...
25, డిసెంబర్ 2008, గురువారం
ఏం పుస్తకాలు ఉచితంగా ఇవ్వకూడదా?
మన రచయితలు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తమ తమ రచనలను పుస్తకాల రూపంలో ప్రచురిస్తున్నారు.ఆ పుస్తకాలను పలువురు చదివి తమ అభిప్రాయాలను ప్రకటించాలని ప్రతి రచయితా కోరుకొంటాడు. తమ పుస్తకాలు సరియైన పాఠకుని చేతికి చేరాలని ఆశిస్తాడు ప్రతి రచయితా.తాము ప్రచురించిన పుస్తకాలతో లాభాలను గడించి దానితో జీవిక కొనసాగించాలని మామూలు రచయితలెవరూ కోరుకోవడం లేదు. తాము పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే అదే పదివేలు అనుకొనే రచయితలెందరో. అయితే పుస్తకంలో ఎంత పస వున్నా అది పాఠకుని దృష్టికి తీసుకు రావడానికి రచయిత బ్రహ్మ ప్రయత్నమే చేయాల్సి వుంటుంది. తమ పుస్తకాలకు తగిన ప్రచారం ఇవ్వడం ప్రస్తుతం గగన కుసుమంగా వున్నది. ప్రస్తుత తరుణంలో పత్రికలలో పుస్తక సమీక్షలే పుస్తకాలకు కొంతలోకొంత ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. ఆ సమీక్షలైనా ఆ పత్రికల ఇష్టాయిష్టాలపై, దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వుంటుంది.ఈ సమీక్షలకు తక్షణం లభించే స్పందనకూడా ఆ రచయితలు ఆశించినంతగా ఉంటుందని అనుకోవడం అసాధ్యం. పుస్తకాలనైతే ఎలాగో ప్రచురిస్తున్నారుగానీ వాటిని అమ్ముకొనే నేర్పును మాత్రం చాలామంది రచయితలు అలవరచుకోలేక పోతున్నారు. పేరున్న పుస్తక విక్రేతలపై భారం వేసి వారు అమ్మి పెట్టే ఒకటి రెండు ప్రతులకోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తూ వుంటారు మన రచయితలు.తమ పుస్తకాలను అమ్ముకోవడానికి మరో ఆధారం గ్రంధాలయాలు. అయితే గ్రంధాలయాలలో కొనుగోళ్లు ఆయా గ్రంధాలయాధికారుల అభిరుచులపై, నిధుల లభ్యతపై ఆధారపడిఉంటుంది.ఇటువంటి పరిస్థితులలో రచయితలు తమ పుస్తకాలను ఉచితంగా ఇవ్వకుండా ఏం చేయాలి? ఇంట్లో కట్టలుకట్టలుగా పడిఉండే బదులు వాటిని ఉచితంగానైనా సరే ఇచ్చి చదివించేలా చేయడం మంచిదా? కాదా? ఉచితంగా ఇవ్వగలం గాని వాటిని చదివించడం మాత్రం మన చేతుల్లో ఉందా?అంత ఖర్చు పెట్టి ప్రచురించి ఉచితంగా కాంప్లిమెంటరీల రూపంలో తోటి రచయితలకు, స్నేహితులకు, తెలిసిన వారికి ఇవ్వడం తప్పు అని గుడిపాటి, కస్తూరిమురళీకృష్ణ మొదలైన అనేక మంది రచయితల నిశ్చితాభిప్రాయం. వింజమూరి అచ్యుతరామయ్య లాంటివారు కాంప్లిమెంటరీ కాపీ ఇచ్చినా సున్నితంగా తిరస్కరించి మన మనసు నొప్పించకుండా ఆ పుస్తకం వెలలొ కొంత మొత్తం చెల్లించి ఆ పుస్తకాన్ని తీసుకుంటారు. అందరూ అచ్యుతరామయ్యలైతే నాకు ఈ టపా రాసే శ్రమ వుండేదికాదు కదా? మొదటి ఏడాది మాత్రం ఎవ్వరికీ కాంప్లిమెంటరి కాపీలు ఇవ్వవద్దని వేదగిరి రాంబాబు ఒకసారి నాతో అన్నారు. ఎంతో అనుభవంతో చెప్పిన మాట అది. అయ్యగారి శ్రీనివాస రావు లాంటి రచయితలు తమ పుస్తకాలను ఉచితంగా ఇవ్వరు. ఎంతోకొంత సొమ్ము పెట్టి తమ పుస్తకాలను కొనేలా మనలను ఒప్పిస్తారు. ఇది నిజంగా, మనస్ఫూర్తిగా ఆహ్వానించదగ్గ ప్రయత్నమే. ఇటువంటి ప్రతిభ మన రచయితలందరికీ ఉంటే ఎంత బావుణ్ణు? అటువంటి ప్రతిభ లేని రచయితలు తమ పుస్తకాలను ఇష్టపడి చదివే వారికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగితే ఫ్రీగా ఇవ్వడం తప్పు కాదని, తప్పనిదని నా అభిప్రాయం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్లు:
ఏంటిసార్ అరకు ఆసుని పెట్టారు .. ఆరుద్ర అంతటి వాడు .. అరకు రాణి గుండె తలుపు తట్టుతోందిరా అని చెప్పినా? :)
కాంప్లిమెంటరీల్ని గురించి మీరు చెప్పింది రైటో రైటు.
కొత్తపాళీ గారూ మీ కాంప్లిమెంటుకి ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి