...

...

14, మార్చి 2013, గురువారం

పాలపర్తి జ్యోతిష్మతి గారి కథ!

పాలపర్తి జ్యోతిష్మతి గారి కథ 'వృక్షవేదన'ను కథాజగత్‌లో చదవండి.

12, మార్చి 2013, మంగళవారం

మైలురాయి

నేటితో తురుపుముక్క బ్లాగు వీక్షకుల సంఖ్య 50,000 దాటింది. మీ అభిమానానికి కృతజ్ఞతలు

11, మార్చి 2013, సోమవారం

కథాజగత్‌లో సై-ఫై కథ!


అనిల్ ఎస్.రాయల్ గారి కథ నాగరికథ బ్లాగు మిత్రులకు సుపరిచితమే! అబ్రకదబ్ర అనే ప్రక్షిప్త నామంతో 'తెలు-గోడు' బ్లాగుద్వారా అనిల్‌గారు మనకు తెలిసినవారే! ఈ కథ ఆంధ్రజ్యోతిలో నవంబరు2009లో అచ్చయింది. తర్వాత కథ - 2009, వర్తమాన తెలుగు కథ - 2009, త్వరలో(?) వెలువడనున్న సాహిత్య అకాడెమీ సైన్స్ ఫిక్షన్ కథల సంపుటి మొదలైన సంపుటాల్లోనూ, 2012లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారానూ వెలుగు చూసింది. ఇప్పుడు కథాజగత్‌లో కూడా చోటు చేసుకుంది. చదవండి.

9, మార్చి 2013, శనివారం

భూసూక్తము - కాల నిర్ణయము


భూసూక్తము అను పేరుతో ఒక కథను డాక్టర్ సర్దేశాయి తిరుమలరావు గారు వ్రాసినారు. దానిని తురుపుముక్కలో చదువవచ్చును. ఈ కథ రచనా కాలమెప్పటిదో నిర్ధారించుట ఈ వ్యాసము ముఖ్యోద్దేశము. 

1. ఈ కథను సర్దేశాయి తిరుమలరావుగారు వ్రాసిరి. వారు క్రీ.శ.1928వ సంవత్సరములో జన్మించి 1994 మే నెలలో కాలధర్మం చేసినారు. కాబట్టి ఈ కథ 1928-1994 మధ్యకాలంలో రచింపబడింది. 

2. కథలో గంగిరెడ్డి మద్రాసులో చదువుతున్న తన కొడుకు భీమిరెడ్డిని చూడటానికి వెళ్ళినప్పుడు అతని గదిలో గోడకు సినిమా యాక్టర్ల ఫోటోలు వ్రేలాడ బడి యుండెను. అవి వరుసగా అశోక్ కుమార్, ఎరోల్ ఫ్లిన్, గ్రెగరీ పెక్‌లవి. అశోక్ కుమార్ బాలివుడ్ నటుడు. ఈయన తొలి సినిమా జీవన్ నయా 1936లో విడుదల కాబడినది. ఎరోల్ ఫ్లిన్ మొదటి సినిమా 1935లో విడుదలయ్యెను. దాని పేరు కేప్టన్ బ్లడ్. ఇక గ్రెగరి పెక్ 1944లో విడుదలైన డేస్ ఆఫ్ గ్లోరీ చిత్రముద్వారా తెరపైకి వచ్చెను. వీటిని పరిగణనలోనికి తీసుకొనిన ఈ కథ 1944కు ముందు రచింపబడలేదు. అనగా 1944-1994 మధ్యలో రచింపబడినదని తాత్పర్యము.

3. రెండవతూరి గంగిరెడ్డి కొడుకును చూడబోయినప్పుడు అతని గదిలో డేవిడ్ థోరూ రచించిన వాల్డెన్, హెన్రీ జార్జి అనే అతను రచించిన ప్రోగ్రెస్ అండ్ పావర్టీ, గాంధీ వ్రాసిన సర్వోదయ, భట్టాచార్య వ్రాసిన సోమెనీ హంగర్సు, విద్వాన్ విశ్వం వ్రాసిన పెన్నేటి పాట మొదలైన చెత్త పుస్తకాలు దర్శనమిచ్చును. వాల్డెన్ 1854లోనూ, ప్రోగెస్ అండ్ పావర్టీ 1879లోనూ, సర్వోదయ 1908లోనూ, భవానీ భట్టాచార్య  యొక్క సో మెనీ హంగర్స్ 1947లోనూ వెలువడినవి. ఇక విద్వాన్ విశ్వం పెన్నేటి పాటను 1955లో తెలంగాణా రచయితల సంఘం తొలిసారిగా ముద్రించినది. దీనినిబట్టి 1955 ముందు పెన్నేటిపాట పుస్తకము భీమిరెడ్డి వద్ద ఉండుటకు ఆస్కారము లేదు. అనగా ఆ పుస్తకమును రచయిత ప్రస్తావించినాడని అన్నచో ఈ కథ 1955 తరువాతనే రచింపబడినదని అవగాహన చేసుకొన వచ్చును. కావున ఈ కథా రచనా కాలము 1955 -1994 కు కుదించబడినది. 

4. ఇక కథ చివరి రెండు పేరాలలో భీమిరెడ్డి వినోబాభావే వలన ప్రేరేపితుడయ్యి ఆతని అనుచరునిగా మారినట్లు బోధపడును. ఇక ఈ కథ ఆఖరి వాక్యము యిట్లున్నది. ఆనాడే ఆచార్య వినాబాభావే భూదాన యజ్ఞార్థము యావత్తు ఆంధ్రదేశ పదయాత్ర ఆరంభించి ఉండెను. భూదానోద్యమము 1951లో ఆంధ్ర రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో ఆరంభింపడినది. ఇచ్చట ఒక సంగతి గమనార్హము. ఈ ఉద్యమము ముందుగనే అనుకొని ప్రారంభించిన ఉద్యమము కాదు. అప్పటికి అప్పుడు అసంకల్పితముగా పుట్టినది.  గాంధీ అనుయాయి యైన వినోబాభావే కమ్యూనిష్టు ప్రభావం కల పోచంపల్లి హరిజనవాడలను 1951 ఏప్రిల్ 18వ తేదీన సందర్శించినప్పుడు అక్కడి దళితులు ఆయుధాలను పట్టి కమ్యూనిష్టులకు సహకరించడానికి కల కారణాలను తెలుసుకొన గోరినప్పుడు కమ్యూనిష్టులు వారికి భూములను ఆశచూపినట్లును వారికి భూములున్నయెడల హింసామార్గమునకు స్వస్తి పలుకగలరనియు తెలుసుకుని వారి సమస్యను ఊరి పెద్దలకు తెలుపగా ఆశ్చర్యకరముగా రామచంద్రారెడ్డి అను భూస్వామి 100 ఎకారల భూమిని హరిజనులకు ఇచ్చునట్లు ప్రకటించెను. ఆ విధముగా భూదానోద్యమునకు బీజము పడినది.  ఆ తరువాత ఈ ఉద్యమము 1957 వరకు పెద్ద ఎత్తున భారత దేశమంతయు ఒక ఊపు యూపి 1957 తర్వాత క్రమేపీ సన్నగిల్ల జొచ్చెను. భూదానోద్యమునకు పూర్వము వినోబా పేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంత సుపరిచితమైనది కాదు. ఆ ఉద్యమము ద్వారానే ఆయన భారతీయులకు ఆరాధ్య పురుషుడైనాడు. కథ చివరి వాక్యము ప్రకారము 1951లో వినోబా భావే ఆంధ్ర రాష్ట్రమంతయు  భూదాన యజ్ఞార్థము పదయాత్ర ఆరంభించినాడనుకొందము. అప్పటికి భీమిరెడ్డి వినోబాభావే అనుయాయిగా మారుటకు అవకాశము లేదు. దీనిని బట్టి వినోబాభావే ఆంధ్ర దేశ పదయాత్ర మరొక సారి (రెండవసారి) చేసియుండవచ్చును. అప్పటికి ఆతడు పాపులరు కావచ్చును. అదియునుగాక పైన పేర్కొన్న 3వ అంశము ప్రకారము కథ 1955కు మునుపటిది కాదు. వినోబాభావే కథలో ఉదహరించిన ప్రకారము పదయాత్ర 1955 - 1957 మధ్య కాలములో చేసి ఉండవచ్చుననునది నా ఊహ. సాధారణముగా కవి లేదా రచయిత ఒక అంశముపై స్పందిచవలసి వచ్చినప్పుడు ఆ విషయము జరిగిన కొద్ది కాలములోనే స్పందించగలడు.ఆ అంశము చల్లారిన తరువాత రచించిన పేలవముగా ఉండును. కారంచేడు సంఘటనపై 2012లో కవిత్వము వెలయించుట అసాధ్యము కాదు కానీ కష్ట సాధ్యము. కావున పై కథ భూదానోద్యమము పతాక స్థాయిలో ఉన్నప్పుడు (ఒకటి రెండు సంవత్సరములు అటూ ఇటూ) వ్రాసి ఉండవచ్చును. అదియునూ గాక కథలో వాడ బడిన భాష (సరళ గ్రాంథికమా?) 1970ల తరువాత వెలువడిన రచనలలో కానరాదు. దీనిని బట్టి ఈ కథ 1956 -1960 ల మధ్య కాలంలో వెలువడి ఉండవచ్చునని సూత్రీకరిస్తున్నాను. విజ్ఞులెవరైనా ఇంకా ఖచ్చితమైన కాలమును నిర్ధారించెదరు గాక.