...

...

1, మార్చి 2009, ఆదివారం

పుస్తక సమీక్ష! - 5 కోటలో నారాజు

గ్రంథావలోకనమ్ నుండి
[కోటలో నారాజు(చారిత్రక నవల) రచన: శ్రీమతి సత్యవాడ(ఓగేటి) ఇందిరాదేవి ప్రతులకు: ఓగేటి పబ్లికేషన్స్,3-6-470,ఫ్లాట్ నెం.103,పావని సత్యా కాంప్లెక్స్,రోడ్‌నెం.6,హిమాయత్ నగర్ హైదరాబాద్ 500 029 పేజీలు:150 వెల:రూ.100/-]
పుస్తకాలు చదవడమే గగనమైన ఈ కాలంలో చారిత్రక నవలలు చదివే వారు వుంటారా? అనే అనుమానం కలగడం సహజం. దీనిని నివృత్తి చేస్తూ సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి సత్యవాడ(ఓగేటి) ఇందిరాదేవి గారి కలం నుండి ఒక మంచి నవల కోటలో నారాజు వెలువడింది. ఆద్యంతమూ ఆసక్తిగా చదివించే గుణం కలిగిన ఈ నవల కాకతీయుల చరిత్ర ప్రత్యేకించి ప్రతాపరుద్రుని చరిత్ర నేపథ్యంగా సాగుతుంది.
కాకతీయుల చరిత్ర పట్ల శ్రీమతి ఇందిరాదేవి గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం వున్నది. కాకతీయ శాసనాలపై వీరు సుధీర్ఘమైన పరిశోధన గావించారు. వీరు ఇదివరకే కాకతీయ వైభవం అనే రుపకాన్నీ, ఆనంద ధార అనే నవలనూ రచించారు. ప్రస్తుత నవల కాకతీయుల చరిత్రపై వీరికి కల అభిరుచిని ఇనుమడింప జేస్తున్నది.
కాకతీయ ప్రభువు గణపతిదేవ చక్రవర్తి మరణించాక అతని పుత్రిక రుద్రమదేవికి పట్టాభిషేకం చేయ నిశ్చయిస్తారు మహామాత్యుడు శివదేవయ్య, తిక్కన సోమయాజి. ఐతే ఏకశిలానగరంలో నెలకొన్న వ్యతిరేకత దృష్ట్యా కృష్ణాతీరం వెలంగపూడి అగ్రహారం వద్ద రుద్రమదేవి పట్టాభిషేకం అంగరంగవైభవంగా జరుగుతుంది. మగసంతానం లేని కారణంగా ప్రతాపరుద్రుడిని దత్తత చేసుకొని అతడికి రాచరికపు విద్యలలో శిక్షణనిప్పిస్తుంది. ప్రతాపరుద్రుడికి యుక్త వయసు రాగానే విశాలాక్షి అనే కన్యనిచ్చి వివాహం చేస్తుంది. వెనువెంటనే యువరాజ పట్టాభిషేకం కూడా జరిపిస్తుంది రుద్రమదేవి. ఆ పట్టాభిషేక మహోత్సవంలో మాచలదేవి అనే నర్తకి నాట్య ప్రదర్శనను చూసి ఆమెను మోహించి రాజనర్తకిగా నియమిస్తాడు ప్రతాపరుద్రుడు. అంబదేవ మహారాజుపై యుద్ధానికి వెళ్లుతుంది రుద్రమదేవి. మోసంతో రుద్రమదేవిని మట్టు పెడతాడు అంబదేవుడు. రుద్రమదేవి మరణంతో ఓరుగల్లు సామ్రాజ్యం శోకతప్తమౌతుంది. అంబదేవుడిపై ప్రతాపరుద్రుడు దండెత్తి అతడిని సంహరిస్తాడు. ఆ తరువాత ఢిల్లీ సైన్యాన్ని గోదావరీతీరంలో ఎదిరించి ఓడిస్తాడు. ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడిపోయి వూరుకోలేదు. మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఓరుగల్లు మీదికి సైన్యాన్ని పంపిస్తాడు. ఆ తురుష్క సైన్యం నెలరోజులు ముట్టడించి కొందరు ద్రోహులను ప్రలోభపెట్టి కోటలోనికి ఆహార పదార్థాలను ప్రవేశించకుండా చేస్తుంది. విధి వక్రించి చివరకు ప్రతాపరుద్రుడు ఢిల్లీ సైన్యానికి లొంగిపోతాడు. ఇదీ స్థూలంగా ఈ నవలలోని కథ.
ఐతే ఈ కథాంశాన్ని తెలియజేయడానికి రచయిత్రి కొన్ని కల్పిత పాత్రలను సృష్టించారు. లాస్య అనే యువతి తన మిత్రబృందంతో వరంగల్లుకు పిక్నిక్‌కు వెళుతుంది. ఓరుగల్లు విజయ తోరణాలను దర్శిస్తుంది. అక్కడ నుండి ఆమె వింతగా ప్రవర్తించడం మొదలౌతుంది. తనను మాచల్దేవిగా ఊహించుకుంటుంది. తన చుట్టూ ఉన్నవారిని విద్యానాథ కవిగా, మేచయ నాయకునిగా, జాయప సేనానిగా ఇలా సంబోధిస్తూ ఉంటుంది. లాస్య ప్రవర్తనకు వారి ఇంట్లోని వారు చింతిస్తారు. ఆమెను మామూలు మనిషిగా మార్చడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తారు. చివరకు లాస్య వంశీ అనే అతన్ని పెళ్ళి చేసుకొనడంతో కథ సుఖాంతమవుతుంది.
కథ ఎక్కడా విసుగు కలగకుండా రచయిత్రి ఎంతో సమర్థవంతంగా వ్రాశారు. పాల్కురికి, రాయప్రోలు, పుట్టపర్తి, మధునాపంతుల తదితర కవుల కవిత్వాన్ని సందర్భానుసారంగా 'కోట్' చేయడం బాగుంది. కాకతళీయంగానో, లేక కాకతీయంగానో లాస్యను పెళ్ళి చేసుకొనే వంశీ కూడా తనను తాను ప్రతాపరుద్రుడిగా భ్రమించడం దీనిలో కొసమెరుపు.
(నేటినిజం, అక్టోబరు2007)

కామెంట్‌లు లేవు: