...

...

25, అక్టోబర్ 2009, ఆదివారం

భరాగో కథ!

ప్రసిద్ధ కథా రచయిత శ్రీ భమిడిపాటి రామగోపాలం గారి కలం నుండి వెలువడిన 'నుపకారికి నపకారము!' అనే కథను తెలుగు కథల శతవార్షికోత్సవ కానుక వర్తమాన కథా కదంబం "కథాజగత్‌"లో చదవండి.

అతి త్వరలో ఈ క్రింది కథలు కూడా కథాజగత్‌లో ప్రకటింప బడతాయి.

1.రాలిన మందారం - తంగిరాల చక్రవర్తి

2.గృహ హింస - ఆచార్య కొలకలూరి ఇనాక్

3.హామీ...!! - ఎ.వి.యం

4.రెండు లోకాలు - డా. వేదగిరి రాంబాబు

5. బొమ్మలు - డా.బోయ జంగయ్య.

తప్పక చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.

19, అక్టోబర్ 2009, సోమవారం

నాకు తెలిసిన బాలగోపాల్ఇదే శీర్షికతో అంకురం బ్లాగులో శరత్‌చంద్ర వ్రాసిన టపా చూసిన తరువాత నాకు కూడా బాలగోపాల్ గురించి వ్రాయడానికి కాస్త ధైర్యం వచ్చింది. నా జీవితంలో బాలగోపాల్ గారిని ప్రత్యక్షంగా చూసే అవకాశం రెండు సార్లు కలిగింది. నేను అనంతపురంలో డిప్లొమా చదివే రోజుల్లో మొదటి సారి బాలగోపాల్‌ను చూశాను. లలిత కళా పరిషత్ పక్క సందులో ఉండే గిల్డ్ ఆఫ్ టీచర్స్ స్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ రామనాథం సంతాప సభలో బాలగోపాల్ ప్రసంగం విన్నాను. ముందు వరసలో కూర్చుని(ఆ సభకు కార్యకర్తలు మినహా ఎక్కువ మంది హాజరు కాలేదు) అతి దగ్గరనుండి బాలగోపాల్‌ను చూసే అవకాశం కలిగింది. ఆ సభ విశేషాలు నాకు ఇప్పుడు గుర్తు లేదు కానీ చాలా వేగంగా ఉద్రేకపూర్వకంగా సాగిన బాలగోపాల్ ప్రసంగం నాకు ఇప్పటికీ మనసులో మెదులుతోంది. బహుశా అప్పటికి ఇంకా అతను ఎ.పి.సి.ఎల్.సి.లో ముఖ్యమైన బాధ్యతను చేపట్టలేదనుకుంటా. ఆ రోజు నుండి నాకు తెలియకుండానే బాలగోపాల్ ప్రభావం నాపై పడింది. తరువాత అప్పుడప్పుడూ పత్రికలలో బాలగోపాల్ గురించి, పౌర హక్కుల గురించి వార్తలు చదివే వాడిని. ఎ.పి.సి.ఎల్.సి.కి ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడని వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్నాను. అతనో అన్‌సంగ్ హీరోగా నామనసులో వుండిపోయాడు. రెండోసారి బాలగోపాల్‌ను నేను కలిసింది ఆర్.టీ.సీ బస్సులో. అదీ అతని పక్క సీటులో కూర్చుని కలిసి ప్రయాణించే అదృష్టం కలిగింది. నేను హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళడానికి బస్సు ఎక్కి కూర్చున్నాను. కాస్సేపటి తర్వాత బాలగొపాల్ బస్సు ఎక్కి నా పక్కన ఉన్న విండో సైడు సీటు వద్దకు వచ్చాడు. పొట్టి చేతుల కాటన్ చొక్కా వేసుకుని ఉన్నాడు. భుజాన ఒక గుడ్డ సంచి మరో చేతిలో పోస్టర్లు చుట్టి ఉన్న కట్ట పట్టుకుని అతి సాధారణంగా వస్తున్న బాలగోపాల్‌ను చూసి ఆశ్చర్యపోయాను. లేచి అతనికి దారి వదలి అతను తన సీటులో కూర్చోగానే నా సీటులో నేను కూర్చున్నాను. సంకోచంతో కూడిన ఉద్వేగం వల్లనో మరే కారణం చేతో నేను బాలగోపాల్‌ను పలకరించే సాహసం చేయలేకపోయాను. అతను కూడా నా వైపు ఒక చూపు చూసి తన పనిలో తాను మునిగిపోయాడు. మరుసటిరోజు తాను పాల్గొనే సభగురించి ఆలోచించుకుంటూ ఉండివుంటాడు. ఆరోజు అతన్ని పలకరించి పరిచయం చేసుకోక పోవడం నేను చేసిన తప్పుగా ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను. తరువాత బాలగోపాల్ కడపలో బస్సు దిగిపోయాడు. తరువాత అడపాదడపా టీ.వీ.చానళ్ళలో చర్చలలో అతడిని చూడటం, అతడు రాసిన వ్యాసాల్లో ఒకటో రెండో చదవడం మినహా బాలగోపాల్ గురించి నాకు తెలిసింది శూన్యమే అని చెప్పాలి. నిజం చెప్పాలంటే బాలగోపాల్ గురించి ఆయన మరణించిన తరువాతనే ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను. తాడిత పీడిత అణగారిన వర్గాల తరఫున ఆయన నిత్యం న్యాయం కోసం హైకోర్టులో అలుపెరుగని పోరాటం చేసేవాడనీ, మానవ హక్కులకు ఎక్కడ భంగం వాటిల్లినా అక్కడ ప్రత్యక్షమై తన గొంతుకను విప్పేవాడనీ, కేవలం మన రాష్ట్రంలోనే కాక కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, కాశ్మీర్, బీహార్, గుజరాత్ లాంటి ప్రాంతాలలో కూడా మానవ హక్కుల కోసం పోరాటం చేసి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడనీ, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో సాధికారమైన వ్యాసాల పరంపరను వెలువరించాడనీ, డి.డి.కోశాంబిని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ ఒక అద్భుతమైన పుస్తకం వ్రాశాడనీ ఇంకా ఎన్నో విషయాలు ఆయన మరణించిన తర్వాతే తెలిసింది. 12వ తేదీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సంతాప సభలో బాలగోపాల్ నాకు పూర్తిగా అవగాహనకు వచ్చాడు. బాలగోపాల్ సమకాలీకుడినని చెప్పుకునేందుకు ఇప్పుడు నేను గర్విస్తున్నాను.

16, అక్టోబర్ 2009, శుక్రవారం

దీపావళి శుభాకాంక్షలు!!!
బ్లాగ్మిత్రులందరికీ ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళిఅమావాస్య, బలిపాడ్యమి పర్వదినాల సందర్భంగా నా హార్థిక శుభకామనలు.

15, అక్టోబర్ 2009, గురువారం

పొలిటీషనోపాఖ్యానం!!!

రాముడు సీతాన్వేషణలో సహాయపడిన జటాయువుకు ఇచ్చిన వరమేమిటి? రామరావణ యుద్ధానంతరం జరిగిన విజయోత్సవ సభలో పక్షులు ఎందుకు గొడవ చేశాయి? పక్షులను రెండవసారి ఏమి చెప్పి ఊరించాడు శ్రీరాముడు? శ్రీకృష్ణుని ఎదుట పక్షి సమూహం ఎందుకు స్ట్రైక్ చేసింది? జటాయువు ఇచ్చిన వరాన్ని నెరవేర్చేందుకు రామునికి రెండు యుగాల సమయం ఎందుకు పట్టింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవలని ఉందా? అయితే కథాజగత్‌లో వచ్చిన కథ వరదానం చదవండి.

14, అక్టోబర్ 2009, బుధవారం

సర్కస్ సర్కస్ - చివరి భాగం!

ఇంతవరకూ కొన్ని సర్కస్ వీడియో క్లిప్పింగులు చూశారుకదా! ఇప్పుడు మిగతా క్లిప్పింగులు కూడా చూడండి.
చివరి వీడియో క్లిప్పింగు మాత్రం పడుకుని చూడండి. వీలు కాకపోతే కనీసం మీ మానిటర్‌ను పడుకోబెట్టండి.

13, అక్టోబర్ 2009, మంగళవారం

సర్కస్ సర్కస్ - 2వ భాగం!

మేము చూసిన సర్కస్ తాలూకు మరికొన్ని ఫీట్లు మీరూ చూసి ఆనందించండి.మరికొన్ని విన్యాసాలు మరో టపాలో!

12, అక్టోబర్ 2009, సోమవారం

క్షమాపణల బాటలో మరో మేధావి!

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి పై పాట రాయడమనే తప్పిదానికి భాద్యత వహిస్తూ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు ప్రజా ఉద్యమానికీ, ప్రజలకు బేషరతుగా క్షమాపణలు తెలిపినట్లు ఈ రోజు పేపర్లో వార్త కనిపించింది. మానసిక స్థితి బాగాలేకపోవడం వల్ల, వయసు పైబడడంతో ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో వై.ఎస్.రాజశేఖర రెడ్డిపై పాట కట్టాడట! ఇంతకు ముందు వి.ర.సం. నేత ఎన్.వేణుగోపాల్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి తో తనకుగల అనుబంధాన్ని తెలుపుతూ వ్రాసిన వ్యాసం దుమారాన్ని రేపటం, పర్యవసానంగా ఆయన్ని విరసం నుండి బహిష్కరించటం, ఆ పిమ్మట ఆయన క్షమాపణలు చెప్పటం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలో వంగపండు... నిజంగా వీరు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారా? అలా అయితే ఫరవాలేదు కానీ ఒత్తిడితో ఆ పని చేస్తే వారికి నా సానుభూతి. తాము నమ్మింది తప్పో ఒప్పో దానికే జీవితాంతం ధైర్యంగా కట్టుబడి ఉండటం అందరికీ సాధ్యం కాదు. అలాంటివారినే చరిత్ర గుర్తుంచుకుంటుంది కానీ తతిమ్మా వాళ్ళని కాదు.

11, అక్టోబర్ 2009, ఆదివారం

ఎంపైర్ సర్కస్

ఈ రోజు మా శ్రీమతి, పిల్లలతో కలిసి సర్కస్‌కు వెళ్ళాను. రెండున్నర గంటలసేపు రొటీన్ జీవితం నుండి కాస్త ఆటవిడుపు. మా అబ్బాయి ప్రమోద్ ఈ సర్కస్ విన్యాసాలని తన మొబైల్ ఫోన్‌లో కాప్చర్ చేశాడు. వాడి పుట్టిన రోజు బహుమతిగా ఈ మధ్యే ఒక సెల్‌ఫోన్ కొనిచ్చా. కొత్త ఫోను మోజులో వీడియో తీశాడు. మీరూ చూసి ఆనందించండి.
మిగతా విన్యాసాలు మరో టపాలో.

4, అక్టోబర్ 2009, ఆదివారం

ఇప్పుడు కథాజగత్ వెబ్‌సైట్ రూపంలో!!!

కథాజగత్ పేరుతో నేను నడుపుతున్న బ్లాగు గురించి తురుపుముక్క పాఠకులకు తెలుసు. ఆ బ్లాగులో వస్తున్న కథల వివరాలు ఎప్పటికప్పుడు తురుపుముక్కలో తెలియజేస్తున్న సంగతి విదితమే. ఈ కథాజగత్ బ్లాగులో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి ఇప్పుడు దానిని పూర్తిస్థాయి వెబ్‌సైటుగా మార్చాను. ఇప్పుడు కథాజగత్‌ను ఈ చిరునామాలో దర్శించవచ్చు. http://www.kathajagat.com

ఈ వెబ్‌సైటును ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవిగారు లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాదు లోని బాగ్‌లింగంపల్లి లోని వారి ఇంట్లో ఈ రోజు అంటే 04-10-2009న సాయంత్రం 4.30గంటలకు ఈ వెబ్‌సైటును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మిత్రులు కొల్లూరి సోమశంకర్, తంగిరాల చక్రవర్తి, గురజాడ అప్పారావు, సత్య భాస్కర్, జి.ఎస్.రామకృష్ణ, వూసల రజనీ గంగాధర్ పాల్గొన్నారు. ఆ సమావేశం తాలూకు ఫోటోలు కొన్ని.2, అక్టోబర్ 2009, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము! - సమాధానాలు

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము! పేరుతో ఇంతకు ముందు ఇచ్చిన పజిల్ సొల్యూషన్ ఇక్కడ ఇస్తున్నాను.సమాధానాలు:
అడ్డం :
1.ఏకాకి కథా రచయిత(6) -అచ్యుతరామయ్య
4.వింజమూరి వారి కథలో ఇంటావిడ పేరు వయసులో ఉన్నప్పుడా?(3) - జానకి
6.దింపుడు కళ్ళం రచయిత కలగాపులగం అయ్యాడు (6) -ద్రచంరారావుమ
10.సుందరం తన కూతుర్ని ఈ అంశంలో చాంపియన్ చేయాలని ఆశించాడు పాపం!(2) -ఈత
11.దింపుడు కళ్ళం కథలో నాన్న ఇంటికి తెచ్చింది ఈవిడ్నే!(2) -నర్సు
12.యాడంట నీళ్ళు పొయ్యబోతే అమ్మో అయ్యో అంటూ ఒకటే ____ పెడుతుంటే. నిజంగా ఒకటే!(3) -సోకండం
13.వైదేహి మనుమరాలు, మానస కూతురూను (3) -శ్రీలత
15.రాబోయే ప్రమాదం నుండి ఎ.పి.ఎక్స్‌ప్రెస్‌ను కాపాడాలని పాపం ఈ గ్యాంగ్‌మ్యాన్ తడబడ్డాడు(3) -రాయ్యమ
17.సూపర్‌వైజర్‌ని చూడగానే ఈ గేట్‌మాన్ విష్ చేశాడు అటునుంచి?!(4) -య్యరమకొ
21.చిన్ని చిన్ని ఆశ కథకుడు (4) -దిలావర్
23.బుడ్డ రాకాసి తల్లి కాబట్టే తడబడింది(4) -త్యాయికాని
24.అటునుంచి ఏకాకి హీరో (4) -థ్‌నామరా
25.కథా రచయిత ఈశ్వర్ ఇంటిపేరు?(4) -కోలపల్లి
28.రాధేయ గారి కథ తడబడటంతో ఒక అక్షరానికున్న సున్న మరో అక్షరానికి తగులుకుంది(4) -సంమౌనహి
30.నాలుగు ప్లేట్లల్లో కరివేపాకు ___, తమలపాకు ___, క్యాబేజీ ___, ఉల్లి ___ ఉన్నాయి. అందంగా ముస్తాబైన కుసుమ నవ్వులు చిందిస్తూ వారికి సెర్వ్ చేస్తోంది(3) -పకోడి
32.నిలువు 4.రచయిత ఈ యేడాది ___శాంతి పురస్కారం మరో రచయితతో షేర్ చేసుకుంటున్నారు కాబట్టి వెనుక నుండి చదవండి(3) -లామవి
34.ఆకులేని అడవి అని దీన్ని వర్ణిస్తున్నారు ఓ కథకుడు(3) -సముద్రం
37.రాత్రుళ్లు పళ్లు పటపటలాడిస్తూ - మానస మీద __ __గా దాడి!రెండు సార్లు చెప్పనక్కర లేదు(2) -కసి
38."__ క్రాంతి!" బుగ్గలు తడిమాడు రాఘవ (2) -హాయ్
40. కొందరు మాత్రమే ఏపరిస్థితుల్లోనైనా మారకుండా మంచివాళ్లుగానే ఉంటారు. వాళ్లనే ______ అంటాం. కానీ పాపం చెల్లాచదురయ్యారు(6) -రుమహాపులురు
41.ఈ తిలకం పెట్టుకుంటాడో లేదో తెలియదు కాని పేరుముందు మాత్రం ఉంటుంది మన మురళీకృష్ణకి(3) -కస్తూరి
42.వానరాయుడి అసలు సిసలు పేరు? -కాటమరాయుడు

నిలువు:
1.మృదుల తండ్రి, రాఘవకు మామయ్య కాలేక పోయాడు?(4) -అనంతయ్య
2.సునీత నానిగాడి __?(2) -తల్లి
3.తర్వాత క్రాంతి "కమలాక్షు నర్చించు కరములు కరము.." అంటూ నెమ్మదిగా, అందులో లీనమై భక్తి,జ్ఞానాలు ప్రకాశించేట్లు చదివాడు. ఈ పదానికి పర్యాయ పదం(3) -మమైకం
4.అడ్డం 34 రచయితే!(3) -జాతశ్రీ
5.అతనికి తల నరికి మధ్యలో గుడిలేకున్నా అర్థం మారదు కానీ తలక్రిందలయ్యింది(3) -కినత
7.మానస వీణ రచయిత ఇంటిపేరు లేకుండా? ఐతే నేం?(3) -చంద్రయ్య
8.పడమటి దేశానికి __ హిరణ్యుడు(2) -రాజు
9.మానస మానసచోరుడు?(4),
12.సోమశంకర్ కొల్లూరిని ఇలా పొట్టిగా పిలవచ్చా?(2) -సో.కొ.
14.హసీనాను సమ్మోహితురాల్ని చేసిన నర్తకి(2) -లక్ష్మి
16.ఇన్నాళ్ళూ తన కూతురి మనసులో ఏముందో తెలుసుకోలేక పోయినందుకు కొంచెం అపరాధ భావనకు లోనయ్యాడు.ఈ పదానికి పర్యాయ పదం!(2) -మది
18.ఐదారడుగుల పొడవుతో నాలుగైదు కిలోల బరువు మొదలు, పాతిక కిలోల బరువున్న వంజరం, సందవ, పారలు, గోరకలు, టేకి... వగైరా రక___ చేపలు!(3) -రకాల
19.ఇందిరాదేవిగారి కథలో పాత్రలు ప్రయాణించింది ఈ ఎక్స్‌ప్రెస్‌లో?(3) -బొకారొ
20.అజీజ్‌గారి కథలో హీరోయిన్?(3) -మీనాక్షి
22.మధుకర్ భారతిని ఇలా సంభోధిస్తాడు కానీ హ్రస్వంగా...(3) -వదిన
25. ఇంటికి ____, పొరుక్కి శివాలక్ష్మి.కానీ అటూఇటూ అయ్యింది(4) -కోదెష్టారు
26. తలక్రిందలైన గంగాధర్ ఇంటిపేర్లో లేనివేం?(2) -ల్లిప
27."అయిపోక ఇంకా వుంటదా అయ్యగోరూ.. వూహ దెలిసినకాడనించి ఇక్కడ __నవమికి పందిరేస్తున్నా.."అరిపిరాల సత్యప్రసాద్ కథలో ఒక డైలాగు(2) -రామ
28.ముప్పైనాలుగు అడ్డమే పొట్టిగా(2) -సంద్రం
29.పశ్చిమ దేశానికి రాజు____(4) -హిరణ్యుడు
31.నిలబడే గబగబా అన్నం తింటున్న ఈశ్వరమ్మ కోపంగా చెప్పింది... ఈశ్వరమ్మ వైపు కోపంగా చూస్తూ అన్నాడు నరసయ్య. ఇద్దరివీ కలిపి(3) -కోపాలు
32.స్వరహీనమైన బహుమానం రచయిత!(3) -లాసిక
33.ఈ కలం పేరుగల ఇద్దరి కథలు కథాజగత్‌లో ఉన్నాయి(3) -విహారి
35. ఇక్కడ గోదావరి నీళ్ళు అటువంటివయ్యా! గోదావరీ తీరంలో ధర్మం, న్యాయం, నీతి ___లై గోదాట్లో పారుతుంటాయ్(3) -ముప్పేట
36.తోక తెగిన 33నిలువు రచయిత? -విహా
39.ఓంప్రకాశ్ కథ పేరులో చివరి రెండక్షరాలు(2) -దురా

సరియైన సమాధానాలు ఎవరూ వ్రాయలేకపోయారు. కేవలం అమంతాగారు మాత్రం కొంత ప్రయత్నించారు. వారికి నా అభినందనలు. త్వరలో మరో క్రాస్‌వర్డ్ పజిల్‌తో మీముందుకు వస్తాను.