...

...

30, ఏప్రిల్ 2009, గురువారం

మహాకవి శ్రీశ్రీకి శతజయంత్యుత్సవ నివాళి!!!


మహాకవి శ్రీశ్రీ శతజయంత్యుత్సవాల సందర్భంగా ఆ మహానుభావుణ్ని తలచుకునే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఈ సందర్భంగా నా పాత టపాలోని 'శ్రీశ్రీ - ఆరుద్ర'ల సంవాదం సాహిత్యోపనిషత్ నుండి కొన్ని భాగాలు మళ్ళీ మీకోసం.చెప్పిందే చెప్పిందే మళ్ళీ చెప్పడం
అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కొందరి కిష్టం
చెప్పింది చెప్పి మెప్పించాలని
చేస్తున్నాను నేను నా రచనల్లో ప్రయత్నం
అదే అనుకుంటాను కవిత్వం
అనుకరణం అనవసరం
అంతేకాదు అనర్ధకం
అందుకనే దేవుణ్ణి సహా ఇమిటేట్ చెయ్యడం
మానెయ్యడం
అదీ నా ప్రయత్నం
అదే నా కవిత్వం
ఈ మేకలే నాలోని పెద్దపులికి ఆహారం
నా కవిత్వం ఆ వ్యాఘ్రం ఆకలి ఆహారం


* * * * * *

రుచీ, ఔచిత్యం ఇవీ ముఖ్యం మెప్పుకి
కవికోరే మెప్పు గండపెండేరం కాదు
సమానధర్ముల హృదయస్పందనం శిరఃకంపనం
అదీ గీటురాయి అసలైన కవిత్వానికి
వానలాగ ప్రజల హృదయాలల్లో వర్షించి
కొత్త భావాల బీజాలు జల్లేది కవిత్వం
ప్రజలు చప్పట్లు కొట్టే భావాలకి
పద్యాల రూపం ఇస్తే చాలదు
ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తూనే కవి
మెజారిటీకి అందని ఊహలు వెదకాలి
ఆ తర్వాత అతని మైనారిటీ ఓటు
ఆక్రమిస్తుంది ప్రజాహృదయంలో చోటు
ఏమైనాసరే కవిత్వం
మేలుకొల్పాలి కాని జోగొట్టగూడదు


* * * * * *

కవిత్వమ్మీద కవిత్వంకూడా కవిత్వమే
అది ఎప్పటికైనా తెలిసిపోయే రహస్యమే
ఈలోగా ఎవరైనా తికమక పడుతున్నప్పుడు
వ్యాఖ్యాత జోక్యం చేసుకోక తప్పదు
భావాల సరిహద్దులవద్ద కాపలా కాయాలి కవి
ప్రపంచాన్ని ప్రజానీకానికి విశదం చేయాలి కవి
చక్రాల్లో చక్రాల్లాగా అర్ధాల్లో అంతర్ధాలుంటాయి
కొంతమట్టుకే బోధపడవచ్చు కొందరికి
ఇంకా అందులో ఏముందో చెబుతాడు వ్యాఖ్యాత
అర్ధంకాని రహస్యం లేనట్టే అసలే బోధపడనిదంటూ ఏదీ
ఉండదు
అన్ని కళల్లాగే కవిత్వం కూడా
ఏక కాలంలో రెండు లెవెల్స్ లో పనిచేస్తుంది
అందుకే అసలైన కవిత్వం
ఏకకాలంలోనే పండిత పామరజన రంజకం
ఎవరో అనగా విన్నాను
"మనుష్యులంతా సమానులే గాని
కొందరు మరికొంచెం ఎక్కువ సమాను"లని
విదూషకుడి నోటంట వచ్చే నిజం లాంటిదిది
మనుష్యుల్లో హెచ్చు తక్కువలు సర్దుదాం మొదట
మనసుల్లో ఎగుడు దిగుడులు సర్దుకొంటా యాపిదప
సరేగాని నేనొకటడుగుతాను చెప్పు
ఛందస్సుల నియమ బంధంలో లేదా ముప్పు?

25, ఏప్రిల్ 2009, శనివారం

పుస్తక సమీక్ష! -10 పర్యావరణం - సమాజం, ప్రకృతి - పర్యావరణం

[పుస్తకం: 1.పర్యావరణం - సమాజం పేజీలు :171 వెల: రూ.100=00లు
పుస్తకం: 2.ప్రకృతి - పర్యావరణం పేజీలు : 96 వెల:రూ.50=00లు
రచన : నాగసూరి వేణుగోపాల్ ప్రతులకు : ఎన్.కె. పబ్లికేషన్స్, 24-8-1, సమీర రెసిడెన్సి, విజయనగరం 535 001]


తెలుగులో శాస్త్ర సాంకేతిక రంగాలపై రచనలు తక్కువగానే వెలువడుతున్నాయని చెప్పుకోవాలి. ఆంగ్ల సాంకేతిక పదాలకు తెలుగులో సరియైన, సులభమైన సమానమైన పదాల సృష్టి తక్కువగా ఉండటం ఒక కారణమైతే, ఈ విషయాలపై జనరంజకంగా, ఆసక్తి గొలిపే విధంగా రచనలు చేయడం అంత సులభం కాకపోవడం మరో కారణం. అయితే శాస్త్రీయ వైజ్ఞానిక అంశాలపై రచనలు చేస్తున్న తెలుగు రచయితలలో నాగసూరి వేణుగోపాల్ విషయాన్ని సామాన్య పాఠకునికి సులభంగా, తేలికగా అర్థమయ్యే విధంగా రాయడంలో బహు నేర్పరి. వీరు పర్యావరణ శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలను ఒక ప్రముఖ దిన పత్రిక ఆదివారం సంచికలో ప్రకృతి - వికృతి అనే శీర్షికతో జనసామాన్యానికి అందించారు. ఈ వ్యాసాలు ప్రకృతి - పర్యావరణం, పర్యావరణం - సమాజం అనే పేర్లతో పుస్తకరూపంలో మన ముందున్నాయి. వీటిలో పర్యావరణం - సమాజం అనే పుస్తకం ఇదివరకే ప్రకృతి - వికృతి అనే పేరుతో రెండు ముద్రణలు పొంది ప్రస్తుతం పునర్నవీకరించబడింది.


ఈ వ్యాసాలలో నాగసూరి వేణుగోపాల్ పర్యావరణ, జీవావరణ సంబంధమయిన అనేక విషయాలను, వాటి మూలంగా ప్రకృతిలో సంభవిస్తున్న అనేక మార్పులను, విపత్తులను వివరిస్తున్నారు. రకరకాలైన కాలుష్యాల కారణంగా చాలా రకాల మొక్కలు, జంతువులు, పక్షులు కనుమరుగవుతున్నాయి. విపరీతమైన పాలిథీన్ కవర్ల వాడకం పర్యావరణ తుల్యతను దెబ్బతీస్తోంది. అధిక జనాభా, వాటి అవసరాలు, నాగరికత, శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి కారణాలుగా పలు రకాల జీవ రాశులు అంతరించిపోతున్నాయి. పారిశ్రామిక కాలుష్య ప్రభావంతో తాజ్‌మహల్ వంటి అద్భుత కట్టడాలు తేజొ రహితంగా మారిపోతున్నాయి. తరుగుతున్న అడవులు పులులు, ఏనుగులు వంటి మృగాలను జనావాసాల వైపు రావడానికి దోహద పడుతున్నాయి. మనం పంట పొలాల్లో వాడుతున్న క్రిమి సంహారక రసాయనాల కారణంగా రాబందులు, గ్రద్దలు మొదలైన పక్షి జాతులు అంతరించి పోతున్నాయి. రొయ్య చెరువుల కోసం కృష్ణా తీరంలో మడ అడవులను నాశనం చేయడం వల్ల జీవ వైవిధ్యం అంతరించి పోతోంది. పలు దేశవాళీ పళ్ళ రకాలు క్రమంగా కనుమరుగు కావడానికి మనం ఒడిగట్టుతున్న పర్యావరణ వినాశనమే కారణం. కాలుష్యం, మానసిక ఒత్తిడి, పొగత్రాగడం, మలిన ఆహారం, పరిసరాల్లోని విషపు లోహాలు, ఇతర మలినాలు ఇవన్నీ మానవజాతి వంధ్యత్వానికి కారణాలవుతున్నాయి. ఆధునిక వ్యవసాయం, నగరీకరణ కారణంగా పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. పరిశ్రమల మలినాలు, క్రిమి సంహారిణిలు భుగర్భ జలాలను సైతం కలుషితం చేస్తున్నాయి. దీని వల్ల చర్మ సంబంధమైన వ్యాధులు, శ్వాస కోశ వ్యాధులు కలుగుతున్నాయి. రసాయనిక, పారిశ్రామిక పరిశోధనల మూలంగా అసహజమైన, సింథటిక్ రంగులు రావడంతో ప్రకృతి సిద్ధమైన రంగులు అంతర్థానమయ్యాయి. సౌందర్య సాధనాలుగా మనం వాడుతున్న పౌడర్లు, స్నోలు, లిప్‌స్టిక్‌లు, నెయిల్ పాలిష్‌లు, డియోడరెంట్లు అన్నింట్లోనూ ఉన్న రసాయనికాల వల్ల అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉంది. డిడిటి లాంటివి మనుష్యులలో జన్యు పరమైన మార్పులకు దోహద పడే ఈడిసి (Endocrine Disrupting Chemicals)ల పాత్ర పోషిస్తున్నాయి. శీతల పానీయాలను సేవించడం వల్ల ఎముకలలో కాల్షియం పరిమాణం తగ్గడం, రక్త పీడనాన్ని ప్రభావితం చెయ్యడం, నిద్రలేమి, తలనొప్పి, కడుపులో అల్సర్, ఆందోళన వగైరా కలుగుతాయి. నియాన్ దీపాల వలన అధిక రక్త పీడనం, నరాల క్షీణత, అల్సర్, ఋతుక్రమంలో అవాంచనీయ తేడాలు, తలనొప్పి, అసిడిటి, నిర్లిప్తత, అలసట, న్యూనత మొదలైన సమస్యలు వస్తాయి. ఆటోమొబైల్ వాహనాల నుండి వెలువడే వాయువులు ఆమ్ల వర్షాలు కురిసేందుకు కారణభూతాలవుతున్నాయి. పొగ త్రాగటం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదమే కాక పాస్సివ్ స్మోకింగ్ కారణంగా పలువురు అనారోగ్యం పాలౌతున్నారు. మనం వాడుతున్న రిఫ్రిజిరేటర్లు ఓజోన్ పొరలో రంధ్రం ఏర్పడటానికి ఒక కారణం. పోడు సేద్యం వల్ల ఎంతో విస్తీర్ణం కల అడవి అంతరించి పోతోంది. లుకేమియా, లింఫొమా లాంటి రక్త కాన్సర్లకు వాతావరణ కాలుష్యమే ప్రధాన కారణం. ఇటువంటి విషయాలను నాగసూరి తమ వ్యాసాల్లో తెలియజేస్తున్నారు. ఈ వ్యాసాల్లో పలు చోట్ల రచయిత తన ఉద్దేశ్యం బెదరగొట్టి భయపెట్టడం కాదని పేర్కొంటున్నారు. పర్యావరణ కాలుష్య ప్రభావంపై పాఠకులకు అవగాహన కలిగించడమే ఈ రచన ముఖ్య సంకల్పంగా వారు చెబుతున్నప్పటికీ ఈ వ్యాసాల్లోని గణాంకాలూ అవీ చూస్తే భయం కలుగక మానదు.


అయితే ఈ వ్యాసాల్లో నాగసూరి వేణుగోపాల్ కేవలం పర్యావరణం వల్ల కలిగే నష్టాలనే కాకుండా ఎన్నో కొత్త కొత్త విషయాలను కూడా పాఠకులకు పరిచయం చేస్తున్నారు. గోవాలో విదేశీ పర్యాటకుల రాకకు అసలు కారణం వారి దేశాలలో సముద్ర తీరాన్ని కలుషితం చేస్తే కట్టవలసిన పన్ను కన్నా గోవాలో విహరించడం చౌక కావడమేనట. కార్గిల్‌లో పాకిస్తాన్ సైనికుల చొరబాటుకు పర్యావరణం ఒక కారణమని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. పర్యావరణంలో భారీ మార్పుల కారణంగా సాధారణం కంటే ముందుగా కార్గిల్ ప్రాంతంలో వచ్చిన వసంతం వల్ల మంచు తొందరగా కరిగి చొరబాటుదారులకు మార్గం సుగమం చేసింది. సాధారణంగా శీతాకాలంలో కార్గిల్ ప్రాంతంలో ఉండటం చాలా కష్టం. అందుకే ఆ సమయంలో గస్తీ కూడా ఉండదు. ఇదే అదనుగా తీసుకుని పాక్ సైనికులు మన భూభాగం పైకి రాగలిగారు. ఇంకా పర్యావరణ పరిరక్షణలో స్ఫూర్తి ప్రదాతలుగా పేర్కొన దగిన ప్రభాత్ ఉప్రితి, కొంగర తిమ్మప్ప, శోభన్ సింగ్ భండారి, కొచ్చిన్ లోని ఆంథోని, బెంగళూరుకు చెందిన ఎస్.విశ్వనాథ్, పాట్నాకు చెందిన వికాస్ చంద్ర, స్వాధ్యాయ ఉద్యమ స్థాపకుడు పాండురంగ శాస్త్రి అథవాలే మొదలైనవారి విజయ గాథలను వివరించే వ్యాసాలూ ఇందులో ఉన్నాయి.


రచయిత నాగసూరి వేణుగోపాల్ ఈ వ్యాసాలను అకడమిక్‌గా కాకుండా కథనాత్మకంగా, సాహితీ గుభాళింపును మేళవించి, సరళమైన భాషతో అందరికీ అర్థమయ్యేలా రాశారు. గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్‌వార్మింగ్, బయోనీర్స్ వంటి సాంకేతిక అంశాలు ఈ వ్యాసాలు చదివిన వారికి ఇట్టే అర్థమౌతుంది. ప్రముఖ వ్యక్తుల కొటేషన్లను సందర్భానుసారంగా ఉపయోగించి చదువరికి ఆసక్తి కలిగించారు రచయిత. ఈ వ్యాసాలకు ఉంచిన శీర్షికలూ అకట్టుకుంటాయి. ప్లాస్టిక్ సంచి పర్యావరణానికి విషాద విపంచి, ప్రకృతి లీలా విలాసానికి ప్రతీక - మడ అడవి, వినబడలేదా ఈ మృతుఘంటికలు?, వెలగనీకుమా నియాన్ దీపం!, వినువీధిలో రాగ విపంచి, గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి, ఆకు పచ్చ సంద్రంలో... ఒలికిన విషం, మొసళ్ళకు మొసలి కన్నీరు మొదలైన శీర్షికలు రచయిత భాషాభిమానాన్ని చాటితే, కాలుష్యంతో వంధ్యత్వం, విషతుల్యమవుతున్న జీవన గంగ, ఏరు పారింది ఊరు వెలిగింది, సంపదలకు నెలవు చెరువు!, అడవులకు చేటు పోడు సేద్యం, క్యాన్సర్‌కు చిరునామా కాలుష్యం మొదలైన శీర్షికలు ఆ వ్యాసాలలోని విషయాలను సూచిస్తున్నాయి. ద్రోహబుద్ధి వీడితే స్నేహహస్తం!, పేరాశతో పిచ్చి వాళ్ళం కాకూడదు!, వెనుదిరిగి విశ్లేషుకుందాం!, జాగరూకతతో ముందుకెడదాం!, పర్యావరణంలో విలువలు ప్రధానం, సామూహిక చైతన్యమే రక్షణ మొదలైన శీర్షికలు ఆ వ్యాసాలలో వివరించబోయే సమస్యలకు పరిష్కారాన్ని సూచనప్రాయంగా తెలియజేస్తుంది.


ప్రపంచ స్థాయిలో సమస్యను అర్థం చేసుకుని వ్యక్తిగత స్థాయిలో పరిష్కారాలను ప్రారంభించా లనే సూత్రం పర్యావరణ శాస్త్రానికి చక్కగా వర్తిస్తుందంటున్నారు వేణుగోపాల్. ఈ సమస్యలకు పర్యావరణవేత్తలు రెండు రకాల పరిష్కారాలను సూచిస్తున్నారు. సమస్యను అర్థం చేసుకుని జాగ్రత్తతో మసలుకుంటూ మనుగడ సాధించడం మొదటి రకం. ఇక రెండవ రకం చిన్న చిన్న గ్రామాలలో నివసిస్తూ సమస్యలకు దూరంగా పారిపోయి కాలుష్య రహితమైన జీవనాన్ని గడపడం. దీన్ని గాంధేయ దృష్టి(?)గా పేర్కొంటున్నారు రచయిత.


మొత్తం మీద పర్యావరణానికి సంబంధించిన స్థూలమైన అవగాహనను తెలుగు పాఠకులకు అందించడానికి ఈ పుస్తకాలు దోహద పడుతున్నాయి. రచయిత నాగసూరి వేణుగోపాల్ ఈ అంశాలపై కొత్త సమాచారంతో ఇంకా విస్తృతంగా రచనలు చేయడానికి పూనుకోవాలి. ఇది ఒక కర్తవ్యంగా రచయిత భావిస్తారని మనం ఆశించవచ్చు.

ఈవారం జనవార్త రాజకీయ సామాజికార్థిక వారపత్రిక ఏప్రిల్26- మే2, 2009 సంచికలో ప్రచురితం.

10, ఏప్రిల్ 2009, శుక్రవారం

పెళ్ళి సంబరం

శ్రీ శంకర వెంకట నారాయణ రావు(ఆచంట) గారి కలం నుండి వెలువడిన కథానిక పెళ్ళిసంబరం నా బ్లాగు కథాజగత్లో ప్రకటింపబడింది. కథాభిమానులైన పాఠకులందరూ చదివి మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయగలరు.

4, ఏప్రిల్ 2009, శనివారం

పుస్తక సమీక్ష ! - 9 వ్యాస రచనా శిల్పం

[పుస్తకం పేరు : వ్యాస రచనా శిల్పం రచన: వి.చెంచయ్య, పేజీలు: 40, వెల: రూ.20=00 ప్రతులకు: శ్రీ వి.చెంచయ్య, సాహితీ నిలయం, 10-40-15ఎ/1, జనతా పేట నార్త్, కావలి - 524 201 నెల్లూరు జిల్లా ఆం.ప్ర.]

విప్లవ రచయితల సంఘం నెల్లూరు జిల్లా శాఖ ప్రచురించిన ఈ చిన్ని పుస్తకంలో వ్యాస రచన గురించిన విలువైన ఉపయుక్తమైన సమాచారం లభ్యమౌతున్నది. ఇందులో అయిదు వ్యాసాలున్నాయి.

మొదటి వ్యాసం వ్యాస ప్రక్రియ పుట్టు పూర్వోత్తరాలు. ఈ వ్యాసంలో చెంచయ్యగారు వ్యాస రచనా ప్రక్రియ పరిణామ వికాసాలను వివరిస్తున్నారు. వ్యాస ప్రక్రియకు బీజం 16వ శతాబ్దంలో పడి, ప్రమేయం, సంగ్రహం, ఉపన్యాసం మొదలయిన పేర్లతో పెరిగి పెద్దదయి 20వ శతాబ్దం నాటికి వ్యాసం అనే పేరుతొ స్థిర పడింది. తొలి నాళ్లలో పరవస్తు వేంకట రంగాచార్యులు, జియ్యరు సూరి, కందుకూరి వీరేశలింగం, పానుగంటి లక్ష్మీ నరసింహారావు, గురజాడ అప్పారావు మొదలైన వారు ఈ ప్రక్రియకు ప్రాచుర్యం కల్పించారు.

ఇక రెండవ వ్యాసం వ్యాసం ఎలా ఉండాలి? కొన్ని అభిప్రాయాలు. దీనిలో రచయిత వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రులు, ముద్దు నరసింహ నాయుడు, జియ్యరు సూరి, మునిమాణిక్యం నరసింహారావు, డా.ముదిగొండ వీరభద్ర శాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, సంజీవదేవ్, కొలకలూరి ఇనాక్ తదితరుల అభిప్రాయాలను క్రోడీకరించారు. చివరకు ఎన్ని లక్షణాలున్నా, వ్యాసానికి స్పష్టత, వివరణ, చదివించే గుణం ఉంటేనే వ్యాసానికున్న ప్రయోజనం నెరవేరుతుంది అని సూత్రీకరిస్తున్నారు.

మూడవ వ్యాసం వ్యాస రచన - కొన్ని మార్గదర్శక సూత్రాలు. ఈ వ్యాసంలో చెంచయ్యగారు వ్యాస రచనలో సందర్భాన్ని బట్టి కొంత అనుభూతి చోటు చేసుకున్నా ఆలోచన, విశ్లేషణ, విషయ వివరణ ముఖ్యమైనవిగా పేర్కొంటున్నారు. విషయ స్పష్టత, గతితార్కిక వివరణ, భావానికి తగిన భాషాశైలి అనే అంశాలు వ్యాస రచనకు మార్గదర్శకాలుగా గుర్తించారు.

తరువాతి వ్యాసం వ్యాస రచనా శిల్పం. దీనిలో భాష, శైలి, పదబంధాలు, జాతీయాలు, సామెతలు, ఆలంకారిక ప్రయోగం, వాక్య విన్యాసం, వ్యాసకర్త అనుసరించే వ్యూహం, ఎత్తుగడ, నిర్మాణం మొదలైన అంశాలు రచనా శిల్పాన్ని నిర్దేశిస్తాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టీ, సందర్భాన్ని బట్టీ, దాని పాఠకులను బట్టీ శిల్పరీతులు మారిపోతాయి. సూటిగా, సులభంగా, బలంగా, ఆకర్షణీయంగా భావ ప్రకటన చెయ్యడానికి ఈ శిల్ప రీతులను సందర్భోచితంగా వ్యాసకర్తలు ఉపయోగించుకోవడం అవసరం అంటారు రచయిత ఈ వ్యాసంలో.

ఇక చివరి వ్యాసం వ్యాస నిర్మాణాలు. విషయ పరిధిని బట్టి అవగాహన సౌకర్యం కోసం వ్యాసాన్ని చిన్న వ్యాసం, సమగ్ర వ్యాసం, వ్యాస శకలం అనే మూడు భాగాలుగా విభజించ వచ్చనీ, విషయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పాఠకుల్ని బట్టి చిన్నవ్యాసం రాయాలా, సమగ్ర వ్యాసం రాయాలా అనేది వ్యాసకర్త నిర్ణయించుకోవాలనీ రచయిత అభిప్రాయం.

ఈ వ్యాసాలలో రాళ్లపల్లి, విశ్వనాథ, చలం, కొ.కు., శ్రీశ్రీ, కె.వి.ఆర్., త్రిపురనేని మధుసూధన రావు, సంజీవదేవ్ మొదలైన ప్రసిద్ధ వ్యాసకర్తల శైలీ భేధాలను, శిల్ప రీతులను సోదాహరణగా చర్చించి వ్యాస రచనా పద్ధతులను చక్కగా వివరించారు. వ్యాస రచనలో దృష్టి పెట్టాలనుకునే వర్ధమాన రచయితలకు ఈ పుస్తకం బాగా ఉపయోగ పడుతుంది.

పుస్తక సమీక్ష! -8 సంకల్పం

గ్రంథావలోకనమ్ నుండి
[పుస్తకం పేరు: సంకల్పం (కథల సంపుటి) రచన: గుమ్మా ప్రసాదరావు,వెల: రూ.80/-, ప్రతులకు: శ్రీ గుమ్మా ప్రసాదరావు, ఎల్ఇజి-259, హడ్కో, అమ్దీనగర్, భిలాయ్- 490 009 మరియు సాహిత్య నికేతన్, హైదరాబాద్ & విజయవాడ]
కవిత స్వప్న సుందరి, కథ సహధర్మ చారిణి.
కవిత అతిదూరాన తళుక్కున మెరిసే అప్సరాంగన
కథ చేరువగా ఉన్న చిర పరిచితురాలి వంటిది.
ప్రతివాని జీవితానికి సన్నిహితమైనది కథ
-డా. సినారె

సీనియర్ కథా రచయిత గుమ్మా ప్రసాదరావు ( కలం పేరు గుమ్మా నిత్య కళ్యాణమ్మ) గారి కథాసంపుటి సంకల్పం చదివాక పై వాక్యాలు గుర్తుకు వచ్చాయి. దీనిలోని కథలన్నీ సగటు మధ్య తరగతి జీవితాలకు సన్నిహితంగా ఉంటాయి. ప్రేమ, త్యాగం, అభిమానం, పెళ్ళి, దాంపత్యం మొదలైన మానవ సంబంధాలను రచయిత ఈ కథల్లో హృద్యంగా చిత్రించారు. దేశంకోసం ప్రాణాలు అర్పించే సైనికులను కన్నవారి మానసిక సంఘర్షణ సంకల్పం కథలో కనిపిస్తే, పెళ్ళిచూపులు కథలో కాబోయే కోడలి వ్యవహార దక్షతను పరీక్షించే ఒక ఆదర్శ స్త్రీమూర్తి దర్శనమిస్తుంది. పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చిన ఆడపిల్లను కన్నవారే పరాయి దానిలా మర్యాదలు చేస్తే ఆమె పడే బాధ కూతురొచ్చిన వేళ కథలో ఆవిష్కరింప బడింది. భార్యాభర్తల మధ్య కోపతాపాలు తాత్కాలికమైనవి అనే సత్యాన్ని జీవన న్యాయం కథలో రచయిత చెబుతారు. ఓ యువతి దురుసుతనం కారణంగా పరివర్తన చెంది తన కుమారుడి పెళ్ళి కట్నకానుకలు తీసుకోకుండా చేయాలని నిశ్చయించిన స్త్రీ ఆశయం చురక కథలో చదువుతాము. పాల పొంగు లాంటి వయస్సులో అల్లరి పెట్టిన అమ్మాయినే పెళ్ళి చూపుల్లో చూసి నిరాకరించిన ఓ యువకుడికి ఆ అమ్మాయి అతడి పట్ల దురభిప్రాయం లేదని తన మనోభావాలను తెలిపే కథ ఔన్నత్యం. కూతురి సంపాదనతో పబ్బం గడుపుకొంటున్న ఓ తండ్రీ ఆమెకు పెళ్ళి కాకుండా చేసే కుతంత్రాన్ని భగ్నం చేసిన వైనం అనూహ్యం కథలో తెలుస్తుంది. సంస్కారమనేది పుట్టుకతో రాదు పెంచిన పెంపకంలో ఉంటుందన్న సత్యాన్ని క్షితిజ కథ చాటుతుంది. స్త్రీ విద్య, ఉద్యగాల పట్ల, స్త్రీ పునర్వివాహాల పట్ల సదభిప్రాయం లేని అధికారికి తాను నమ్మిన సిద్ధాంతాలకోసం ఉద్యోగాన్ని సైతం వదులుకొనే క్రింది ఉద్యోగి కళ్ళు తెరిపిస్తాడు కనువిప్పు కథలో. జీవన శకటానికి స్త్రిపురుషులిద్దరూ రెండు చక్రాల లాంటివారు. ఏ చక్రం లేకపోయినా బండి నడవదు అనే సందేశం బొమ్మ-బొరుసు కథ ద్వారా లభిస్తుంది. పరిస్థితులతో రాజీ పడటం కాదు వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం మనిషి కర్తవ్యం అనే సంగతి మార్పు కథలో బోధపడుతుంది. వేషభూషాలనుబట్టి ఎదుటివారి వ్యక్తిత్వాన్ని బేరీజు వేయలేమని తగిన బంధం కథ నిరూపిస్తుంది. చేసిన తప్పును సరిదిద్దుకోవడంలో మానవత్వం ఉందనే నిజాన్ని పరిష్కారం కథ ద్వారా గ్రహించగలం. వైధవ్యం ప్రాప్తించిన కోడలికి ఉద్యోగం, ఆర్థిక సహాయం అందజేయిస్తే మాట మాత్రం చెప్పకుండా పునర్వివాహం చేసుకుని తన దారి తాను చూసుకొన్నా ఆమె నిర్ణయాన్ని హర్షించే మామ దొడ్డమనసు కథలో తారసిల్లుతాడు. మనుమడి పెళ్ళికి ఆరాటపడే నాయనమ్మ పాత్రను ఆహ్వానం కథలో, చెప్పుడు మాటలు విని అదే నిజమని నమ్మే తల్లి పాత్రను బలహీనత కథలో చూస్తాము. తాంబూలం కథలో కొడుకు పెళ్ళిచూపుల నెపంతో వచ్చి మిత్రుని ద్వారా కాబోయే వియ్యంకుని వివరాలు రాబట్టి విశ్లేషించిన తీరు ఆకట్టుకొంటుంది. మిగతా కథలతో పోలిస్తే అంబేద, శుభలేఖ, లక్ష్యం కథలు సాధారణంగా ఉన్నాయి. జీవన న్యాయం, పరిష్కారం కథల్లో రచయితే ఒక పాత్రగా మలచబడ్డారు. మొత్తానికి ఒక మంచి పుస్తకం చదివామన్న అనుభూతిని మిగుల్చుతుంది ఈ కథా సంపుటం.
(ఆంధ్రభూమి దినపత్రిక 6 జనవరి 2008 లో ప్రచురితం)

3, ఏప్రిల్ 2009, శుక్రవారం

శ్రీరామనవమి కానుక!


బ్లాగ్మిత్రులందరికీ శ్రీరామ నవమి సందర్భంగా నా హార్ధిక శుభాకాంక్షలు. ఆ శ్రీరామ చంద్రుడు మీకు మీ కుటుంబానికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నా కథాజగత్ బ్లాగులో శ్రీ అరిపిరాల సత్య ప్రసాద్ గారి రామా కనవేమిరా!! కథ ప్రత్యేకంగా మీకోసం ప్రకటిస్తున్నాము. చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.