...

...

24, ఏప్రిల్ 2015, శుక్రవారం

పుస్తక సమీక్ష - 32 నాగావళి నుంచి మంజీర వరకు


[పుస్తకం పేరు: నాగావళి నుంచి మంజీర వరకు, రచన:రావి కొండలరావు, వెల: రూ.150/-, పేజీలు:184, ప్రతులకు: ఆర్కే బుక్స్,502, సన్నీ రెసిడెన్సీ, 166, మోతీనగర్, హైదరాబాదు - 18 మరియు అన్ని ముఖ్యమైన పుస్తకశాలలు]  

ప్రముఖ నటుడు, జర్నలిస్టు, హాస్య రచయిత, నాటక రంగ ప్రముఖుడు అయిన రావికొండలరావు గారి జ్ఞాపకాల దొంతర ఈ పుస్తకం.  తనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్క ప్రముఖుణ్ణి, సామాన్యులను, అసామాన్యులను ఈ పుస్తకంలో స్మరణకు తెచ్చుకున్నారు రావి కొండల్రాయుడు ఉరఫ్ రావి కొండల్రావు. ఈ మధ్య కాలంలో వెలువడిన పుస్తకాలలో ఇది ఒక మంచి పుస్తకం అని చెప్పవచ్చు. రచయిత గారి జీవిత విశేషాల సంగతి ఎలా ఉన్నా తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగం అని చెప్పుకునే కాలం నాటి చలనచిత్ర విశేషాలు ఈ పుస్తకంలో రికార్డు కావడం విశేషం. బాపురమణ 'కు' ('లకు' కాదు) అంకితమివ్వబడిన ఈ పుస్తకం చక్కని గెటప్‌తో పాఠకులకు అందుబాటు ధరలో వెలువడటం అభినందనీయం.  పుస్తకం కొనడానికి వెచ్చించిన డబ్బు గిట్టుబాటు అయ్యిందన్న తృప్తిని మిగిలిస్తుంది.

నాగావళి శ్రీకాకుళం తీరంలో ప్రవహించే నది. మంజీర హైదరాబాదు సమీపంలో ఉన్న నది. శ్రీకాకుళం నుంచి హైదరాబాదు దాకా సాగిన జీవిత ప్రస్థానాన్ని రచయిత ఈ పుస్తకంలో వివరించారు. తిరుమల రామచంద్రగారి హంపీ నుంచి హరప్పా దాక ఈ పుస్తకానికి స్ఫూర్తిని కలిగించి ఉండొచ్చు.  ఆర్.కె.రావు, చక్రపాణి, తిమ్మరాజు శివరావు, సి.హెచ్.నారాయణరావు, గండికోట జోగినాథం, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, నల్లరామ్మూర్తి, గోవిందరాజు సుబ్బారావు, న్యాయపతి రాఘవరావు, బాపు, ముళ్లపూడి వెంకటరమణ, వడ్డాది పాపయ్య, సఖ్ఖరి కృష్ణారావు , గరిమెళ్లరామ్మూర్తి, ప్రయాగ నరసింహశాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు, భానుమతి, కొడవటిగంటి కుటుంబరావు, ఎం.ఎస్.రామారావు, జి.వరలక్ష్మి, మద్దాలి శర్మ, పూడిపెద్ది లక్ష్మణమూర్తి(పూలమూర్తి), సదాశివరావు, రేలంగి వెంకట్రామయ్య, సదాశివరావు, చదలవాడ కుటుంబరావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, ఘంటసాల, సుందరశివరావు, సుంకర ప్రభాకరరావు, రావి ధర్మారావు, బి.ఎన్.రెడ్డి,సి.పుల్లయ్య, వల్లభజోశ్యుల శ్రీరామమూర్తి, మల్లాది వెంకటకృష్ణశర్మ, శ్యామలరావు, కమలాకర కామేశ్వరరావు, డాక్టర్ రాజారావు, మాస్టర్ మల్లేశ్వరరావు, ముద్దుకృష్ణ, కాశీనాథ్ తాతా, నార్ల వేంకటేశ్వరరావు, ఎన్.జగన్నాథ్, కళ్యాణసుందరీ జగన్నాథ్, మాధవపెద్ది సత్యం, హరనాథ్, ఆత్రేయ, బండారు చిట్టిబాబు, పెండ్యాల నాగేశ్వరరావు, ద్వారం వేంకటస్వామి నాయుడు, ఆదిభట్ల నారాయణదాసు, కళావర్ రింగ్, ఉప్పులూరి కాళిదాసు, శ్రీశ్రీ, నిర్మలమ్మ, జె.వి.సోమయాజులు, జె.వి.రమణమూర్తి, కె.వి.రావు, బి.సరోజాదేవి, డి.వి.నరసరాజు, పింగళి నాగేంద్రరావు, మద్దిపట్ల సూరి, మల్లాది రామకృష్ణశాస్త్రి,దైతా గోపాలం,ఆరుద్ర,అంజలీదేవి,చౌదరి, వీర్రాజు, చిత్తూరు నాగయ్య మొదలైన వారి (పైన పేర్కొన్న జాబితాకు రెట్టింపు మంది) గురించి అంతో ఇంతో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. రావి కొండలరావు హాస్య రచయిత కాబట్టి పుస్తకం నిండా బోలెడన్ని చమత్కారాలు, హాస్యాలు, ఒకటి ఒకటిన్నర కుళ్ళు జోకులు కనిపిస్తాయి. ఈ పుస్తకంలో చాలా విలువైన ఫోటోలు, సినిమా స్టిల్స్, నాటకాల స్టిల్స్ రంగుల్లోనూ తెలుపు నలుపుల్లోనూ దర్శనమిచ్చి పాఠకులను రంజింపజేస్తాయి. 

ఈ పుస్తకంలో కొన్ని ఆరోపణలు చేస్తారు రావి కొండలరావు. అయితే అవి ఆరోపణలని అనిపించకుండా చాలా లౌక్యంగా వ్రాశారు.

అవి:

1.ఎ.నాగేశ్వరరావు తనకు ఆటోగ్రాఫు ఇవ్వలేదు. (పేజీ 30)

2.అతను యెవరు? సినిమాకి మాటల రచయితగా ఇతని పేరు వేయలేదు. కారణం అన్నయ్య ఆర్.కె.రావు(?)

3.ఉప్పులూరి కాళిదాసు ఆనందవాణి పత్రికలో పనిచేయించుకుని డబ్బులు ఎగ్గొట్టారు.  

4.వి.ఎ.కె.రంగారావు తనకు కావలసిన రికార్డును ఇవ్వడానికి ఏడాదిన్నర తిప్పుకున్నారు. అలాగే వడ్డాది పాపయ్య తన పత్రిక ముఖచిత్రం వేయడానికి కొంతకాలం చుట్టూ తిప్పించుకున్నారు.

5.తెలుగు స్వతంత్రలో సబ్ ఎడిటర్‌గా పనిచేసిన కె.రామలక్ష్మి తన కథలు రెండింటిని రిజెక్ట్ చేశారు.

పైన పేర్కొన్నవన్నీ నిజమే కావచ్చు కాని వాటిని పాఠకులతో పంచుకుంటే ఏం ఉపయోగం?

ఉత్తమ పుస్తకం కాకపోయినా ఈ మధ్య కాలంలో వెలువడిన మంచిపుస్తకంగా దీనిని పరిగణించవచ్చు.
  

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

తెవికీలో ఇద్దరు తిరపతోళ్లు

తిరుపతిలో ఈ నెల 14,15 తేదీల్లో జరిగిన తెలుగు వికీపీడియా పదకొండవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఇద్దరు తిరుపతికి చెందిన రచయితల వ్యాసాలు వికీపీడియాలో వ్రాయడానికి కారణం అయ్యింది. లేకపోతే ఈ ఇద్దరి గురించిన వ్యాసాలు తెలుగు వికీపీడియాలో కనిపించడానికి మరికొంత కాలం పట్టేదేమో! ఈ సమావేశాల్లో సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య మాట్లాడుతూ ముందు రోజు మరణించిన ఎస్.మునిసుందరం గురించి ఇంటర్నెట్‌లో వెదికితే సరైన సమాచరం లభించలేదని అన్నారు. రచయిత ఎస్.మునిసుందరం మరణ వార్త అక్కడే తెలిసింది. మునిసుందరం గారు నాకు పరిచయం నా కథాజగత్ ద్వారా. అతని కథ రాయలమ్మ కథాజగత్‌లో ఉంది. అతని చారిత్రక పౌరాణిక నాటకాలపై నా సమీక్ష చదివి వారు నాకు ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారు. ఆదిత్యగారి వ్యాఖ్యకు స్పందించి ఆ రోజే తెలుగు వికీపీడీయాలో మునిసుందరం గారిపై ఒక వ్యాసాన్ని వ్రాశాను. దానిని ఇక్కడ చదవండి. ఆ వ్యాసంలో మునిసుందరం గారికి నూతలపాటి గంగాధరం సాహితీ కుటుంబం తో ఉన్న అనుబంధం తెలిసి నూతలపాటి గంగాధరం గురించి కూడా ఒక వ్యాసం తెలుగు వికీపీడియాలో వ్రాయడం జరిగింది. ఈ వ్యాసాలు చదివి ఆసక్తి కలిగిన వారు ఎవరైన ఈ వ్యాసాలను ఇంకా మెరుగు పరచమని కోరుతున్నాను.

17, నవంబర్ 2014, సోమవారం

స్వకీయ విలాప కదంబము by నల్లి

మానవ రుధిరపానమే నాకు ఆహారమను మాట నిజమేకాని నావంటి జీవరాసులు భూలోకమున లేవా? ఇంతకు నేజేసిన పాపమేమి? సృష్టికర్త నిర్ణయించిన తీరున నా జీవయాత్ర సాంతముగ కొనసాగించు నిచ్చతో, మానవకోటికి కొంచెముగనో గొప్పగనో లాభకారిగ నుండవలెనను తలపు తప్ప మఱియొకటి నాకు లేదు. చూడుడు. టీ మొదలగు వెలగల నిషావస్తువుల సహాయము  కోరకయే మానవులు నన్ను నమ్మ బలుకుకొని నిద్రాపిశాచమును జయించుచున్నారు. కావున ముఖ్యముగ విద్యార్థుల పాలిటికి దైవసమానురాలను కానా? కుబేరుని వంటి ధనికుల గృహములలో నేనును నా సఖులును నిశాచరులవలె మంచముల మీద తిరుగుచు ఇంటివారి నొక్కమారైనను రాత్రులలో కనులు మూయనియ్యకుండ జేసి తమ యాస్తులను భద్రపఱచుకొన హెచ్చరించుచున్నాను. ఒక కాసైనను వారు మానవ భటుల మీదల శలవు చేయ నవసరము లేకుండ జేయు మాకన్న మహోపకారులు కలరా! ........................................................................................

మిగతా భాగాన్ని క్రింది లంకెలో వెదికి చదువుకోండి.


8, నవంబర్ 2014, శనివారం

సై సై నారపరెడ్డీ!

విద్వాన్ విశ్వం గారి పెన్నేటిపాటలో దొంగసుంకన్న కట్టినపాట :)

2, నవంబర్ 2014, ఆదివారం

శ్రీ సాధనపత్రిక ఇప్పుడు అంతర్జాలంలో!!!

ఆమధ్య నేను సీమసాహితీస్వరం శ్రీసాధనపత్రిక అనే పుస్తకాన్ని సమీక్షిస్తూ శ్రీసాధనపత్రిక పాతసంచికలు పాఠకులకు, పరిశోధకులకు అందుబాటులో లేకపోయాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాను. దాన్ని చదివిన శ్రీ కైపనాగరాజ గారు తమ వద్ద ఉన్న సాధనపత్రిక భాండారాన్ని ఇంటర్నెట్టులో అందరికీ లభ్యమయ్యేలా పెట్టమని నాకు అందజేశారు. వారి సహకారంతో సాధనపత్రికను ఇక్కడ ప్రతిరోజూ ఒక సంచిక చొప్పున  పొందు పరుస్తున్నాను. చదివి 20వ శతాబ్దపు పూర్వార్థ భాగంలో సీమ వాసుల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్యవైభవాన్ని ఆస్వాదించండి. ఈ విషయంలో సహకరించిన రవికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 
   

21, అక్టోబర్ 2014, మంగళవారం

విద్వాన్ విశ్వం శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభ!

విద్వాన్ విశ్వం శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభ కొంపెల్ల శర్మ గారి తెలుగు రథం ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం త్యాగరాయగానసభలో జరిగింది. భూమన్ గారు కీలకోపన్యాసం చేశారు. కొంపెల్ల శర్మగారు విద్వాన్ విశ్వం సాహితీ విశేషాలను సభకు పరిచయం చేశారు. కాదంబరిగారు(విశ్వం గారి కుమార్తె) తమ తండ్రితో గల అనుబంధాన్ని, జ్ఞాపకాలనూ వివరించారు. ఉభయరాష్ట్రాలలో అనేక ప్రాంతాలలోను, హైదరాబాదులోనూ విశ్వం గారి శతజయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సభలో నేనూ, త్యాగరాయగానసభ అధ్యక్షులు కళావెంకటదీక్షితులు కూడా పాల్గొన్నాము. 





  

ఆంధ్రభూమి

నమస్తే తెలంగాణా


ఈనాడు

ప్రజశక్తి

 ఈనాడు

ఆంధ్రజ్యోతి

అచ్చరపు సేద్యకాడు

బిలబిలాక్షులేమొ తిలలను పెసలనే
కాదు, కంకి గింజ కానబడిన
పొడిచి,పొడిచి రాల్చి పొలిపుచ్చు పంటను
జడుపుతోడగాని విడిచిపోవు

పై పద్యాన్ని చదివితే వెంటనే మనకు శ్రీనాథుని ఈ క్రింది చాటు పద్యం గుర్తుకు వస్తుంది.

కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లుచెల్లింతు టంకంబు లేడునూర్లు?

శ్రీనాథుడేమో బిలబిలాక్షులు తిలలు పెసలు తినిపోయాయని వాపోతుంటే పైన ఉదహరించిన పద్యం చెప్పిన కవి తిలలు పెసలే కాదు అవి జొన్న కంకులను కూడా వదలవయ్యా బాబూ అని  అంటున్నాడు. ఇలా శ్రీనాథుని ఆక్షేపించడం అల్లాటప్పా కవుల వల్ల సాధ్యమయ్యే పని కాదు. దానికి చాలా సత్తా కావాలి.  అలాంటి సత్తా, సారం కలవాడు కాబట్టే ఈ కవి కాళిదాసు కుమారసంభవ, మేఘసందేశ, రఘువంశాదులను, బాణుని కాదంబరిని, భారవి కిరాతార్జునీయాన్ని, మాఘుని శిశుపాలవధను, దండి దశకుమార చరిత్రను, కల్హణుని రాజతరంగిణిని, సోమదేవభట్టు కథాసరిత్సాగరాన్ని తెలుగు పాఠకులకు అరటి పండు వొలిచి ఇచ్చినట్లు అందజేయగలిగాడు.  అంతటి సత్తా కలవాడు కాబట్టే పదిహేనో యేటనే కవిత్వం చెప్పడం ప్రారంభించి ఇరవయ్యవ యేటనే విరికన్నె అనే తొలి కావ్యాన్ని ప్రకటించగలిగాడు. ఒకనాడు, నా హృదయం, పెన్నేటి పాట మొదలైన జీవత్‌కావ్యాలను సృజించగలిగాడు. ఈయన కవి మాత్రమే కాదు పండితుడు, రాజకీయవేత్త, పత్రికా సంపాదకుడు, సంఘసేవకుడు కూడా. అలాంటి వ్యక్తి గురించి ఒకటి రెండు విషయాలు ఇక్కడ ముచ్చటించుకుందాం.

ఈయన 1938 ప్రాంతంలో తరిమెల నాగిరెడ్డితో కలిసి నవ్యసాహిత్యమాల పేరుతో ఒక పుస్తక ప్రచురణ సంస్థను అనంతపురంలో ప్రారంభించి సుమారు 22 గ్రంథాలను ప్రచురించాడు. వాటిలో ఎక్కువ భాగం ఈయన వ్రాసినవి, అనువాదం చేసినవి ఉన్నాయి. సమీక్ష, ఫాసిజం, లెనిన్, ఏమిచెయ్యడం, పాపం మొదలైన పుస్తకాలను వ్రాసి ఈ నవ్యసాహిత్యమాల ద్వారా ప్రకటించి ప్రజలను చైతన్య పరిచాడు.   నవ్యసాహితి అనే పేరుతో ఒక పత్రికను సైతం  తరిమెల నాగిరెడ్డితో కలిసి నడిపాడు. ఆకాశవాణి అనే రహస్య పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు. రాజద్రోహం నేరం క్రింద తరిమెలనాగిరెడ్డి, పప్పూరు రామాచర్యులు మొదలైనవారితో కలిసి కారాగారవాసం చేశాడు. జిల్లా కాంగ్రెస్ రాజకీయాలలో చురుకుగా పాల్గొని జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా, రైతుసంఘ కార్యదర్శిగా, క్షామనివారణ సంఘకార్యదర్శిగా, జిల్లా రైతుమహాసభకు ఉపాధ్యక్షుడిగా, అనంతపురం మండల ఆంధ్రమహాసభకు కార్యదర్శిగా సేవలనందించాడు.

కేవలం ఉపన్యాసాల ద్వారా, ఉద్యమాల ద్వారా కాక ఇంకాస్త లోతుగా దిగి జనంలో ముఖ్యంగా ఆలోచనాపరులైన యువతలో రాజకీయాలు శాస్త్రీయంగా తెలపాలన్న ఆశయంతో రాజకీయాలనుండి తప్పుకుని పత్రికా రచనవైపు ఈయన తన దృష్టిని సారించాడు. హైదరాబాదులో మీజాన్ పత్రికలో సహాయ సంపాదకుడిగా చేరి కొన్నాళ్లు పనిచేశాడు. తరువాత  ప్రజాశక్తి దినపత్రిక సంపాదకుడిగా, ఆంధ్రపత్రిక దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా, ఆంధ్రజ్యోతి దినపత్రికలో సహాయ సంపాదకుడిగా,     ఆంధ్రప్రభ దినపత్రికకు అసోసియేట్ ఎడిటర్‌గా, ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక సంపాదకుడిగా  అవతారం ఎత్తి తెలుపు-నలుపు, అవీ... ఇవీ..., ఇవాళ, మాణిక్యవీణ మొదలైన శీర్షికలను నడిపాడు. ఎన్నో గేయాలను, వ్యాసాలను, పద్యఖండికలను, సమీక్షలను వ్రాశాడు. అనువాదాలను చేశాడు.  పత్రికా సంపాదకుడిగా పదవీవిరమణ చేసిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణల విభాగానికి ప్రధాన సంపాదకుడిగా వేదాలతో పాటు ఎన్నో సంస్కృత గ్రంథాలను అనువాదం చేశాడు.  నిజాం రేడియోలోనూ, మద్రాసు ఆకాశవాణి ద్వారాను ఎన్నో ప్రసంగాలు చేశాడు. 

కొన్ని లక్షల పుటల వాఙ్మయాన్ని సృజించి అశేష పాఠకులను ప్రభావితం చేసిన ఈ మహానుభావుడి గురించి ఎంతని చెప్పగలం. ఏమని చెప్పగలం. ఒక ముక్కలో చెప్పాలంటే ఈయన పేరు విద్వాన్ విశ్వం!

(ఈరోజు విద్వాన్ విశ్వం 100వ జయంతి )