...

...

27, మార్చి 2011, ఆదివారం

మెదడుకు మేత!- 8

1.ఒక కాలనీలో ఐదుగురు సాహితీ వేత్తలు ప్రక్కప్రక్కనే నివసిస్తున్నారు. కాంట్రాక్టరు వృత్తిలో ఉన్న వ్యక్తి ప్రభవ - విభవ అనే పుస్తక రచయిత ఇంటి ప్రక్కన నివసిస్తాడు.
2.పెరుమాళ్ళు భావయుక్తం అనే గ్రంథం వ్రాశాడు; పద్యకవి సరస్వతీమహల్‌లో ఉంటున్నాడు.
3.సులేమాన్ కథారచయిత; విక్రమపరాక్రమం అనే కృతికర్త ఇంటిపక్కనే ఇంజనీరు నివాసముంటాడు.
4.సరస్వతీ మహల్ డైమండ్ ప్లాజాకు కుడిప్రక్కన ఆనుకుని ఉంది.
5.అధ్యాపక వృత్తిలో ఉన్న సాహితేవేత్త మన్మథచాపం అనే పుస్తకాన్ని రచించాడు; వచనకవి మధ్య ఇంట్లో ఉంటాడు.
6.కార్తికేయ నందసదనంలో నివాసం చేస్తున్నాడు; కాంట్రాక్టరు ఆనంద్ విల్లాలో ఉంటున్నాడు.
7.వ్యాసకర్త ఒక కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు; అయ్యంగార్ మొదటి ఇంట్లో ఉంటాడు.
8.లింగోజి ఒక వ్యాపారి; అయ్యంగార్ లక్ష్మీ నివాస్ ప్రక్కనే నివసిస్తున్నాడు.
9.ప్రతి వ్యక్తీ వేర్వేరు ఇళ్ళలో ఉంటూ,వేర్వేరు వృత్తులు చేస్తూ, వేర్వేరు ప్రక్రియలను ప్రవృత్తిగా చెపట్టి, వేర్వేరు పుస్తకాలు వ్రాశారు.


పై వివరాల ప్రకారం సౌమ్యమనస్విని అనే గ్రంథాన్ని వ్రాసిందెవరు?

26, మార్చి 2011, శనివారం

మెదడుకు మేత! - 7 సమాధానం

ఊరపిచ్చుక బ్లాగుకు హారం కేటాయించిన కర్మ ఫలాలు ఒకటి.

వివరణ : మొదట మనకు తెలిసిన వివరాలనుండి ప్రారంభిద్దాం.

తీన్‌మార్‌కు 24 కర్మఫలాలు రావడానికి ఉన్న సంభావ్యత (5,5,5,5,4) ఒక్కటే. వీరముష్టికి హారం 5 కర్మఫలాలు కేటాయించింది. తీన్‌మార్‌కు 5 కర్మఫలాలు కేటాయించడానికి వీలు లేదు కనుక తీన్‌మార్‌కు నాలుగు కర్మఫలాలు ఎక్కడినుంచి వచ్చాయో తెలిసిపోయాయి.
మనకు ఐదు సంకలినిలు ఐదు బ్లాగులుకు కేటాయించిన మొత్తం కర్మఫలాలు 5*(1+2+3+4+5) = 75 అని తెలుసు.
వీరముష్టి బ్లాగుకు కనీసం 11 కర్మ ఫలాలు (5+3+1+1+1) వస్తాయి. వీరముష్టి బ్లాగుకు మొత్తం 11 కాకుండా 12 కర్మఫలాలు వచ్చాయి అనుకుందాం. అప్పుడు బేవార్స్‌గాడు బ్లాగుకు కనీసం 13, సొంతడబ్బా బ్లాగుకు కనీసం 14, ఊరపిచ్చుక బ్లాగుకు కనీసం 15 కర్మఫలాలు రావాలి ఎందుకంటే ఏ రెండు బ్లాగులకు సమాన మొత్తంలో కర్మఫలాలు రాలేదు కనుక. అప్పుడు అన్ని బ్లాగుల మొత్తం కర్మఫలాలు (12+13+14+15+24) 79 అవుతుంది. ఇది అసాధ్యం ఎందుకంటే అన్ని బ్లాగుల మొత్తం కర్మఫలాలు  75 కావాలి. కాబట్టి వీరముష్టి బ్లాగుకు మొత్తం 11 కర్మ ఫలాలు వస్తుంది. 


ఇదే తర్కం ఉపయోగిస్తే మనకు బేవార్స్‌గాడు బ్లాగుకు 12 కన్న తక్కువ మొత్తంలో కర్మఫలాలు రాకూడదు. ఆ బ్లాగుకు 13 కర్మఫలాలు వచ్చాయను కుందాం. అప్పుడు సొంతడబ్బాకు 14, ఊరపిచ్చుకకు 15 కనీసంగా కర్మఫలాలు రావాలి. అప్పుడు అన్ని బ్లాగుల కర్మఫలాల మొత్తం 11+13+14+15+24 = 77 అవుతుంది. ఇది తప్పు అని తెలుసు కనుక బేవార్స్‌గాడు బ్లాగుకు 12 కర్మఫలాలు అని తెలిసిపోతుంది. ఇదేవిధంగా చూస్తే సొంతడబ్బా బ్లాగుకు 13, ఊరపిచ్చుకకు 15 కర్మఫలాలు వస్తాయి. సొంతడబ్బా బ్లాగుకు నాలుగు సంకలినులు ఒకే విధమైన కర్మ ఫలాలను కేటాయించాయి. అవి 1, 5 కాదు అని మనకు పై పట్టికలు చూస్తే తెలిసిపోతుంది. ఇక మిగిలినవి 2,3,4. 4కూడా అయ్యే అవకాశాలు లేవు ఎందుకంటే 4X4=16 కన్న ఎక్కువ కర్మఫలాలు రావాలి కానీ దాని మొత్తం విలువ 13 అని మనకు తెలుసు. 2 అయితే 2X4=8. 13లో 8 తీసివేస్తే 5కర్మఫలాలను ఒక సంకలిని కేటాయించాలి. ఇది కూడా అసాధ్యం ఎందుకంటే అన్ని సంకలినిలు 5 కర్మఫలాలను ఇదివరకే కేటాయించాయి కాబట్టి. ఇక మిగిలింది 3. వీరముష్టి బ్లాగుకు సమూహం 3 కర్మఫలాలను కేటాయించింది కనుక మిగితా సంకలినిలు సొంతడబ్బా బ్లాగుకు మూడేసి కర్మఫలాలను కేటాయించాయి.    
పై పట్టికలో బేవార్స్‌గాడు బ్లాగువైపు చూడండి. ఆ బ్లాగుకు 3,5 కర్మఫలాలు రావడానికి వీలు లేదు. ఆ బ్లాగుకు 2,4,1(ఒకటి మాత్రమే) కర్మఫలాలను కేటాయించాలి. ఆ బ్లాగు మొత్తం 12 కర్మఫలాలను 5 సంకలినులు కేటాయించడానికి కల ఏకై సంభావ్యత 2,2,2,2,4 మాత్రమే. కానీ హారం తీన్‌మార్‌కు 4 కేటాయించింది కనుక హారం బేవార్స్‌గాడు బ్లాగుకు 2 కర్మఫలాలను కేటాయిస్తుంది.  పై పట్టికను గమనిస్తే ఊరపిచ్చుక బ్లాగుకు హారం కేటాయించిన కర్మ ఫలాలు ఒకటి తెలిసిపోతుంది.


24, మార్చి 2011, గురువారం

మెదడుకు మేత!- 7

తీన్‌మార్,  సొంతడబ్బా,ఊరపిచ్చుక, బేవార్స్‌గాడు, వీరముష్టి అనే తెలుగు బ్లాగుల మధ్య పోటీ పెట్టారు. కూడలి, మాలిక, జల్లెడ, హారం, సమూహం సంకలినులు ఇచ్చిన కర్మఫలాల (performance points) ఆధారంగా ఏది ఉత్తమమైన బ్లాగో నిర్ణయిస్తారు. పై సంకలినులు ఆయా బ్లాగుల పాపులారిటీ ఆధారంగా 1 నుండి 5 కర్మ ఫలాలను ఇస్తాయి. ఎక్కువ పాపులర్ అయిన బ్లాగుకు 5 కర్మ ఫలాలు తక్కువ ప్రాచుర్యం పొందిన బ్లాగుకు 1 కర్మ ఫలాన్ని యిస్తాయి అన్నమాట. ఈ విలువలు వారం వారం మారుతూ ఉంటాయి. పై సంకలినులు పైన పేర్కొన్న 5 బ్లాగులలో ఏ రెండింటికీ ఒకేరకమైన కర్మ ఫలాన్ని ఇవ్వలేదు. ప్రతి సంకలని ఇచ్చిన కర్మ ఫలాల మొత్తం ఆధారంగా ఏ బ్లాగు ఉత్తమమైనదో నిర్ణయిస్తారు.  తీన్‌మార్ బ్లాగుకు అత్యధికంగా 24 కర్మఫలాలు లభించాయి.  సొంతడబ్బా బ్లాగుకు నాలుగు సంకలినులు ఒకే విధమైన కర్మ ఫలాలను కేటాయించాయి. వీరముష్టి బ్లాగుకు జల్లెడ 5 కర్మఫలాలను, సమూహం 3 కర్మఫలాలను ఇచ్చాయి. ఏ రెండు బ్లాగులకు సమాన మొత్తంలో కర్మఫలాలు రాలేదు. వరుసగా తీన్‌మార్, ఊరపిచ్చుక, సొంతడబ్బా, బేవార్స్‌గాడు, వీరముష్టి బ్లాగులు ఒకటి నుండి అయిదు స్థానాలలో నిలిచాయి. ఈ వివరాల ఆధారంగా ఊరపిచ్చుక బ్లాగుకు హారం కేటాయించిన కర్మ ఫలాలు ఎన్నో చెప్పగలరా?    

మెదడుకు మేత! - 6 సమాధానం

స్ఫూర్తి కూతుళ్ళ వయసు వరుసగా 8సంవత్సరాలు, 3సంవత్సరాలు, 3సంవత్సరాలు.


వివరణ: స్ఫూర్తి, విభల మధ్య జరిగిన సంభాషణ ద్వారా స్ఫూర్తి కూతుళ్ళ వయస్సు ఈ క్రింది విధంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి.
         వయస్సులు                వయస్సుల
                                            మొత్తం
            1 1 72                       74
            1 2 36                       39
            1 3 24                       28
            1 4 18                       23
            1 6 12                      19
            1 8 9                        18
            2 2 18                      22
            2 3 12                      17
            2 4 9                        15
            2 6 6                        14           

            3 3 8                        14           
            3 4 6                        13

విభకు వాళ్ళున్న గది నెంబరు తెలిసినా కనుక్కోలేక పోయింది అంటే ఆ హోటల్ గది నెంబరు 14 అన్నమాట. ఎందుకంటే పై పట్టికలో  ఒకటి కన్న ఎక్కువ సంభావ్యత కలిగి ఉంది ఆ ఒక్క సంఖ్య మాత్రమే కనుక.
కాబట్టి ఆ అమ్మాయిల వయస్సు 2 6 6 కాని 3 3 8 కాని కావాలి.
స్ఫూర్తి పెద్దమ్మాయి పాటలు బాగా పాడుతుంది అనే సమాచారం ద్వారా వారి వయస్సు 2 6 6 కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే పెద్దమ్మాయి ఒక్కటే (కవలలు కాదని)అని మనకు తెలిసిపోయింది కనుక. కాబట్టి స్ఫూర్తి కూతుళ్ళ వయస్సు 3 3 8 సంవత్సరాలు. 

23, మార్చి 2011, బుధవారం

మెదడుకు మేత!- 6

విభ స్ఫూర్తి ఇద్దరూ బాల్య స్నేహితులు. ఇరవై యేళ్ళ తరువాత అనుకోకుండా ఒక హోటల్ గదిలో కలుసుకుంటారు.

విభ : మనం కలిసి చాలా రోజులయ్యింది. ఏమిటి విశేషాలు?

స్ఫూర్తి : నాకు పెళ్ళయ్యింది. ముగ్గురు అమ్మాయిలు.

విభ : అలాగా. ఎంత వయస్సేమిటి?

స్ఫూర్తి : వాళ్ళ వయస్సులను హెచ్చవేస్తే 72 వస్తుంది. కూడితే వచ్చే సంఖ్య ఈ గది సంఖ్య ఒకటే.

విభ : నీవిచ్చిన సమాచారంతో వాళ్ళ వయసులను కనుక్కోలేక పోతున్నానే స్ఫూర్తీ.

స్ఫూర్తి : అన్నట్టు చెప్పడం మరిచి పోయాను. మా పెద్దమ్మాయి పాటలు చక్కగా పాడుతుంది తెలుసా?

విభ : అలాగా మా అమ్మాయి కూడా సరిగ్గా మీ పెద్దమ్మాయి వయస్సేనే.

పై సంభాషణ ద్వారా స్ఫూర్తి కూతుళ్ళ వయస్సు కనిపెట్టగలరా?

20, మార్చి 2011, ఆదివారం

మెదడుకు మేత! - 5 సమాధానం

కథకు ఎ రూపాయలు, వ్యాసానికి బి రూపాయలు, కవితకు సి రూపాయలు పారితోషికం అనుకుంటే
ఫిబ్రవరి నెల పారితోషికం  ఎ + 5బి + 7సి = 3000     ....(1)
మార్చి నెల పారితోషికం    ఎ + 7బి + 10సి = 3900     ....(2)

మొదటి సమీకరణాన్ని రెండవదానిలో తీసివేస్తే
                            2 బి + 3 సి = 900

ఇప్పుడు జనవరి నెల పారితోషికం = ఎ + బి + సి
                 = ( ఎ + 5బి + 7సి ) - ( 4బి + 6సి)
                 = ( ఎ + 5బి + 7సి ) - 2(2బి + 3సి)
                 =  3000 -2(900)
                 =  3000 - 1800
                 =  1200 రుపాయలు.


అలాగే ఏప్రిల్ నెల పారితోషికం = 9ఎ +23బి +30సి
                 = 9(ఎ + 5బి + 7సి) - 22బి -33సి
                 = 9(ఎ + 5బి + 7సి) -11(2బి + 3సి)
                 = 9(3000) -11(900)
                 = 27000 - 9900
                 = 17100 రూపాయలు.

వట్టి మనిషి!

సుంకోజి దేవేంద్రాచారి రచన వట్టి మనిషి కథాజగత్‌లో చదవండి.

18, మార్చి 2011, శుక్రవారం

మెదడుకు మేత!- 5

పరమానందయ్య ఒక ప్రొఫెషనల్ రచయిత. ఆయన ఆంధ్రాజమీను దిన పత్రికలో వ్రాసిన రచనల వివరాలు ఇలా ఉన్నాయి.

జనవరి నెల : 1 కథ, 1 వ్యాసం, 1కవిత

ఫిబ్రవరి నెల : 1కథ, 5 వ్యాసాలు, 7కవితలు


మార్చి నెల : 1కథ, 7వ్యాసాలు, 10 కవితలు

ఏప్రిల్ నెల: 9కథలు, 23 వ్యాసాలు, 30 కవితలు.

ఆ పత్రిక వాళ్లు ఒక్కో ప్రక్రియకు నిర్దుష్టమైన పారితోషికం ఇస్తారు. పరమానందయ్యకు ఫిబ్రవరి నెలలో 3000రూపాయలు, మార్చి నెలలో 3900 రూపాయలు పారితోషికం వచ్చింది. అయితే జనవరి, ఏప్రిల్ నెలల్లో ఎంత పారితోషికం వస్తుంది?  

మెదడుకు మేత! - 4 సమాధానం

1. రోయల్ రీడర్                                - 3.00 X 9 = 27.00
2. మాన్యూల్ గ్రామర్                          - 9.00 X 9 = 81.00
3. గోష్ జియామెట్రీ                            - 11.00 X 8 = 88.00
4. బాస్ ఆల్జీబ్రా                                  - 17.00 X 8 = 136.00
5. శ్రీనివాసయ్యర్ అర్థిమెటిక్                - 21.00 X 8 = 168.00
                                                                                -------
                                                                               500.00
                                                                               --------

6. నలచరిత్ర                                        - 2.00 X 5 = 10.00
7. రాజశేఖర చరిత్ర                               - 7.00 X 5 = 35.00
8. షెపర్డు జనరల్ ఇంగ్లీష్                   - 10.00 X 6 = 60.00
9. వెంకట సుబ్బారావు మేడీజీ            - 15.00 X 5 = 75.00
10. కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్       - 20.00 X 6 = 120.00
                                                                                --------
                                                                                300.00
                                                                                --------

మొదటి దుకాణం (వెంకట్రామా అండ్ కో)లో అన్ని పుస్తకాలు ఎనిమిదేసి కొంటే 488 రూపాయలు ఖర్చవుతుంది. మిగిలిన 12 రూపాయలకు (ఆదుకాణంలో కొనవలసిన పుస్తకాల ధర ఖచ్చితంగా 500 రూపాయలు కనుక) వచ్చే రెండు పుస్తకాలు రోయల్ రీడర్ (3.00) మరియు మాన్యూల్ గ్రామర్ (9.00). ఇదే పద్ధతిలో రెండవ దుకాణంలో కూడ దుకాణందారు పుస్తకాలు ఇవ్వగలిగాడు.

పశ్చాత్తాపం

హోతా పద్మినీ దేవిగారి కథానిక పశ్చాత్తాపం కథాజగత్‌లో చదవండి.  మనిషి బతికి ఉండగా గుప్పెడు అన్నం పెట్టడానికి బాధపడే మనుషులు చనిపోయాక వేలకి వేలు ఖర్చుపెట్టి కర్మకాండ చెయ్యడాన్ని నిరసించే ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలపండి.


17, మార్చి 2011, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 40 సమాధానాలు!గమనిక: అడ్డం 5. వంశీ రచన ఆకుపచ్చని జ్ఞాపకం. ఆకుపచ్చ జ్ఞాపకం కాదు. ఆధారం ఇచ్చినప్పుడు సంశయంతోనే '?' ఇవ్వడం జరిగింది. 

16, మార్చి 2011, బుధవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 40

 


ఆధారాలు:
1.  తెలంగాణా జేయేసీ పల్లెల్లో ఈ పేరుతో ధూంధాం కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది.(4,2)
3. డామిట్! అనౌన్స్‌మెంటు అడ్డం తిరిగింది.(4)
5. ఈ colourful remembrance వంశీ రచనయేనా? (4,3)
7. సుఖము కలిగిన స్త్రీ (3)
9. కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన నవల (5)
10. సింహాసనం, రౌడీ అల్లుడు, స్టేట్ రౌడీ సినిమాలకు సంగీతం కూర్చిన బాలీవుడ్ సంగీతదర్శకుడు.(5)
11. భీరులు యుద్ధము చేయదగరు. ఈ వాక్యంలోని ఆయుధ విశేషము.(3)
14. తన్ను మాలిన ధర్మము , మొదలు చెడ్డ బేరము. ఇలాంటివి ఒకటి కాదు. పెక్కు. తెవికీ ప్రకారం :) (4,3)
15. శివరాజు వెంకట సుబ్బారావు సంతోష్ కుమార్ కాదు (4)
16. రచయితలకు ఆశ పెట్టేది. కొండొకచో భంగ పరచేది. అడపాదడపా తృప్తి నిచ్చేది. (6)
నిలువు:
1. Screen shot.(4)
2. రాశి, కుప్ప, ప్రోగు మధ్యలో కాస్త తేలికగా(5)
4. పులికాట్ సరస్సు (3,3)
5. గుల్జారీలాల్ నందా (4,3)
6. దివిటీలు(7)
7. శశి థరూర్‌ను ఈ మధ్య పెళ్ళి చేసుకున్నది ఈ కాశ్మీరీ మహిళ. (3)
8. ఉర్దూ సమాచారం (3)
9. వైయెస్సార్ కాంగ్రెస్  అ(న)ధికార ప్రతినిధి. (3,3)
12. సహస్రావధాని నరసింహారావుగారి ఇంటిపేరు కాస్త అటుఇటు అయ్యింది(5)
13. పగడాల జాబిలి చూడు - గగనాల దాగెను నేడు అంటున్నారీ సినిమాలో సినారె.(4)

13, మార్చి 2011, ఆదివారం

మెదడుకు మేత!-4

గిరీశం 800రూపాయలు పెట్టి ఈ క్రింది పుస్తకాలు తెమ్మని వెంకటేశాన్ని పురమాయించాడు.

1. రోయల్ రీడర్                                - 3.00
2. మాన్యూల్ గ్రామర్                          - 9.00
3. గోష్ జియామెట్రీ                            - 11.00
4. బాస్ ఆల్జీబ్రా                                  - 17.00
5. శ్రీనివాసయ్యర్ అర్థిమెటిక్                - 21.00
6. నలచరిత్ర                                        - 2.00
7. రాజశేఖర చరిత్ర                               - 7.00
8. షెపర్డు జనరల్ ఇంగ్లీష్                   - 10.00
9. వెంకట సుబ్బారావు మేడీజీ            - 15.00
10. కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్       - 20.00

                    అయితే వెంకటేశం పుస్తకాల పేర్లు వాటి ధరలతో ఒక జాబితా వ్రాసుకున్నాడు కాని ఏ పుస్తకాలు ఎన్నెన్ని కాపీలు తేవాలో మరచిపోయాడు. జాబితాలోని మొదటి అయిదు పుస్తకాలు డి.వెంకట్రామా అండ్ కో.లోను, మిగిలినవి వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ దుకాణంలోను గిరీశం తెమ్మన్నట్లు గుర్తు. వెంకట్రామా అండ్ కో. లో ఖచ్చితంగా 500.00 రూపాయలు, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ లో ఖచ్చితంగా 300.00 రూపాయలు ఖర్చవుతుందని తెలుసు. వెంకట్రామా పుస్తకాల అంగడిలో కొనవలసిన పుస్తకాలలో రెండు పుస్తకాలు తొమ్మిది కాపీలు మిగితావి ఎనిమిది కాపీలు కొనమన్నాడు. కాని ఏవి ఎన్ని పుస్తకాలో మన వెంకటేశం మరచిపోయాడు. అలాగే వావిళ్ల వారి దుకాణంలో కొనవలసినవాటిలో రెండు పుస్తకాలు ఆరు కాపీలు మిగిలినవి ఐదుకాపీలు గిరీశం కొనమన్నాడు కాని వెంకటేశం అవి ఏపుస్తకాలో మరచిపోయాడు. అయినా ఆ దుకాణం దార్లు అతనికి కావలసిన పుస్తకాలు కావలసిన కాపీలను ఇవ్వగలిగారు. మన వెంకటేశం ఏయే పుస్తకాలు ఎన్ని కాపీలు కొన్నాడో మీరేమయినా కనుక్కోగలరా?     

12, మార్చి 2011, శనివారం

పోటీ ఫలితాలు!

కథను వ్రాయండి అంటూ మేము పి.వి.బి శ్రీరామమూర్తి గారి కథ పరిధి దాటిన వేళ ఇతివృత్తాన్ని తీసుకుని మరో కోణంలో తిరగ వ్రాయమని అడిగాము. మా ప్రకటనకు స్పందించి కేవలం మూడు ఎంట్రీలు మాత్రమే వచ్చాయి.

అవి 1. వర్ధనమ్మ మొగుడు - రవికుమార్   
       2. స్వేచ్చకోసమై... - లక్ష్మీ రాఘవ   
       3. పరిధి దాటని వేళ - జి.ఎస్.లక్ష్మి

       వీటిలో రవికుమార్‌గారి కథ వర్ధనమ్మ మొగుడు కథాజగత్‌లో చదవండి. మిగిలిన రెండు కథలను తురుపుముక్కలో వీలువెంబడి ప్రకటించగలము. రచయితలకు అభినందనలు!!!  అన్నట్లు ఈ రవికుమార్ 'రవిగారు'గా మన బ్లాగులోకానికి చిరపరిచితులే.

11, మార్చి 2011, శుక్రవారం

మెదడుకు మేత! - 3 సమాధానం

నరహరి కోశంలోని పదాల సంఖ్య 10,26,425.
మాదిరాజు శబ్దమంజూషలో పుటల సంఖ్య 1970.

నేను సైతం!

ఒకటే పేరుతో ఈ రెండు కథలు కనిపించగానే కొంత ఉత్సుకత కలిగింది. దాదాపుగా ఒకే ఇతివృత్తాన్ని ఆధారంగా  చేసుకుని రాసినవి అని తెలిశాక ఉత్సుకత మరింత ఉత్సాహంగా మారింది. రెండూ ఇంచుమించు ఒకే సమస్యని ప్రతిబింబిస్తున్నాయి, ఒకటే పేరు కలిగి ఉన్నాయి కనక ఒకేచోట విశ్లేషిస్తే? అన్న ఆలోచన వచ్చింది. ఐతే ‘తురుపుముక్క ‘ గారి నిబంధన కొంత వెనక్కు తీసింది. అయినా సరే నాకెందుకో ఇది ఇలా రాస్తేనే బాగుంటుంది అని గట్టిగా అనిపించడంతో నా మౌస్ తీసుకుని ముందుకే కదిలాను ‘నేను సైతం’ అనుకుంటూ. శ్రీ పంజాల జగన్నాథం, శ్రీ డీ.కే. చదువులబాబు గార్లచే రాయబడ్డాయి ఈ రెండు కథలూ. పిల్లలని ఎంతో ప్రేమతో, ఆప్యాయతలతో, కొండంత ఆశలతో పెంచడం తరవాత వారి నిరాదరణకు గురి కావడం, ముఖ్యపాత్రలు అపార్ధం చేసుకున్న ఇతర పాత్రల ఉదాత్తమైన ఆశయసాధన లో తామూ భాగంగా మారడం మూల కథగా రెండింటిలోనూ కనిపిస్తుంది. తమ్ముడి బిడ్డలని సొంత బిడ్డలుగా సాకి, తన పెద్దవయసులో వారి తిరస్కారానికీ, నిరాదణలకీ గురి అయిన రాం నర్సయ్య కథ జగన్నాథం గారు రాసిన ‘నేను సైతం’. తమ్ముడూ, మరదలూ మందలించబోయినా వినని పిల్లలని చూసి విరక్తి చెందిన అతను తన గతాన్నీ, అందులో అర్ధం లేని అనుమానంతో, ఆవేశంతో తను దూరం చేసుకున్న భార్యనీ గుర్తుకు తెచ్చుకుని కలత చెందుతాడు. తరవాత తన జీవితంలో ఆమె లేక కలిగిన అగాధమంత లోటుని గుర్తించి తనని కలవాలని భద్రాచలం చేరతాడు అతను. అక్కడ మానవతకీ,అలుపెరగని సేవకీ నిదర్శనంగా నిలచిన తన భార్యనీ, ఆమెకి అన్నివిధాలా తోడుగా ఉన్న తన ప్రతిరూపాన్నీ చూసి ఆనంద పారవశ్యంలో మునిగిపోతాడు. తన వెంట తెచ్చుకున్న జి.పి.ఎఫ్, గ్రాట్యూటీ లాంటి వన్నీ ఇచ్చి ‘ నేను సైతం ‘ అనిపించుకుంటాడు. కథా, కథనమూ బావున్న ఈ కథ తెలంగాణా మాండలీకంలో రాసినట్టుగా కనిపిస్తుంది. రాం నర్సయ్య భార్యని వదిలేసి రావడానికి కారణాలు మరింత బలంగా చూపించి ఉంటే బావుండుననిపించింది నాకు. ముగింపు మాత్రం ‘ అన్నిరోజుల తర్వాత కలిసాడు కదా అని భర్త కాళ్ళమీద పడిపోవడమూ, నన్ను క్షమించండి లాంటి రొటీన్ డైలాగులు ‘ లేకుండా సహజంగానూ, ఉన్నతంగానూ ఉంది. ఇక ఇదే పేరుతో రాసిన చదువులబాబు గారి కధ కూడా ఒక పెద్దాయన పరంగా రాయబడింది. ఉత్తమపురుషలో చెప్పిన ఈ కథ కూడా కొడుకునెంతో ప్రేమించి, కళ్ళల్లో పెట్టుకుని పెంచి తరవాత ఆ కొడుకూ, కొడళ్ళ నిర్లక్ష్యానికీ, తిరస్కారానికీ గురి అవుతూ ఉండే అతని కథ. మనసులో కొండంత ఆవేదనతో, అశాంతితో బాధపడుతూ ఉంటాడు అతను. అయినా కూడా ఎప్పుడూ ఇల్లు పట్టకుండా ఆవారాగా తిరిగే ( అతని అభిప్రాయంలో) తిరిగే ఎదురింటి కొడుకుని చూస్తూ, అతనితో తన కొడుకుని పోల్చి చూసుకుని సంతృప్తి చెందటానికి ప్రయత్నం చేస్తుంటాడు. తనని వృద్ధాశ్రమంలో చేర్పించాలని కొడుకు ఏకపక్షనిర్ణయం తీసుకున్నప్పుడు కలత చెందిన మనసుతో తనంత తానుగా ఒక ఆశ్రమానికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. అక్కడ ఆ అనాథల ఆశ్రమాన్ని నడుపుతున్నది తను రోజూ బాధ్యత లేనివాడుగా చిరాకు పడే ఎదురింటి కుర్రాడేనని తెలిసాకా, తనతో తెచ్చుకున్న దస్తావేజులూ, పట్టాలూ ఆ అబ్బాయి అనంత్ నడిపే ఆశ్రమానికి విరాళంగా ఇచ్చి ఈ ప్రయత్నానికి ‘ నేను సైతం’ అని సంతృప్తి చెందటంతో కథ ముగుస్తుంది. ఈ కథ కూడా బాగా రాసారు. కొన్నిచోట్ల ఎదురింటి అబ్బాయిని బలవంతంగా చెడ్డవాడుగా ( చివరిలో అసలు నిజం తెలియడానికి ముందు వరకూ) చూపించే ప్రయత్నం జరిగినట్టు అనిపించింది. తన ఇంటిలో జరిగే పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన అలా అనుకుని ఉండవచ్చేమో మరి. అతని గురించి ఏమీ తెలియకుండానే తన కొడుకుతో పోల్చి తన కొడుకు మంచివాడు అని అనుకోవాలని చూడడం కూడా అతని మనస్థితినే ప్రతిబింబిస్తోంది అనుకోవాలి. అందుకే అతను తను ఆశ్రమంలో చేరడానికి వెళుతూ కూడా అనంత్ నీ, అతని నిర్లక్ష్యాన్నీ చూసి అతని తల్లి గురించి జాలి పడతాడు, ఇలాంటి కొడుకున్నందుకు ఆమె ఒకనాడు ఆశ్రమంలో చేరాల్సి వస్తుంది అని. ఇది నిజమైన మానవ నైజం అనిపించింది నాకు. ఒకేపేరుతో రాయడమే కాక ఒకే రకమైన కథతో రాసిన ఈ రెండు కథలూ ఇంచుమించు ఒకేరకంగా సాగడమూ, ఒకే రకమైన ముగింపులతో ముగియడమూ ‘కాకతాళీయమే’ అయినా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కథాజగత్ లో కూడా ఇంచుమించు పక్కపక్కనే ఉండడం ( మధ్యలో మూడు కథల తేడాతో). కూడా చిత్రమే. ఈ రెండు కథలూ చదివినప్పుడూ, విశ్లేషించినప్పుడూ కూడా ఒక స్తితిలో నాకు ఒక్క కథే  చదివిన అనుభూతి కలిగింది. అదే ఇలా ఒకే విశ్లేషణ రాయడానికి ప్రేరణ.
ఈ కథల లింకులు: 1. http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/nenu-saitam---panjala-jagannatham

2. http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/nenu-saitam--di-ke-caduvulababu


(సౌజన్యం : మనసు పలికే)

9, మార్చి 2011, బుధవారం

మెదడుకు మేత! - 3

తెలుగు భాషలో పరిపూర్ణమైన నిఘంటువు లేదని భావించిన ఆచార్య తవ్వా నరహరిగారు నిఘంటు నిర్మాణానికి పూనుకున్నారు. నిఘంటు నిర్మాణం ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి కఠోరమైన పరిశ్రమ, అకుంఠిత దీక్ష, నిర్దుష్టత, శ్రద్ధగా పరిశీలించే జాగరూకత మొదలైనవన్నీ అవసరమైనప్పటికీ దానిని ఒక సవాలుగా స్వీకరించి ఆ పనికి శ్రీకారం చుట్టారు. నాలుగేళ్ళు శ్రమించిన తరువాత ఒక బృహత్ నిఘంటువును నరహరి కోశం పేరుతో వెలువరించారు. దీనిలో పది లక్షలకు పైగా పదాలు, వాటి అర్థవివరణాదులు ఉన్నాయి.

మాదిరాజు సీతారాం గారి 'మాదిరాజు శబ్దమంజూష'లో కన్నా ఈ నరహరి కోశంలో 62,623 పదాలు అధికంగా ఉన్నాయి.మాదిరాజు శబ్దమంజూషలో తొమ్మిది లక్షలకు పైగా పదాలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మాదిరాజు శబ్దమంజూషలోని పదాలసంఖ్యలో నాలుగు అంకె లేదు. మరియు ఏ అంకె కూడా పునరావృత్తం కాలేదు.

మాదిరాజు శబ్దమంజూషలోని పదాలసంఖ్యకు అయిదువందలా యిరవై రెండు కలుపగా వచ్చిన సంఖ్య యొక్క వర్గమూలాన్ని ద్విగుణీకరించి ఆరు కలిపితే ఆ నిఘంటువు పుటల సంఖ్య వస్తుంది.

పై సమాచారం ఆధారంగా నరహరికోశంలోని పదాల సంఖ్యను, మాదిరాజు శబ్దమంజరిలోని పుటల సంఖ్యను కనుక్కోగలరా?      

మెదడుకు మేత! - 2 సమాధానం

ఏ రెండు భుజాల మొత్తం పొడవు మూడవ భుజం కంటే ఎక్కువ వుండాలనేది త్రిభుజం యొక్క నియమం. దాన పత్రంలో ఇచ్చిన కొలతలు రెండింటి మొత్తం మూడవదానితో సమానము (170 ⅔ గజాలు + 145గజాల3అంగుళాలు = 315¾ గజాలు) కాబట్టి వాటితో సరళరేఖ తప్పితే త్రిభుజం ఏర్పడదు. అంటే ఆ జమీందారు కవికి మొండిచెయ్యి చూపించాడన్నమాట.

స్వయంవరం కథపై లక్ష్మీరాఘవ గారి అభిప్రాయం!

స్వయంవరం....అల్లూరి గౌరిలక్ష్మి గారి కథ అందరికి ఒక మామూలు కథ లాగ అనిపిస్తుంది..కాని ఆలోచిస్తే ఒక మంచి సందేశం కనిపిస్తుంది..అందుకే నాకు నచ్చింది. ఒక పెళ్ళి అయిన అమ్మాయి పక్కింటి కుర్రాడితో లేచిపోతే పరువుపొయిందనుకునే పుట్టింటివారు , సమాజంలో అందరూ ఏమనుకుంటారో అని, అందరూ తమకుటుంబాన్ని వేలెత్తి చుపుతారనే భయం !!అంతేకాదు అలా లేచిపోయిందనగానే తద్దినాలు పెట్టి చచ్చిపొయిందని చెప్పే తల్లిదండ్రులు, భర్త యెంత కష్టం పెట్టినా భర్త దగ్గిరే నే నీ బతుకని బోధించేవారు, భర్త తక్కువ చదువుకున్నా , అంతస్థులో తక్కువ అయినా సర్దుకు పోవాలమ్మా అని చెప్పే పుట్టింటివాళ్ళు చాలామందే వున్నారు ..ఎంతసేపూ పరువు ప్రతిష్టా అని ఆలోచిస్తారే తప్ప..అమ్మాయి అత్తగారింట్లో యెంత సుఖపడుతోంది అని తెలుసుకోరు...పెళ్ళిచేయగానే బాధ్యత తీరిపోదు. అమ్మాయి ఇంట్లోంచి పారిపోవాల్సిన పరిస్థితి యెందుకువచ్చిందో తెలుసుకొవడానికి ప్రయత్నించరు ..చివరకు అమ్మాయి నిర్ణయం నచ్చక బరి తెగించిందనే అనుకుంటారు తప్ప .....యెలావుందో అలోచించరు..ఈ కథలొ రేణుతో వదిన కామేశ్వరి " వ్యక్తికి, వ్యవస్థకూ ఘర్షణ ఏర్పడినప్పుడు వ్యక్తిధర్మాన్నే ఉత్కృష్టమైనదిగ అంగీకరించాలి. ఎన్ని నీతి బోధలు విన్నా మనిషి తన సుఖం తరువాతే సమాజం గురించి ఆలోచిస్తాడు. అది మానవనైజం , కాదనలేని నిజం " అన్న మాటలు ఈ కథకు హైలైటు. రేణు జీవితములొ వివేక్ వంటి సంస్కారవంతుడు తారసపడటం తన అదృష్టం.
- లక్ష్మీరాఘవ8, మార్చి 2011, మంగళవారం

మెదడుకు మేత! -2

ఒక కవి తలపర్తి సంస్థానానికి వెళ్ళి అక్కడి సంస్థానాధీశుడు శ్రీశ్రీశ్రీ రావుబహద్దూర్ కృష్ణప్రసాదరాయల ముందు అతనిపై ఆశువుగా కొన్న్ని పద్యాలను వినిపిస్తాడు. అందుకు ఆ సంస్థానాధీశుడు ఎంతో సంతోషించి ఆ కవికి 170 ⅔ గజాలు, 315¾ గజాలు, 145గజాల3అంగుళాలు కొలతలుగల సారవంతమైన  ఒక త్రిభుజాకార స్థలాన్ని దానంగా ఇస్తున్నట్టు దానపత్రం వ్రాసి యిస్తాడు. ఆ దాన పత్రాన్ని చదివి ఆ కవి " మహాప్రభూ ఈ పేద కవిని ఇటుల పరిహసించుట తగునా? మీకు నన్ను సత్కరించటం ఇష్టం లేకపోతే మర్యాదగా తెలియజేస్తే ఎంతో సంతోషిస్తాను. శలవిప్పించండి" అంటూ వెళ్ళిపోయాడు. ఆ కవి మాటల ఆంతర్యం ఏమిటి?     

మెదడుకు మేత! - 1 సమాధానం.

మొదటి బహుమతి: వేదన - రోదన - రసూల్ (చెన్నేకొత్తపల్లి)
రెండవ బహుమతి: భూగోళంలో గందరగోళం - జ్ఞానశ్రీ (హైదరాబాదు)
మూడవ బహుమతి: మనిషిలోని మహిషం - పాలడుగు పరంధామయ్య (పిఠాపురం)
ప్రత్యేక బహుమతి: బిళ్ళంగోడు - రమణీస్వామినాథన్ (నాగాయలంక)
ప్రోత్సాహక బహుమతి: పరేషాని - విశ్వంభరశాస్త్రి (కడప)

ధిక్కార స్వరంపై జ్యోతిగారి అభిప్రాయం!

కథాజగత్ కధలపోటి లోని పంతుల జోగారావుగారు రాసిన ధిక్కార స్వరం నాకు చాలా నచ్చింది. దాని గురించి కొన్ని మాటలు.

అనువుగాని చోట అధికులమనరాదు అనే నానుడి అందరికీ తెలిసిందే. కాని ఎప్పుడూ పరిస్థితులకు, వ్యక్తులకు భయపడి అణగిమణగి ఉండడం కూడా మంచిది కాదు. ఇది జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు కాని, ఉద్యోగంలో నిత్యం ఎదురయ్యే సమస్యలు కాని అవసరమైనప్పుడు మనలోని ఆలోచనలను, ఆవేశాన్ని బయటకు ధైర్యంగా చెప్పాలి తప్పదు. లేకుంటే అందరు మనని చేతకానివాడనుకుని పెత్తనం చెలాయిస్తారు. అలా అని ప్రతీసారి ధిక్కార స్వరంతో  మాట్లాడం కూడా మంచిది కాదు. ఈ కథలో వామనరావు పరిస్థితి అంతే.  మధ్యతరగతి మనిషిగా ఇంట్లో, బయటా,ఆఫీసులొ ప్రతీ చోట అతనికి సమస్యలే. ధైర్యంగా తన మనసులోని భవాలను మాటలుగా గట్టిగా చెప్పలేడు. ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. మనం ఎప్పుడూ తగ్గి ఉండాలి.అవతలివాళ్లు పెద్దవాళ్లు .ఎదిరించరాదు.వాళ్లు ఏదైనా చేయగలరు.మనం ఏదంటే ఏమవుతుందో? అనే సవాలక్ష సందేహాలు,భయాలు అతడిని ప్రతీ విషయంలో కృంగదీస్తాయి.  ఎప్పటికీ అలా పిరికివాడిగా, భయస్తుడిగానే  ఉండిపోతాడు. అతని మనుగడ కూడా అసంతృప్తిగా, నిస్సహయతగా గడిచిపోతుంది. అతని కూతురు వామనరావుకి పూర్తిగా వ్యతిరేకం. తనకు జరిగిన అన్యాయానికి బాధపడి , నిరాశ చెందక ఒంటరిగా అందరినీ కలిసి ఒక ఉద్యమం లేవనెత్తి తన స్వరాన్ని అందరికీ వినిపించింది. తండ్రి అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి చూపిస్తుంది. తాను తన కూతురిలా ఎప్పుడూ ఎదిరించి, తన స్వరాన్ని వినిపించలేకపోయినా జరిగిన సంఘటన అతనికి సంతోషాన్నిస్తుంది. తప్పు చేయనప్పుడు,అన్యాయం జరిగినప్పుడు ధిక్కారంగా, ధైర్యంగా మాట్లాడంలో తప్పేమి లేదు. మనసులోని కుమిలిపోతుంటే ఆ వ్యధ అందరికి తెలిసేది ఎలా? అతని అభిప్రాయం అర్ధమయ్యేది ఎలా? 

ఈ కథలో రచయిత చెప్పదలుచుకున్నది నీతిసూత్రం లా అనిపిస్తే అది చాలా తప్పు అని నేనంటాను. ఎందుకంటే ప్రతి మనిషి సర్వస్వతంత్రుడు. మంచిని సమర్ధించి, చెడును,అన్యాయన్ని ఎదిరించే అధికారం, హక్కు అందరికీ ఉంది. పిరికివాడు, తప్పు చేసినవాడే మరొకరికి భయపడతాడు. పెద్దవాళ్లను గౌరవించాలి, ఆదరించాలి.కాని అవసరమైన వేళలో ఏ విషయం మీదైనా తమ ధిక్కార స్వరం అందరూ ఉపయోగించాల్సిందే.. తమకు నచ్చని విషయాల గురించి ఎలుగెత్తి చెప్పాలి అన్నామాట అక్షరాలా ఆచరణీయమైనది.  అనుసరణీయమైనది అని ఒప్పుకోక తప్పదు కదా.

-జ్యోతి వలబోజు

(సౌజన్యం:జ్యోతి)

6, మార్చి 2011, ఆదివారం

మెదడుకు మేత! -1

కవితాకోకిల పత్రిక వారు  రాష్ట్ర స్థాయి కవితల పోటీ నిర్వహించి వాటి  ఫలితాలు ప్రకటించారు. మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, ప్రత్యేక బహుమతి, ప్రోత్సాహక బహుమతి అని అయిదు బహుమతులు ప్రకటించారు. హైదరాబాదు, నాగాయలంక, కడప , చెన్నేకొత్తపల్లి, పిఠాపురం నుండి వచ్చిన కవితలకు బహుమతులు వచ్చాయి. రమణీస్వామినాథన్, జ్ఞానశ్రీ, విశ్వంభర శాస్త్రి, పాలడుగు పరంధామయ్య, రసూల్‌లు ఈ బహుమతులను అందుకున్నారు. పరేషాని, వేదన - రోదన, మనిషిలో మహిషం, భూగోళంలో గందరగోళం, బిళ్ళంగోడు కవితలు ఈ పోటీలో గెలిచాయి. ఈ క్రింది వివరణల ద్వారా ఏయే బహుమతులు ఏయే కవితలకు ప్రకటించారో చెప్పుకోండి. అలాగే ఆ కవితలను ఎవరు వ్రాశారు? ఏ ప్రాంతానికి చెందినవారో? తెలపండి.

'పరేషాని' కవితకు ప్రోత్సాహక బహుమతి ఇచ్చారు. దానిని వ్రాసింది విశ్వంభర శాస్త్రి. రెండవ బహుమతి జ్ఞానశ్రీ రచించిన కవితకు ప్రకటించారు. అయితే అది 'వేదన - రోదన' కాదు. 'మనిషిలోని మహిషం'కు మూడవ బహుమతి వచ్చింది. ఇది తూ.గో. జిల్లా నుండి వచ్చిన కవిత. రమణీస్వామినాథన్ 'బిళ్ళంగోడు' అనే కవితను వ్రాశారు. అయితే ఈ కవిత అనంతపురం కడప జిల్లాలకు ప్రాతినిధ్యం వహించడంలేదు. పిఠాపురం నుండి వచ్చిన కవితకు ప్రత్యేక బహుమతి రాలేదు. రసూల్ ఒక కరువు జిల్లాకు చెందినవారయినా అతని కవితకు ప్రత్యేక బహుమతి ఇవ్వలేదు. 'భూగోళంలో గందరగోళం' అనే కవిత హైదరాబాదు నుండి వచ్చింది. 'వేదన - రోదన' అనే కవిత జిల్లా ముఖ్యపట్టణం  నుండి రాలేదు.

5, మార్చి 2011, శనివారం

నన్ను ఆకట్టుకొన్న కథ ధనలక్ష్మి!


ధనలక్ష్మి కథ జీవితంలో నెగ్గుకు వచ్చే ఓ ఆడపడుచు కథ. ధనలక్ష్మి పాత్రలో చదువరి జీవితంపైన అపారమైన నమ్మకాన్ని, ఉత్సాహాన్ని చూస్తాడు. ఓటమిని అంగీకరించని పట్టుదలని చూస్తాడు. గెలుపుకై ఆమె శ్రమిస్తుంది. తన చుట్టూ ఉన్నవాళ్ళను కలుపుకు పోతుంది. తెలివి, చలాకీతనం, స్నేహభావం  ప్రతిబింబించేలా రచయిత ఆమె పాత్రని అద్భుతంగా మలచారు.

ఇతర పాత్రలు అన్నీ చక్కగా మలచబడి ధనలక్ష్మి వక్తిత్వాన్ని బలపరిచేవిగా ఉన్నాయి. రామాంజనేయులు ధనలక్ష్మి భర్త. ప్రతి మగవాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉంటుందనేది రామాంజనేయులు విషయంలో అక్షర సత్యం. ధనలక్ష్మి రామాంజనేయులుని ఎక్కడా తక్కువచేయకపోగా, తను వోడినట్లు నటించి తన ఆలోచనలను అతని నిర్ణయాలుగా మలచి , అతని సంపూర్ణ సహకారంతోనే అనుకొన్నవి సాధిస్తుంది. జయజయధ్వానాలు రామాంజనేయులకే. గెలుపు ధనలక్ష్మిదే.

మరొక సమర్థవంతమైన ప్రయోగం రచయిత కథలో ఒక పాత్ర కావడమే. ఇది పాఠకులకు కథ పట్ల నమ్మకాన్ని కలిగిస్తుంది. కథ జీవవంతమౌతుంది. రామాంజనేయులు మాష్టారు, రచయిత భార్య లాంటి చిన్న పాత్రలు కూడా కథకు చక్కటి ఊతాన్నిచ్చాయి. 

కథ నడిచే రంగస్థలాన్ని రచయిత నమ్మదగ్గ విధంగా తయారు చేశారు. తాలుకా హెడ్‌క్వార్టర్ అనదగిన ఒక మోస్తరు ఊరు ఈ కథకు రంగస్థలం. అందులో జీవితాలని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఉదాహరణకి రచయిత తండ్రి గారి గుమాస్తాగిరి మించి ఆలోచించలేని మధ్య తరగతి మనస్తత్వం, శుభలేఖల్లో చి.సౌ.శకుంతల - బ్రాకెట్‌లో బి.ఎ.అని ఏ ముహూర్తాన అచ్చు వేశారో, ఆ బ్రాకెట్లు విడకపోగా "...మనమేం ఈ మహానగరంలో ఊళ్ళేలాలా ఉపన్యాసాలివ్వాలా" అని సాగదీస్తూ ఇద్దరు పిల్లల తల్లిగా సెటిలై పోయేరచయిత భార్య వీరంతా పాఠకుణ్ణి కథలో ఇన్వాల్వ్ చేస్తారు. 

కథ చెప్పిన తీరు ప్రతి వాక్యాన్ని చదివించేలా ఉన్నది. తెలుగుతనం ఉట్టిపడుతోంది. మాండలీకాలను సమర్థవంతంగా ఉపయోగించి చదువరులను కథా వాతావరణంలోకి లాక్కువెళ్ళారు. ఉదాహరణకు ఈ వాక్యాన్ని చూడండి. 'కానీ మూడోరోజున నాయుడుగారి పచారీ సరుకుల ఖాతా వేరే కొట్లోంచి రామాంజనేలు కొట్లోకి మారింది. రామాంజనేలు కాజా తిన్నాడు.' సున్నితమైన హాస్యం, చక్కటి పాత్రపోషణ ఈ కథకు జీవం పోశాయి. ఉపమానాలు, వర్ణన పాత్ర భావస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. ఈ వాక్యాన్ని చూడండి. 'అంతా విని అందర్నీ గమనిస్తున్న రామాంజనేలు మీసాలు మిరకాయలైనాయి. ముక్కుపుటాలెగిరి పడ్డాయి. ధనమ్మ వంక దెబ్బతిన్న పులిలా చూశాడు.' ముగింపు ధనలక్ష్మికి మల్లే చదువరికీ సంతృప్తిని ఇస్తుంది. ఇది అందరూ తప్పక చదివి ఆనందించదగిన కథ.

ఈ కథని కింది లింకులో చదవండి
.

-కె.ఫణిప్రసన్నకుమార్

కథాజగత్‌లో 150వ కథ!

వర్తమాన కథా కదంబం కథాజగత్‌లో శ్రీవిరించి గారి కథ పుడమి-పోడిమి కథను చదవండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 


త్వరలో కథాజగత్‌లో ఈ క్రింది కథలు ప్రకటించ బడతాయి.

1.హోతా పద్మినీదేవి - పశ్చాత్తాపం


2.సుంకోజు దేవేంద్రాచారి - వట్టి మనిషి


3.ఆదూరి వెంకట సీతారామ మూర్తి - గలగలా గోదారి


4.తులసి బాలకృష్ణ - పొగమంచు

అలాగే మేము నిర్వహిస్తున్న పోటీ కాని పోటీ లో పాల్గొనండి. చివరి తేదీ మార్చి 12, 2011. 
2, మార్చి 2011, బుధవారం

సంస్కారం కథపై అను ఊసులు.

మానవ సంబంధాలు డబ్బుతోనూ, సమాజం పట్ల భయంతోనూ ఎలా ముడిపడి ఉన్నాయో చూపించిన...కాకాని చక్రపాణిగారు రాసిన 'సంస్కారం' కథ నాకు నచ్చింది. మొదటి వాక్యమే 'పోయాడు, పీడా పోయింది అని అనుకుని ఆమె స్వాంతన పొందే అవకాశం లేదు. ఎందుకంటే ఏడవకపోతే, సమాజం ఆడిపోసుకుంటుంది.' మనం చాలానే పనులు సమాజానికి భయపడి చేస్తుంటాము కానీ ఇష్ట పడి చేయం అనే విషయాన్ని విశదపరుస్తుంది. హరినారాయణ కూతురు, కొడుకుల సంభాషణలు తండ్రి పోయాడన్న బాధ కన్నా ఇంటిని దక్కించుకోవాలన్న ఆత్రం - కూతురికి, తనకు రావలసిన డబ్బు దక్కించుకోవాలన్న ఆరాటం - కొడుకుకి ఉన్నట్లు తెలుపుతాయి. తమ పిల్లల భవిష్యత్తును తామె చేతులారా ప్రేమ పేరుతో ఎలా కాలరాస్తారో హరినారాయణ పాత్ర ద్వారా చూపించారు. కర్మకాండలు దగ్గరకు వచ్చేసరికి కూతురు ఎంత డబ్బు మనిషి అయినప్పటికీ, తమ్ముడు చేయననేసరికి, ఆచారాలు నిర్వహించకపోతే ఏమవుతుందో అనే భయం వల్ల కర్మకాండలు నిర్వహించటానికి అవసరమయిన డబ్బు ఇవ్వటానికి ఒప్పుకుంటుంది. ఇక్కడ ధనవ్యమోహం కంటే భయమే డామినేట్ చేసింది. మానవ సంబంధాలలో డబ్బో భయమో... ఈ రెండూ ప్రాముఖ్యత వహించినంతగా, ఇంక ఏమీ లేవు అని రచయిత చాలా చక్కగా చెప్పారు.  ఈ కథలోని ఉదాత్తమైన పాత్ర భాగ్యలక్ష్మి మామగారిది. ఆ పాత్ర చేత జన్మతోనే ఎవరూ అస్పృశ్యులు కారు, బుద్ధి చేత తప్ప అని ఒక చోట అనిపిస్తారు. భాగ్యలక్ష్మి పాత్ర ఎప్పుడూ భర్త చేసే పనులకు బాధ పడటం తప్పించి ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఆలోచన చేసినట్లు కనిపించలేదు. ఎంతసేపూ భర్తను ఒక పీడగానే తలపోసింది. ఆర్థిక ఇబ్బందులనుంచి ఎలా బయట పడాలి అని కూడా ఆలోచించినట్లు కనపడదు. ఇదే విషయం తన మామ తనతో అన్నట్లు అనిపిస్తుంది. ("నువ్వు ఇతర్లను 'పీడ' అనుకుంటూ బతికావు. నీ మొగుడి చావుతో 'పీడ' పోయిందనుకున్నావు! నీ బతుకునుండీ ఎదగటానికి నువ్వేం ప్రయత్నించావమ్మా?" అని ఆయన ప్రశ్నించినట్లయి ఉలిక్కిపడింది భాగ్యలక్ష్మి.) అప్పుడు తన బతుకు తను ఇప్పటికయినా బతకటం మొదలెట్టాలి అని అనుకుంటుంది. కథకు ఇది చక్కటి ముగింపు. 

కథలోని ఈ క్రింది వాక్యాలు నాకు చాలా నచ్చాయి.


"ఇంక మిగిలింది ప్రేమా ఆప్యాయతలూ కాదు, కర్మకాండే! మంచీ, మర్యాదా, సంస్కారాలు లేవు. మిగిలిందల్లా అంతిమ సంస్కారం పట్ల నమ్మకం. అది జరక్కపోతే మనకేమన్నా పీడ పట్టుకుంటుందేమో నన్న భయమూ మిగిలింది"

"పీడ ఎక్కడో లేదు. మన ఆలోచనల్లోనే ఉంది. క్రియాశీలమైన ఆలోచనతో, ప్రవర్తనతో పీడ తొలగిపోతుంది."ఈ కథను ఈ క్రింది లింక్‌లో చదవవచ్చు.


http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/sanskaram---kakani-cakrapani


-అను

(సౌజన్యం : ఊహలు - ఊసులు)  


మహాశివరాత్రి శుభాకాంక్షలు!

 మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు!

1, మార్చి 2011, మంగళవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 39 సమాధానాలు!

ఈసారి ప్రసీద (సుభద్ర వేదుల), భమిడిపాటి సూర్యలక్ష్మి గార్లు ఈ పజిల్ పూరించడానికి ప్రయత్నం చేశారు. వారికి నా అభినందనలు!