...

...

9, జులై 2014, బుధవారం

పుస్తక సమీక్ష -30 అక్షరాభిషేకం!


డా.రాధేయగారి అభినందన సంచిక 'అవిశ్రాంతమూర్తికి అక్షరాభిషేకం' పై నేను వ్రాసిన సమీక్ష సాహితీకిరణం తాజాసంచికలో ప్రచురింపబడింది. ఐతే స్థలాభావం వల్లనేమో సమీక్ష పూర్తిగా కాకుండా కుదించి వేశారు. ఇక్కడ పూర్తి పాఠం చదవవచ్చు.

అవిశ్రాంతకవితామూర్తికి అక్షరాభిషేకం
అనంతపురంలోని స్పందన అనంతకవుల వేదిక 2013 మే 19 తేదీన సుప్రసిద్ధ కవి, విమర్శకులు డా.రాధేయగారికి 'జీవన సాఫల్య పురస్కారం' అందజేసింది. సందర్భంగా అనంతకవుల మదిలో రూపుదిద్దుకున్న ఆలోచన ఫలితమే అభినందన సంచిక. జెన్నె ఆనందకుమార్, వి.చంద్రశేఖరశాస్త్రి(చం), ఉద్దండం చంద్రశేఖర్, మధురశ్రీ, ఆకుల రఘురామయ్య, ..నాగేంద్ర ప్రభృతుల కృషితో డా.రాధేయగారి మూడున్నర దశాబ్దాల సాహితీప్రస్థానమూ, ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కార రజతోత్సవమూ, 31 సంవత్సరాల అధ్యాపక పదవీ విరమణ సందర్భమూ కలుపుకుని అభినందన సంచిక వెలుగు చూసింది..
ప్రత్యేక సంచికలో కీర్తిశేషులు జానమద్ది హనుమచ్ఛాస్త్రి, శ్రీయుతులు బన్న అయిలయ్య, కొలకలూరి ఇనాక్, బి.హనుమారెడ్డి, కె.శివారెడ్డి, అద్దేపల్లి రామమోహనరావు, ఎన్.గోపి, రావి రంగారావు, మసన చెన్నప్ప, ఎస్జీడీ చంద్రశేఖర్, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కొండేపూడి నిర్మల, కత్తి పద్మారావు, తేళ్ళ సత్యవతి, మునుగోటి సుందరరామశర్మ, సడ్లపల్లె చిదంబరరెడ్డి, సంకేపల్లి నాగేంద్ర శర్మ, సబ్బని లక్ష్మినారాయణ, వి.పి.చందన్రావు, కొండపల్లి నీహారిణి, పాతూరి అన్నపూర్ణ, కె.జి.వేణు, నందవరం కేశవరెడ్డి, అశ్రుజల కవి కె.వి.రమణారెడ్డి, సి.హెచ్.ఆంజనేయులు, అంగలూరి అంజలీదేవి, బండి సత్యనారాయణ, కర్రా కార్తికేయశర్మ, మందరపు హైమవతి, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సంగవేని రవీంద్ర, ఎన్వీ రఘువీరప్రతాప్, వనపట్ల సుబ్బయ్య, మౌనశ్రీ మల్లిక్ మొదలైన ఎందరో ప్రముఖులు రాష్ట్రం నలుమూలల నుండే కాక ముంబై మొదలైన సుదూర ప్రాంతాల నుండి తమ అభినందన సందేశాలను అందజేయడంతోపాటు రాధేయగారితో వ్యక్తిగతంగానూ, సాహిత్యపరంగానూ తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. శిష్యత్రయం పెళ్ళూరు సునీల్, సుంకర గోపాల్, దోర్నాదుల సిద్దార్థ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని, వారి పేరు మీద నెలకొల్పిన కవితాపురస్కారం నేపథ్యాన్ని వివరించారు. 


గొల్లాపిన్ని శేషాచలం, మధురశ్రీ, ఆకుల రఘురామయ్య, పాళెం వెంకటకొండారెడ్డి, కెరె జగదీష్, దాట్ల దేవదానం రాజు, కె.వి.రామానాయుడు, సిరికి స్వామినాయుడు, మల్లెమాల వేణుగోపాలరెడ్డి, జూటూరి షరీఫ్, కిలపర్తి దాలినాయుడు, మోపూరు పెంచల నరసింహం, వి.సూర్యారావు, బీరం సుందరరావు, బొగ్గరపు రాధాకృష్ణమూర్తి, చం, మిద్దె మురళీకృష్ణ, ముకుందాపురం పెద్దన్న, జెన్నె అభిషేక్ తదితరులు వచన కవితల్లో రాధేయగారిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.  అమళ్ళదిన్నె వేంకటరమణ ప్రసాద్, కోడీహళ్లి మురళీమోహన్, ఒంటెద్దు రామలింగారెడ్డి, ఎం.సింహాద్రి మొదలైనవారు పద్యప్రసూనాలను సమర్పించినారు.
డా.రాధేయగారి కవితా సంపుటులపై మానేపల్లి సత్యనారాయణ, జినేంద్ర, కుందుర్తి ఆంజనేయులు, అద్దేపల్లి రామమోహనరావు, టి.గౌరీశంకర్, టి.ఎల్.కాంతారావు, గూడ శ్రీరాములు, వైశాఖి, ఆవంత్స సోమసుందర్, విహారి, కల్పనారెంటాల, దర్భశయనం శ్రీనివాసాచార్య, నందిని సిధారెడ్డి, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, విరియాల లక్ష్మీపతి, పత్తిపాక మోహన్, కె.శివారెడ్డి ప్రభృతుల వ్యాసాలు ఈ అభినందన సంచికలో చొటుచేసుకున్నాయి. డా.రాధేయగారి విమర్శనా గ్రంథాలయిన కవిత్వం ఓ సామాజిక స్వప్నం/సంస్కారం/సత్యంలపై  ద్వా.నా.శాస్త్రి, మాకినీడి సూర్యభాస్కర్, కొప్పర్తి వెంకటరమణమూర్తి, కె.బయ్యపురెడ్డి, దేవరాజు మహారాజు, పి.రమేష్ నారాయణ గార్ల అమూల్యాభిప్రాయాలు దీనిలో ఉన్నాయి.  ఆధునిక కవిత్వానికి ప్రతిష్ఠాత్మక పురస్కారం ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రారంభమైన 1988 నుండి 2012 దాకా అవార్డుసభల వివరాలు  ఫోటోలతో సహా వివరంగా ఇచ్చారు. ఈ జాబితాను పరిశీలిస్తే ఈ అవార్డు విశిష్టత, ప్రామాణికత సులభంగా తెలిసిపోతుంది.  ఇంకా ఈ అభినందన సంచికలో డా.రాధేయగారి జీవన రేఖలు,  డా.రాధేయగారి అంతరంగాన్ని ఆవిష్కరింపజేసే చిల్లర భవానీదేవిగారి ఇంటర్వ్యూ, వారి జీవితం కవిత్వం గురించిన ఎ.ఎ.నాగేంద్రగారి వ్యాసం కూడా ఉన్నాయి.
కడపజిల్లా ముద్దనూరు మండలం యామవరం గ్రామంలో ఓ సామాన్య చేనేత కుటుంబంలో జన్మించిన వి.ఎన్.సుబ్బన్న 1982లో హిందీ ఉపాధ్యాయునిగా ఉద్యోగజీవితం ప్రారంభించారు. పదవీ విరమణ కావించే సమయానికి డిగ్రీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా ఎదిగారు. ఉన్నత చదువులు చదుకోవాలనే బలమైన కాంక్షతో ఎం.ఏ.ప్రైవేటుగా చదివి 2008లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి "ఆధునికాంధ్ర కవిత్వానికి సీమ కవుల దోహదం" అనే అంశం మీద పరిశోధనచేసి డాక్టరేటు పట్టా పుచ్చుకున్నారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిసూనే వీరు కవిత్వం వైపు తమ దృష్టిని సారించారు. చిన్నతనంలో చదివిన సాహిత్యం ప్రభావంతో శ్రీశ్రీ ప్రేరణతో కవితలల్లడం ప్రారంభించారు. వీరి తొలికవిత 'ఇదా నవభారతం?' 1972లో ప్రచురింపబడింది. ఆ తర్వాత రాధేయ అనే కలంపేరుతో అంచలంచెలుగా వీరు కవిగా ఎదిగి 'మరోప్రపంచం కోసం(1978)', 'దివ్యదృష్టి(1981)', 'జ్వలనమ్(1983)', 'తుఫాను ముందటి ప్రశాంతి(1986)', 'ఈ కన్నీటికి తడిలేదు(1991)', 'క్షతగాత్రం(2003)', 'మగ్గం బతుకు(2006)', 'అవిశ్రాంతం(2009)' అనే ఎనిమిది కవితాసంపుటులను వెలువరించారు.  ఈ పుస్తకాలు వీరికి ఎన్నో అవార్డులూ, రివార్డులూ సంపాదించిపెట్టి వీరిని జాతీయకవిగా ఎదగడానికి దోహదం చేశాయి.
వీరి కథలు సుమారు పాతికదాకా ప్రచురింపబడ్డాయి. 1988లో తమ యింటిపేరు మీద ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు నెలకొల్పి ప్రతియేటా ఒక ఆధునిక ఉత్తమ కవితా సంకలనాన్ని ఎంపికచేయించి ఆ కవిని సత్కరించే కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. ఈ అవార్డు తెలుగు సాహిత్యజగత్తులోని అత్యుత్తమ పురస్కారాలలో ఒకటిగా పేరుగడించడానికి వీరి నిబద్ధతే ముఖ్యమైన కారణం. ఈ అవార్డు ఎంపికలో ప్రాంతీయాభిమానం, పక్షపాత ధోరణులకు తావివ్వరు. అవార్డు ఎంపికలో వీరి ప్రమేయం ఉండదు. న్యాయనిర్ణేతల నిర్ణయానికే కట్టుబడి ఈ అవార్డు ప్రదానం చేయడం వల్ల ఇదొక ప్రతిష్ఠాత్మక అవార్డుగా గుర్తింపు పొందింది. ఈ అవార్డును అందుకున్నవారిలో సౌభాగ్య, శిఖామణి, సుధామ, అఫ్సర్, పాపినేని శివశంకర్, ఆశారాజు, కందుకూరి శ్రీరాములు, దర్భశయనం శ్రీనివాసాచార్య, చిల్లర భవానీదేవి, నాళేశ్వరం శంకరం, విజయచంద్ర, జూపల్లి ప్రేమ్‌చంద్, అన్వర్, దాసరాజు రామారావు, పి.విద్యాసాగర్, కొప్పర్తి, మందరపు హైమవతి, ప్రభు, గంటేడ గౌరునాయుడు, తైదల అంజయ్య, పెన్నా శివరామకృష్ణ, యాకూబ్, కోడూరి విజయకుమార్, సిరికి స్వామినాయుడు, కొండేపూడి నిర్మల, శైలజామిత్ర ఉన్నారు.
అవార్డు పరిశీలనకు వచ్చిన అనేక కవితా సంపుటాలతోబాటు రాష్ట్రం నలుమూలల నుండి ఎందరో కవిమిత్రులు పంపిన కవిత్వపుస్తకాలనూ, వివిధ పత్రికలలో ప్రచురింపబడే కవిత్వాన్నీ ఎంతో మమేకంతో చదివే రాధేయ ఆ కవితలలోని వస్తువుని పరిశీలించడం మొదలుపెట్టారు. అక్షరం, పుస్తకం, కుర్చీ, రోడ్డు, పేపర్ బాయ్, నులకమంచం, పోస్ట్‌మేన్, గోదావరి, నయాగర ఇలా  విభిన్న వస్తువులను తీసుకుని వివిధ కవులు వాటిని ఏవిధంగా తమ కవిత్వంలో వ్యక్తం చేశారనే అంశాన్ని విశ్లేషిస్తూ వందల కొద్దీ వ్యాసాలను వ్రాసి వివిధ పత్రికలలో ప్రచురించారు. మంచి కవితా వాక్యాలు కనిపిస్తే చాలు అవి వ్రాసింది మహాకవి అయినా కొత్తగా వ్రాస్తున్న కవి అయినా వాటిని ఈ వ్యాసాలలో కోట్ చేయడం రాధేయగారి నైజం. ఇలా యువకవులెందరినో గొప్ప కవుల సరసన నిలబెట్టి వారికి చైతన్యాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తారు రాధేయ. ఈ వ్యాసపరంపర రాధేయగారిని ఒక గొప్ప విమర్శకునిగా నిలబెట్టింది. ఈ వస్తు వైవిధ్య విశ్లేషణా వ్యాసాలలో కొన్నింటిని ఇప్పటివరకు కవిత్వం ఓ సామాజిక స్వప్నం, కవిత్వం ఓ సామాజిక సంస్కారం, కవిత్వం ఓ సామాజిక సత్యం అనే పేర్లతో మూడు సంపుటాలుగా వెలువరించారు. ఈ పుస్తకాలు అనేక పురస్కారాలను వీరికి సంపాదించి పెట్టింది.  యువస్వరాలు అనే కవితా సంకలనం, రా.రా.పై ఎక్స్‌రే ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం నిర్వహించారు. రాజ్‌కోట్‌లో జరిగిన సర్వభాషా కవిసమ్మేళనం, రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు,  నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొని తమ కవితాగళాన్ని వినిపించారు. వీరి కవిత్వమూ, కథలూ ఇంగ్లీషు, హిందీ, కన్నడ తదితర భాషల్లో తర్జుమా కాబడింది. 
డా.రాధేయగారి సమగ్ర సాహిత్య స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్న ఈ అభినందన సంచిక యువకవులకు, సాహిత్యాభిమానులకు స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ అభినందన సంచిక తీసుకువచ్చిన అనంత కవిబృందానికి అభినందనలు!

[పుస్తకం పేరు: అవిశ్రాంత కవితామూర్తికి అక్షరాభిషేకం, ప్రచురణ:శ్రీమతి జెన్నె(ఎం) మాణిక్యమ్మ పబ్లికేషన్స్, అనంతపురం, పుటలు:178, వెల:రూ250/- ప్రతులకు: డా.రాధేయ, కవితానిలయం, 13-1-606-1, షిర్డీసాయినగర్,రెవెన్యూకాలనీ, అనంతపురం 515001]