...

...

24, ఏప్రిల్ 2015, శుక్రవారం

పుస్తక సమీక్ష - 32 నాగావళి నుంచి మంజీర వరకు


[పుస్తకం పేరు: నాగావళి నుంచి మంజీర వరకు, రచన:రావి కొండలరావు, వెల: రూ.150/-, పేజీలు:184, ప్రతులకు: ఆర్కే బుక్స్,502, సన్నీ రెసిడెన్సీ, 166, మోతీనగర్, హైదరాబాదు - 18 మరియు అన్ని ముఖ్యమైన పుస్తకశాలలు]  

ప్రముఖ నటుడు, జర్నలిస్టు, హాస్య రచయిత, నాటక రంగ ప్రముఖుడు అయిన రావికొండలరావు గారి జ్ఞాపకాల దొంతర ఈ పుస్తకం.  తనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్క ప్రముఖుణ్ణి, సామాన్యులను, అసామాన్యులను ఈ పుస్తకంలో స్మరణకు తెచ్చుకున్నారు రావి కొండల్రాయుడు ఉరఫ్ రావి కొండల్రావు. ఈ మధ్య కాలంలో వెలువడిన పుస్తకాలలో ఇది ఒక మంచి పుస్తకం అని చెప్పవచ్చు. రచయిత గారి జీవిత విశేషాల సంగతి ఎలా ఉన్నా తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగం అని చెప్పుకునే కాలం నాటి చలనచిత్ర విశేషాలు ఈ పుస్తకంలో రికార్డు కావడం విశేషం. బాపురమణ 'కు' ('లకు' కాదు) అంకితమివ్వబడిన ఈ పుస్తకం చక్కని గెటప్‌తో పాఠకులకు అందుబాటు ధరలో వెలువడటం అభినందనీయం.  పుస్తకం కొనడానికి వెచ్చించిన డబ్బు గిట్టుబాటు అయ్యిందన్న తృప్తిని మిగిలిస్తుంది.

నాగావళి శ్రీకాకుళం తీరంలో ప్రవహించే నది. మంజీర హైదరాబాదు సమీపంలో ఉన్న నది. శ్రీకాకుళం నుంచి హైదరాబాదు దాకా సాగిన జీవిత ప్రస్థానాన్ని రచయిత ఈ పుస్తకంలో వివరించారు. తిరుమల రామచంద్రగారి హంపీ నుంచి హరప్పా దాక ఈ పుస్తకానికి స్ఫూర్తిని కలిగించి ఉండొచ్చు.  ఆర్.కె.రావు, చక్రపాణి, తిమ్మరాజు శివరావు, సి.హెచ్.నారాయణరావు, గండికోట జోగినాథం, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, నల్లరామ్మూర్తి, గోవిందరాజు సుబ్బారావు, న్యాయపతి రాఘవరావు, బాపు, ముళ్లపూడి వెంకటరమణ, వడ్డాది పాపయ్య, సఖ్ఖరి కృష్ణారావు , గరిమెళ్లరామ్మూర్తి, ప్రయాగ నరసింహశాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు, భానుమతి, కొడవటిగంటి కుటుంబరావు, ఎం.ఎస్.రామారావు, జి.వరలక్ష్మి, మద్దాలి శర్మ, పూడిపెద్ది లక్ష్మణమూర్తి(పూలమూర్తి), సదాశివరావు, రేలంగి వెంకట్రామయ్య, సదాశివరావు, చదలవాడ కుటుంబరావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, ఘంటసాల, సుందరశివరావు, సుంకర ప్రభాకరరావు, రావి ధర్మారావు, బి.ఎన్.రెడ్డి,సి.పుల్లయ్య, వల్లభజోశ్యుల శ్రీరామమూర్తి, మల్లాది వెంకటకృష్ణశర్మ, శ్యామలరావు, కమలాకర కామేశ్వరరావు, డాక్టర్ రాజారావు, మాస్టర్ మల్లేశ్వరరావు, ముద్దుకృష్ణ, కాశీనాథ్ తాతా, నార్ల వేంకటేశ్వరరావు, ఎన్.జగన్నాథ్, కళ్యాణసుందరీ జగన్నాథ్, మాధవపెద్ది సత్యం, హరనాథ్, ఆత్రేయ, బండారు చిట్టిబాబు, పెండ్యాల నాగేశ్వరరావు, ద్వారం వేంకటస్వామి నాయుడు, ఆదిభట్ల నారాయణదాసు, కళావర్ రింగ్, ఉప్పులూరి కాళిదాసు, శ్రీశ్రీ, నిర్మలమ్మ, జె.వి.సోమయాజులు, జె.వి.రమణమూర్తి, కె.వి.రావు, బి.సరోజాదేవి, డి.వి.నరసరాజు, పింగళి నాగేంద్రరావు, మద్దిపట్ల సూరి, మల్లాది రామకృష్ణశాస్త్రి,దైతా గోపాలం,ఆరుద్ర,అంజలీదేవి,చౌదరి, వీర్రాజు, చిత్తూరు నాగయ్య మొదలైన వారి (పైన పేర్కొన్న జాబితాకు రెట్టింపు మంది) గురించి అంతో ఇంతో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. రావి కొండలరావు హాస్య రచయిత కాబట్టి పుస్తకం నిండా బోలెడన్ని చమత్కారాలు, హాస్యాలు, ఒకటి ఒకటిన్నర కుళ్ళు జోకులు కనిపిస్తాయి. ఈ పుస్తకంలో చాలా విలువైన ఫోటోలు, సినిమా స్టిల్స్, నాటకాల స్టిల్స్ రంగుల్లోనూ తెలుపు నలుపుల్లోనూ దర్శనమిచ్చి పాఠకులను రంజింపజేస్తాయి. 

ఈ పుస్తకంలో కొన్ని ఆరోపణలు చేస్తారు రావి కొండలరావు. అయితే అవి ఆరోపణలని అనిపించకుండా చాలా లౌక్యంగా వ్రాశారు.

అవి:

1.ఎ.నాగేశ్వరరావు తనకు ఆటోగ్రాఫు ఇవ్వలేదు. (పేజీ 30)

2.అతను యెవరు? సినిమాకి మాటల రచయితగా ఇతని పేరు వేయలేదు. కారణం అన్నయ్య ఆర్.కె.రావు(?)

3.ఉప్పులూరి కాళిదాసు ఆనందవాణి పత్రికలో పనిచేయించుకుని డబ్బులు ఎగ్గొట్టారు.  

4.వి.ఎ.కె.రంగారావు తనకు కావలసిన రికార్డును ఇవ్వడానికి ఏడాదిన్నర తిప్పుకున్నారు. అలాగే వడ్డాది పాపయ్య తన పత్రిక ముఖచిత్రం వేయడానికి కొంతకాలం చుట్టూ తిప్పించుకున్నారు.

5.తెలుగు స్వతంత్రలో సబ్ ఎడిటర్‌గా పనిచేసిన కె.రామలక్ష్మి తన కథలు రెండింటిని రిజెక్ట్ చేశారు.

పైన పేర్కొన్నవన్నీ నిజమే కావచ్చు కాని వాటిని పాఠకులతో పంచుకుంటే ఏం ఉపయోగం?

ఉత్తమ పుస్తకం కాకపోయినా ఈ మధ్య కాలంలో వెలువడిన మంచిపుస్తకంగా దీనిని పరిగణించవచ్చు.