...

...

28, ఆగస్టు 2013, బుధవారం

వాణిశ్రీ కథ!

వాణిశ్రీ అంటే కళాభినేత్రి వాణిశ్రీ కాదు. అదే పేరును కలం పేరుగా కలిగిన ప్రముఖ రచయిత సి.హెచ్.శివరామ ప్రసాద్‌గారి కథ 'త్యాగం' కథాజగత్‌లో చదవండి. 1985లో యువ మాసపత్రికలో ప్రచురింపబడిన ఈ కథ పై మీ అభిప్రాయం చెప్పండి.

27, ఆగస్టు 2013, మంగళవారం

మలుపుతిప్పిన కథ!

"ఈ కథలోని నైరాశ్యం వోటమి తత్వం కాలక్రమంలో కరిగిపోయి, దిగంబర కవుల ఉద్యమంతో, విప్లవ రచనా మార్గం ఒక సార్థక పరిణామం. నా రచనా యాత్రలో అదో కీలక మలుపు!" అంటున్నారు ప్రముఖ దిగంబర కవిత్వోద్యమ సారథి నిఖిలేశ్వర్‌గారు. ఆ కీలక మలుపు తిప్పిన కథ ఏమిటో త్వరలో కథాజగత్‌లో చదవండి.

25, ఆగస్టు 2013, ఆదివారం

దిష్టి బొమ్మ

      “నీకు అయి ప్రాణం లేని బొమ్మలుగా కనిపించుతాది. కాని.. నాకు- అయి-- ఈ సేతులతో సేసిన బొమ్మలు రా-- అందుకే మమకారం- చేలల్లోని- పెద్ద పెద్ద బిల్డింగుల మీద ఎండకి ఎండుతూ-- వానకి తడుస్తూ గర్వంగా నిలబడతాయి. నరదృష్టిని తిప్పికొడతాయి. ఆటిని అలా చూస్తుంటే మనసు ఎంత పొంగిపోతుందో-- ఆటిని కాలితో తోక్కి-- తగలెట్టేస్తుంటే-- నా గుండెల మీద ఎవరో తొక్కి-- తక్కుతున్నట్లుగా అనిపించిందిరా-- ఇదిగో-- సూడు-- నీ పిల్లలకి గుడ్డబొమ్మలు సేసి ఇచ్చాను. నువ్వన్నావే-- ప్రాణం లేదని- కాని నీ కూతురు సూడు - దాన్ని-- దాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా సూసుకుంటుంది. దానికి రంగురంగుల గుడ్డముక్కలు సుట్టి మురిసిపోవడానికి బొమ్మమీద మమకారం- సూడు"  సుమారు ఒక అడుగు పొడుగున్న గుడ్డ బొమ్మని తన పక్కనే పడుకో బెట్టుకొని- ఆదమరిచి పడుకున్న- నాలుగేళ్ళ మనవరాలిని చూపిస్తూ అన్నాడు.
        
    "అయితే ఏటంటావు నాన్నా-- అందరూ నీ బొమ్మలని పూజిస్తూ కూకోమంటవా- ఏభై రూపాయిలు కూడా చెయ్యని, ముష్టి దిష్టిబొమ్మకి ఆ గొడవల పుణ్యమా అని -- ఒక్కోదానికి మూడొందలు దొరుకుతుంది. డబ్బు- సంపాదించడం ఇంక ఎప్పుడు నేర్చుకుంటావు-- నువ్వు కాకపోతే ఇంకొకడు చేస్తాడు. ఆడికాడే జనం కొనుక్కుంటారు. ముందు బతకడం నేర్చుకో- తర్వాతే ఆ మమకారాలు..." కోపంగా అని- అక్కడనుండి వెళ్ళి పోయాడు.

    "బ్రతుకిచ్చిన వాడికి బ్రతకడం ఎలాగో నేర్పిస్తున్నాడు" గోపాలం కళ్ళకి నీటి తెర కమ్మేసింది. మవునంగా-- కూర్చుని బొమ్మ తయారీలో పడ్డాడు.

రావాడ శ్యామల గారి దిష్టి బొమ్మ కథలోనిది పై సన్నివేశం. ఈ కథను కథాజగత్‌లో చదవండి.
            


11, ఆగస్టు 2013, ఆదివారం

ఆవంత్స సోమసుందర్ కథ!

ఆవంత్స సోమసుందర్ గారి కథ కాలం కలిసిరాందే కథాజగత్‌లో చదవండి.

టాప్ టెన్ పోస్టులు!

ఈ బ్లాగులో ఇప్పటి వరకు 815 పోస్టులు పెట్టాను. వాటిల్లో ఎక్కువగా వీక్షించిన పది పోస్టుల వివరాలు ఇవిగో!


అరుణ్‌గాడి చదువు!

ఇవటూరి రాజమోహన్‌గారి కథ అరుణ్‌గాడి చదువును కథాజగత్‌లో చదవండి.

9, ఆగస్టు 2013, శుక్రవారం

సాహిత్య సమాచారం!

పద్య కవి మిత్రుల ఉపయోగార్థం...
నేటి నిజం దినపత్రిక సౌజన్యంతో

రంజని - విశ్వనాథ
పద్య కవితా పోటీలు: 2013


2013 సంవత్సరానికి మొత్తం అవార్డు సొమ్ము 5,000 రూపాయలు

ప్రథమ బహుమతి : 2000 రూ.ల నగదు + యోగ్యతా పత్రం
ద్వితీయ బహుమతి : 1500 రూ.ల నగదు + యోగ్యతా పత్రం
మూడు ప్రత్యేక బహుమతులు :1500 రూ.ల నగదు + యోగ్యతా పత్రాలు (500X3)

నిబంధనలు: 
* ఏ ఛందస్సులోనయినా ఒక అంశం మీదే 12 పద్యాలకు తక్కువ కాకుండా ఉండాలి.
*సామాజికత తప్పనిసరి
*ఇంతవరకూ ప్రచురణ, ప్రసారం కానివి, దేనికీ అనువాదం, అనుక(స)రణ కాని పద్య కవితల్ని మాత్ర్మే పంపాలి.
*ఇందుకు సంబంధించిన హామీ పత్రాన్ని విధిగా జతపరచాలి.
*పద్యకవితల్ని కాగితంపై ఒక వైపే రాయాలి.
*పద్యకవితలు పంపే కవరుపై 'రంజని-విశ్వనాథ పద్య కవితా పోటీలు' అని పేర్కొనాలి.
*పద్యకవిత ఉన్న కాగితంపై పేరు, విలాసం ఏదీ రాయకూడదు.
*పూర్తిపేరు, చిరునామా తదితర వివరాలు హామీ పత్రంలో మాత్రమే పేర్కొనాలి.
*విజేతలకు ఫలితాలను నేరుగాను, పత్రికాముఖంగాను తెలియచేస్తారు.
*ఎంపికయిన పద్యకవితలను ప్రచురించే హక్కు రంజనిదే.
*న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం.

ప్రధాన కార్యదర్శి, రంజని, తెలుగు సాహితీ సమితి, ఏ.జి.ఆఫీసు, హైదరాబాదు 500 004 అనే చిరునామాకు 10-09-2013 లోగా అందేలా పంపాలి.

7, ఆగస్టు 2013, బుధవారం

కథాజగత్‌లో టాప్ టెన్ స్టోరీస్!

చాలా రోజుల తర్వాత ఈ రోజు గూగుల్ అనలిటిక్స్ లో కథాజగత్ స్టాటిస్టిక్స్ చూడడం సంభవించింది. 

దానిలోని విజిట్స్  ఆధారంగా కథాజగత్‌లోని టాప్ స్టోరీస్‌కు సంబంధించిన సమాచారం ఇక్కడ చూడండి. 

మొత్తం విజిట్స్ ఆధారంగా అంటే 4 అక్టోబర్ 2009 నుండి 07 ఆగష్టు 2013 తేదీవరకు టాప్ పది కథలు ఇలా ఉన్నాయి.

1.సరికొత్త సూర్యోదయం - శైలజామిత్ర
2.ఏకాంతంతో చివరిదాకా - అరుణపప్పు
3.ప్రేమజిల్లాలు - కొండేపూడి నిర్మల
4.కొడిగట్టరాని చిరుదీపాలు - అంబికా అనంత్
5.గొడ్డు - జయంపు కృష్ణ
6.ఏకాకి - వింజమూరి అచ్యుతరామయ్య
7.రాత్రౌ తరతి నర్మదా - ఓగేటి ఇందిరాదేవి
8.చల్లారిన పాలు - ఆచంట హైమవతి
9.రుణం - ఎస్.డి.వి. అజీజ్
10.జంధ్యం - అక్కిరాజు భట్టిప్రోలు 

ఈ మాసంలో టాప్ టెన్ కథలు (అంటే 8జూలై నుండి 7 ఆగష్టువరకు వీక్షించిన వారి గణాంకాల ఆధారంగా)

1.దూరం - జయంతి పాపారావు
2.నాగరికథ - అనిల్ ఎస్.రాయల్ 
3.గాలిలో దీపం - మధురాంతకం నరేంద్ర
4.గూడుచాలని సుఖం - పురాణం శ్రీనివాస శాస్త్రి
5.నాన్నంటే- ఏ.ఎస్.జగన్నాథ శర్మ
6.ఏకాకి - వింజమూరి అచ్యుతరామయ్య
7.అనుబంధం లోగిల్లో ప్రేమజల్లు - యలమర్తి అనూరాధ
8.ఆహిరి - రావూరి భరద్వాజ
9.ప్రేమ జిల్లాలు - కొండేపూడి నిర్మల
10.వానరాయుడి పాట - వేంపల్లి గంగాధర్.

గమనిక: పై రాంకింగు యూనిక్ విజిటర్స్ గణాంకాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. రిపీటెడ్ విజిటర్స్ ను పరిగణనలోకి తీసుకో లేదు.  

6, ఆగస్టు 2013, మంగళవారం

పుస్తక సమీక్ష -26 బియాండ్ కాఫీ

[పుస్తకం పేరు: బియాండ్ కాఫీ, రచయిత: మహమ్మద్ ఖదీర్ బాబు, ప్రచురణ: కావలి ప్రచురణలు, 1-13-6, ఓల్డ్ టౌన్, కావలి 524201 వెల:రూ.135/- ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు, e-బుక్ కొరకు: www.kinige.com]

ప్రముఖ యువరచయిత మహమ్మద్ ఖదీర్‌బాబు రచించిన 10 కథల పుస్తకం  ఇది. పది కథలూ డైరెక్టు కథలే. ఇదివరకు ఎక్కడా ప్రచురింపబడలేదు. ఈ కథల్ని ఇక్కడ కొంత పరిశీలిద్దాం.

మంత్రాలూ,తంత్రాలూ, మాయలూ, తాయెత్తులూ, మూలికలూ అంటూ ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకునే హుజూర్ లాంటివారు తమ ఆటలు సాగని చోట ఎలా లౌక్యంగా వ్యవహరిస్తారో మొదటి కథ ఆస్తిలో తెలుస్తుంది. డ్రగ్సుకు అలవాటు పడి చివరకు తన మగతనాన్నే కోల్పోయిన ఒక ధనవంతుడు, అతని చేతకానితనాన్ని ఆసరగా చేసుకుని అతని ముందే అతని డ్రైవర్‌తో సంబంధం పెట్టుకుని కులికే భార్య, పరువు ప్రతిష్టల కోసం, మనవడి కోసం కోడల్ని సహిస్తున్న అత్తగారు ఈ కథలో మనకు తారసపడతారు.

తరువాతి కథ పేరు ఘటన. ఒక ముసలాడు తప్పతాగి రోడ్డుకు అడ్డంగా నడుస్తూ కారు క్రింద పడతాడు. ఆ కారు నడుపుతున్న కుర్రాడు ఆయన్ని హాస్పెటల్లో చేరుస్తాడు. విషయం తెలుసుకున్న ముసలిది హాస్పెటల్‌కు వచ్చి మొగుడిపై ఉన్న కోపాన్ని అక్కడున్న వాళ్ళపై ప్రదర్శిస్తూ చెడామడా దులిపి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ కుర్రాడు ఎలాగో ఆవిడను కన్విన్స్ చేసి మళ్ళీ హాస్పెటల్‌కు పంపుతాడు. మొగుడి పలకరింపుతో ఆమె కరిగిపోతుంది. ఇదీ కథ. ఎన్ని గొడవలున్నా దంపతుల మధ్య ఆప్యాయతలు అనేవి ఉంటాయని ఈ కథ నిరూపిస్తుంది. స్త్రీలకున్న క్షమించే గుణాన్ని కూడా ఈ కథ తెలియజేస్తుంది.    ఒంటరితనంతో నరకాన్ననుభవించే ఓ ధనిక కుటుంబ స్త్రీ ఆ 'బోర్' నుండి తప్పించుకోవడానికి అపరిచిత పురుషులకు ఫోన్ చేసి విసిగించే వైనం టాక్ టైం కథలో చూడవచ్చు.  An idle mind is devil's workshop అనే నానుడికి ఈ కథ ఒక ఉదాహరణ.  ఒక పిల్లవాడు తనపై ఆప్యాయతను చూపే పక్కింటి అమ్మాయి(అక్క)పై అభిమానాన్ని పెంచుకోవడం, ఆ అమ్మాయి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే వాడిలో కలిగే మథనం వహీద్ అనే కథలో కన్పిస్తుంది.  'ఎదుటివాళ్లనే కాదు ఒక్కోసారి మనల్ని కూడా మనం క్షమించుకోవాలి మనస్ఫూర్తిగా' అని మచ్చ అనే కథలో సందేశమిస్తాడు రచయిత. మంచి మాటలతో వినయం నటిస్తూ తారసపడిన స్త్రీలను వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని లొంగదీసుకునే ఓ మగాడి కథ ఏకాభిప్రాయం.

ఇక తరువాతి కథ పేరు పట్టాయ. పట్టాయ అంటే ఒక పట్టాన అర్థం కాలేదు. గూగుల్లో శోధిస్తే అది థాయ్‌లాండ్ దేశంలో ఒక నగరం పేరు అనీ, మసాజ్ సెంటర్లకూ, బార్లకూ, వ్యభిచారానికీ ఫేమస్ అనీ తెలిసింది. ఈ కథలో అక్కడకు వెళ్ళేవారి ఆకలి గురించీ,అక్కడ పడుపువృత్తిలో ఉన్న వారి ఆకలి గురించీ వర్ణిస్తున్నాడు రచయిత. అదేంటోగానీ ఈ కథ చదివితే పడుపు వృత్తిలో ఉన్నవారిపై మనకు జాలి కలుగదు. ఓ సాఫ్టువేర్ ఉద్యోగి ఓ టీకొట్టు అమ్మాయిని ముగ్గులోకి దింపుతాడు అపస్మారకం కథలో. 'టూ మినిట్స్'కోసం సిద్ధపడుతుండగా అనుకోని సంఘటనలు ఎదురై తను పాల్పడిన నీచానికి సిగ్గుపడుతూ, జ్వరంలో వున్న తన బాబు గురించి కంగారు పడుతూ చివరకు స్మారకంలోకి వస్తాడు అతడు.

భర్తకు విడాకులు ఇవ్వడానికై లాయర్‌ను సంప్రదించబోయి ముప్పయ్ రెండేళ్ల స్త్రీ ఒక సమస్య వల్ల సతమతమవుతూ సామూహిక మానభంగానికి గురవుతుంది ఇంకోవైపు అనే కథలో. చివరి కథ పేరు బియాండ్ కాఫీ. అదొక రెస్టారెంట్ పేరు. ఆ రెస్టారెంట్‌లో ఒక స్త్రీ పరిచయమౌతుంది రచయితకు. తన భర్త పైన కంప్లయింట్స్  చెబుతూ అతడిని అభాసుపాలు చేయడానికి ప్లాన్ అడుగుతూ ఉంటుంది రచయితని. భర్త కూడా తన భార్య మ్యాడ్ అనీ ఆవిడ మాటలు నమ్మవద్దనీ నమ్మితే డేంజర్లో పడతారనీ హెచ్చరిస్తూ ఉంటాడు. ఇద్దర్లో ఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో చివరి దాకా సస్పెన్స్ కొనసాగించాడు ఈ కథలో.

దాదాపు అన్ని కథలలోనూ స్త్రీ పురుషుల మధ్య అనైతిక సంబంధాల ప్రస్తావన వస్తుంది. కనీసం అలా ధ్వనిస్తుంది. ఉదాహరణకు ఘటన కథలోని ఈ వాక్యాలు చదవండి.

'మ్మ్'... మూలిగింది.

కుర్రాడు చటుక్కున ఆమె దగ్గరికొచ్చి పట్టుకున్నాడు. పెనుగులాడుతూ ఉంది. వైద్యుడు రోగిని పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. పెనుగులాడుతూ ఉంది. పురుషుడు స్త్రీని పట్టుకున్నట్టు. 

ఆ తర్వాత వాళ్లు ఇంటి నుంచి బయట పడటానికి మరికొంత సమయం పట్టింది. 

ఈ వాక్యాలు లేకపోయినా కథకేం భంగం వాటిల్లేది కాదు.

వీటికి మాడ్రన్ ఫేబుల్స్ అని కితాబు ఇచ్చారు ముక్తవరం పార్థసారథి గారు. దీనితో ఈ పుస్తకం చదివినవారు ఎంతమంది ఏకీభవిస్తారు? మహమ్మద్ ఖదీర్‌బాబు కథలు పాఠకులను ఆసక్తిగా చదివిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. థాయ్‌లాండ్, మణికొండ, జూబ్లీహిల్స్ నేపథ్యంలో సాగే కథలకంటే కావలి బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే కథల్నే ఖదీర్ బాబు నుండి పాఠకులు కోరుకుంటారని ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. ఒక రకంగా ఈ పుస్తకంలోని కథలు ఎబ్బెట్టు కథలు.      

         

3, ఆగస్టు 2013, శనివారం

2, ఆగస్టు 2013, శుక్రవారం

జ్ఞా.సిం.స.తి.రా పై కౌముది సమీక్ష!మా జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు గ్రంథంపై కౌముది వెబ్ మాస పత్రికలో పుస్తక పరిచయం ప్రచురించారు. చదవడానికి ఈ క్రింది లింక్ నొక్కండి. ఎడమవైపు వున్న సైడ్ బార్‌లో పుస్తక పరిచయం క్లిక్ చేయండి.

1, ఆగస్టు 2013, గురువారం

పుస్తక సమీక్ష 25 - వంశీమోహనము
[పుస్తకం పేరు: వంశీమోహనము - శ్రీకృష్ణ స్వర్వస్వం, సంపాదకులు: డా.టి.శ్రీరంగస్వామి, వెల: రూ.250/-, ప్రచురణ: శ్రీలేఖ సాహితి(సాహిత్య సాంస్కృతిక సంస్థ), ఇంటి నెం. 14-5/2, మండల కార్యాలయము ఎదురుగ, హసన్‌పర్తి, వరంగల్లు 506 371, ప్రతులకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మరియు దాని శాఖలు] 


భారతీయ వాఙ్మయంలో ప్రత్యేకించి సంస్కృతాంధ్రాలలో శ్రీకృష్ణుని దర్శనాన్ని వివరించి విశ్లేషించే 32 వ్యాసాల సంపుటమిది. శ్రీకృష్ణుని బహుముఖమయిన అన్ని పార్శ్వాలనూ స్పృశించే ఈ గ్రంథానికి శ్రీకృష్ణ సర్వస్వం అనే నామాంతరం కూడా సరిపోయింది. కోవెల సుప్రసన్నాచార్య, కపిలవాయి లింగమూర్తి, సముద్రాల లక్ష్మయ్య, ఆముదాల మురళి, ఎన్.అనంతలక్ష్మి, తంగిరాల వెంకటసుబ్బారావు, ధారా రామనాథశాస్త్రి, హెచ్.ఎస్.బ్రహ్మానందం, వి.ఎ.కె.రంగారావు, అంబికా అనంత్,జి.ఎస్.మోహన్, కోలవెన్ను మలయవాసిని, ద్వారం లక్ష్మి, సామల సదాశివ, టి.శ్రీరంగస్వామి, రావి ప్రేమలత మొదలయిన దిగ్గజాలు శ్రీకృష్ణ తత్త్వాన్ని విశ్లేషించిన వైనాన్ని ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు.  


శ్రీకృష్ణుడు క్రీ.పూ.3228లో జన్మించి 125 సంవత్సరాలకు పైన జీవించాడనీ, హాభారత యుద్ధం నాటికి శ్రీకృష్ణుని వయసు 90 యేళ్ళని, తన జీవితకాలంలో  పూతన, శకటాసుర, తృణావర్త, వత్సాసుర, బకాసుర, అఘాసుర, ధేనుకాసుర, ప్రలంబ, శంఖచూడ, వృషభాసుర, రజక, చాణూర, ముష్టిక, కంస, కాలయవన, శంబరాసుర, నరకాసుర, రుక్మి, బాణాసుర, పౌండ్రక వాసుదేవ, సుదక్షణ ద్వివిద, శిశుపాల, దంత్రవక్త, విదూరధ, వ్యోమాసుర, ముర,సాళ్వ మొదలైన 29 మంది దుష్టులను సంహరించినట్లు ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది.

భాగవత  రహస్యమంతా శ్రీకృష్ణోపనిషత్తాత్పర్యంగా రూపొందిందని నిరూపించే వ్యాసంతో ప్రారంభమయిన ఈ పుస్తకంలో మేఘకావ్యమ్, గర్గ సంహిత, రాధికోపనిషత్తు, శ్రీకృష్ణకర్ణామృతము, రాధికా స్వాంతనము, గీతాగోవిందము కృష్ణస్తవరాజం మొదలైన రచనలలో శ్రీకృష్ణుని వివిధ రూపాలలో సాక్షాత్కరింపజేసే వ్యాసాలున్నాయి. మీరా, అన్నమయ్య, పురందరదాసు మొదలైన అనేక వాగ్గేయకారుల కీర్తనలలో శ్రీకృష్ణ ప్రశస్తిని వ్యక్తపరిచే వ్యాసాలేకాక, హిందుస్తానీ సంగీతంలో శ్రీకృష్ణభక్తిని వివరించే రచనకూడా ఈ పుస్తకంలో పాఠకులకు కనువిందు చేస్తుంది. భగవద్గీతలోనూ, భారత, భాగవతాల్లోనూ పాండవపక్షపాతిగా, గీతాచార్యునిగా, అవతార పురుషునిగా, గోపబాలకుడిగా శ్రీకృష్ణుని రూపించే వ్యాసాలు, తమిళనాడులోని శ్రీకృష్ణారణ్య క్షేత్రాలను వివరించే వ్యాసం కూడా ఈ పుస్తకంలో వున్నది. విశ్వనాథ సత్యనారాయణ కావ్యాలలోనూ, వేంకట పార్వతీశ కవుల బృందావన కావ్యంలోనూ శ్రీకృష్ణ వర్ణనలు తెలిపే రచనలు ఈ పుస్తకంలో చోటుచేసుకున్నాయి. ప్రబంధ సాహిత్యంలోనూ, జానపద వాఙ్మయములోనూ, శతక సాహిత్యంలోనూ, నాటక సాహిత్యంలోనూ, సినిమా పాటల్లోనూ, నవలల్లోనూ శ్రీకృష్ణ దర్శనాన్ని చేయిస్తుందీ పుస్తకం. పర్యావరణ పరిరక్షణలో శ్రీకృష్ణుని పాత్రను కూడా మనకు తెలియజేస్తుంది. కేవలం ఆధ్యాత్మిక జగత్తుకే కాకుండా సాహిత్యాభిలాషులకు,సామాన్య పాఠకులకు ఎంతో ఆసక్తిని కలిగించే రచన యిది. ఈ మధ్య కాలంలో చదివిన పుస్తకాలలో నాకు బాగా నచ్చిన పుస్తకం ఈ వంశీమోహనము.