...

...

30, ఆగస్టు 2011, మంగళవారం

కనుక్కోండి చూద్దాం!




పై ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్ట గలరేమో ప్రయత్నించండి.

ఇంతవరకూ ఎవరూ గుర్తించలేకపోయారు! సరే ఒక హింట్ ఇస్తాను. ఇతను మా అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తే.

29, ఆగస్టు 2011, సోమవారం

తెలుగు చిత్రలేఖనం మరియు వ్యాసరచన పోటీలు


అంశం:

చిత్రలేఖనం పోటీలకు :

1. తెలుగు భాష ఔన్నత్యం
2. భారత దేశ ప్రగతిలో తెలుగువారి సహకారం, పాత్ర
3. ప్రాచీన మరియు ఆధునిక భాషగా తెలుగు
4. పుష్ప విలాపం
5. తెలుఁగ దేల నన్న దేశంబు దెలుఁగేను

వ్యాసరచన పోటీలకు : 

1. ఆధునిక భాషగా తెలుగు
2. తెలుగు భాష భవిష్యత్తు
3. మాతృభాష Vs మోజు తో నేర్చుకునే భాష
4. సాంకేతిక భాషగా తెలుగు
5. ప్రభుత్వ పరిపాలనా భాష - తెలుగు
6. తెలుగు భాషలో విద్య - ఉపాధి అవకాశాలు


పిన్నలూ పెద్దలూ అందరూ పాల్గొనవచ్చు. ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబరు 20, 2011. వివరాలకు ఇక్కడ చూడండి.



28, ఆగస్టు 2011, ఆదివారం

తెలుగు బాట



















ఈరోజు తెలుగుబాట కార్యక్రమం తెలుగు లలిత కళాతోరణం నుండి ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్ చౌరస్తా మీదుగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వరకూ సాగింది. మన బ్లాగర్లు బజ్జర్లు కొంత మందితో పాటు కూచిభొట్ల ఆనంద్, అమర్‌నాథ్ రెడ్డి, గురజాల విజయ్‌కుమార్, కె.ఎల్.కామేశ్వరరావు, ఎఱ్ఱ నాయుడు, మాడభూషి అనంతాచార్యులు మొదలైన వారు కొందరు పాల్గొన్నారు. నడక ముగిసిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలోని నందమూరి తారకరామారావు కళాప్రాంగణంలో చిన్న సభ, తదనంతరం తెలుగు తల్లి విగ్రహాన్ని పుష్పమాలలతో అలంకరించడంతో కార్యక్రమం ముగిసింది. గత సంవత్సరం జరిగిన తెలుగుబాటతో పోల్చుకుంటే పాల్గొన్నవారి సంఖ్య బాగా తగ్గింది. e-తెలుగు సభ్యులు, ఆ సంస్థ కార్యవర్గ సభ్యులే చాలామంది గైర్హాజరు కావడం (కారణాలు ఏవైనా) చూస్తే ఇక ఇతరులు పాల్గొనక పోవడంపై ఆలోచించడంలో అర్థం లేదనిపిస్తోంది.   

27, ఆగస్టు 2011, శనివారం

శాశ్వతం

"రోజూ పద్దులు చూసుకునే వాడిలాగా కాకుండా కొద్ది సేపు ఆగిపోయి శాశ్వతమైన వాటి వైపు చూడలేకపోతే ఈ మొద్దు జీవితంలోని ముద్దూ లేదు, ముచ్చట అంతకంటే లేదు" అంటున్నారు వేదాంతం శ్రీపతిశర్మగారు తమ కథ శాశ్వతంలో. వారలా ఎందుకు అంటున్నారో తెలుసు కోవాలంటే కథాజగత్‌కోసం ప్రత్యేకంగా వ్రాసిన ఈ కథను చదవాల్సిందే!

23, ఆగస్టు 2011, మంగళవారం

తెలుగు రచయితల మహాసభలు - కొన్ని పొటిగరాపులు

 నేనూ,  రాధేయ
రాధేయతో తంగిరాల చక్రవర్తి

కారా మేష్టారూ, తంగిరాల
పులిగడ్డ విశ్వనాథరావుగారితో

పులిగడ్డ విశ్వనాథరావుగారితో కస్తూరి మురళీకృష్ణ
మంత్రవాది మహేశ్వర్‌తో
అయ్యగారి శ్రీనివాసరావుతో



మండలి బుద్ధప్రసాద్‌తో తంగిరాల
మాలతీ చందూర్‌తో నేనూ తంగిరాల

ఆచార్య నరేంద్ర, వకుళాభరణం రామకృష్ణ, తంగిరాల చివరన నేను
కవిసామ్రాట్ విశ్వనాథవారి ఇల్లు
జ్ఞానపీఠ పురస్కారం

విశ్వనాథ చెంత మురళీమోహన్



















డాక్టర్ మంతెన సూర్యనారాయణ రాజు, ఆర్ధి రఘునాథవర్మ తదితరులతో పిచ్చాపాటీ

వేదికపై వీవెన్

21, ఆగస్టు 2011, ఆదివారం

పుస్తక సమీక్ష -21 తప్పుల తడక 'తెలుగు వెన్నెల'

                                                                                                                                                                                                                                                         
 ప్రపంచ తెలుగు రచయితల 2వ మహాసభలను పురస్కరించుకుని కృష్ణాజిల్లా రచయితల సంఘం రెండు ప్రత్యేక సంచికలను విడుదలచేసింది. తెలుగుపున్నమి పేరుతో సుమారు 700 పేజీలకు పైగా ఉన్న ప్రత్యేక సంచికను 600/-రూపాయల ధర నిర్ణయించి వెలువరించారు. మరొక ప్రత్యేక సంచిక తెలుగు వెన్నెల (సుమారు 160పుటలు) మాత్రం మహాసభలకు హాజరైన ప్రతినిధులకు ఉచితంగా ఇచ్చారు. ఈ తెలుగువెన్నెలలో మండలి బుద్ధప్రసాద్ గారి 'తెలుగుభాష - గమనం - గమ్యం' అనే ముందుమాట, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి 'లక్ష్యప్రస్తావన', విస్కాన్సిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాబర్ట్ ఎరిక్ గారి సందేశం, గుత్తికొండ సుబ్బారావు, జి.వి.పూర్ణచందు గార్ల నివేదిక మొదట కనిపిస్తాయి.


     ఈ సంచికలో విశ్వనాథ సత్యనారాయణ, పొట్లూరి సుబ్రహ్మణ్యం, జానమద్ది హనుమచ్ఛాస్త్రి,మంగళగిరి ఆదిత్య ప్రసాద్, సన్నిధానం సువర్చలా సుబ్రహ్మణ్యం, ఎమ్.వి.జె.భువనేశ్వరరావు, కోడూరు పాండురంగారావు, త్రిపురనేని హనుమాన్ చౌదరి, గోగినేని యోగ ప్రభావతీ దేవి, పన్యారం సాంబశివరావు, కాలనాథభట్ట వీరభద్రశాస్త్రి, చొక్కాపు నారాయణస్వామి, పి.వి.సుబ్బారావు, నడమల గంగాధరరెడ్డి, పి.బాబివర్ధన్, సర్వా సీతారామ చిదంబర శాస్త్రి, వి.వి.కృష్ణశాస్త్రి, ఎల్లూరి శివారెడ్డి, ఎ.వి.కె.సుజాత, తాళ్ళపాక నటరాజ, టి.ఎస్.ఏ.కృష్ణమూర్తి, కొండూరి సీతారామచంద్రమూర్తి, గుడిసేవ విష్ణుప్రసాద్, వి.ఉమామహేశ్వరి, ముశం దామోదరరావు, జె.వి.సత్యవాణి, ముదిగొండ శాస్త్రి, దామెర విజయసారథి, కె.ఎస్.ఆర్ బాలకృష్ణ శాస్త్రి, కె.రామకృష్ణ, కొట్టి రామారావు, గాజుల సత్యనారాయణ, కె.శ్రీనివాసరావు, పోలేపెద్ది వేంకట హనుమచ్ఛాస్త్రి గార్ల వ్యాసాలున్నాయి. ఎమ్.వి.జె.భువనేశ్వరరావుపై ఉన్న అవ్యాజమైన ప్రేమతో ఆయన వ్రాసిన ఆంధ్రుల సంస్కృతీ వైభవం అనే వ్యాసాన్ని రెండుసార్లు ప్రచురించారు.

        తొడుపునూరి సరోజ, వియోగి, విశాలవియోగి, శింగిసెట్టి సంజీవరావు, కోడూరు వేంకటేశ్వరస్వామి, గంధం వేంకాస్వామి శర్మ గార్ల కథలున్నాయి ఈ సంచికలో. ఇంకా వూసల రజనీగంగాధర్, యస్.దామోదరరావు, అధికార్ల నీలకంఠం, ఆర్యమఠారి బాలాజీరావు, సూర్యదేవర రవికుమార్, రామడుగు వెంకటేశ్వరశర్మ గార్ల కలం నుండి వెలువడిన పద్యకవితలు చోటు చేసుకున్నాయి. 

    ఇంకా ఈ ప్రత్యేక సంచికలో 50 వరకు వచన గేయ కవితలు చోటు చేసుకున్నాయి. మేడిచర్ల ప్రకాశరావుగారి కొన్ని జోకులు కూడా ఈ ప్రత్యేక సంచికలో చూడవచ్చు.  

   ఇటువంటి ప్రత్యేక సంచికల తయారీలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకై, వాటి మనుగడకై పరితపించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా విడుదలైన ప్రత్యేక సంచిక కాబట్టి. కానీ ఈ పుస్తకం తీసుకురావడంలో కూర్పరులు ఎంత నిర్లక్ష్యం వహించారో ఈ పుస్తకం చదివిన వారికి అర్థం అవుతుంది. ప్రూఫులు సరిగ్గా చూడలేదనే విషయం లెక్కలేనన్ని అచ్చుతప్పుల వల్ల బోధ పడుతుంది. జాదమద్ది, విశ్వనాధ, పటనం, వైబవం, కంటం, స్వరపైటిక, సాట్య శాస్త్రం, వ్యవ్థ(వ్యవస్థ కు వచ్చిన అవస్థ), గ్రీఆమ్యం, మైళనము, ఆంధ్రభూబి,శింవలెంక,దేవీ నవరాత్రుములు, పరుషోత్తం, ఇల్లిందర సరస్వతీదేవి మచ్చుకు కొన్ని.  ఈ సంచిక చివరలో సభలకు హాజరయిన/నమోదు చేసుకున్న ప్రతినిధుల పేర్లు, చిరునామాలు ప్రకటించారు. చిత్రంగా వీరినందరినీ కృష్ణాజిల్లా రచయితల సంఘం జీవిత సభ్యులను చేసేశారు. అందుకే ఇవి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు కావనీ, కృష్ణా జిల్లా రచయితల సభలని కొన్ని వ్యంగ్యోక్తులు వెలువడ్డాయి. ఈ సమీక్షకుని పేరు కూడా ముద్రారాక్షసానికి బలయ్యింది. సాక్షాత్తూ ఈ మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షుల వారి ఇ-మెయిల్ చిరునామాయే తప్పుగా ప్రచురింపబడ్డాక ఇక వేరే వారి సంగతి చెప్పేదేముంది?

    అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకును పట్టి చూస్తే సరిపోతుంది. అలాగే ఈ తెలుగు వెలుగు ఎంత అపరిపక్వంగా ఉందో తెలుసుకోవడానికి ఈ క్రింది  ఉదాహరణ ఒక్కటి చాలు.

     జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారి 'నేనెరిగిన శంకరంబాడి సుందరాచారి' వ్యాసంలో '1989లో పెండ్లాడి బ్రతుకుచెడి చిత్తూరు బోర్డు హైస్కూల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడనై చక్కని దేశికుడని పేరు పొందితిని.'అని శంకరంబాడి సుందరాచారి జానమద్ది వారికి వ్రాసిన లేఖలో పేర్కొన్నట్లు ఉంది. 1977 ఏప్రిల్ 8న మృతి చెందిన సుందరాచారికి మరణించిన పన్నెండేండ్లకు పెళ్ళి చేసిన ఘనత మన కృష్ణా జిల్లా రచయితల సంఘానికే దక్కుతుంది. 

20, ఆగస్టు 2011, శనివారం

నాలాగా ఎందరో?


కొమ్మూరి రవికిరణ్‌గారి కథ నాలాగా ఎందరో కథాజగత్‌లో ప్రకటించబడింది. చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే ఈ క్రింది కథలు త్వరలో కథాజగత్‌లో రానున్నాయి.


1. ఎవరు బాధ్యులు - ఎం.వెంకటేశ్వరరావు


2. కొత్త రేడియో లీల - చలపాక ప్రకాష్ 


3. అమ్మ కొడుకు - టి.శ్రీరంగస్వామి


4. పండుగా నీకు జోహార్ - అయ్యగారి శ్రీనివాసరావు 

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 48 సమాధానాలు!


ఈ పజిల్‌ను సరిగ్గా పూరించిన కంది శంకరయ్యగారికి, కొన్ని తప్పులతో పూరించిన ఆత్రేయ, భమిడిపాటి సూర్యలక్ష్మి, ఫణిప్రసన్న కుమార్ గార్లకు అభినందనలు!

18, ఆగస్టు 2011, గురువారం

కాక్‌టెయిల్

సతీష్ చందర్‌గారి కథ కాక్‌టెయిల్ కథాజగత్‌లో చదవండి. అలాగే కోపల్లె మణినాథ్‌గారి గృహం - ఋణం కూడా చదవండి.

17, ఆగస్టు 2011, బుధవారం

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు - నా పరిశీలన

      ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహాసభలు విజయవాడలో ఈ నెల 13వతేదీ నుండి 15వ తేదీవరకు జరిగాయి. ఈ సభలలో ప్రతినిధిగా పాల్గొనే అవకాశం నాకు దక్కింది. ఈ మహాసభల విశేషాలను తురుపుముక్క పాఠకులతో పంచుకునే ఉద్దేశంతో ఈ టపా వ్రాస్తున్నాను.

       ప్రారంభ సమావేశం శనివారం ఉదయం తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం(వేటూరి సుందర రామమూర్తి వేదిక)లో ఘనంగా జరిగింది. సి.నా.రె, రామోజీరావు, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జి.వి.పూర్ణచందు, వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్), కె.శ్రీనివాస్(ఆంధ్రజ్యోతి),మాలతీ చందూర్, కాళీపట్నం రామారావు, అగ్రహారం కృష్ణమూర్తి(కేంద్ర సాహిత్య అకాడెమీ)  తదితరులు వేదిక పైనుండి తమ తమ సందేశాలను వినిపించారు. ఈ ప్రసంగాల సారాంశాన్ని క్రోడీకరిస్తే తెలుగుకు కష్టకాలం వచ్చిందనీ,తెలుగుకు తీరని అన్యాయం జరుగుతోందనీ, ఆంగ్లంపై మోజు తగ్గాలనీ, బడినుంచి భాషోద్ధరణ జరగాలనీ, టీవీలు వచ్చాక పల్లెల్లో కూడా తెలుగుభాష ఆంగ్ల పదాలతో కలుషితమైపోతుందనే ఆవేదన, ఆందోళనలే  తప్ప ఆ సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు ఏవీ లభించలేదు.  ఈ సమావేశంలో ప్రత్యేక సంచికలు తెలుగు వెన్నెల, తెలుగు పున్నమిలను ఆవిష్కరించారు.


         మధ్యాహ్నం నుంచీ ప్రతినిధుల సదస్సులు బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఎస్.వి.ఎస్ కల్యాణమంటపంలో ప్రారంభమయ్యాయి. మొదటి సదస్సు సురవరం ప్రతాపరెడ్డి వేదికపై తెలుగుకు సంబంధించిన చరిత్ర, సంస్కృతుల ప్రాచీనత, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించింది. ప్రతిజిల్లాకు సమగ్రమైన చరిత్ర అవసరమని, చారిత్రక ఆధారాలను కాపాడేందుకు పురావస్తు శాఖ సమర్థవంతంగా పనిచేయాలని, రాజకోటలను పరిరక్షించేందుకు, పునర్నిర్మించేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయించాలనీ, ఇంకా పరిష్కరింపబడని శాసనాలను, నాణేలను, తాళపత్రాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలనీ, రచయితలు, కవులు పురావస్తు, చారిత్రకాధారాల విలువపై అవగాహన కలిగి ఉండటమే కాకుండా వాటి విలువను సామాన్యులకు అర్థమయ్యేలా వివరించాలనీ వక్తలు పేర్కొన్నారు. వకుళాభరణం రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్, వి.వి.కృష్ణశాస్త్రి, చెన్నారెడ్డి, హర్షవర్ధన్, శ్రీపాద సుబ్రహ్మణ్యం,పొత్తూరి వెంకటేశ్వరరావు, ఏబికె ప్రసాద్, బి.సుబ్రహ్మణ్యం తదితరులు ప్రసంగించిన ఈ సదస్సుకు రాళ్ళబండి కవితాప్రసాద్ సమన్వయం చేశారు.

         తరువాతి సదస్సులో రాష్ట్రేతరాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై మండలి వెంకటకృష్ణారావు వేదికపై చర్చ జరిగింది. గౌరీశంకర్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సదస్సులో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర ప్రాంతాలనుండి వచ్చిన ప్రతినిధులు తమతమ సమస్యలను సభముందు వెళ్ళబోసుకున్నారు. ఎక్కడెక్కడ తెలుగు భాష విస్తరించి ఉందో అక్కడ దాన్ని పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, తెలుగు సాహిత్యగ్రంథాలను పంపి పిల్లలు తెలుగు నేర్చుకునేలా ఇక్కడి సంస్థలు, రచయితలు, ప్రభుత్వం ప్రోత్సహించాలని, తమ యాసను అవమానించేలా రచయితలు,సినీ కవులు తమ రచనల్లో వాడకూడదని విజ్ఞప్తి చేశారు. పుష్పలత, బెల్లంకొండ నాగేశ్వరరావు, ఆర్ధి రఘునాథవర్మ, సా.వెం.రమేష్ తదితరులు ప్రసంగించారు.

      ఆ తర్వాత మో వేదికపై జరిగిన ప్రత్యేక కవిసమ్మేళనంలో చాలామంది ప్రముఖ కవులు పాల్గొన్నారు. కె.బి.లక్ష్మి సమన్వయం చేశారు. అనంతశ్రీరామ్, ఆశావాది ప్రకాశరావు, పాటిబండ్ల రజని వంటి కొందరి కవితలు మినహా మిగిలిన కవితలు సదస్యులను ఆకట్టుకోలేకపోయింది. అనంతరం ప్రతినిధుల కవిసమ్మేళనం కూడా చప్పగాసాగింది.

        రెండవరోజు గుఱ్ఱం జాషువా వేదికపై సాహిత్యరంగంపై చర్చ జరిగింది. కన్నడ రచయిత భైరప్ప, గొల్లపూడి మారుతీరావు, శలాక రఘునాథ శర్మ, శిఖామణి, ఎస్.గంగప్ప, రేవూరి అనంతపద్మనాభరావు, కడియాల రామమోహన్ రాయ్, ఎస్.వి.రామారావు, బాబీవర్ధన్, శంకరనారాయణ, కస్తూరి మురళీకృష్ణ,రావి రంగారావు, ఝాన్సీ కె.వి.కుమారి తదితరులు ఎన్నో విలువైన సూచనలు చేశారు. రచయితల సహకార సంఘం ఏర్పాటు, సాహిత్య అకాడెమీ పునరుద్ధరణ, తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, తెలుగు పుస్తకాలను ఇతరభాషలలో అందుబాటులోకి తేవడం, పిల్లలకు శతకసాహిత్యాన్ని నేర్పించడం, మాండలికాలకు ఒక ప్రత్యేకమైన నిఘంటువు నిర్మించడం వంటివి అందులో కొన్ని.

         తరువాతి సదస్సు గిడుగురామ్మూర్తి వేదికపై మాతృభాషల మనుగడ, మాండలికాల వినియోగం, తెలుగుభాషకు ప్రాచీనహోదా అనంతర చర్యలు మొదలైన విషయాలపై చర్చ జరిపింది. ఆధునిక నిఘంటు నిర్మాణం, మాండలికాల పదకోశ నిర్మాణం మొదలైన అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఈ సదస్సులో బూదాటి వెంకటేశ్వర్లు, వెలివెల సిమ్మన్న, యు.వి.నరసింహమూర్తి, ద్వానాశాస్త్రి, సామల రమేష్, కాలువ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

           సాహిత్య పత్రికలు రేపటి మనుగడ అనే సదస్సు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు వేదికపై జరిగింది. విజయబాబు, కొమ్మినేని శ్రీనివాస్, రాజశుక, నండూరి రాజగోపాల్, కొల్లా శ్రీకృష్ణారావు, జల్దంకి ప్రభాకర్, వై.శ్రీరాములు, పాలెపు బాబు మొదలైన పత్రికా సంపాదకులు ప్రసంగించారు. సాహిత్య పత్రికల స్థాయికి రచనలు వెలువడటం లేదన్నది వీరి ప్రధాన ఆరోపణ. తదనంతరం సాహితీ సంస్థల ప్రతినిధుల సమావేశం కొమర్రాజు లక్ష్మణరావు వేదికపై, మహాకవి దాశరథి వేదికపై ప్రతినిధుల కవిసమ్మేళనం జరిగాయి.


          చివరి రోజు స్వాతంత్ర్య దినోత్సవ సభ గరిమెళ్ళ సత్యనారాయణ వేదిక పై జరిగింది. ఈ సందర్భంగా దేశభక్తిని చాటే పాటలను పాడారు. హిందీ రచయిత్రి ప్రతిభారాయ్, బెంగాలీ రచయిత్రి ఉషా చౌదరి, ఇంద్రనాథ్ చౌదరి ఈ సదస్సులో అతిథులుగా విచ్చేసి తమ సందేశాలు వినిపించారు. ఆతర్వాత సాంకేతికంగా తెలుగు భాషాభివృద్ధి అనే అంశంపై సి.పి.బ్రౌన్ వేదికపై సదస్సు నిర్వహించారు. సదస్సు ప్రారంభంలో శ్రీరమణీయ అనే కొత్త ఉచిత యూనీకోడ్ ఫాంట్‌ను విడుదల చేశారు. కూచిభొట్ల ఆనంద్ సమన్వయ కర్తగా ఈ సభనిర్వహించబడింది. సాంకేతిక పరిపుష్టికి ప్రభుత్వం చేస్తున్న కృషిని అమర్నాథరెడ్డి వివరించారు. వీవెన్ అంతర్జాలంలో తెలుగు వినియోగంపై ఒక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించారు. చావాకిరణ్ వికీపీడియా గురించి సదస్సుకు తెలియజేశారు. ఇంకా మైనేని దుర్గాప్రసాద్, గారపాటి ఉమామహేశ్వరరావు తదితరులు తమ సందేశాలను వినిపించారు.

           మధ్యాహ్నం ముగింపు సమావేశం జరిగింది. జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్, జయప్రకాష్ నారాయణ, లగడపాటి రాజగోపాల్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మహాసభలు కొన్ని తీర్మానాలను చేసింది. వాటిలో అందరూ తెలుగు భాషనే మాట్లాడటం, తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం, అధికార భాషా సంఘం కార్యవర్గాన్ని ప్రభుత్వం వెంటనే నియమించటం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీని పునరుద్ధరించడం, జీ.వో 86ను అమలు చేయని పాఠశాలల గుర్తింపు రద్దు చేయటం, తెలుగు మాధ్యమంలో చదివిన ఉద్యోగార్థులకు మౌఖిక పరీక్షల్లో అయిదు మార్కులు అదనంగా కేటాయించటం ముఖ్యమైనవి.


            ఈ మూడు రోజుల సంబరాలలో అనేక మంది రచయితలతో పరిచయ భాగ్యం కలగటం ఒక అదృష్టం. మన బ్లాగర్లు నవ్వులాట శ్రీకాంత్, కౌటిల్య, రెహ్మానుద్దీన్ షేక్, వీవెన్, చావా కిరణ్, కస్తూరి మురళీకృష్ణ  ఈ సదస్సుకు హాజరయ్యారు. నేను, కస్తూరి మురళీకృష్ణ,రెహ్మానుద్దీన్ షేక్, కౌటిల్య, శ్రీకాంత్ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నివసించిన ఇంటికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన పుస్తకాలను, విశ్వనాథ వారి పురస్కారాలనూ, జ్ఞాపికలను, వారు ఉపయోగించిన వస్తువుల ప్రదర్శనను తిలకించాము. అక్కడ సుమారు ఒక గంట సేపు గడిపాము. ఆ సందర్భంలో కౌటిల్య, కస్తూరి మురళీకృష్ణ, శ్రీకాంత్‌ల మధ్య నడిచిన సాహిత్యపరమైన సంభాషణను నేను, రెహ్మాన్ ఎంతో ఆసక్తిగా విన్నాము. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శన, పుస్తక ప్రదర్శన, తెలుగు వెలుగుల చిత్రాల ప్రదర్శన బాగా ఆకట్టుకుంది. ఈ మహాసభలలో అందరికీ విపరీతంగా నచ్చింది కమ్మనైన భోజన ఫలహారాలు. ఈ విషయమై నిర్వాహకులను అభినందించితీరాలి. 

        ఈ మహాసభలలో అసంతృప్తిని మిగిల్చిన విషయాలూ కొన్ని ఉన్నాయి. సుమారు 1200 కు పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ మహాసభలలో విదేశాలనుండి ఒక్కరంటే ఒక్క రచయితకూడా పాల్గొనక పోవటం చేత ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు అనే పేరుకు సార్థకత చేకూరలేదని కొందరు బాహాటంగా విమర్శించారు. (సిలికానాంధ్రకు చెందిన కూచిభొట్ల ఆనంద్ హాజరైనా అతను ప్రతినిధిగా కాక ఒక సదస్సుకు సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరించారు.) కొన్ని 'పెద్ద తలకాయలు' కనిపించక పోవటంపై కావాలని వారిని దూరంగా పెట్టారన్న విమర్శలు వినిపించాయి. దీనిని సమర్థించినట్లే నిర్వాహకులు కొందరికి ఆహ్వానం పంపకపోటం, చివరినిముషంలో తూతూ మంత్రంగా వారిని ఫోనుద్వారా పిలవటం జరిగిందని తెలియ వచ్చింది. తెలంగాణా ఉద్యమ ప్రభావం ఈ సదస్సుపై బాగా కనిపించింది. 1200 మంది ప్రతినిధుల్లో తెలంగాణా ప్రాంతం వారి సంఖ్య  పట్టుమని పాతిక కూడా లేకపోవడం ఒక లోటు. అలాగే వామపక్ష భావాలు గల రచయితలను, సాహితీ సంస్థలను దూరంగా ఉంచారు. మొదటిరోజు ప్రతినిధుల నమోదు కార్యక్రమం ఒక ప్రహసనంగా సాగింది. క్యూలో గంటలకొద్ది నిలబడిన వారిని కాదని ఇష్టం వచ్చినట్లుగా నమోదు కార్యక్రమం నిర్వహించారు. ప్రతినిధులకు జ్ఞాపికలను కౌంటర్లలో పంపిణీ చేయటం కూడా విమర్శకు దారితీసింది. వేదికపై ఎవరైనా ప్రముఖుని చేతులమీదుగా జ్ఞాపికలను ప్రదానం చేసి ఉంటే అదొక తీయని జ్ఞాపకంగా మిగిలి ఉండేదని కొందరు వ్యాఖ్యానించారు. ఈ సభల్లో సరుకు లేదని ప్రాచీనాంధ్ర గ్రంథమాల జగన్‌మోహన రావు చేసిన వ్యాఖ్య ఈ సభల తీరుతెన్నులపై కొందరి అభిప్రాయాలకు అద్దం పడుతోంది. సభలో సుదీర్ఘ ఉపన్యాసాలుండవని ప్రకటించిన నిర్వాహకులు వాటిని నిరోధించలేక పోయారు. కొందరు వక్తలు తాము మాట్లాడవలసిన అంశాన్ని వదిలి సందర్భరహితమైన ఉపన్యాసాలతో ప్రతినిధుల సహనాన్ని పరీక్షించారు. వక్తల సందేశాన్ని శ్రద్ధగా వినమని పక్కవారితో మాట్లాడవద్దని పదే పదే వేదిక ముందున్నవారికి  విజ్ఞప్తి చేసిన నిర్వాహకులు వేదిక పైనున్న వారు ప్రసంగాన్ని వినకుండా ఒకరి చెవులు ఒకరు కొరుకుతుంటే ఆ సంగతిని పట్టించుకోకపోవటం కనిపించింది. ఏమైనా ఇవి చిన్నచిన్నలోపాలు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఇలాంటి చిన్నచిన్న పొరబాట్లు సహజం. మొత్తం మీద ఈ మహాసభలు విజయవంతంగా జరిగి పాల్గొన్న ప్రతినిధుల్లో  ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపినాయి అనటంలో సందేహం లేదు.  

         ఈ మహాసభల నిర్వహణలో ఎవరి కృషినైనా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అది వాలంటీర్లుగా వ్యవహరించిన విద్యార్థినీ విద్యార్థులు వారి ఉపాధ్యాయులూ అందించిన సేవ. వారి సహకారమే లేకుంటే నిర్వాహకులు ఇబ్బంది పడేవారేమో! 

       ఈ వ్యాసంలో వేదికపై ప్రసంగించినవారి అందరి పేర్లు ఉదహరించకపోవడం ఉద్దేశపూర్వకం కాదని, నా జ్ఞాపకశక్తి వల్ల కలిగిన పొరపాటని గ్రహించమని విజ్ఞప్తి.   

11, ఆగస్టు 2011, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము -48


ఆధారాలు :

అడ్డం: 1శంషాబాదులో రాజీవ్‌గాంధీ పేరున ఉన్నది (5,6)
4. తీవ్ర ఖేదనము (3, 4)
6. మురళికి ఉన్న కొమ్మును తీసేసి లేని దీర్ఘాన్నిపెడితే ఆడ హంస ప్రత్యక్షమౌతుందా? (3)
8. నందమూరి వారి విశ్వ విఖ్యాతమైన బిరుదు చివరి అక్షరం మధ్యలో తిష్ట వేసింది (2, 3, 1, 2, 3)
9. అడ్డదిడ్డంగా వినము (3)
10. నలకూబరుడు, కుబేర తనయుడు (4, 3)
11.  వికటకవి సృష్టి తిలకాష్ట మహిష బంధనము తిరగబడింది. ఆ తిరగబడటంలో నడిమి మూడక్షరాలు తబ్బిబ్బయ్యాయి. (4,3,4)

నిలువు :
1.  పొద్దు పత్రిక ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసేది (4,2,5)
2.  శతక వాఙ్మయంలో ఈ మకుటం కలిగిన పద్యాలు జనబాహూళ్యం పొందినాయి (6, 3, 2)
3.  క్రిందినుండి పైకి ప్రాకిన గతి తార్కిక భౌతిక వాదము. గతి గతితప్పింది (3, 3, 3, 2)
4. పాము. కన్నులతో విను. కలికాలం : )  (7)
5. 'సాము గట్లు కుచ్చనీ' ముచ్చటలు పొడిగించవద్దు. (3, 4)
6. అభిప్రాయము, ఉపాయము, అంగీకారము లేదా విధము (3)  
7. తారుమారైన తామర (3)


10, ఆగస్టు 2011, బుధవారం

7, ఆగస్టు 2011, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 47 సమాధానాలు!





అడ్డం:
1. పబ్లిక్ గార్డెన్స్‌ లో ఉన్న ఓపెన్ ఎయిర్ థియేటర్  - తెలుగు లలిత కళా తోరణం
4. ఆడ డాన్సర్లూ, మగ డాన్సర్లు నర్తకీనర్తకులు
6. సాగరతీరంలో పుష్కలంగా దొరికేది రసికతలో వెదుకు - సికత
8. 'షిర్డీ సాయిబాబా దివ్య చరితం' కూర్పు అస్తవ్యస్తంచర్డీసాయిబాషిదివ్యరితంబా
9. ఇంకా నయము చివరలు మాత్రమే తెగిపోయాయికానయ
10. అముద్రిత గ్రంథము ముద్రించని పుస్తకం
11.  కన్నులకు విందు గొల్పెడిది కనువిందు తరహాలో దిక్సూచి నిర్వచనందిక్కులు సూచించెడిది దిక్సూచి
నిలువు :
1.  తోక తెగిన తెరవే - తెలంగాణా రచయితల వేది(క)
2.  'చెడు ల్గినిషి' చెల్లాచెదురయ్యాడు - తడునడకషినల్గినిమచె
3.  ప్రామాణికమైన తెలుగు గ్రామరు బుక్కు రచయిత పేరును ముందు కలుపుకుని తల్లక్రిందులయ్యిందిణంరకవ్యాలబారిసూయన్నచి (చిన్నయసూరి బాల వ్యాకరణం)
4. యద్దనపూడి, మాదిరెడ్డి ఒకప్పుడు యేలినది - నవలాసాహిత్యము/నవలా సామ్రాజ్యము
5. అభాగ్యోపాఖ్యానమును వ్రాసిన పంతులుగారే శీర్షాసనం వేశారు. మధ్యలో పేరు మాయమైంది - లుతుపం రికూదుకం [కందుకూరి(వీరేశలింగం) పంతులు]
6. పేరు మార్చుకున్న బినాకా సిబాకా
7. విదియ చవితుల మధ్య తదియ

6, ఆగస్టు 2011, శనివారం

మెదడుకు మేత! -9

మా కాలనీలో నిర్వహించిన కుక్కపిల్లల పరుగు పందెంలో మొదటి నాలుగు కుక్కపిల్లలూ తమ ప్రత్యర్థుల కన్నా చాలాముందుగా ఉండి గెలిచాయి. ఆదినారాయణ గారి కుక్కపిల్లకు చివరి స్థానం రాలేదు. గోధుమ రంగులో ఉన్న కుక్కపిల్లకు మూడో స్థానం రాలేదు. భాస్కరరావు గారి కుక్కపిల్ల తెల్లబొచ్చు కుక్కపిల్లకంటే ముందు స్థానంలో ఉంది. ధనలక్ష్మి గారి కుక్కపిల్లకు మొదటి బహుమతి వచ్చింది.  భాస్కరరావుగారి కుక్కపిల్ల ఆదినారాయణ గారి కుక్కపిల్ల కంటే ముందు గమ్యాన్ని దాటింది. ఖాదర్‌వలీ గారిది నల్లకుక్క పిల్ల. కానీ భాస్కరరావుగారిది నల్ల మచ్చలున్న తెల్లకుక్క కాదు. ఈ వివరాల ఆధారంగా ఎవరి కుక్కపిల్ల ఏ రంగులో ఉందో, ఏ బహుమతి గెలుచుకుందో చెప్పగలరా?  

4, ఆగస్టు 2011, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము -47


ఆధారాలు :

అడ్డం:
1. పబ్లిక్ గార్డెన్స్‌ లో ఉన్న ఓపెన్ ఎయిర్ థియేటర్.  (3,3,2,3)
4. ఆడ డాన్సర్లూ, మగ డాన్సర్లు. (7)
6. సాగరతీరంలో పుష్కలంగా దొరికేది రసికతలో వెదుకు. (3)
8. 'షిర్డీ సాయిబాబా దివ్య చరితం' కూర్పు అస్తవ్యస్తం (11)
9. ఇంకా నయము చివరలు మాత్రమే తెగిపోయాయి. (3)
10. అముద్రిత గ్రంథము (?) (4,3)
11.  కన్నులకు విందు గొల్పెడిది కనువిందు తరహాలో దిక్సూచి నిర్వచనం   (3, 5, 3)
నిలువు :
1.  తోక తెగిన తెరవే (4, 5, 2)
2.  'చెడు నడత కల్గిన మనిషి' చెల్లాచెదురయ్యాడు (11)
3.  ప్రామాణికమైన తెలుగు గ్రామరు బుక్కు రచయిత పేరును ముందు కలుపుకుని తల్లక్రిందులయ్యిది. (5,2, 4)
4. యద్దనపూడి, మాదిరెడ్డి ఒకప్పుడు యేలినది (3, 4)
5. అభాగ్యోపాఖ్యానమును వ్రాసిన పంతులుగారే శీర్షాసనం వేశారు. మధ్యలో పేరు మాయమైంది. (4,3)
6. పేరు మార్చుకున్న బినాకా (3)
7. విదియ చవితుల మధ్య (3)


క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 46 సమాధానాలు!



ఈ పజిల్ పూరించటానికి ప్రయత్నించిన ఊకదంపుడు,కంది శంకరయ్య, ఆత్రేయ, భమిడిపాటి సూర్యలక్ష్మిగార్లకు  అభినందనలు!