...

...

11, ఆగస్టు 2012, శనివారం

టి.శ్రీవల్లీరాధిక గారి సత్యం కథపై విశ్లేషణ!!

                   నేను విశ్లేషణకు ఎంచుకున్న కథ టి. శ్రీవల్లీరాధిక గారి సత్యం. 


          ఈ కథ లో రచయిత్రి అద్వైత సిధ్ధాంతాన్ని చాలా సరళంగా ప్రతిపాదించారనిపించింది. అహంకారంతో ఏ విషయాన్నైనా ఇదింతే అని సిధ్ధాంతీకరించేస్తాం. సత్యాన్ని విభిన్నంగా వారి వారి భావావేశాల కనుగుణంగా విభజించుకుంటాం. 


          ఎన్నో ఏళ్ళుగా శైలజ ఇంట్లో పని చేసే సత్తెమ్మ ఒక నిరక్షరాస్యురాలు. స్పందన, తర్కం తెలియదు. కాని తన అనుభవసారంతో యజమానురాలి బలహీనతని భయంగా జమ కడుతుంది. అందుకే అంటుంది “నేనెక్కడ మానేస్తానో అని శైలజమ్మ కి భయం” అని. 


            భయం ఒక బలహీనత. దాన్ని అహంకారం మాటున దాచుకుని తన కన్నా తక్కువ స్థాయి వారిని అమానవీయంగా ఛీత్కరిస్తారు. ఇది శైలజ పాత్ర లో మనకి కనబడుతుంది. 


            సంతోష్ ని హూంకరించిన పూలచీరావిడ అహంకారం వెనుక అంతర్లీన శోకం కనిపిస్తుంది. పనిమనిషి పనిలోకి రాకపోతే మనం అచేతనులం. 


           ఈ భయ శోకాల మాయ కమ్ముకున్నపుడు విచక్షణ కోల్పోయి ఆధిక్యం చూపడం జరుగుతుంది. ఆ మాయ వీడిపోతే, ‘అవును ఇది ఇలా ఉంది కాబట్టి అది అలానే ఉంటుంది’ అన్న సత్తెమ్మ మాటలు అక్షర సత్యాలన్న విషయం అర్ధమవుతుంది. 


          ప్రతి వర్గం వారు ఒక సిధ్ధాంతాన్ని వారి ఆలోచనా ప్రాతిపదికగా తర్కించి విభేదిస్తారు. కాని ఒక నిర్వికార అనుభవసారంతో తనకి తెలిసిన ఒక సత్యాన్ని సత్తెమ్మ ఒక కొత్త కోణంలో చెప్పడం చాలా బాగుంది. 


           అయితే రచయిత్రి ఒకచోట ఇలా అంటారు. “ఏదో ఒక విషయాన్ని నమ్మడమే మన అందరికీ ఇష్టమయినపుడు దానికి అందరమూ సిధ్ధమయినపుడు అది అందరికీ అంతగా అలవాటయిన విషయమయినపుడు అందరమూ ఒకటే విషయాన్ని ఎందుకు నమ్మలేం? అసహనం, ఘర్షణా లేకుండా ఎందుకు ఉండలేం” అని. 


           ఈ పై వాక్యాలలో "ఐతే అది అందరికీ అంతగా అలవాటయిన విషయమైనపుడు" అన్నదానికన్న “అయితే అది అందరికీ అంతగా ఆచరణాత్మకమైన విషయమైనపుడు” అని ఉంటే బాగుండు ననిపించింది. 

            మొత్తమ్మీద మానవ స్వభావంలో బహీనతలు, భయాలు వాటి మాటున ”సత్యం“ అన్నది విభిన్నంగా తోచడం, అదే అహంకారాన్ని కాస్త పక్కన పెట్టి నిశితంగా గమనిస్తే సత్యం ఒక్కటే అన్నది బాగా విశ్లేషించారు రచయిత్రి.

- లలితారాణి

(సాహితీసంహిత బ్లాగు సౌజన్యంతో)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి