...

...

17, నవంబర్ 2009, మంగళవారం

బాల్యమిత్రుల అపురూప సమ్మేళనం!!!

ఈ నవంబర్ 14, 15 తారీఖుల్లో మా చిన్ననాటి స్నేహితులం అందరం హైదరాబాదులో కలిశాం. గుత్తిలో మాల్టస్‌స్మిత్ జూనియర్ కళాశాలలో తొమ్మిది, పది తరగతులు మేమందరం కలిసి చదివినాము. ఇరవైతొమ్మిదేళ్ళ నాటి ముచ్చట అది. ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ రెండు రోజులూ సరదాగా గడిపాము.

మంజునాథ సెట్టి, గంగవరం సత్యనారాయణ, మురళీకృష్ణ, జగదీష్, జగన్నాథం, గోవర్ధన గిరిధరరెడ్డి, ఇనాయతుల్లా, బషీర్, రఫీక్, వెంకటేష్, కేశవచంద్ర, చంద్రశేఖరరెడ్డి(బాబు), బాలరాజు, రఘునందన్, ఇసాక్, మోహన్‌రావ్, ఫయాజ్, నజీర్, పి.రమేష్, నాగేశ్వరరెడ్డి, నేను ఈ సమాగమంలో వున్నాము. గుత్తి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, గుంతకల్లు, హైదరాబాదు, గదగ్, గోదావరిఖని, హిందూపురం ఇలా వివిధ ప్రాంతాలనుండి వచ్చాము. మాలో కొందరు టీచర్లు, కొందరు లాయర్లు, కొందరు వ్యాపారస్తులు, ఒకడు లెక్చరర్, మరొకడు ప్రొఫెసర్. ఒకడు ప్రొడక్షన్ మేనేజర్, ఒకడు ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ఒకడు ఇండస్ట్రియలిస్ట్. ఒకడు ఆర్కిటెక్ట్. మరొకడు రాజకీయ నాయకుడు ఇలా అన్ని రకాల జీవన పథగాములము ఉన్నాము. మాలో ఒకడు తరచూ విదేశాలకు వెళ్తూ ఉంటాడు. ఒకడైతే మొదటిసారి హైదరాబాదు చూశాడు. ఇలా భిన్న జీవన విధానాలు కలిగిన మమ్మలనందరినీ కలిపింది ఒక్కటే. అదే స్నేహం. సంఘం కప్పిన ముసుగులను తొలగించుకుని మేము అందరం అరే ఒరే అంటూ ఎటువంటి భేషజాలూ లేకుండా ఈ రెండు రోజులూ గడిపాము.

14వ తేదీ ఉదయం 6 గంటలకు హోటల్ అతిథి ఇన్‌లో మా మిత్రులకు స్వాగతం పలికాము నేనూ, సత్య. అందరూ గుత్తి నుండి ఒక మినీ బస్సులో వచ్చారు. పలకరించడాలూ, గుర్తించడాలూ (కొందరిని చాలా ఏళ్ళ తరువాత మొదటి సారి కలిశాం) అన్నీ అయిన తరువాత అందరం రూముల్లో సెటిలై స్నానాలు ముగించుకుని తయ్యారయ్యాము. హోటల్ టెర్రేస్ పైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నాము. ఈ లోగా మోహన్‌రావూ, మురళీకృష్ణా మాతో జాయిన్ అయ్యారు. అందరం అదే మినీ బస్సులో గోల్కొండకు వెళ్ళాము. నలభై దాటిన మేమందరం పడుచు యువకుల్లా హుషారుగా జోకులేసుకుంటూ గోల్కొండ కోటను దర్శించాము. సుమారు రెండు గంటలు గోల్కొండలో గడిపిన తర్వాత కుతుబ్ షాహీ టూంబ్స్ చూశాము. గుత్తిలో జీవించిన వాళ్ళము కొండలూ, గోరీలు మాకు కొత్త కాకపోయినప్పటికీ గోల్కొండ పురాతన వైభవం మామిత్రులను ఆకర్షించింది. తర్వాత మధ్యాహ్నం పూర్ణ హోటల్లో భోజనాలు ముగించుకుని స్నోవరల్డ్ వైపు దారి తీశాము. స్నోవరల్డ్ లో మేమంతా చిన్న పిల్లల్లా మారిపోయాము. ఓ గంట సేపు మా ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత అక్కడి నుండి బిర్లా మందిర్‌కు వెళ్ళాము. కార్తీక మాసం, సెలవు రోజు కావడంతో బిర్లా మందిర్ రద్దీగా ఉంది. బాలాజీ దర్శనం చేసుకుని కోఠీలో కొందరు షాపింగ్ చేసి రాత్రి పదకొండు గంటలకు మా హోటల్ చేరుకున్నాము. ముందుగానే ఆర్డర్ ఇచ్చిన మెనూ ప్రకారం హోటల్ డాబాపై మా అందరికీ ఫుడ్ సర్వ్ చేయబడింది. కొందరు వెజిటేరియన్లు. మరికొందరు శనివారం కాబట్టి వెజిటేరియన్లు. మిగతా వారందరూ ఎన్.వీలు. కొందరు లిక్కర్ తీసుకున్నారు. షరా మామూలుగానే శనివారం కాబట్టి కొందరు మందుకు దూరంగా ఉండి మా గ్రూపులో కలిశారు. వోడ్కా, 12యేళ్ళ పాతదైన షివాస్ రీగల్ వాళ్ళు సేవించింది. తాగిన మైకంలో మా మిత్రులు చేసిన అల్లరి భరిస్తూ రాత్రి ఒంటిగంటవరకు మేలుకున్నాము.

మరుసటి రోజు ఉదయమే గదగ్ నుండి రమేష్, కర్నూలు నుండి రఘు వచ్చారు. అందరం తయ్యారయ్యేసరికి తొమ్మిది గంటలు దాటింది. అన్నీ సర్దుకుని హోటల్ వెకేట్ చేసి పక్కనే ఉన్న కామత్ హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము. రామోజీ ఫిల్మ్ సిటీలో మేము చూసినవి మూవీ మాజిక్, ఫిల్మీ దునియా, స్టంట్ షో, ఫన్ షో, స్పిరిట్ ఆఫ్ రామోజి ఫిల్మ్ సిటీ, బోరాసుర వగైరా. అక్కడ అన్నింటి కన్నా మమ్మల్ని బాగా అలరించింది రేంజర్ అనే కాంప్లిమెంటరీ రైడర్. దీన్లో మేము సవ్య దిశలో రెండు చక్కర్లు, అపసవ్య దిశలో రెండు చక్కర్లు కొడతాము. ఆకాశంలో పూర్తి తలక్రిందలుగా కొన్ని సెకెన్లు అలాగే ఉంటాము. అప్పుడు వేసే భయానికి నోరు కూడా పెగలదు. జీవితంలో ఇలాంటి అనుభవం ఒకసారైనా ఉండితీరాలి. సాయంత్రం ఆరుగంటల దాకా రామోజీ ఫిల్మ్ సిటీలో గడిపి అక్కడి నుండి నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న ఒక ఎక్జిబిషన్‌కు వెళ్ళాము. అక్కడి రష్షులో ఎవరికీ షాపింగ్ చేయడానికి వీలు పడలేదు. మా ప్రమేయం లేకుండానే లోపలికి త్రోయబడి మా ప్రమేయం లేకుండానే బయటకు నెట్టివేయబడ్డాము. ఇక మేము విడిపోయే సమయం ఆసన్నమయింది. అందరం ఒకరికొకరు థాంక్స్ చెప్పుకున్నాము. వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి మేం మా యిళ్ళకి వెళ్ళిపోయాము. కొన్ని చిన్న చిన్న అసౌకర్యాలు మినహాయిస్తే మా పార్టీ విజయవంతమయ్యిందనే చెప్పాలి. ఈ పార్టీ తాలూకు ఫోటోలు త్వరలోనే మరో టపాలో మీముందు ఉంచుతాను.

కామెంట్‌లు లేవు: