...

...

29, ఆగస్టు 2009, శనివారం

బెస్తవారి జీవితాలను ప్రతిబింబించే కథ!

సుప్రసిద్ధ కథా రచయిత జాతశ్రీ గారి రచన అగ్నితుఫాను మీకోసం ప్రత్యేకంగా కథాజగత్ బ్లాగులో ప్రకటిస్తున్నాము. సముద్రంలో చేపలను వేటాడే బెస్త వారి జీవితాలను ప్రతిబింబించే ఈ కథ చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి.

12, ఆగస్టు 2009, బుధవారం

కథాజగత్తు మరో కథ!

నా బ్లాగు కథాజగత్‌లో శ్రీ రంగనాథ రామచంద్రరావుగారి కథ దింపుడు కళ్ళం ప్రకటించ బడింది. ఈ కథ విపుల పత్రికలో ఏప్రిల్ 2000లో ప్రకటించబడింది. ఈ కథ శ్రీ రంగనాథ రామచంద్రరావు గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తప్పక చదవాల్సిన కథ ఇది. చదివి మీ అభిప్రాయం తెలియజేస్తే సంతోషిస్తాను.

8, ఆగస్టు 2009, శనివారం

శ్రీ వరిగొండ కాంతారావు గారికి

సాహితీ మిత్రులు శ్రీ కాంతారావుకు
సహృదయపు వందనమ్ములు!
ఆదరముగ మీరిచ్చిన
అయిదు పుస్తకములు
ఆసాంతం చదివినాను.

కాజిపేటలోన
ఏ.పి.ఎక్సుప్రెస్సు
ఎక్కినది లగాయితు
లష్కరు చేరుదాక
లీనమై మీ పొత్తములు
కడదాక చదివినాను.

దోస్తాన కథల సంపుటి
కడు పసందుగా వున్నది.
'వర్షం'కథ వ్యంగ్యధారను
కురిపించు చున్నది.
వర్తమానపు కడగండ్లను
పురాణపాత్రల కన్వయించిన
తీరు తమాషగనున్నది.
జన్మభూమి పథకమును
'కన్న నేల'యని ఎక్కెసమాడి
దానిలోని లొసుగులను
ఎండగట్టిన వైనం
బహు బాగున్నది.
మనిషికి మనిషి తోడు
అనియెడి సంఘనీతిని
'ఆలంబన' కథలోన
అతిచక్కగ చెప్పినారు.
'దోస్తాన'కథ చదివినంక
కండ్లల్ల నీరు తిరిగె
అవ్వతోడు ఇది నిజం!
స్వంత ఇంటికై
చింత పడే మధ్య తరగతి
సగటు జీవి
అగచాట్లను 'ఇల్లు' కథలో
వివరించినారు.
ఆంధ్రభూమి వారపత్రికలో
వచ్చిన ఒక శీర్షిక ప్రేరణతో
'ఊరూ- పేరూ'చక్కగా అల్లినారు.
చరిత పేరుతో కట్టు కథలను
చెప్పజూసెడి వారికిది
చెంప పెట్టు.
ప్రతిభకు పాతర బెట్టి
ఉత్తర దక్షిణాల
ప్రాభవాన్ని
'అధముడు' చాటితే
'డింగుడిబో'
సున్నిత హాస్యాన్ని
పంచింది సుమా!
గాంధి పేరు పెట్టుకుని
గూండాగిరి చేస్తున్న
రాజకీయ బేహారి
చంపబడి'మృతవీరుడై'నాడు.
చీపులిక్కరును
'అగ్గువ సీస'యని
అతి చమత్కారముగ
తెనిగించినారు
'నువ్వె నా సర్కారు'లోన.
కనికారం లేని 'అన్నల'
'బస్సు దహనపాకలి'కి
పసిద్దయిన పల్లేపోరి
'బతుగ్గాలిపాయె'.
నిజంగా మీ దోస్తాన
కథాజగత్తుకు ఒక నజరాన!

మీ'సంద్రం'లో నేను
ఓలలూగినాను.
'గగనం'లో
కూడ విహరించినాను.
తెలుగు భాషపై
మీకున్న మమకారమును
'ప్రాచ్యాప్రాచ్యములు',
'విషాంగ్ల బాలురు',
'పిచ్చి కవి', 'తెంగ్లీషు'
కైతలు చాటుచున్నవి.
'అమ్మాయికి జాగ్రత్త'ను
అరటిపండు వొలిచినట్లు
అతిరమ్యముగ జెప్పినారు.
పసిమనసుపై
యమసెట్టు పెట్టు
వత్తిడిని 'చివరి లేఖ' చాటింది.
'పచ్చదనం'పై మీ 'ఫికరు'
'చెట్టు' కవితలో కనబడింది.
టెలివిజనును
'శవ పేటిక'తో పోల్చినారు
ఇది మీకే చెల్లును.
'యూజరు చార్జీల'పై
మీ సెటైరు
నా మనసును దోచింది.
'ఇంటర్వ్యూ','స్వర్గంల'
కవితలు మరీ మరీ నచ్చాయి.
మంద బుద్ధిని నేను
'ఏం చేద్దామ'నే కవితను
మామూలుదనే భ్రమసినాను
సైకిలు సంగతి వచ్చు వరకు.
కాడి ఎద్దులు, కంకి, కొడవలి,
సుత్తె, ఉదయార్కము,
ఆవుదూడ, రిక్త హస్తము,
రెండు ఆకులు, కమలాల
మతలబు ఎంచి చూడగ
కైతలోని 'సారాసెంబు'
తెలిసి వచ్చెను.

'ఏలికకొక లేఖ'ను
ఏకబిగిన చదివినాను.
ప్రజల వెతలను
ప్రభుత దృష్టికి
తీసుకెళ్ళే ప్రయత్నమ్మిది
భళీ!భళీ!బాగు!బాగు!
సంఘమందున
ప్రతి దినమూ అగుపించే
వెతలకు వేదనా భరితులై
మనసు కవ్వము మథియించగ
వ్యంగ్య రూపమున కవితలల్లినారు.
మా మనసు దోచినారు.

పొగడ్తలెక్కువైనాయని
కిన్కబూనకు మిత్రమా!
ఉన్నమాట అంటే
పొగడినదెటులో చెప్పుమా!
నిజమెప్పుడు
నిష్టూరమని అన్నదెవడు?
కర్ణపేయముగ నుండును
కదా అపుడపుడు!

శ్రీ రాడ్రాణ్నరేంద్ర భూపతి(దుష్ట సంధియా?) పేరున
హనుమకొండన వెలసినట్టి
ఆంధ్ర భాషానిలయపు ఘనచరితను
చదివి పులకరించినాను.
మీ కార్య దర్శనమున
ఈ నిలయానికి
పూర్వ వైభవమ్ము
ఒనగూడునని
నిశ్చయమ్ముగ నమ్మినాను.

మీదు కవితలు
చదివి నాకు కూడ
కొంత పైత్యమెక్కినది.
మీ తరీఖన గాకున్న
దేడ్‌దిమాఖ్ గాడ్ని
ఏదో నాలుగు ముక్కలు
గెలక బెడితి.
ఇంకోతీర్గ అనుకోకుండ్రి.
తప్పులున్న మన్నించుండ్రి!

భవదీయుడు

కోడీహళ్లి మురళీమోహన్

1, ఆగస్టు 2009, శనివారం

ప్రియమైన శత్రువు

కోలపల్లి ఈశ్వర్‌గారి కథానిక ప్రియమైన శత్రువు కథాజగత్‌లో ప్రకటింపబడింది. చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.

26, జులై 2009, ఆదివారం

'నవ్య వీక్లీ' శ్రీశ్రీ ప్రత్యేక సంచికపై 3 విశ్లేషణలు!!!

నవ్య వీక్లీ శ్రీశ్రీ ప్రత్యేక సంచిక(17-6-2009)లోని విషయాలపై ఇంతకు ముందు శ్రీశ్రీని కించపరచడం మానలేరా?! అంటూ ఒక టపాలో నా అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ టపాకు విశేషమైన స్పందన వచ్చింది. ఈ ప్రత్యేక సంచికపై పత్రికలలో మూడు విశ్లేషణలు చదవడం సంభవించింది. అందులో ఒకటి నా అభిప్రాయలకు దగ్గరగా వుంది. మిగతా రెండు వ్యాసాలు వేరువేరు దృష్టికోణాల్లో ఈ సంచికపై విశ్లేషించాయి. ఈ మూడు వ్యాసాలను తురుపుముక్క పాఠకులకు పరిచయం చేయాలనిపించింది. వీటిలో రెండు ప్రజాసాహితి మాసపత్రిక జూలై 2009 సంచికలో ప్రచురింప బడగా మరొకటి ఈవారం జనవార్త వార పత్రికలో నాగసూరి వేణుగోపాల్ గారు 'మీడియా నాడి' కాలమ్‌లో వ్రాశారు. ఈ మూడు విశ్లేషణలూ మీ కోసం!

1.కాస్త ఖేదం - కాస్త మోదం


'నవ్య' అనేది ఆంధ్రజ్యోతి యాజమాన్యంచే నడపబడుతున్న "వీక్లీ". ఈ వార పత్రిక 17-06-2009 సంచికని మహాకవి శ్రీశ్రీ ప్రత్యేక సంచికగా వెలువరించారు. షుమారు 25 మంది ప్రసిద్ధులైన వారు శ్రీశ్రీతో వారి అనుభవాల్ని 'నవ్య'వారి అభ్యర్థనపై రాశారు. ఈ సంచిక వెలువడిన 10వ తేదీ సాయంత్రానికే దాని కాపీలు దొరకలేదు(గుంటూరులో). శ్రీశ్రీ శతజయంతి సంవత్సరంలో ఇదొక ఆనందిచదగ్గ విషయం.

అయితే ఎంతో అపురూపంగా తీసుకెళ్ళిన సంచిక తెరిస్తే ఎక్కువ మంది పెద్దలు తమ అనుభవాల్ని చెత్తచెత్తగా రాశారు.

శ్రీశ్రీని తెల్సిన వాళ్ళందరికీ ఆయన తాగుతాడని తెల్సు. దీన్ని రహస్యంగా ఉంచాలని ఆయనగాని, ఆయన అభిమానులుగాని ఏనాడూ ప్రయత్నించలేదు. విషయాన్ని చెప్పే సందర్భంలో అనివార్యమైతే దాన్ని గూర్చి ప్రస్తావించడం అప్రస్తుతం కాకపోవచ్చు. కాని అదే పనిగా ఆయన సురాపానం నుండి మూత్రీకరణ వరకు ప్రస్తావించటం - అందులోనూ లబ్ద ప్రతిష్టులైన వారు చేయడం సరికాదు.

"తాను రాసి పారేసిన గీతాలు
గుబాళిస్తుండగా
తాగి పారేసిన
సీసాల కంపెందుకు" అనే గీతాన్ని కాళోజి గారు రాశారు. అది శ్రీశ్రీయే తన్ను గురించి రాసుకున్నాడని ఈ సంచికలో రాసిన వారున్నారు. శ్రీశ్రీ ఏమి రాశాడో కూడా తెలియని వాళ్ళ చేత అనుభవాలను రాయించవలసిన దుర్గతి తెలుగుదేశం లోని సాహితీ వాతారణానికి ఇంకా కల్గలేదు.

శ్రీశ్రీతో బాగా పరిచయం వున్న నిఖిలేశ్వర్, భూమన్, చలసాని లాంటి వాళ్ళు కూడా యే కారణంగానో గాని శ్రీశ్రీతో అనుభవాల్ని సరిగ్గా పంచుకోలేకపోయారు. అసలు పరిచయమే లేని డా.యాకూబ్ గారి స్పందనే అందరికన్నా బాగుంది. శ్రీశ్రీ వ్యక్తిగత అనుభవాలకు తిరుపతి పరిసరాలకి పరిమితం చేయకుండా రచనలు ఆహ్వానిస్తే ఇంకొంచెం మంచి రచనలు, శ్రీశ్రీని మరికొంత బాగా ఆవిష్కరించే రచనలు వచ్చేవేమో.

(ప్రజాసాహితి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక జూలై 2009 సౌజన్యంతో)

** * * * * * * * * * * * * * *

2.సాహిత్య సంచికగా నవ్య ప్రయోగం - నాగసూరి వేణుగోపాల్

మహాకవి శ్రీశ్రీ ప్రత్యేక సంచికగా 'నవ్య' వీక్లీ చేసిన ప్రయత్నం ఎంతో చక్కగా ఫలించింది. బహుగొప్పగా గుర్తుండిపోతుంది. జర్నలిజం పలురకాల విశేషణాలతో తీవ్రంగా విమర్శలకు గురవుతున్న కాలంలో ఇటువంటి ప్రయోగం ఎడారిలో ఒయాసిస్సులా ఆశలు రేపుతోంది. 'భారతి' వంటి సాహిత్య పత్రికను అగ్రశ్రేణి దినపత్రిక నడిపే కాలమయితే ఇందులో విస్మయం కలిగించే కోణం ఉండేదికాదు. అసలు జర్నలిజానికి గౌరవం, ఆదరణ లేని చెడ్డకాలమిది. అందువల్లనే నవ్య వీక్లీ ప్రయోగానికి ఇంతగా అభినందనలు అవసరం.

ప్రత్యేక సంచికలు రావడం విశేషం కాదు. సుంకర సత్యనారాయణగారిపై 'ప్రజాసాహితి' మాసపత్రిక బృహత్తర సంచిక ఇటీవల వెలువరించింది. ఇదేరీతిలో చిన్న పత్రికలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఒక పూర్తి స్థాయి వాణిజ్య పత్రిక ఇలా పూర్తి స్థాయిలో ఒక సాహిత్య ప్రయత్నం చేయడం ఈ కాలంలో గొప్పదే! ఈ సంచికను చూడగానే శ్రీశ్రీ పోయినపుడు జ్యోతిచిత్ర సినిమా వార పత్రిక ఒక వారం శ్రీశ్రీ సంచికగా వెలువరించిన విషయం గుర్తుకు వచ్చింది. అలాగే దాదాపు అదే సమయంలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి నేతృత్వంలో ఆంధ్రజ్యోతి వార పత్రిక కూడా శ్రీశ్రీ మీద సంచిక వెలువరించింది. అయితే ఆంధ్రజ్యోతి వార పత్రిక కన్న 'జ్యోతిచిత్ర' సినిమా వార పత్రిక ప్రయత్నం సాపేక్షికంగా సాహసం అనిపించింది. అందులో సంగతులు కేవలం సినిమా రంగానికే పరిమితం కాకపోవడం విశేషం. తర్వాత 90వ దశకం తొలి సంవత్సరంలో ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రిక కేవలం కవితలు మాత్రమే ఒక సంచికలో ప్రచురించే ప్రయోగం చేసింది. ఆ సంచికలో దాదాపు 108 కవితలు ప్రచురింపబడ్డాయి. సీరియల్‌స్, జ్యోతిష్యం వంటి ఫీచర్లు తప్పా మిగతా పేజీలన్నీ కవితలకోసం కేటాయించారు. శ్రీశ్రీ సంచికను చూడగానే ఈ జ్ఞాపకాలన్నీ అలా మెదలుతున్నాయి. ముఖచిత్రంగా పినిశెట్టిగారి చిత్రణ నుంచి చివరి అట్ట లోపలి పేజీలో శైశవగీతి దాకా సుమారు అరవై అంశాలున్నాయి. అంటే మొత్తం 76 పేజీల్లో 56 దాకా శ్రీశ్రీ పరం అయిపోయాయి. కేవలం నాలుగు సీరియల్స్, ప్రకటనలు, ఉత్తరాలు, జ్యోతిష్యం, పంచాంగం వంటి శీర్షికలు తప్పా మిగతా శీర్షికలు కూడా శ్రీశ్రీమయం అయిపోయాయి. దాంతో వారు(శ్రీశ్రీ) రాసిన కథలూ,కవితలు, కబుర్లతో పాటు ఆయన అనురాగాలు - అనుబంధాలు, ఆత్మీయతలు-అల్లరి చేష్టలతో నవ్య వీక్లి ప్రత్యేక సంచిక (వారే చెప్పుకున్నట్టు) తయారైంది. శ్రీశ్రీ జవాబులు, కవితలు, కథ, పదబంధ ప్రహేళికలతో పాటు వర్తమాన సాహితీ వేత్తలు (దాదాపు నలభైమందికి పైగా) చెప్పిన విశేషాలు ఈ సంచికలో చోటు చేసుకున్నాయి. శ్రీశ్రీ రాసిన అంశాలు తప్పా మరేమిటీ పునర్ముద్రణ కాకపోవడం మంచి వ్యూహం. అలాగే సినిమా రంగపు విశేషాలు కూడా ప్రధానం కాకపోవడం మంచి ఎత్తుగడే! దీని వల్ల ప్రయోగం సీరియస్‌గా సాగిందని చెప్పుకోవాలి. అదే సమయంలో సిగరెట్ తాగుతున్న శ్రీశ్రీ ఫోటోను ప్రతిపేజీలో ప్రచురించడంలో నిర్ణయం వెనుక ఆలోచన ఉందో లేదో కానీ- ఈ విషయంలో మనకు శ్రీశ్రీ ఆదర్శం కానక్కరలేదు. అలాగే నలభై మంది పైగా రచయితలలో రచయిత్రులు కేవలం నలుగురు మాత్రం కావడం లోటే!

అద్దేపల్లి, రావికొండలరావు, ఇనాక్, కేతు, చలసాని ప్రసాద్, వసంతలక్ష్మి, అదృష్టదీపక్, చాయాదేవి, పాపినేని, ఎం.వి.రమణారెడ్డి, మునిసుందరం, తనికెళ్ళ భరణి, ఓల్గా, శ్రీపతి, భూమన్ ఇలా ఎంతో మంది శ్రీశ్రీతో తమ అనుబంధం పంచుకుంటూ శ్రీశ్రీ కబుర్లు చెప్పారు. అన్నీ కూడా దాదాపు వైయక్తికమైన కోణంలో వివరించబడటంతో హాయిగా చదివించేస్తాయి. అంతా లబ్దప్రతిష్టులే కాకుండా మరికొందరితో కూడా వ్యాసాలు రాయించడంతో నిండుదనం వచ్చింది. ఇంద్రధనస్సులో శ్రీకాంతశర్మ శ్రీశ్రీ గురించి చెప్పడం కష్టమైన విషయం కాదు కానీ స్పోర్ట్స్‌కాలమ్ 'క్రీడాభిరామం' కూడా శ్రీశ్రీ గురించి రాయడం అభినందనీయమే! అలాగే శేఖర్‌టూన్స్ శ్రీశ్రీ సిరిసిరిమువ్వలతో గలగలలాడటం, సరసి కార్టూన్ శ్రీశ్రీ కవితాపాదాలపై ఉండటం గొప్ప విషయమే! పజిల్ స్థానంలో శ్రీశ్రీ ప్రహేళికను సమాధానాలతో పాటు ఇవ్వడం సముచితమే! ఇనాక్ ఇంటిపేరులో అచ్చుతప్పు రావడం కన్న చలసాని ప్రసాద్ కాస్త చలసాని ప్రసాదరావు అయిపోవడం పెద్ద పొరపాటే! ఇంకా చేయాలనడానికి అంతం ఉండదు. అయితే మంచి ప్రయత్నం చేశారని నవ్య వీక్లి యాజమాన్యాన్ని, సంపాదకవర్గాన్ని తప్పక అభినందించాలి.

నిజానికి ఇటువంటి ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఏమిటి? పత్రికలకు లాభమా? కాదా?- అని కూడా చూడాలి. సాహితీ వేత్తలు అభినందించడం లేదా ఫలానా కోణం, ఫలానా రచయిత చోటు చేసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేయడం సహజమే! కానీ దీన్ని దాటి వాణిజ్యపరంగా పరిశీలించినపుడు ఏమిటి అని ఆలోచించాలి. ఒక సంచికను ఇలా సాహిత్య ప్రత్యేక సంచికగా తేవడం ఆర్థిక భారం కాకపోయినా, సగటు పాఠకుడు సంచికను ఎంతవరకు ఆదరిస్తాడనే ప్రశ్న ఎదురవుతుంది. గతంలో నార్ల వెంకటేశ్వరరావు గారు సంపాదకుడుగా గురజాడ అప్పారావుగారి ఫోటోను ముఖచిత్రంగా ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికను ఒక వారం వెలువరించారు. ఆ వారం చాలా సంచికలు తిరిగివచ్చాయని నార్లగారు పేర్కొన్నట్టు నా జ్ఞాపకం. అందువల్ల ఇటువంటి సమస్య తప్పదు. అయితే ఈ సంచిక కారణంగా లభించిన పాజిటివ్ ప్రచారం ఎనలేనిది. దీన్ని ఇతరత్రా కొలవలేం. అది కేవలం అనుభవించి పలువరించడమే! అందువల్ల పత్రికకు స్థూలంగా లాభమే! అంతకు మించి 'నవ్యా తొలుత 'సరసం'గా కించిత్ అశ్లీలంగా సాగేదనే విమర్శ కలిగివుండేది. కానీ ఇటీవల రచయితలతో ఇంటర్వ్యూలు చేయడం, ఇప్పుడు శ్రీశ్రీ సంచిక రావడంతో అటువంటి ముద్ర పూర్వపక్షం అయిపోయింది. కనీసం అపుడపుడైనా ఇలాంటి ప్రయత్నం జరగాలి. ప్రాంతీయ సాహిత్యం నేపథ్యంగా, కళలు నేపథ్యంగా ఇలాంటి సంచికలు ఆరు నెలలకోసారి అయినా వెలువరిస్తే మంచిది. మిగతా పత్రికలకు ఈ ప్రయోగం స్ఫూర్తి అవుతుంది. ఏదిఏమైనా ఇతర వారపత్రికల కన్నా గౌరవమైన స్థానాన్ని 'నవ్య'వీక్లీ ఇలా పొందడం అభినందనీయమే!

[ఈవారం జనవార్త రాజకీయ సామాజికార్థిక వారపత్రిక జూన్28-జూలై 4,2009 సంచిక సౌజన్యంతో]

** * * * * * * * * * * * * * *

3.శ్రీశ్రీపై 'నవ్య వీక్లీ' ప్రత్యేక సంచిక- వ్యాపార దృక్పథం - పినాకిని, హైదరాబాదు

'గౌరవిస్తే గౌరవింపబడతామ'ని శ్రీశ్రీపై ప్రత్యేక సంచికను 'నవ్య' వెలువరించింది. శ్రీశ్రీలోని అనుకూలాంశాలను, ఆయన ఏ ప్రాపంచిక దృక్పథం వైపుకి పయనించాడన్న నిర్దిష్ట ఆలోచనకు పాఠకుడ్ని రానీయకుండా చేసిందీ సంచిక. సంచికలో కొన్ని ముఖ్యమైన వివరాలు, చాలామందికి తెలియని కొన్ని సంఘటనలు వున్నప్పటికీ ముందుగా అనుకూల అంశాలుగా రాయాలనిపించడం లేదు- ఎందుకంటే శ్రీశ్రీలోని నెగెటివ్ షేడ్స్ ఎక్కువగా మా తరానికి 'నవ్య' పరిచయం చేసింది కనుక నేను కూడా ఈ సంచిక నెగెటివ్ షేడ్‌నే ముందుగా చెప్పాలనుకుంటున్నాను.

'తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వర'ని ప్రశ్నించిన శ్రీశ్రీకున్న దృక్పథం ఖచ్చితంగా మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం. ఈ పాదంలోని అర్థం ఈ సంచికలో అభిప్రాయాలు చెప్పిన ఎక్కువ మందికి తెలియదనీ, కొందరికి తెలిసినా తెలియనట్లు మాట్లాడారనీ, ఒకరిద్దరు ఈనాటికీ సంస్థల్లో వున్నవారు అవి తప్ప మిగిలినవి రాశారనీ అనిపిస్తోంది. కొందరు వ్యక్తులుగా మిగిలిపోయి శ్రీశ్రీని ఒక వ్యక్తిగా చిత్రించారు. ఆయనలో వ్యక్తిగతంగా వీరికున్న అనుభవాలు రాదామని బయల్దేరి తమకెలా వుపయోగపడ్డారో రాసుకున్నవారున్నారు. శ్రీశ్రీ సమాజానికుపయోగపడమని చెప్పింది వీళ్ళెంత వరకు పాటించారో ఎవరూ ఒక్కముక్క చెప్పలేదు. రాసేవాళ్ళు అలా రాస్తే శ్రీశ్రీనుంచి ఉత్తేజం పొందిన ఈ ప్రముఖుల నుంచి కూడా ఈనాటితరం ఉత్తేజం పొందేవారు. ప్రతి ఒక్కరూ మీటింగ్ పెట్టారని, అక్కడకు శ్రీశ్రీ వచ్చాడని, ఏ రైల్‌లో వచ్చాడు? వేరుశెనగ కాయలు ఎక్కడ తిన్నారు? మందు ఎక్కడ కొన్నారు? ఇలా చెప్పారు. తప్ప ఆ మీటింగ్‌లు ఏ సమస్యల మీద పెట్టారు. ఎవరెవరు లేదా ఎంతమంది కార్యకర్తలు ఎన్ని వత్తిడుల నడుమ ఆ పన్లు చేశారు? ఏ ఒక్కరూ పరిశీలించలేదని అర్థమవుతుంది. రాళ్ళెత్తిన కూలీలెవరో వీరికి తెలియకనే అలా రాయలేదు. రాసిన వారి పరిమితులు, అనుభవాలు, అడిగిన వారి పరిమితుల్ని అర్థంచేసుకుందామనుకున్నా నష్టం శ్రీశ్రీకి జరిగినట్టు పైకి కనిపించినా శ్రీశ్రీ నమ్మిన ప్రాపంచిక దృక్పథానికి నష్టం కలిగించారు.

"మహాప్రస్థానం సామూహిక ఉద్యమాలకు, తిరుగుబాట్లకు ప్రేరణ ఇస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ జీవితంలోని ప్రతి ఘట్టంలో, ప్రేమలో, బంధంలో, ఆప్తుల మరణంలో, లోకం ఇచ్చిన శాపాలలో, నేను చేసిన తిరుగుబాట్లలో నా చేయిపట్టుకుని నన్ను నడిపించే నేస్తం మహాప్రస్థానమే"నంటున్నారు ఓల్గా గారు. సామూహిక ఉద్యమాలకు ప్రేరణ ఇవ్వదనేనా దీనర్థం. లేక అవసరం లేదనా? శ్రీశ్రీ వ్యక్తి కాదు శక్తి అన్నంత వరకూ అందరూ ఒప్పుకొంటున్నారు. 1970ల శ్రీశ్రీని చెప్పి అంతకు ముందు శ్రీశ్రీని వదిలేస్తే ఈ శక్తి ఆకాశంలోంచి ఊడిపడ్డ మెరుపులా కన్పిస్తాడు. అప్పుడు శ్రీశ్రీ రెండు మహావిప్లవాల నడుమ, రెండు మహా యుద్ధ సంక్షోభాల నడుమ మార్క్సిజాన్ని స్వీకరించి, స్వయంకృషిని జోడించి సాహితీ పరిణతిని సాధించాడన్న వాస్తవం మరుగున పెట్టినట్లవుతుంది. "పూవు పుట్టగానే పరిమళించును"అని రాసుకొని, శ్రీశ్రీ బ్రతికినంతకాలం ఏ ఫ్యూడల్ భావజాలాన్ని సాహిత్య రూపాల్లో తెగనరుకుతూ వచ్చాడో దాన్నే, శ్రీశ్రీకి ఆపాదించి దిన వారపత్రికలు సాహిత్య చరిత్రగా నిక్షిప్తం చేసినట్లుగా వుంది.

శ్రీశ్రీ సమాజ మార్పులో, సాంస్కృతిక రంగంలో, సాహిత్య రంగంలో ప్రజలు కోల్పోతున్న హక్కుల విషయంలో సామాజిక శక్తులతో భుజంభుజం కలిపి ఎలా నడిచాడో ఒక్క ముక్కైనా ఈ సంచికలో లేనందుకు అలా వుండాలని కోరుకోవడం అత్యాశే అవుతుందేమోనన్న సందేహంతో ఇలా స్పందిస్తున్నాను. అల్పవిషయాల చుట్టూ,భావుకత చూట్టూ పరిభ్రమించేవారి రచనలు ఈ సంచికలో ఎక్కువ వ్యాసాలు కనబడుతున్నాయి. ఇలాంటి ప్రత్యేక సంచికలింకెన్నో తేవచ్చు. శ్రీశ్రీతోడి అనుభవాలు అనంతం. అన్నట్టు ఈ సంచికలో నిజాయితీతో చెప్పిన వారు లేరా అని ఎవరన్నా అడగొచ్చు. తమ పరిమితుల్ని చెప్పుకున్న జర్నలిస్టులూ,సినీరంగంవారూ, అభిమానులూ, శ్రీశ్రీలాగా చిన్నపిల్లల్లా భోళాగా చెప్పుకున్న వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. ఈ సంవత్సరాన్ని శ్రీశ్రీనామ సంవత్సరంగా చెప్పడం చాలా గొప్పగా వుంది. ఈ సంచికకి పేరు తెచ్చేది మిత్రుడు పినిశెట్టి కుంచెలోంచి ఒకనాటి శ్రీశ్రీ తీక్షణతని చెక్కిన ముఖచిత్రమేనని నాకనిపిస్తుంది.

ఈ సంచిక ద్వారా శ్రీశ్రీ గౌరవం నిజంగా పెరిగివుంటే, 'నవ్య' కూడా గౌరవింపబడేదే. వ్యాపారస్తుల గౌరవాల గరిమనాభి లాభం దగ్గరేవుంటుందేమో!

(ప్రజాసాహితి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక జూలై 2009 సౌజన్యంతో)

20, జులై 2009, సోమవారం

చిన్ని... చిన్ని... ఆశ

డాక్టర్. దిలావర్ గారి కథ చిన్ని... చిన్ని... ఆశ కథ కథాజగత్‌ లో ప్రకటించ బడింది. ఈ కథను తప్పక చదవండి. ఈ కథలోని విషయాలపై చర్చకు ఆహ్వానిస్తున్నాం.

14, జులై 2009, మంగళవారం

పుస్తక సమీక్ష! -13 కన్నోజు కవిత

[పుస్తకం: కన్నోజు కవిత, రచన: కన్నోజు లక్ష్మీకాంతం, పేజీలు: 107, వెల: రూ70/-, ప్రతులకు: ఇం.నెం.18-3-463/1/175/1, రాజన్న బావి, ఫలక్‌నుమా, హైదరాబాద్.]

ఈ కవితాసంకలంలో 50 కవితలున్నాయి. ఈ కవితలన్నీ సరళంగానూ, స్పష్టంగానూ చక్కని భావాలను వెల్లడిస్తున్నాయి. ఈ కవితల్లో వస్తువైవిధ్యత విస్తృతంగా ఉంది. పల్లెల పట్ల తమ అభిమానాన్ని చాటే కవితలు కొన్ని, నగరంలోని మురికివాడలను, లేబర్ అడ్డాలను వర్ణించే కవితలు కొన్ని ఉన్నాయి. పర్యావరణం, దాని పరిరక్షణ పట్ల కన్నోజు లక్ష్మీకాంతం గారికి ఉన్న అవగాహన కాపాడుకుందాం,ధరిత్రి, పర్యావరణమంటే...!, ప్రకృతిని చూసిగూడా....! అనే కవితలలో స్పష్టమౌతున్నది.

"ప్రగతెప్పుడూ ప్రతిఫలం కోరకున్నా
నిర్దయగా ఛిద్రం చేస్తున్న మనం
నింపాదిగా ఆలోచించాలి" అంటారు.

మానవత్వం, జాగృతి కావాలి, సంస్కృతిని కాపాడుకుందాం మొదలైన కవితలు కవి మనోభిలాషను వ్యక్తం చేస్తున్నాయి. తల్లిదండ్రులను పలుకరించే తీరికలేని పిల్లల తీరుపట్ల కవి ఆవేదన చెందుతున్నారు. నగరాలలోని డాంబికాలు, ఊర్లలోని అనురాగాల నడుమ వ్యత్యాసాలను చేతికర్ర కవితలో చక్కగా తెలుపుతున్నారు. అమ్మను అద్దంతో పోలుస్తూ కన్నోజువారు 'అమ్మను అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోద'నే సత్యాన్ని చాటుతున్నారు. గతంలో ఎంత ఎబ్బెట్టుగా ఉన్నా దాన్ని అసహ్యించుకోకూడదంటున్నారు వెనక్కి తిరిగి చూడండి అనే కవితలో. కమ్యూనికేషన్ రంగంలో ఎంత పురోగమించినా ఉత్తరాలను రాసే అలవాటును మానకూడదంటున్నారు.

"ఉత్తరం రాసి చూడండి
అనుబంధాన్ని డిపాజిట్ చేయండి" అని ప్రవచిస్తున్నారు.

కవులు రచయితలను ఉద్దేశిస్తూ కన్నోజు లక్ష్మీకాంతం గారు వారికి ఇలా మార్గనిదేశనం చేస్తున్నారు.


"ఒప్పించేరీతిలో, మెప్పించే తరహాలో
ఏదైనా వినిపించండీ
ఎంతైనా వినిపించండి"

"అర్థాలు వెదుక్కునేలా కాదు
అందరికీ అర్థమయ్యేలా రాయండి"

"ఉబుసుపోక రాయడం కాదూ
ఉత్తేజాన్నిచ్చే కవిత్వం రాయండి"

"గుండె లోతులోంచి ఆలోచిస్తూ
నిండు రచనల్ని ఆవిష్కరించండి"

కన్నోజు వారి కవిత్వం ఎక్కువ భాగం ప్రభోదాత్మకంగానే ఉన్నది. వీరి కవిత్వంలో వ్యంగ్యం అక్కడక్కడా తొంగిచూసినా అది తక్కువమోతాదులోనే ఉంది. మన సంస్కృతీ సంప్రదాయాలపైన అభిమానం, మానవత్వం పట్ల మమకారం, గ్రామసీమల పైన ప్రేమ, పర్యావరణం మీద అభిరుచి, మంచి రచనలకోసం ఆరాటం, కపట ప్రేమలపై నిరసన ఇవన్నీ కన్నోజు లక్ష్మీకాంతం గారిని కవిత్వం వ్రాయడానికి ప్రేరకాలుగా పనిచేశాయి.

ఈ కవి ఇంతకు ముందు 'చార్మినార్ నానీ'ల పేరుతో ఒక పుస్తకాన్ని ప్రకటించినట్టూ, దానిపై పలువురు ప్రముఖులు ప్రశంసల వెల్లువ కురిపించినట్లూ ఈ పుస్తకంలో సమాచారం ఉంది. ఈ నానీల పుస్తకం పలు సాహితీ సంస్థల నుండి పురస్కారాలను పొందడం విశేషం. ఈ'కన్నోజు కవిత'కూడా 'చార్మినార్ నానీ'లవలె మంచి పేరు గడిస్తుందని ఆశిస్తున్నాను.

[సాహితీ కిరణం మాస పత్రిక జూలై 2009 సంచిక నుండి]