...

...

29, అక్టోబర్ 2012, సోమవారం

కొడిగట్టరాని చిరుదీపాలపై శైలజామిత్ర విశ్లేషణ!


ఒకప్పుడు కుటుంబం ఆంటే అమ్మ నాన్న, పిల్లలు, వీలయితే నానమ్మ, తాతయ్య వారందరితో పాటు కనీసం నలుగురు లేదా కనీసం అయిదు మంది పిల్లలతో  అందరూ కలిసి ఉండేవారు. . నేడు ఎవరికీ వారే యమునా తీరే అన్న చందంగా అమ్మ నాన్న  ఒకరో లేక ఇద్దరో పిల్లలతో జీవిస్తూ, అదే జీవితమని మురిసిపోయే రోజులు వచ్చాయి. పోనీ ఇదివరకటిలా అమ్మ వంటింటిలో కనిపిస్తోందా ఆంటే అదీలేదు. అమ్మ కూడా ఉద్యోగం పేరిట ఉదయం వెళితే రాత్రి వరకు రాకపోవడం, వచ్చిన కాసేపు అలసటగా ఏదో తిన్నాను అనిపించి నిద్రపోవడంతో కన్న బిడ్డలు ఎలా ఉన్నారు? స్కూల్ లో ఎలా ఉన్నాడు? అతని స్నేహితులు ఎవరు? ఎదిగిన పిల్లలయితే తాము లేనప్పుడు ఇంట్లో పిల్లలు ఏమి చేస్తున్నారు? కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరితో చాట్ చేస్తున్నారు? ఇవన్నీ గాలికి వదిలేసారు. ఏదో పిల్లో పిల్లవాడో ఎవరైతేనేమి ఒక ఖరీదైన స్కూల్ లో చేర్చాలి. చేతికి అడిగినంత డబ్బు ఇవ్వాలి. అని ఆలోచిస్తున్నారే తప్ప మరేమీ ఈ కాలపు తల్లి తండ్రులలో కనబడటం లేదు.  అదీ కాకుండా ఉన్న ఒక్క బిడ్డని అతి గారాబం చేయడం కూడా ఒక తప్పుగా పరిణమిస్తోంది. విమల ఆనంద్ ది చక్కని జంట. పేరుకు తగ్గట్లుగా వారికో కుమారుడు పేరు విజయ్ తన చిన్నతనంలోనే తన తల్లి తండ్రులు తనతో ఏమాత్రం సమయాన్ని కేటాయించలేక పోతున్నారని బాధపడేవాడు. అలా అనుకుంటూనే అలవాటు పడిపోయాడు. అయితే ఎలా? పనికిరాని విడియో గేమ్స్ ఆడటం నేర్చుకున్నాడు. ఆంటే ఇక్కడ విడియో గేమ్స్ అన్నీ అలాంటివని కాదు. కొన్ని ఉదాహరణకు షాడో వారియర్, బ్లడ్, ఆర్మ గడ్దాస్ ,ఫ్రాన్కిన్స్టిన్ లాంటివి అన్నమాట. 
ఇవిలా ఉంచితే ఉన్నట్లుండి ఆ ఇంటికి పెద్ద దిక్కయిన ప్రకాశరావు ను తలపై మోది ఎవరో చంపేశారు. అయితే ఎవరు? డబ్బుకోసం కాదు. మరే ఇతర శత్రువులు అతనికి లేరు. మరెలా ఎవరు చంపారు? అనే ఆలోచనతో కొడుకు ఆనంద్ చాలాకాలం సతమతం అయ్యాడు. తర్వాత తాతగారు పోయినప్పటి నుండి రాజేష్ మౌనంగా ఉన్న కారణంగా వారి తల్లి తండ్రులు రాజేష్ ను సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకుని వెళతారు. ఒకవేళ ఆయన మరణం ఈ పసితనానికి షాక్ గా మారిందేమో అని వారి అనుమానం. గైనకాలజిస్ట్ అయిన రాజేష్ తల్లి విమలకు ఈ  డా. వర్మ క్లాస్ మాటే అదీ కాకుండా స్నేహితుడు కూడా. దాంతో మరింత శ్రద్ధతో గమనిస్తాడని వీరు తీసుకుని వచ్చారు. కాస్సేపు మౌనంగా ఉన్నా మరి కాస్సేపు మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టి తన అలవాట్లను, తనకు తాతయ్యకు మధ్య నిరంతరం సాగే ఆటలు గురించి చెప్పడంలో ఆ చిన్న వయసులోనే ఆ ముఖంలో ఏదో తెలియని ఉన్మాదం డాక్టర్ గమనించాడు.అప్పటికి అనవసరమేమో ఆనుకున్నా తల్లి విమల తీసుకుని వెల్లి పోయినా మరుసటి రోజూ రాజేష్ ఆడే ఆటలు గమనించాలని ఇంటికే డాక్టర్ రావడం జరిగింది. ఇక ఆపై రాజేష్ అదే వికృతమయిన ఆటలను చూసి ఆశ్చర్యపడి ఏదో అనుమానంతో  డాక్టర్ వర్మ షాడో వారిఎర్ లో తనను మించి స్కోరు ఎవరికీ రాదని అంటుంటే డాక్టర్ కూడా ఆడటమే కాదు. ఏకంగా రాజేష్ ను దాటిపోవడం కూడా జరిగింది. దాంతో తట్టుకోలేని రాజేష్, డాక్టర్ గొంతు పట్టుకున్నాడు. ఆవేశంతో ఆ ముఖం ఎర్రబడి వికృత రూపం దాల్చడంతో వెంటనే అక్కడే ఉన్న తల్లితండ్రులు పట్టి ఆపేరు. విశ్రాంతిగా పడుకోపెట్టారు. తల్లిగా విమల విల విల లాడింది.
డాక్టర్ వర్మ, రాజేష్ ను  మెల్లగా ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి ఒక్కో ప్రశ్న అడుగుతుంటే  తాత తో తాను ఆడటం, ఎప్పుడూ ఓడిపోయే తాత గెలిచిపోతుండటం తాను తట్టుకోలేక పోయానని. అందుకే అక్కడే ఉన్న ఇనప క్యారిఎర్ తో తలపై మోదానని దాంతో తాతయ్య  అదీ మళ్లీ లేవకుండా పోయాడని చెప్పడం విని అక్కడివారంతా నిశ్చేష్టులయ్యారు.
 ఈ కధలో వస్తువు బావుంది. శిల్పం బావుంది.  నేడు సమాజానికి ఒక హెచ్చరిక గా కూడా ఉంది.  నేడున్న విజ్ఞానం ఎంతగా శాడిజం పిల్లలలో పెంచుతోందో తెలియజేసారు. తల్లి తండ్రులు కేవలం డబ్బు సంపాదించే మెషీన్స్ లా తయారవ్వడం ద్వారా పిల్లల మానసిక స్తితి ఎంతగా విక్రుతరుపం దాల్చుతోందో తెలియజేసారు. కాకుంటే కధా గమనంలో డాక్టర్ ను ఒకచోట వర్మ అని మరోచోట రమేష్ అని చెప్పడం పొరపాటుగా జరిగిందేమో కాని కధా పరంగా ఈ కధ సామాజిక దృక్పధం కలిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. 



కధను పూర్తిగా చదవడానికి చూడండి  

(శైలి బ్లాగు సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు: