...

...

28, డిసెంబర్ 2008, ఆదివారం

పుస్తక సమీక్ష - 2 స్వాతిముత్యాలు, నెమలి కనులు

సాంప్రదాయ కవిత్వానికి కాలం చెల్లింది అనే విమర్శకు సమాధానంగా ఇప్పుడు అక్కడక్కడా పద్య రచనలు వెలువడుతునే వున్నాయి. కూచిపూడి నాట్యాచారునిగా, కళాకారునిగా, శాస్త్రీయ నాట్య రూపక కర్తగా, రచయితగా, కవిగా బహుముఖ ప్రతిభ కనపరుస్తున్న యువకుడు శ్రీ దండిభొట్ల వైకుంఠ నారాయణ మూర్తి కలం నుండి వెలువడిన శతక రచన " స్వాతిముత్యం " కూడా పై విమర్శకు ఒక రకమైన సమాధానమే! "మూర్తి పలుకు స్వాతి ముత్యమొలుకు" అనే మకుటంతో వెలువడిన ఈ పుస్తకంలో కవి తన మనసులోని భావనలకు అద్భుతంగా కవిత్వ రూపమిచ్చినారు.సామజిక విశ్లేషణలు ఈ శతకంలో కోకొల్లలు.కవి పరిశీలనాసక్తికి, రచనా ప్రతిభకు ఈ శతకమొక అచ్చమైన ప్రామాణ్యము. ఇంద్ర పదవి కన్న ఆంధ్ర యశము మిన్న అంటూ తమ భాషాభిమానాన్ని చాటుతున్నారు. ముళ్ళ చెట్లకు నీరు పోసి పెంచినా అవి మన రక్తాన్ని చూసినట్లు వంచకులకు మేలు చేయతగదని కవి అంటారు. సంస్కార గుణం జన్మతః అలవడుతుందని కవి భావన.భూమిపై పనికి రాని వస్తువు లేదని, లౌక్యుడు ఎటువంటి స్థితినైనా ఎదుర్కోగలడని, విఫలమైనా విడువక ప్రయత్నిస్తే గెలుపు దక్కుతుందని, కుజనుల గుంపులో మంచివారుండజాలరని ఇలా సామాజిక సత్యాలను ఎన్నో కవి ఈ శతకంలో పేర్కొన్నారు.అందమైన ఆటవెలదులతో అలరించే ఈ శతకము సాహిత్య ప్రియులందరూ ఆహ్వానించ తగినది.
మచ్చుకు రెండు పద్యాలు ఆస్వాదిద్దాం.

అవసరమ్ము కలుగ అరి కూడ స్వజనుండు
లేనివేళ హితుడె కానివాడు
మధువు చేదుకాదె మధుమేహ రోగికి
మూర్తి పలుకు స్వాతి ముత్యమొలుకు.

గంగిరెద్దు లయకు కాలు కదల్చును
మంచి పాట విన్న మబ్బు కరగు
కళను వీడు నరుడు కంటక హృదయుండు
మూర్తి పలుకు స్వాతి ముత్యమొలుకు.


ఈ యువకవి మరో కవితా సంపుటి నెమలి కనులు. చతుష్పాద పద్యాలనే కాక ద్విపదలను కూడా నైపుణ్యంగా వ్రాయగలరని నిరూపిస్తుంది ఈ పుస్తకం. ద్విపదలంటే ఛందోబద్ధమైన ద్విపదలు కావండోయ్! రెండు లైన్ల ఆధునిక కవితలన్నమాట. అల్పాక్షరాలలో అనల్పార్థాలను వ్యక్తం చేస్తున్నాయి ఈ నెమలి కనులు. వీటిలో ఎన్నెన్నో సూక్తులూ, నిత్యసత్యాలు వున్నాయి. చమత్కారాలు, వ్యంగ్యాలు కనిపిస్తాయి. పక్షులకు తెలియవు మోసాలు/ అందుకే వాటికక్కర లేవు వీసాలు, హారతి కర్పూరం-ప్రేయసి/ పచ్చ కర్పూరం- భార్య, అనురాగం అణువంతున్నా చాలు/ చినుకుకే నెమలి పులకించదా?, నిశ్చలంలో నీరే నిలువుటద్దం/ ప్రశాంతతలోనే పరమార్థం ఈ పంక్తులు చాలవా కవి ప్రతిభను బేరీజు వేయడానికి?

[స్వాతిముత్యాలు, నెమలి కనులు ఈ రెండు కృతుల రచన శ్రీ దండిభొట్ల వైకుంఠ నారాయణ మూర్తి, వెల చెరి 50రూ.లు(విదేశాలకు 5 $) ప్రతులకు దండిభొట్ల, ఫ్లాట్ నెం. 301, సత్యసాయి నిలయం, ఓల్డ్ మల్కాజిగిరి, రామాలయం ఎదురుగా, సికిందరాబాదు 500 047]

కామెంట్‌లు లేవు: