...

...

6, జులై 2009, సోమవారం

ఓగేటి ఇందిరాదేవి చారిత్రక నవలలు - సంక్షిప్త పరిచయం

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి సత్యవాడ(ఓగేటి) ఇందిరాదేవిగారు మే 23వ తేదీన కన్నుమూశారన్న వార్త సాహితీలోకాన్ని కృంగదీసింది. ఇందిరాదేవిగారు కథ, నవల, వ్యాసం, నాటకం, సాహిత్య రూపకం, గేయం, శతకం తదితర అన్ని ప్రక్రియల్లోనూ విరివిగా రచనలు చేసి పాఠకుల అభిమానాన్ని చూరగొన్న విదుషీమణి.సుమారు నాలుగున్నర దశాబ్దాలకు పైగా నిర్విరామంగా రచనలు చేసిన వీరు తమ జీవిత కాలంలో అనేక ప్రతిష్టాకరమైన పురస్కారాలను పొందారు.తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మ నిధి పురస్కారం, నోరి నరసింహ శాస్త్రి స్మారక పురస్కారం అందులో పేర్కొన దగినవి.సాంఘిక, పౌరాణిక, చారిత్రక, ఆధ్యాత్మక విషయాలలో వీరు తమ సాహిత్యాన్ని వెలువరించినా చారిత్రక రచనలపై ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నారు.

చరిత్ర పట్ల వీరికి ఉన్న మక్కువ వీరి రచనలలో ప్రస్ఫుటమయ్యింది.కాకతీయుల శాసనాలపై వీరు విశేషమైన పరిశోధన గావించారు.అమృతవర్షిణి,ఆనంద ధార, కోటలో నారాజు, నిరుడు కురిసిన హిమ సమూహములు అనే నాలుగు నవలలతో పాటు కాకతీయ వైభవం అనే నాటకం వీరిని అగ్రశ్రేణి చారిత్రక రచయిత్రిగా నిలబెడుతోంది.వీరి చారిత్రక నవలలను ఈ వ్యాసంలో పరిచయం చేసుకుందాం.

అమృత వర్షిణి: ఈ నవలలో రచయిత్రి కన్నడ కవిత్రయంగా పేరుపొందిన రన్న, పొన్న, పంప కవులలో పొన్న, పంప కవులను తెలుగువారిగా నిరూపించే ప్రయత్నం చేశారు.పంప మహాకవి చాళుక్య చక్రవర్తి రెండవ అరికేసరి కోరిక మేరకు మహాభారత కావ్యాన్ని కన్నడంలో విక్రమార్జున విజయం పేరుతో రచిస్తాడు. పంప కవి సోదరుడు జిన వల్లభుడు తన స్నేహితుడైన మల్లియ రేచనను ప్రోత్సహించి కవిజనాశ్రయం అనే చందశ్శాస్త్ర గ్రంధాన్ని తెలుగులో వ్రాయిస్తాడు. పంప కవి చరిత్రతో ప్రారంభమైన ఈ నవల నన్నయ ఆంధ్ర మహా భారత రచనతో ముగుస్తుంది. విక్రమార్జున విజయం, కవిజనాశ్రయం, ఆంధ్ర మహాభారతం కావ్యాల ఆవిష్కరణకు దారితీసిన పరిస్థితులకు సంబంధించిన ఇతివృత్తం ఈ నవలలోని వస్తువు.ఆ కాలంలో జైన, వైదిక మతాల మధ్య సంబంధాలు, కన్నడాంధ్ర భాషల మధ్య సయోధ్య మొదలైన విషయాలు చిత్రీకరించారు రచయిత్రి ఈ నవలలో. శృంగార, హాస్య, కరుణ, వీర రసాలను రచయిత్రి ఈ నవలలో చక్కగా పోషించారు.

ఆనందధార: అమృత వర్షిణి నవలలో నన్నయ్య గురించి వ్రాస్తే, ఈ నవలలో తిక్కన గారి చరిత్ర ఉంది. కాకతీ రుద్రమ దేవిని తండ్రి గణపతి దేవుడు అల్లారు ముద్దుగాపెంచి అన్నివిద్యలూ నేర్పిస్తాడు. గణపతి దేవుని మరణానంతరం రుద్రమ మహారాణి అవుతుంది. అడుగడుగునా ఆటంకాలను ఎదుర్కుంటూ రుద్రమదేవి దేశ రక్షణ కోసం శౌర్యాన్ని ప్రదర్శిస్తుంది. శత్రు రాజుల దండయాత్రలో రుద్రమను రక్షించబోయి ఆమె ప్రియసఖి వకుళ, భర్త వీరభద్రుడు, రామప్ప ప్రాణాలు త్యజిస్తారు. ఈ నవలలో సన్నివేశలన్ని అద్భుతంగా ఉండి, ఉత్కంఠమైన మలుపులు తిరుగుతూ పాఠకులను ఆకట్టుకుంటుంది. ఈ నవల దూరదర్శన్‌లో ధారావాహికగా ప్రసారమయ్యింది.

కోటలో నారాజు: ఈ నవలకూడా కాకతీయుల చరిత్రకు సంబంధించినదే. ఆనందధారలో రుద్రమదేవి హృదయం ఆవిష్కరింపబడితే ఈ నవల కోటలో నారాజు లో ప్రతాపరుద్రుడి పరాక్రమాన్నీ, రసికతనూ చూస్తాము.కాకతీయ ప్రభువు గణపతి దేవ చక్రవర్తి మరణించాక అతని పుత్రిక రుద్రమ దేవికి పట్టం కడతారు. మగ సంతానం లేని కారణంగా ప్రతాపరుద్రుని దత్తత తీసుకుని అతనికి రాచరికపు విద్యలలో శిక్షణనిప్పిస్తుంది రుద్రమ్మ. ప్రతాపరుద్రునికి యుక్తవయసు రాగానే యువరాజ పట్టాభిషేకం జరిపిస్తుంది. ఆ పట్టాభిషేక మహోత్సవంలో మాచలదేవి అనే నర్తకి నాట్య ప్రదర్శనకు మోహితుడై ఆమెను రాజనర్తకిగా నియమిస్తాడు ప్రతాపరుద్రుడు. అంబదేవ మహారాజుపై జరిగిన యుద్ధంలో రుద్రమదేవిని మోసంతో మట్టుపెడతాడు అంబదేవుడు. రుద్రమదేవి మరణంతో ఓరుగల్లు శోకతప్త మౌతుంది. అంబదేవుడిపై ప్రతాపరుద్రుడు దండెత్తి అతడిని సంహరిస్తాడు. ఆ తర్వాత గోదావరీ తీరంలో ఢిల్లీ సైన్యాన్ని ఎదిరించి ఓడిస్తాడు. ఓతమిపాలైన ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఓరుగల్లు మీదికి సైన్యాన్ని పంపిస్తాడు. ఆ తురుష్క సైన్యం నెల రోజుల పాటు ముట్టడించి కొందరు రాజద్రోహుల సహాయంతో కోటలోకి ఆహార పదార్థాలను ప్రవేశించకుండా చేస్తుంది. విధి వక్రించి ప్రతాపరుద్రుడు ఢిల్లీ సైన్యానికి లొంగిపోతాడు. ఇదీ స్థూలంగా ఈ నవలలోని కథ. అయితే ఈ కథను నడపడానికి రచయిత్రి కొన్ని సాంఘిక పాత్రలను కల్పించి పాఠకులకు విసుగు కలగ కుండా నవలను చక్కగా నడిపారు.

నిరుడు కురిసిన హిమ సమూహములు: ఇది ఒకరకంగా ఇందిరాదేవిగారి స్వీయ చరిత్ర అనుకోవచ్చు. ఇందులో స్వేచ్చ అనే పాత్ర ఇందిరాదేవి గారిదే. తమ పూర్వీకుల కుటుంబ చరిత్రను భారత స్వాతంత్రోద్యమంతో మేళవించి ఈ రచన చేశారు ఇందిరా దేవిగారు. గాంధీ సిద్ధాంతాలు, స్వావలంబన సిద్ధాంతము, గ్రామస్వరాజ్యము,మద్యపాన వ్యతిరేక ఉద్యమం మొదలైన విషయాలు ఈ నవలలో ఉన్నాయి. ఈ నవలలో ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను రచయిత్రి ఆవిష్కరిస్తున్నారు. ఆనాటి సంఘ దురాచారాలను చూచాయగా ప్రస్తావించారు. విధవా వివాహాలు, వర్ణాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలు మొదలైన సంఘ సంస్కరణల ప్రసక్తి ఈ నవలలో ఉంది. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో సాహిత్య రంగంలో జరిగిన పురోగతి దీనిలో చూపబడింది.

ఈ నవలలన్నీ శ్రీమతి ఓగేటి ఇందిరాదేవి గారి సామర్థ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. వీరి రచనలు ఎక్కడా పాఠకులకు విసుగు కలిగించకుండా అత్యంతాసక్తితో చదివిస్తాయి. సందర్భానుసారం ఈ నవలలో అక్కడక్కడా ప్రముఖ కవుల కవిత్వం, అనేక పాటలు, పద్యాలు, జానపద గేయాలు వాడుకున్నారు. ఫై నవలలు ఇందిరాదేవిగారికి చారిత్రక నవలా రచయిత్రిగా ఆంధ్ర సాహిత్యంలో ఒక సుస్థిర స్థానాన్ని కల్పిస్తున్నాయి. శ్రీమతి ఓగేటి ఇందిరాదేవి గారు భౌతికంగా దూరమైనా తమ రచనల ద్వారా పాఠకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.
(మూసీ సాహిత్య సాంస్కృతిక చారిత్రక మాస పత్రిక జూలై - 2009 సంచికలో ప్రచురితం)

3 కామెంట్‌లు:

Kalpana Rentala చెప్పారు...

indira devi gaari gurimchi vinatame tappa aame rachanalu chadivimdi ledu. manchi information.thanks for writing detailed artilce.

Kalpana Rentala

కొత్త పాళీ చెప్పారు...

వీరి గురించి ఇంతకు మునుపు తెలియదు. మంచి రచనలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

Unknown చెప్పారు...

Naaku aanandha dhara navala kaavali.
Please ekkada dhorukuthundhi cheppandi.