...

...

4, డిసెంబర్ 2012, మంగళవారం

రాధేయకు నచ్చిన రచన!

సాహిత్య ప్రస్థానం మాసపత్రిక డిసెంబరు 2012 సంచికలో నచ్చిన రచన శీర్షిక క్రింద ప్రముఖ కవి, ఉమ్మిడిశెట్టి సాహితీ అవార్డు వ్యవస్థాపకులు డాక్టర్ రాధేయ గారు సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం పుస్తకం పై తమ అభిప్రాయాన్ని వ్రాశారు. ఆ వ్యాసం తాలూకు పూర్తి పాఠం ఇక్కడ చదవండి.

కరువు సీమ సాహితీరత్నం - విద్వాన్‌ విశ్వం !!

    అచట నొకనాడు పండె ముత్యాల చాలు

    అచట నొకపుడు నిండె కావ్యాల జాలు

    అచట నొకపుడు కురిసె భాష్యాల జల్లు

    విరిసెనటనాడు వేయంచు విచ్చుకత్తి...  అంటూ

    రాయలసీమ గతకాలపు వైభవాన్ని కీర్తించిన కవి విద్వాన్‌విశ్వం సీమవర్తమాన కన్నీటి చరిత్రను, వాస్తవిక చారిత్రక అనుభవాల్ని జీవన చిత్రాలుగా కళ్ళకు కట్టాడు. అంతేకాదు సీమ భవిష్యత్తులో ఏర్పడబోయే ఎడారిఛాయల్ని ముందే పసిగట్టి, పెన్నా తీర ప్రాంత ప్రజల కడగండ్లను ఆర్ధ్రంగా పలికిన కావ్యం 'పెన్నేటి పాట'ను సాహితీ చరిత్ర మర్చిపోదు. ఈ కావ్యం చదువుతున్నంత సేపూ 'సీమ ప్రజల గుండె తడియారదు'.



    విద్వాన్‌ విశ్వం గతాన్ని మాత్రమే చెప్పలేదు. మొత్తం మానవ సమాజం పట్ల అంతులేని ఆర్తికి పర్యాయపదమై పెన్నేటి పాటగా ప్రతిధ్వనించాడు. ఇందులో సహజమైన మానవ నుడికారం తొణికిసలాడింది.

    'సాహితీ విరూపాక్షుడు విద్వాన్‌ విశ్వం' పేరుతో ఆయన సాహితీ జీవితాన్ని విశ్వజీవి, విశ్వరూపి, విశ్వభావి, విశ్వమేవ, అంటూ నాలుగు అధ్యాయాలుగా విభజించి మన కందించిన సంపాదకులు డా. నాగసూరి వేణుగోపాల్‌, కోడిహళ్ళి మురళీ మోహన్‌ గార్లను మనసారా అభినందిస్తున్నాను. ఇందులో ఉద్దండులైన సాహితీవేత్తలు డా. దివాకర్ల వెంకటావధాని, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తిరుమల రామచంద్ర, వేలూరి శివరామశాస్త్రి, విశ్వనాధ సత్యనారాయణ, ఆరుద్ర, దాశరధి వంటి ప్రముఖులు విద్వాన్‌ విశ్వం గారిని అంచనా వేసిన తీరును, వారి కావ్య ప్రతిభా పాండిత్యాలను విశ్లేషించే వ్యాసాలను పొందుపరిచారు. ఇవి వర్తమాన సాహితీ తరానికిఎంతో స్ఫూరిని అందిస్తాయి.  

    1956లో రాసిన పెన్నేటిపాట నేటికీ సజీవమైనదే. కళ తప్పిన పల్లెసీమలు, కనుమరుగైపోతున్న మన సాంస్కృతిక శోభను తలపింపజేస్తుంది. పల్లెసీమల వ్యథార్థ దృశ్యకావ్యమే పెన్నేటిపాటగా అవతరించింది. వస్తువు రూపంతో ఇతివృత్తం చక్కగా ఇమిడిపోయింది. ఎంత వివరించినా, ఎంత వ్యాఖ్యానించినా తరగని సాహిత్యపు గని. రాయలసీమ పలుకుబళ్ళు వారి నాలుక మీద నాట్యమాడాయి.

    సాహిత్య చరిత్రలో విశ్వంగారి స్థానం విశిష్టమైనది. వారు వ్యాసం రాసినా, పద్యం రాసినా, సమీక్షలు చేసినా తమదైన శైలితో, విషయ వైవిధ్యంతో తొణికసలాడుతూ వుంటాయి. పెన్నానదీ తీర ప్రాంతంలోని సీమ ప్రజల స్వభావాన్ని, వారి గుండె చప్పుళ్ళను సమాజానికందించారు. వారి రచనల్లో అడుగడుగునా వారి ప్రతిభావ్యక్తిత్వం గోచరమవుతుంది.

    ఎన్ని కావ్యాలు వచ్చినా జీవిత చిత్రణలో, భాషలో, భావ వ్యక్తీకరణలో రాయలసీమకు ప్రాతినిథ్యం వహించే కావ్యం పెన్నేటిపాట. కవితావేశంలో పెన్నేటి పాట. మహాప్రస్థానానికి దీటైన కావ్యం. ఇరవయ్యవ శతాబ్దంలో కండగల భాషను సృష్టించుకున్న అతి తక్కువ కావ్యాలలో 'పెన్నేటి పాట' ఒకటి అని ప్రముఖ విమర్శకులు వల్లంపాటి పేర్కొన్నారు.

    విశ్వంగారు సంస్కృతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన కాదంబరి, కిరాతార్జునీయం, దశకుమార చరిత్ర, మేఘసందేశం కావ్యాలను తెలుగులో చక్కటి రసానుభూతితో అనువదించాడు. అంతే కాదు విరికన్నె, మహాశిల్పి, నాహృదయం, మహాసంకల్పం వంటి కావ్యాలను రచించారు. ఆంగ్ల భాష నుండి, రష్యన్‌ భాష నుండి ఆధునిక సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. అంతేకాదు - ఆంధ్రప్రభ వారపత్రికలో వారి 'మాణిక్యవీణ'  విశ్వం గారి విశ్వరూపానికి అద్దంపడతాయి.

    జర్నలిజం కోర్సును భోధిస్తున్న అనేక విశ్వ విద్యాలయాల్లో ఈ వ్యాసాలను పాఠ్యాంశాలుగా పెట్టవలసిన అవసరం ఎంతో ఉంది.  

    విశ్వంగారు, కావ్యంరాసినా, వ్యాసం రాసినా, గేయం రాసినా అది సామాజిక ప్రాధాన్యత సంతరించుకున్నదే తప్ప ఇతరంకాదు. నిజానికి ఆయనే ఒక మానవతావాది. పత్రికా రంగంలో ఉన్నతమైన విలువలను నిలబెట్టిన సత్సంప్రదాయవాది. కరువు సీమలో పుట్టిన కాంతరత్నం. 2015లో విద్వాన్‌ విశ్వంగారి శతజయంతిని జరుపుకోబోయే సందర్భంలోనైనా ప్రభుత్వం ఎటూ చెయ్యదు కాబట్టి తెలుగు విశ్వవిద్యాలయమైనా లేదా సాహిత్య సంస్థలైనా పూనుకొని వారి వివిధ రచనల సమగ్ర సంపుటాలను తీసుకువచ్చే కృషిని ఇప్పటి నుండే ప్రారంభించాలని నా సూచన. కొంతలో కొంతయినా అబ్జక్రియేషన్స్‌ సంస్థ పక్షాన ఈ పుస్తకాన్ని వెలువరించినందుకు సంపాదకుల్ని మరోసారి అభినందిస్తూ వర్తమానతరం సాహితీ మిత్రులు విశ్వం గారి మానవతావాదాన్ని అందిపుచ్చుకోవడానికైనా ఈ పుస్తకాన్ని కొని, చదివి తీరాలి !

కామెంట్‌లు లేవు: