[పుస్తకం పేరు: రియల్ స్టోరీస్ రచన: కస్తూరి మురళీ కృష్ణ, పేజీలు: 296 వెల:రూ.125/- ప్రతులకు: ఎమెస్కో బుక్స్, సూర్యా రావు పేట, విజయవాడ -2 మరియు దోమల్ గూడ, హైదరాబాద్ -29]
ప్రస్తుతం ఏ న్యూస్ ఛానల్ చూసినా లేదా ఏ దిన పత్రిక ఆదివారం అనుబంధం చదివినా అందులో క్రైం స్టోరీ తప్పక కనిపిస్తుంది. ఆసక్తిగొలిపే ఈ క్రైం స్టొరీల ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమాజంలోని నేర ప్రవృత్తిపై ఎంతో కొంత ఉంటుంది. కస్తూరి మురళీకృష్ణ మొదట్లో రియల్ స్టొరీస్ పేరుతో క్రైం స్టొరీలనే రాసినా క్రమంగా వాటి దిశను క్రైం నుండి ఆత్మ విశ్వాసం పెంచే స్ఫూర్తివంతమైన వాస్తవ గాథల వైపుకు మళ్ళించారు. వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని కొంత కల్పనను జోడించి పాఠకునికి ఆసక్తి రేపే విధంగా రాసిన ఈ కథలు మానవ జీవితంలోని అనేక వైఫల్యాలను, వైకల్యాలను, ఆటంకాలను అనుకూలంగా మలచుకుని లోకానికి ధైర్యంగా ఎదురునిలిచిన వారిని మనకు చూపిస్తాయి. నిరాశ నిస్పృహలనుండి ఆశ వైపుకు మనలను తీసుకు వెళతాయి.
సమస్యలను హింస మొదలైన అనాగరిక చర్యల ద్వారా కాకుండా చట్ట బద్ధమైన న్యాయ పోరాటం ద్వారా పరిష్కరించుకొన వచ్చని కేటీ అనే ఒక మహిళ నిరూపిస్తుంది. అమెరికా సైనికులు బర్మా ప్రజలపై జరుపుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూ అమెరికా కోర్టులలో కేసు వేసి 12 సంవత్సరాల పాటు శాంతియుత న్యాయ పోరాటం చేసి చివరకు బాధితులకు నష్ట పరిహారం చెల్లించేటట్లుగా చేసి పునరావాసం, విద్య ఆరోగ్య వసతులును వారికి కల్పించేటట్లు చేయగలిగింది ఈ సాధారణ మహిళ.
తన పూర్వీకుల వృత్తాంతాన్ని తెలుసుకునే ప్రయత్నంలో నీగ్రోల బానిస బ్రతుకును, వారి దారిద్రాన్ని, శ్వేత జాతీయుల అహంకారాన్ని, సంకుచితత్వాన్ని చూసి తన తెల్ల బంధువులైన ‘బ్యూమోంట్’లపై నీల్ హెన్రీ ద్వేషం పెంచుకుంటాడు. ఒకప్పుడు తాము దౌర్భాగ్యమైన జీవితం గడిపినా కష్టపడి ఒక్కో మెట్టూ ఎక్కుతూ పైకి వచ్చారు. తెల్లవారిమన్న జాత్యహంకారంతో విఱ్ఱవీగిన బూమోంట్‌లు కష్టాల పాలయ్యారు. ఈ సత్యం తెలుసుకున్న హెన్రీలో ద్వేషం నశిస్తుంది. తాము చేసిన తప్పులకు తర్వాతి తరంవారు శిక్ష అనుభవిస్తారనే విషయం ఈ కథ ద్వారా బోధ పడుతుంది.
పాలస్తీనాలో క్షణ క్షణం బ్రతుకు భయంతో జీవితం గడుపుతున్న అహ్మద్ అనే కుర్రాడు బ్రిటీష్ పౌరురాలైన తన తల్లి ఐలీన్ దగ్గరకు చేరేందుకు అష్ట కష్టాలు పడి పట్టుదలతో ఇజ్రాయెల్ లోని బ్రిటీష్ దౌత్య కార్యాలయానికి చేరడం ‘ఎగిరి వచ్చిన పావురం’ అనే కథలో చదువుతాము. మనిషి ఎంత నాగరీకుడైనా అతనిలోని బలహీనత అతడిని రాక్షసునిగా మారుస్తుంది అనే నిజాన్ని జాన్ రాబె తన 'ద రేప్ ఆఫ్ నాన్‌కింగ్' అనే పుస్తకంలో తెలియజేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాంకింగ్ ప్రాంతంలో చైనీయులపై జపాన్ సైనికులు జరిపిన అకృత్యాలను జాన్ రాబె ఈ పుస్తకం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పి సంచలనాన్ని సృష్టించింది. మావో జెడాంగ్ ప్రారంభించిన సాంస్కృతిక విప్లవం ప్రారంభ దశలో సిద్ధాంతాల ముసుగులో చైనాలో జరిగిన అత్యాచారాలను, దుష్కృత్యాలను లై జెన్‌షెంగ్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించి ప్రపంచానికి ప్రదర్శించి చైనాతో సహా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ కథల ద్వారా కస్తూరి మురళీ కృష్ణ ప్రపంచానికి మానవత్వ విలువలను గుర్తు చేస్తున్న ఒక మహిళను, ఒక కళాకారుడినీ పరిచయం చేస్తున్నారు.
నిజాలను నిర్భయంగా ప్రచురించే పత్రికా సంపాదకుడు గుడ్లో ఆత్మవిశ్వాసంతో అధికారులు చేస్తున్న అవినీతిపై పోరాడి గెలుస్తాడు ‘నిప్పులా తాకిన నిజం’ అనే కథలో. శిశు జననం అన్నది భగవంతుడి అద్భుతమైన సృజనాత్మకమైన కళా ప్రదర్శనకు నిదర్శనం అంటూ భ్రూణ హత్యకు తన వ్యతిరేకతను రచయిత పలికిస్తాడు ‘మరణం నుంచి జీవితం’ అనే కథలొ ఒక పాత్ర ద్వారా. జన్యు సంబంధిత వ్యాధితో పుట్టిన క్షణం నుండీ మరణం పొంచి ఉందని తెలిసీ అమూల్యమైన జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా, అర్థవంతంగా గడపాలనే బ్రియాన్ కథ హృదయాన్ని కదిలిస్తుంది. మెదడు ఎదగని తన సోదరి జూడిత్‌కు ప్రేమను పంచి ఆమెలోని సృజనాత్మక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన జాయ్స్ కథ పాఠకులకు సంతోషాన్ని కలిగిస్తుంది.
ఆత్మ స్థైర్యంతో, గుండె నిబ్బరంతో మాఫియా ముఠాల ఆటను కట్టించిన ‘టెరెస్సా’ కథ, పట్టుదల ఆత్మ విశ్వాశాలతో మృత్యువుతో పోరాడి గెలిచిన అభినవ సావిత్రి ‘జీన్ ఫ్లాయ్‌డ్’ కథ, చిన్నతనంలో ఏర్పడిన మానసిక వ్యాధికి కృంగి కృశించిపోకుండా మానసిక శాస్త్రవేత్తగా మారిన ‘డంకన్’ కథ ఇలా ప్రతి కథా పాఠకులను ఆకట్టుకుంటాయి. ఈ కథలలోని వ్యక్తులు ఆత్మస్థయిర్యం, ధైర్యం, సాహసం,పట్టుదల,ప్రేమ, శాంతియుత పోరాటం,మానవత్వం,బాధ్యత, విశ్వాసం,కారుణ్యం,దాతృత్వం మొదలైన లక్షణాల ద్వారా ప్రపంచాన్ని జయించిన తీరు పాఠకులకు స్ఫూర్తిని కలిగించి జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తుంది. రచయిత తాను అనుకొన్న లక్ష్యాన్ని ఈ పుస్తకం ద్వారా సాధించడం మరో రియల్ స్టోరీ!
ఈవారం జనవార్త మార్చి 15-21,2009 లో ప్రచురితం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి