...

...

18, మార్చి 2009, బుధవారం

పుస్తక సమీక్ష! -6 అక్షరాంజలి

(పుస్తకం పేరు: అక్షరాంజలి. పేజీలు 288, వెల: రూ.125/- ప్రతులకు: ఎమెస్కో బుక్స్, సూర్యా రావు పేట, విజయవాడ -2 మరియు దోమల్ గూడ, హైదరాబాద్ -29)
ప్రఖ్యాత యువ రచయితగా, కాలమిస్టుగా మనకు తెలిసిన కస్తూరి మురళీకృష్ణ కలం నుండి వెలువడిన పుస్తకమిది. ఒక ప్రముఖ వార పత్రికలో అక్షరాంజలి శీర్షిక పేరుతో ప్రపంచ సాహిత్యంలో విశిష్టమైనవిగా భావించిన నవలలను కొన్నింటిని పరిచయం చేయగా వాటిలో 50 పరిచయాలను ఎంపిక చేసి ఈ పుస్తక రూపంలో ప్రస్తుతం మనకు ఎమెస్కో వారు అందిస్తున్నారు. ఈ మొత్తం యాభై నవలలను సాంఘిక నవలలు, ఉద్యమ నవలలు, తాత్త్విక నవలలు, వినోదాత్మక నవలలు, సైన్స్‌ఫిక్షన్ నవలలు అనే ఐదు భాగాలుగా విభజించారు. ఈ వ్యాసాలన్నీ రచయితకు ప్రపంచ సాహిత్యంతో ఉన్న పరిచయాన్ని, అభిరుచిని, ఆకళింపును స్పష్టం చేస్తున్నాయి. తాను పరిచయం చేయదలచుకున్న నవలను పాఠకులకు ఆసక్తి కలిగించే విధంగా వ్రాయడం కస్తూరి మురళీకృష్ణ ప్రత్యేకత. కేవలం నవలలోని కథను పరిచయం చేయడం మాత్రమే కాకుండా ఆ నవలాకర్త జీవిత విశేషాలు, ఆ రచయిత ఇతర రచనలు, ఆ నవల నేపథ్యం, ఆ నవల వెలువడిన అనంతరం వచ్చిన స్పందన, ఆ నవలకు వచ్చిన పురస్కారాలు, ఆ నవలపై తన అభిప్రాయం వగైరా అన్నీ వ్రాస్తారీ పుస్తకంలో. దానితో ఆ నవలపై పాఠకునికి ఒక స్పష్టమైన అభిప్రాయం కలుగుతుంది.
ప్రపంచంలో ఏ ప్రాంతమైనా ప్రజల ఆలోచనలు, అవసరాలు, ప్రవర్తనలు, ఆకాంక్షలు ఒకే విధంగా ఉంటాయన్న విషయం ఈ పుస్తకం చదివితే అర్థమౌతుంది. పేద ధనిక తారతమ్యం, వర్ణ రూప భేదాలు, ఆత్మవంచన, ద్వంద్వ ప్రవృత్తి, మనుష్యుల మానసిక ప్రకోపాలు ఏ మారుమూలనైనా ఏకస్వారూప్యతను కలిగిఉంటాయని ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఇతర దేశాలపై సగటు భారతీయుడికున్న అభిప్రాయాలను ఈ వ్యాసాలను చదివితే మార్చుకోవాల్సి వుంటుంది. ప్రతి చోటా వెలుగు చీకటి రెండూ వుంటాయని చీకటి కోణాన్ని తెలిపే రచనలకు ప్రజల నుండి, సమాజం నుండి విశేష స్పందన వస్తుందని అవగతమౌతుంది. భూతల స్వర్గమని మనం భావిస్తున్న అమెరికా ముసుగును తొలగించి అసలు రూపాన్ని చూపిస్తుంది సింక్లెయిర్ లూయిస్ రచించిన 'బాబిట్', అప్టాన్ సింక్లెయిర్ రచించిన 'ది జంగిల్' అనే గ్రంథాలు. అవినీతి, మోసం అనే పదాలకు ఆమడ దూరం ఉంటుందని మనం భావించే కమ్యూనిష్టు, సోషలిస్టు దేశాలలో ప్రత్యేకించి రష్యాలో తద్భిన్నంగా అవినీతి, దుర్భర జీవితం, అవకతవకలు మొదలైన వాటిని గురించి 'డెడ్‌సోల్స్(నికొలాయ్ వాసిల్యేవిచ్ గొగోల్)', 'వన్‌డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇవాన్ డెనిసోవిచ్(అలెక్జాండర్ సోల్జెనెస్తిన్)' నవలలు బట్టబయలు చేస్తే స్వేచ్చా శృంగారంలోని డొల్ల తనాన్ని 'మదాం బోవరీ(గుస్తావ్ ఫ్లాబెర్ట్)', 'ఎస్(జాన్ అప్‌డైక్)', 'ఫియర్ ఆఫ్ ఫ్లైయింగ్(ఎరికా జాంగ్)' నవలలు ఎత్తి చూపిస్తాయి. నీగ్రో బానిస బ్రతుకులను ప్రతిబింబించే 'టు కిల్ ఎ మోకింగ్ బర్డ్(హార్పర్ లీ)' , 'ది గ్రాస్ ఈజ్ సింగింగ్(డోరిస్ లెస్సింగ్)' 'ది కలర్ పర్పుల్(అలైస్ వాకర్)' అంకుల్ టామ్స్ కాబిన్(హారియట్ బీచర్ స్టోవ్)', రూట్స్(అలెక్స్ హేలీ) మొదలైన నవలల పరిచయం ఈ పుస్తకంలో ఉంది. సి.పి.స్నో రచన 'ది మాస్టర్స్'లోని రాజకీయపు ఎత్తుగడలు నేటి రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోవు. హోనోర్ డి బాల్జాక్ నవల 'ఓల్డ్ మాన్ గోరోత్' బంధుత్వాలు, ప్రేమానుబంధాలు డబ్బుతో ముడిపడివుండటాన్ని,మానవ జీవితంలోని నిష్ఫలత్వాన్ని చక్కగా ఎత్తిచూపుతోంది. ఇంకా ఈ పుస్తకంలో మన తెలుగు వారికి సుపరిచితమైన అలెక్స్ హేలీ 'రూట్స్', చార్లెస్ డికెన్స్ 'డేవిడ్ కాపర్ ఫీల్డ్', మాక్జిం గోర్కీ 'ది మదర్', మారియోపుజో 'ది గాడ్ ఫాదర్' మొదలైన పుస్తక పరిచయాలున్నాయి.
కస్తూరి మురళీకృష్ణ గారు ఎంపిక చేసుకున్న నవలలన్నీ ఆయా రచయితల జీవితంలో అనుభవించిన లేదా చూసిన ఘటనలను ఆధారంగా వెలువడినవి కావడం గమనించదగ్గ విషయం. ఈ నవలలన్నీ ఆయా రచయితల 'జీవిత చరిత్రలు'గా మనం అనుకోవచ్చు. రచనా శైలిలోనూ, సంవిధానంలోను, సన్నివేశ కల్పనలోనూ, సాహితీ సృజనలోనూ వివిధ దేశాల రచయితల ప్రతిభను ఈ పుస్తకం మనకు చూపెడుతుంది. ఆ రచనలు వెలువడిన కాలంలో కొన్ని రచనలకు తగిన గుర్తింపు రాకపోయినా తర్వాతి కాలంలో వాటిని 'క్లాసిక్'గా గుర్తించబడిన తీరు చూస్తే మంచి రచనలకు ఎప్పటికైనా ప్రశస్తి లభిస్తుందని తేలిపోతుంది. ప్రపంచ నవలా సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేసి వారికి ఒక విశాల దృక్పథాన్ని చుపిస్తున్న కస్తూరి మురళీకృష్ణ నిజంగా అభినందనీయులు.
ఈవారం జనవార్త మార్చి 15-21,2009 లో ప్రచురితం

కామెంట్‌లు లేవు: