...

...

24, ఫిబ్రవరి 2014, సోమవారం

సాహితీ జ్ఞాన సింధు

ఈ గ్రంథం చదివితే తెలుగు సాహిత్యంలో సర్దేశాయి సాధించిన, శోధించిన కృషి తెలుస్తుంది. వైజ్ఞానిక, సాహిత్య ప్రపంచాలలో, సామాజిక చరిత్రలో మరుగున పడిన వజ్రం సర్దేశాయి తిరుమల రావు. అమెరికన్‌, బ్రిటిష్‌, ఫ్రెంచ్‌, జర్మనీ, ఇటాలియన్‌, ఇండియన్‌ పత్రికలలో తిరుమలరావు పరిశోధనా పత్రాలు దాదాపు 302 ప్రచురణ పొందాయి. ఈ పుస్తకం- అనుబంధంలో భారతిలో వివిధ అంశాలపై వారు రాసిన వ్యాసాలను తేదీలతో సహా ప్రచురించారు. హిందూ ఆంగ్ల దినపత్రికలలో సర్దేశాయి రాసిన లేఖలలోని పలు అంశాల ప్రస్తావనలు ప్రచురించారు. పుట్టపర్తి జనప్రియ రామాయణం సమీక్ష విపులంగా ఉంది. రూపనగుడి కావ్యనిదానం పుస్తకానికి రాసిన పీఠికలో సర్దేశాయి తిరుమలరావు అభిప్రాయంతో ఏకీభవించాల్సిందే కవులు, రచయితలంతా. విమర్శ కృతజ్ఞతారహిత ప్రక్రియ. అయినా సాహిత్యంలో విమర్శనకు మహత్వపూర్ణస్థానమే ఉన్నది. ఇంగ్లీషున మథ్యూ ఆర్నాల్‌‌డ, వాల్టరు పాటరు , ఫ్రెంచిలో సైంటుబ్యూ, పాల్‌ వాలెరీ, రష్యను భాషలో టాల్‌‌సటాయి, జర్మనులో ఎకర్మన్‌, హెర్డర్‌,లెస్సింగు , ఇటాలియనులో క్రోచే వ్రాసిన సాహిత్య దార్శనిక విమర్శలు- ఆయా భాషల సాహిత్యాలకు ఓజస్సు, తేజస్సు తెచ్చిపెట్టినవి. తెలుగులో తిరుమలరావు పై విమర్శకుల స్థాయి గలవారు. 

తిరుమలరావు ఆయిల్‌ టెక్నాలజీలో అంతర్జాతీయస్థాయిలో పరిశోధనలు చేసిన గొప్ప వైజ్ఞానికవేత్త. కన్యాశుల్క నాటకకళ, సాహిత్య తత్వము- శివభారత దర్శనము గ్రంథాలను వారు రాసి ప్రచురించారు. విమర్శ- ప్రతివిమర్శ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి సంపాదకత్వంలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. ఆంధ్రపత్రిక, ది హిందూ, భారతి, బ్లిడ్జి, ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ, సైన్‌‌స టుడే పత్రికలలో రాశారు. 

అకాడమీలు, యూనివర్శిటీలు పూనుకుని తిరుమలరావు సమగ్ర సాహిత్యాన్ని (అన్ని పత్రికలలో వారు రాసిన వ్యాసాలు, డా పి.యం. భార్గవతో వాదించిన ద లిబరింత్‌ ఆఫ్‌ సైన్‌‌స వ్యాస పరంపర, వివిధ కలంపేర్లతో రాసిన వ్యాసాలతో సహా) ప్రచురిస్తే బాగుంటుంది. తి, నిశ్శంక తిమ్మణ్ణ, పైథోగొరస్‌- ఇలా తొమ్మిది కలంపేర్లతో వ్యాసాలు, విమర్శలు రాశారు. అవన్నీ వెలుగు చూడాలి. నేడు తెలుగునాట విమర్శకు, విమర్శకులకు చాలా కొదవ ఉంది. తిరుమలరావులాంటి నిశిత పరిశీలకుని సమగ్రసాహిత్యం అందుబాటులోకి వస్తే సాహిత్యానికి, సాహిత్యకారులకు ప్రయోజనం కలుగుతుంది. 

కథా, నాటక రచనల్లోనూ తిరుమలరావు తన సత్తా చాటారు. ఆ విషయాన్ని వారి నాటికలు- పగచిచ్చు, పద్మావతీ చరణచారణ చక్రవర్తి, కథానిక భూసూక్తమ్‌ నిరూపిస్తాయి. 12వ శతాబ్దంలోని జయదేవుడు/ పద్మావతి/ గోవర్ధనాచార్యుడు పాత్రలతో చారిత్రక నాటిక రాశారు తిరుమలరావు. స్క్రీన్‌ప్లే రాయడమే కాకుండా పద్యం ఏ రాగంలో పాడాలో సూచించి తన సంగీత పాండిత్య పరిజ్ఞానాన్ని చాటారు. ఆంధ్రపత్రికలో ప్రచురణమైన- సత్యం శివం, సుందరం అనినదెవరు? అనే వ్యాసం చాలా బాగుంది. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, నాగసూరి వేణుగోపాల్‌, రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద, రావినూతల శ్రీరాములు, సుర్యదేవర రవికుమార్‌ వ్యాసాలు ఈ పుస్తకానికి హైలైట్‌. ఓ మంచి పుస్తకాన్ని అందించింది అబ్జ క్రియేషన్స్. 
- తంగిరాల చక్రవర్తి

(సూర్య సాహిత్య సాంస్కృతిక వేదిక 'అక్షరం'పేజీ సోమవారం, 24 ఫిబ్రవరి 2014 సంచికలో ప్రచురితమైన సమీక్ష)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి