...

...

31, డిసెంబర్ 2009, గురువారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!





2009లో మనం


ఒక పతంజలిని,



ఒక కాంతారావుని,


ఒక రాజశేఖర రెడ్డిని,


ఒక బాలగోపాల్‌ని


కోల్పోయాం. 




అయితేనేం వారు అందించిన స్ఫూర్తిని గైకొని  


రాబోయే కాలంలో పురోగమిద్దాం.  


బ్లాగు మిత్రులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ  


నూతన సంవత్సర శుభాకాంక్షలు.

22, డిసెంబర్ 2009, మంగళవారం

తెరల కథ కమామీషూ...

ప్రముఖ రచయిత విమర్శకుడు శ్రీ కోడూరి శ్రీరామమూర్తి గారు తెరతీయగరాదా అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే యువకవి 'ముఠ్ఠీ'కావ్యకర్త   శ్రీ అన్వర్ తెరతీయనా అంటూ ఊరిస్తున్నారు. ఈ తెరలేమిటో, తెరతీయడాలేమిటో వారి కథల్ని కథాజగత్‌లో చదివి మీరే తెలుసుకోండి.

21, డిసెంబర్ 2009, సోమవారం

దేశభాషల్లో తురుపుముక్క!

ఇప్పుడు మీరు నా తురుపుముక్క బ్లాగును తెలుగు లిపిలోనే కాకుండా బంగ్లా,దేవనాగరి(హిందీ),గుజరాతి, గురుముఖి, కన్నడ, మళయాళం, ఒరియా, తమిళ్ లిపుల్లో చదవవచ్చు.

20, డిసెంబర్ 2009, ఆదివారం

"బుడ్డా వెంగళరెడ్డి" పుస్తకంపై సాక్షి ఫన్‌డేలో సమీక్ష!

ఈ రోజు సాక్షి దినపత్రిక (20-12-2009) ఆదివారం సంచిక ఫన్‌డేలో మా సంస్థ తరఫున ప్రచురించిన బుడ్డా వెంగళరెడ్డి చారిత్రక నవలపై సమీక్ష ప్రచురించారు. తురుపుముక్క పాఠకుల కోసం ఈ సమీక్ష ఇక్కడ పొందుపరుస్తున్నాం.





హైదరాబాదులోని బ్లాగర్లకు, పుస్తకాభిమానులకు ఒక సూచన. ఈ పుస్తకం హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో స్టాల్ నెం.81లో(పాలపిట్ట బుక్స్) అమ్మకానికి లభ్యమౌతుంది.

వస్తున్నాయొస్తున్నాయి...

రాబోయే రోజుల్లో కథాజగత్‌లో మీరు చదవబోయే కథల వివరాలు.  
1.ఆచంట హైమావతి - చల్లారిన పాలు √  
2.రాచపూటి రమేష్ - ట్రంప్ కార్డ్  
3.కల్లూరు రాఘవేంద్ర రావు - ముదిమనసు  
4.ఎం.వి.జె.భువనేశ్వరరావు - అభాగ్యులు   
5.బులుసు -జీ-ప్రకాష్ - కుప్పిగంతులు √    
6.దూరి వెంకటరావు - ఓ ఇంటివాడు √    
7.ఎల్.ఆర్.స్వామి - సూర్యచంద్రులు √    
8.గోవిందరాజు రామక్రిష్ణారావు - శుభవార్త √   
9.జయంపు కృష్ణ - గొడ్డు  √  
10.వాలి హిరణ్మయీదేవి - స్థిత ప్రజ్ఞత  √ 
11.కాకాని చక్రపాణి - సంస్కారం    
12.ఇలపావులూరి మురళీమోహనరావు - నాకొక కుటుంబం కావాలి  
13.మునిపల్లె రాజు - కస్తూరి తాంబూలం  
14.అన్వర్ - తెర తీయనా...  √ 



మీరు చేయ వలసినదల్లా కొంచెం సమయం వెచ్చించి ఈ కథలన్నీ చదవటమే!

18, డిసెంబర్ 2009, శుక్రవారం

కనుక్కోండి చూద్దాం?


హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో వర్తమాన కథాకదంబం కథాజగత్ వెబ్‌సైటును ప్రచారం కలిగించడానికి ఒక బ్యానర్‌ను ప్రదర్శిస్తున్నాము. ఫోటోలో కనిపిస్తున్న ఆ బ్యానర్ ఏ స్టాలులో పెట్టబడిందో ఎవరైనా కనుక్కోగలరా?

17, డిసెంబర్ 2009, గురువారం

సాల్ గిరా...!

నేటితో నేను బ్లాగడం మొదలెట్టి ఏడాది పూర్తవుతుంది.
రేపు తురుపుముక్క రెండో సంవత్సరంలో అడుగిడబోతోంది.
ఈ సందర్భంగా వెనక్కి తిరిగి చూసుకుంటే...
వందకు మించిన టపాలు.
వాటిలో అంతో ఇంతో ఉపయోగ పడేవి, ఆసక్తి కలిగించేవి, ఆలోచింప చేసేవి ఒకటో అరో వుండి ఉండవచ్చు. 
మిగతావన్నీ నా మిడిమిడి జ్ఞానాన్ని, ఉత్తుత్తి పాండిత్యాన్ని, స్వంత పైత్యాన్ని ఎత్తి చూపించే టపాలే.
ఐతే ఈ యేడాదిలో కొన్ని వందల గంటల సేపు బ్లాగుల ప్రపంచంలో విహరించినాను.
నా సమయం వృథా కాలేదని ఘంటాపథంగా చెప్పగలను.
ఈ బ్లాగుల ద్వారా ఎంతోకొంత నేర్చుకున్నాను.
ఈ సందర్భంగా నా రాతలను ఓపికతో చదివిన పాఠకులు అందరికీ ధన్యవాదాలు.
లేఖిని అనే ఉపకరణం ద్వారా తెలుగులో నా ఆలోచనల్ని అంతర్జాలంలో పంచుకునే అవకాశం కల్పించిన వీవెన్ గారికి నా నెనర్లు.
ప్రత్యేకంగా నా టపాలపై కౌంటర్లు విసిరిన
ఒరెమూనా, భావకుడన్, సి.బి.రావు, కొత్తపాళీ, పూర్ణిమ, ఊకదంపుడు, వేదాంతం శ్రీపతి శర్మ, మల్లిక్, కస్తూరి మురళీకృష్ణ, వేదాంతం వెంకట సత్యవతి, చంద్రమోహన్, నేస్తం, చదువరి, భైరవభట్ల కామేశ్వర రావు, మలక్‌పేట రౌడీ, చింతా రామకృష్ణారావు, యోగి, ఆత్రేయ, రానారె, కంది శంకరయ్య, ఋషి, ప్రభాకర్ మందార, జయభారత్ సగిలి, చిలమకూరు విజయమోహన్, అమ్మ ఒడి, విహారి, పానీపూరి 123, వేమన, అరుణపప్పు, ధూం మచారా, భావన, అబ్రకదబ్ర, శరత్'కాలం', జీడిపప్పు, వంశీ ఎం.మాగంటి, కత్తి మహేష్ కుమార్, సుధ చిన్ని,ఎస్, బొల్లోజు బాబా, పునర్వసు, వినయ్ చక్రవర్తి గోగినేని, నాగసూరి, కల్పనా రెంటాల, రాం, PKMCT(ప్రవీణ్ శర్మ), ప్రవీణ్ ఖర్మ, అలీ,  సుభద్ర, స్వప్న@కలలప్రప్రంచం, జ్యోతి,
ఓం ప్రకాష్ నారాయణ వడ్డి, మారుతి, మాలాకుమార్,సృజనా రామానుజన్, కుమార్, రాణి, శ్రీలలిత, భవాని, కెక్యూబ్ వర్మ, రాజశేఖరుని విజయశర్మ,అజ్ఞాతలు, అనానిమస్‌లు మరియు తమ్ముడు ఫణి ప్రసన్న కుమార్ అందరికీ నా అభివాదాలు!


అంతే కాక నా అభిప్రాయాలను ప్రచురించిన
రాతలు - కోతలు, ఓంప్రకాష్ వర్క్స్, శ్రీపదములు, ఆంధ్రామృతం, తెలుగు తూలిక, జాజిమల్లి, డా.ఆచార్య ఫణీంద్ర,  వెంకటూన్స్, హాస్యం లాస్యం, రౌడీ రాజ్యం, పొద్దు స్లిప్పుల సర్వీసు, పొద్దు, పల్లవి అనుపల్లవిమంచికంటి, కలలప్రపంచం, రామాకనవేమిరా మొదలైన బ్లాగుల, వెబ్‌సైట్ల నిర్వాహకులకు నా కృతజ్ఞతలు.


మరియు నా బ్లాగుకు ప్రచారం కల్పించిన కూడలి, జల్లెడ, హారం మొదలైన అగ్రిగేటర్ల యాజమాన్యానికి నా నమోవాకాలు.


నా వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలద్వారా తెలిసో తెలియకో ఎవరినైనా నొప్పించి ఉంటే వారినందరినీ క్షమించవలసినదిగా ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. మరీ ముఖ్యంగా రాతలు-కోతలు బ్లాగులో అభిమాని పేరుతో అచ్చుతప్పులను ఎత్తి చూపి కస్తూరి మురళీకృష్ణ గారిని ఇబ్బంది పెట్టినందుకు వారిని మన్నించమని వేడుతున్నాను.


మీ అందరి సహాయ ప్రోత్సాహాలు మున్ముందు ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాను.

12, డిసెంబర్ 2009, శనివారం

డా.రావూరి భరద్వాజ కథ!

ప్రముఖ రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ గారి కథానిక ఆహిరి కథాజగత్‌లో ప్రకటిస్తున్నాము. 1956కు పూర్వం వ్రాయబడ్డ ఈ కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను వెలువరించవలసినదిగా కోరుతున్నాము.

9, డిసెంబర్ 2009, బుధవారం

నవ్య వీక్లీలో బుడ్డా వెంగళరెడ్డిపై సమీక్ష!

నవ్య వీక్లీ 16-12-2009 సంచికలో బుక్‌చాట్ శీర్షికలో మా అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రచురించిన బుడ్డా వెంగళరెడ్డి చారిత్రక నవలపై సుంకోజి దేవేంద్రాచారి సమీక్షించారు. తురుపుముక్క పాఠకుల కోసం ఆ సమీక్ష ఇక్కడ ఇస్తున్నాను.

5, డిసెంబర్ 2009, శనివారం

తెలంగాణా గోస!

"అవ్వా కోమట్ల యింటికాడ చెక్కా పల్క శేతికిచ్చినపుడు ముర్సుకుంట బడికి పోయిన. పది పాసైనపుడు పది మందికి చెప్పుక తిర్గితి. పై సదువులకు నేను వోతున్నపుడు తూట్లు పడ్డ టిక్కెట్లోలే సదువుకు తూట్లు వడొద్దు అనుకున్న. గని అన్ని నౌకర్ల అటెండర్లనుంచి అందరు ఆందరోల్లె నిండి పోతండ్రు. మనోల్లకు ఏమి యియ్యనిత్త లేరు. నేనేం జేయాలే" అని ఎల్లయ్య అన్నడు.
.......................................................
.......................................................
"ఔరా! తర్రగాడ్దికొడ్కు లెక్క యెన్కకు మర్రుతావురా. యీడ పుట్టినం. ఈడ పెరిగినం. ఈడ మలమల మాడుడు ఏందిరా. పొయి మనది. పొయి మీద కుండ మనది. పొమ్మనకుంట పొగవెట్టి యెల్లగొట్టాలె. గీయింత దానికే పోనని చెప్పుతండు మొగోడు. ఆ ఈని పిరికితనం సూడే...ఎట్లుందో..."
.......................................................
.......................................................
'ఔను నాయన...అవ్వ అన్నది నిజమే. పగదారునితో కొట్లాటకు వోయెటపుడు గెల్చి రావలె. అట్లా అని ఒక్కపారి ఓడిపోతె మొత్తం ఓడిపొయినట్లు ఎట్లయితది? కాదు. ఒక్కసారి ఫేలయినోల్లు నౌకరి చేసేటోల్లు లేరా...'
.......................................................
.......................................................
"మావోడు సదువాంటండు. ఏం సంగతి. ఇన్నొద్దులు మీ అయ్యవ్వ, మేం మంచిగ సదివిత్తర్రు అని పేరెల్లినం. మావోడు ఇగ సదువా అంటండు. ఏం జేయాల్నయా?" అంటూ ఎల్లయ్య దిక్కు చెయ్యి సూపెట్టుకుంట సెప్పుతండు రంగయ్య.

"నువ్వొద్దెనేనే మన నౌకర్లు మనగ్గాకుంట, మన నీళ్లు మనకు పారకుంట మన బొగ్గు మనకందకుండ మనకగ్గివెట్టిండ్రే...'పంట పండాలె గని తింటె దంగుతదా అన్నట్లు మంచి మంచి సదువులు కోస్తాంద్ర పంటలు దీసెటోల్లు సద్వించవట్టిరి. ఇగ మేమయితే మీరు పంపిచ్చిన పైసలు సాలక ఎస్టీడీలల్ల, క్యాటరింగ్...లాంటి ఎన్నో పనులు జేసుకుంట సద్వితిమి. వాళ్లకు మనకు పోటివెడ్తె ఐతదా...? గట్ల పెట్టి, మనదగ్గర కొలువులు కూడా ఏర్పడ కుంట గుంజుక పోతండ్రు. గట్ల నౌకరైనోడు పందికొక్కోలె వాని కిందికి, వానోని కిందికి పొక్క తోడుకుంటండు. మనకు నౌకర్లు రాకుంట చేత్తండ్రు" అని చెప్పిండు సత్తీస్.

"మన పని మనకు పంచెయ్యాలె. మన నౌకరి పాల్లు మనకు పెట్టాలె. పెట్టేటట్లు చెయ్యాలే" రంగయ్యన్నడు.

"అట్లు వొత్తలేదే? మాది మనోల్లది అనే ఆలోచన రాక మనం అట్ల తెలివికి రాక ఆగమైతన్నం" అని సత్తీస్ అన్నడు.

"ఎందుకురాదూ? గడ్డిని తాడువడితే ఆ తాడు గడ్డామును ఆగవడ్తది గాలికి ఇటు అటు కొట్టుకపోకుంట. గట్టిగ పిడికిలి వట్టి యీడిసి గుద్దితే సచ్చెదాక దెబ్బలేకుంట యాదుంటది. అంతకన్నా అడివా...? ఒగొలు చెప్పిన బుద్ది అప్పట్ది. మీ బుద్ది ఎప్పట్ది. మేం మత్తుగ అంటం గుడ్డెద్దు శేన్లవడ్డట్టు. ఇదే ఏ పని జేసినా కాయంగా జేసుకుంటేనే బతుకుతరు...లేకుంటే ఎప్పటి శిప్ప యేన్గులనే."
.......................................................
.......................................................
"ఔరా! మన తాడికి బతికెతందుకొచ్చి, మనది మనగ్గకుంట గుంజుకుంటే ఊకుండ వడ్తిమి. రేపు మన తమ్ముల్ది గుంజుకోరా...? వాంది. వానితాతది. వానయ్యది. మాయిముంత ఏడదాసిండ్రో గది వాని ఖుద్దుజాగ. మన దగ్గర్కొచ్చి మన యాస మీద, బాషమీద, పండుగలమీద వాని జుల్ము ఏంది? బిచ్చానికొచ్చినోడు ఆమిల్లు గరిస్నట్టు గావట్టే. నువ్వెమంటవ్రా ఎల్లా! చెప్రా"
.......................................................
.......................................................
"మనకు చరిత్ర దెల్సు. యిత్తేసి పొత్తుగూడినోడు పొయిమీది కుండను మాయం జేత్తండు. మనం వొండుకున్నది మనకు వెట్ట వాడెవడు. మన పొయి మంటను గుంజుకున్నడు. యిపుడు మండేది పెయి మంట. అదే కడుపుల ఆకలి మంట. గా మంట సల్లార్పెతందుకు ఎన్నడో ఒగనాడు మంచి కాలమొత్తది. గదేందో మనమే సురువుజేస్తే ఐపోతది గదా...!" అని సత్తీస్ అన్నడు.

"ఔను! గీ ముచ్చట మంచిగుంది. థింక్ పాసిటివ్ వే గా ఆలోచిస్తే అది ఖచ్చితంగా ఐతది. ఒగ పెద్దయన 'నీ సంకల్పం మంచిదైతే శక్తి దానంతట అదే ఉద్భవిస్తది' అన్నట్టు మనం జేసే పని మంచిదైతే అదే బాగైతది. మంచిగైతది" అని ఎల్లం అన్నడు.

"ఇగ రేపు వోదాం క్యాంపస్‌కు" సతీష్.
.......................................................
.......................................................
అవ్వా! రేపు పొద్దుగాల పట్నం బోతన్న. నౌకర్ల కోసం, మన తెలంగాణ కోసం, నీళ్ల కోసం, నిధులకోసం, కొలువుల కోసం, అందరం ఒక్కటైయెటట్లు జేస్తం. శెల్లే! ఇగవోతరా సదివెతందుకు.

నాయినా! ఇగ రేపు బోతా. మనకోసం మనం తయారయ్యేటట్లు జేస్త. మన బతుకులకు, మన తెలంగాణకు నా వొంతు నేను శాతనైన కాడ్కి పేరు నిలవెడ్త.


సిద్దెంకి యాదగిరి గారి ఈ "కీలెరిగిన వాత" కథను పూర్తిగా కథాజగత్‌లో చదవండి.