...

...

13, ఏప్రిల్ 2014, ఆదివారం

పుస్తక సమీక్ష - 27 వీవర్స్ & లూమ్స్

[పుస్తకం పేరు: Weavers&Looms, రచయిత: Dr.P.Ramesh Narayana, ప్రచురణ:ఉమ్మడిశెట్టి సాహితీ ప్రచురణలు, అనంతపురము ప్రతులకు: డా.రాధేయ, కవితానిలయం,13-2-172, షిరిడినగర్, రెవిన్యూ కాలనీ,అనంతపురం 515001 వెల: రూ100/- $10]
వర్తమాన కవులలో సుప్రసిద్ధులు, ప్రముఖ విమర్శకులు, ఉమ్మడిశెట్టి సాహితీఅవార్డు వ్యవస్థాపకులు అయిన డా.రాధేయగారి మాగ్నమ్ ఓపస్ మగ్గంబతుకు దీర్ఘకావ్యానికి ఆంగ్లానువాదం ఈ Weavers&Looms. ఈ పుస్తకంలో ఎడమవైపు తెలుగు మూలము కుడివైపు పేజీలలో ఇంగ్లీషు అనువాదము ప్రచురించారు. అనువాదకులు డా.రమేష్‌నారాయణ Reflections on Human Nature అనే పుస్తకం ద్వారా ఇదివరకే తమ సత్తాను చాటుకున్నవారు. అనువాదం చాలా సరళంగా, ఎక్కడా సారస్యం చెడకుండా హాయిగా సాగింది. ముక్కస్య ముక్కః అన్నట్లుగా ఉన్న ఈ అనువాదం మూలరచన యొక్క సారాంశాన్ని తెలుగు తెలియని పాఠకులకు అందజేయడంలో పూర్తిగా సాఫల్యం చెందింది అనవచ్చు.

రమేష్‌నారాయణగారి అనువాదనైపుణ్యానికి శాంపిల్ క్రింద చూడండి.

"మేధావుల్లారా!
గుప్పెడు పత్తి మా మొహాన కొడితే
మూరెడు వస్త్రం నేసి మీకందిస్తాం!
ప్రతి ఎన్నికలముందు నేతలు పంచే
పచ్చనోట్లు మాకొద్దు
కష్టించిన చేతుల్లోని
మా కంచంలో కొంచెం అన్నం పెట్టండి చాలు"
 మూలరచనలోని ఈ భాగానికి రమేష్‌నారాయణగారి అనువాదం ఇలా ఉంది.

O! Intellectuals!
A fistful of cotton if you throw on our face
Weaving a measure of cloth we hand it over to you!
Before each election what the leaders distribute
Currency notes we do not require
In the toiled hands
Into our dish plate it is enough if some food is kept!    

ఈ పుస్తకంలో ఈ అనువాద కావ్యానికి ముందు 'మగ్గం బతుకును పొలిమేర దాటించిన అనువాదం' అంటూ ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్రాసిన పీఠిక, మూలరచయిత, అనువాదకులిరువురి ముందు మాటలు,'వీవర్స్ & లూమ్స్ - సాహిత్య పరిచయం' పేరుతో సుమారు 52పేజీల వివరణాత్మకమైన వ్యాసం ఉన్నాయి. చివరలో మగ్గంబతుకుపై ప్రముఖుల ప్రశంసలు, డా.రాధేయ, డా.రమేష్‌నారాయణగార్ల సంక్షిప్త పరిచయాలు ఉన్నాయి.  

సాధారణంగా ఏదయినా ఒక పుస్తకం ఆంగ్లంలోనికి కాని, హిందీ లేదా ఇతరభాషలలోనికి కాని అనువాదం చేయడంలో అర్థం పరమార్థం మన సాహిత్యాన్ని విస్తృతంగా ఇతర భాషలవారికి పరిచయం చేయడమే కావాలి. దానికి తగినట్లుగా అనువాద పుస్తకం రూపొందించాలి. 132 పేజీలున్న ఈ పుస్తకంలో కేవలం 21 పేజీలలో మాత్రమే ఇంగ్లీషులిపి కనిపిస్తుంది. ఈపుస్తకం తెలుగురాని ఇంగ్లీషు పాఠకులను(తెలుగు తెలిసిన పాఠకులకు ఇంగ్లీషు అనువాదం అక్కరలేదు) ఏవిధంగా ఆకర్షిస్తుందో తెలియదు. టెక్నికల్‌గా ఈ పుస్తకాన్ని ఇంగ్లీషు పుస్తకంగా పరిగణించలేము. తమ కావ్యాన్ని తెలుగుదేశపు ఎల్లలు దాటించి దేశవిదేశాలోని పాఠకులకు అందిచాలన్న ఉద్దేశమే ఉంటే ప్రచురణకర్తలు మరింత జాగ్రత్తలు తీసుకోవలసి వుండేది. కనీసం సాహిత్యపరిచయం వ్యాసం అయినా ఇంగ్లీషులో వ్రాసివుంటే బాగుండేది.