...

...

23, డిసెంబర్ 2008, మంగళవారం

పుస్తక సమీక్ష ! -1 గోపాలం

పుస్తక పఠనం నాకు అత్యంత ఇష్టమైన అభిరుచి. ఈమధ్య పుస్తకాలు చదవడం బాగా తగ్గినప్పటికినీ వీలు చిక్కినప్పుడల్లా చదవడానికే ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్య కొన్ని పుస్తకాలను కొన్ని పత్రికలలొ సమీక్షించడం వలన నాకు చాలామంది రచయితలతో పరిచయం ఏర్పడింది. కొన్ని సభలకు హాజరు అయ్యే అవకాశమూ దక్కింది. ఫలితంగా ఆయా రచయితల పుస్తకాలను కాంప్లిమెంటరీ గా పొందే అదృష్టం లభించింది. కొందరు తమ పుస్తకాలను పోష్టు ద్వారా పంపి సమీక్షించాల్సిందిగా కోరారు. ఆవిధంగా ఇప్పుడు నాదగ్గర పుస్తకాలు పేరుకు పొయాయి. వాటిని అన్నింటినీ చదివి ఈ శీర్షికలో పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను.
ప్రస్తుతం నేను మీకు పరిచయం చేస్తున్నది ఎనుగంటి వేణుగోపాల్ వ్రాసిన హాస్య కథల సంపుటి గోపాలం గురించి. ఎనుగంటి వేణుగోపాల్ నాకు భద్రాచలంలో జాగృతి పత్రిక వారు నిర్వహించిన తెలుగు కథారచయితల సమ్మేళనంలొ పరిచయమయ్యారు. ఆ రెండు రోజుల్లో సన్నిహిత మిత్రుడైనారు. అంతకు ముందే వేణుగోపాల్ కథల పుస్తకం అమ్మా నాన్నా చదివి వుండటంతొ అతనిపై ఒక అభిమానం ఏర్పడింది. వేణుగోపాల్ ఎంతో అభిమానంగా పంపిన ఈ గోపాలం పుస్తకాన్ని అంతే అభిమానంతో చదివాను.
ఈ పుస్తకంలో 12 కథలున్నాయి. ఈ కథలన్నిట్లోనూ గోపాలం కథానాయకుడు. యమలోకం లో భూలోకం అనే కథ మాత్రం దీనికి మినహాయింపు. ఇతడో స్పెషల్ క్యారెక్టర్. ఇతడి చర్యలు బోలెడు హాస్యాన్ని పండిస్తాయి.ప్రేమించి పెళ్ళాడాలనే గోపాలం కోరిక ఎలా అభాసు పాలయ్యిందో రామవ్వ గారి మనవడు కథలోను, గోపాలం ప్రేమ కథ అనే కథలోను రచయిత చక్కగా హాస్యం చిందేలా వర్ణించారు. వీరివీరి గుమ్మడి వీరి బాధేంటి? అనే కథలో గోపాలం చేష్టలు ఇరుగుపొరుగు మగవాళ్ళకు కంటగింపుగా ఉన్నా అతని ప్రవర్తనకు అసలు కారణం తెలిసి వారంతా గోపాలాన్ని చివర్లో ఓదారుస్తారు. కాన్వెంటు స్కూళ్లలో అడ్మిషన్లకై తల్లిదండ్రులు పడే తిప్పలను పాపం గోపాలం కథలో వివరిస్తారు వేణుగోపాల్. తెలుగు టి.వి.చానళ్లపై, అవి చూపే కార్యక్రమాలపై ఒక మంచి సెటైర్ యమలోకం లో భూలోకం అనే కథ.'టచ్ మి నాట్'లాగుండే సూపరింటెండెంట్ కు మన గోపాలం ఇచ్చిన షాక్ తగిన శాస్తి కథలో నవ్వును తెప్పిస్తుంది. వింత వింత కోరికలతో చంపుకుతింటున్న భార్య రోగం కుదర్చడానికి గోపాలం పన్నిన ఎత్తుగడ కథ మలుపు తిరిగింది లో చదివి మనసారా పాఠకులు నవ్వుకోవచ్చు. కవులు, రచయితలపై వేణుగోపాల్ విసిరిన వ్యంగ్యాస్త్రం కవి గోపాలం అనే కథ. మతిమఱుపు వలన జనించే హాస్యాన్ని గోపాలం నాలిక్కరుచుకున్నాడు అనే కథలో బాగా పండించారు రచయిత. తనపై అధికారిని అర్థం చేసుకొవడంలో విఫలమై అతనిపై ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకున్న ఉద్యోగి చివరకు పశ్చాత్తాప పడే వైనం బాస్ స్.. కథలోను, భవిష్యత్తులొ జరగబోయే సంఘటనల ఊహ 2057 కథలోను, సెల్ ఫోన్ల ప్రహసనాన్ని నన్ను దోచుకొందువటే కథలోను చదవ వచ్చు.
ఈ కథలు హాయిగా చదివించేస్తాయి అన్న ముళ్ళపూడి వెంకటరమణ, రావికొండల రావు గార్ల అభిప్రాయంతో ఎవరూ విభేదించలేరు. అయితే ఎనుగంటి వేణుగోపాల్ హాస్య రచనలకన్నా సీరియస్ రచనలు బాగా చేస్తారు అని నాకు అనిపించింది. అంటే హాస్య రచనలు బాగా చేయరని కాదు. సీరియస్ రచనలపై ఎక్కువ దృష్టి పెట్టాలని నా విజ్ఞప్తి.
ఇంకా ఈ గోపాలం పుస్తకంలో నాకు బాగా నచ్చిన అంశం దీని ప్రచురణకు ప్రకటనల ద్వారా ధన సేకరణ చేయడం. సొంతంగా చేతి చమురు వదిలించుకుని పుస్తకాలను ప్రచురించుకుని బాధ పడే అనేక మంది రచయితలకు ఎనుగంటి వేణుగోపాల్ ఒక ఆదర్శంగా నిలుస్తారు. బాపు ముఖచిత్రంతో అందంగా వెలువడిన ఈ పుస్తకాన్ని కొని (వెల రూ.70/- మాత్రమే) చదవాలనిపిస్తే రచయిత ఫోన్ నెంబరు 9440236055 కు సంప్రదించండి.

4 కామెంట్‌లు:

cbrao చెప్పారు...

ఎవరు మీరు? మీ పరిచయం చేసుకుంటారా?

కొత్త పాళీ చెప్పారు...

సంతోషం. మరో పుస్తక ప్రేమికులు మన మధ్య.

mmkodihalli చెప్పారు...

cbrao గారూ!
నా పేరు: కోడీహళ్లి మురళీ మోహన్
పుట్టిన తేదీ: 04-02-1966
చదువు: ఇంజనీరింగులో డిప్లొమా
ఉద్యోగం: దక్షిణ మధ్య రైల్వే, సికందరాబాదు మండలంలో జూనియర్ ఇంజినీరుగా
చిరునామా: ఫ్లాట్ నెం. 9111, బ్లాకు: 9ఏ, జనప్రియ మహానగర్, మీర్ పేట్, హైదరాబాద్ 500 079
ఫోన్ నెం.: 9701371256
ఇ.మెయిల్ :mmkodihalli@gmail.com
కలం పేరు: స్వర లాసిక
రచనా వ్యాసంగము: పలు పత్రికలలో పుస్తక సమీక్షలు, వ్యాసాలు, కథలు ప్రచురింప బడినాయి
ప్రచురించిన పుస్తకాల వివరాలు: 1. గడ్డిపూవు కవితా సంకలనమునకు సంపాదకత్వము,
2.కథాజగత్ కథల సంకలనమునకు సంపాదకత్వము,
3.గ్రంధావలోకనం (సమీక్షా వ్యాసాల సంపుటి)
అముద్రిత రచన: తెలుగు ప్రత్రికల సమగ్ర చరిత్ర (1992 వరకే అప్ డేట్ చేయబడింది కాబట్టి అసమగ్ర చరిత్ర)
నిర్వహిస్తున్న బ్లాగులు: తురుపు ముక్క, కథాజగత్
ఈ వివరాలు సరిపోతాయి అనుకుంటాను.

cbrao చెప్పారు...

మీ పరిచయానికి చాలా సంతోషం. బ్లాగ్లోకానికి స్వాగతం. ప్రతి నెలా రెండవ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కృష్నకాంత్ పార్క్ (యూసఫ్‌గూడా) లో జరిగే సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం.

మీ గురించిన వివరాలతో "నా పరిచయం" అనే టపా ఒకటి ప్రచురించగలరు. మీ బ్లాగు చూసేవారికి మీరెవరో తెలియగలదు.
-cbrao
San Jose, CA