...

...

18, జనవరి 2009, ఆదివారం

పుస్తక సమీక్ష ! - 3 తెరిణెకంటి ముట్టడి

[తెరిణెకంటి ముట్టడి - చారిత్రక నవల, రచన- యస్.డి.వి.అజీజ్, పేజీలు-79,వెల- రూ.50/-(5డాలర్లు), ప్రతులకు యస్.డి.వి.అజీజ్,46/634,బుధవార పేట, కర్నూలు-518 002 సెల్ల్:+91 99894 48353]
"చరిత్ర చదవటం వల్ల మనిషిలోని సంకుచిత భావాలు దూరం అవుతాయి. అంధ విస్వాశాలు, మూఢనమ్మకాలు తొలగిపోతాయి. విశాల దృక్పథం ఏర్పడుతుంది. ఈ కాలంలో కూడా మనిషి మతం కోసం మారణ హోమం సాగించటం, కులాల కోసం కుమ్ములాడుకోవడానికి కారణం? మనిషి పరిణామ చరిత్ర పట్ల, సామాజిక చరిత్ర పట్ల సరియైన అధ్యయనం లేక పోవడమే! సామాజిక అవగాహన లేని వ్యక్తి శాస్త్రవేత్త అయినా సామాన్యడితో సమానమే!" అంటారు రచయిత తమ ముందు మాటలో. క్రీ.శ.1801లో కర్నూలు మండలంలోని తెరిణె కల్లు (తెర్నేకల్లు అని వాడుకలో వుంది) గ్రామపు ప్రజలు బ్రిటీషు వారిపై జరిపిన పోరాటాన్ని అజీజ్ గారు ఈ నవలలో వివరించారు. మెకంజీ కైఫీయతులను, జిల్లా గెజిట్ ను పరిశీలించి లభ్యమైన సమాచారం తో రచయిత ఈ నవలకు రూపాన్ని ఇచ్చారు.తెలుగు నాట బ్రిటీష్ వారు విధించిన శిస్తుకు వ్యతిరేకంగా తెరిణెకల్లు గ్రామ ప్రజలు గ్రామపెద్ద నేతృత్వంలో 15రోజులపాటు కుంఫిణీ సైన్యం పై జరిగిన భీకర పోరాటం ఇందులో మనకు కనిపిస్తుంది. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఈ ఘటనను బ్రిటీషు వారిపై జరిగిన తొలి రైతాంగ తిరుగుబాటుగా రచయిత పేర్కొంటున్నారు.ఈ గ్రామస్థుల బలిదానం తర్వాతి తరాల వారికి ఉత్తేజాన్ని కలిగించి బ్రిటీష్ వారిపై సమరభేరి మోగించడానికి స్ఫూర్తిని రగిలించింది.
నిజాం నవాబు అలిఖాన్ అసఫ్ జాహి తన ఆధీనంలో వున్న బ్రిటీష్ సైన్యం ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో దత్తమండలాలను బ్రిటీషు వారికి గుత్తకు(లీజుకు) యిచ్చి వారిని వదిలించుకుంటాడు. పాలెగాళ్ల పెత్తనం కారణంగా కప్పం వసూలు చేయడం తలనొప్పిగా మారడం కూడా ఆ ప్రాంతాన్ని బ్రిటీష్ వారికి అప్పగించడానికి ఒక కారణం. థామస్ మన్రో ఆ ప్రాంతానికి ప్రిన్సిపల్ కలెక్టర్ గా నియమింపబడతాడు. మన్రో బ్రిటీష్ అధికారి అయినా తన చర్యల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొంటాడు.తన సామర్థ్యంతో పాలెగాండ్ర వ్యవస్థను నిర్మూలించి రైత్వారీ విధానాన్ని ప్రవేశ పెడతాడు. ఆ ఏడు తీవ్రమైన కఱవుతో సరిగ్గా పంటలు పండలేదు. బలవంతంగా అయినా శిస్తు వసూలు చేయమని మద్రాసు నుండి గవర్నరు ఆజ్ఞను అనుసరించి తన మనస్సు అంగీకరించక పోయినా మన్రో తప్పని సరై ఆదేశిస్తాడు.తెరిణె కల్లు గ్రామ పెద్ద ముతుకూరి గౌడప్ప ఈ ఆదేశాలను ధిక్కరిస్తాడు. పంటలే సరిగా లేనప్పుడు శిస్తు వసూలు చేయలేమని వచ్చే ఏడాది పంటలు సరిగా పండితే శిస్తు వసూలు చేసి పంపుతామని అధికారులకు స్పష్టం చేస్తాడు గౌడప్ప.ఈ ధిక్కారాన్ని సహించని బ్రిటీషు సైన్యాధికారి విలియం థాక్రే తెరిణెకల్లు గ్రామంపై దండెత్తడానికి పూనుకుంటాడు. థామస్ మన్రో ఆ సమయానికి అందుబాటులో లేకపోవడంతొ కలెక్టర్ మాథ్యూస్, థాక్రేకు తన ఆమోదాన్ని తెలుపుతాడు. బ్రిటీషు సైన్యం తమపై దాడికి సిద్ధమవడంతో తెరిణెకల్లు ప్రజలు వారిని వీరోచితంగా ఎదుర్కోవడానికి సన్నద్ధులవుతారు. రెండువర్గాల మధ్య 15రోజుల పాటు భీకర పోరాటం జరుగుతుంది. ఇరువైపులా వందల సంఖ్యలో చనిపోతారు. చివరకు గౌడప్పను, మరో ఇద్దరిని బ్రిటీషు సైనికులు పట్టుకుని వారిని ఉరితీస్తారు.స్థూలంగా ఇదీ కథ.ఈ కథను ఆసక్తి కలిగేలా నడపడంలో రచయిత కృతకృత్యులైనారు. అయితే ఇంకా విస్తృతంగా కథను అల్లగల అవకాశం ఉన్న ఇతివృత్తం ఇది. రచయిత ఎందుకో 73 పేజీల తోనే సరిపుచ్చారు.ఏమైనా చారిత్రక సంఘటనలను ప్రజలకు చేరవేసే అజీజ్ గారి ఈ ప్రయత్నం ప్రశంసనీయమైనది. చరిత్రపట్ల ఇష్టమున్న ప్రతి ఒక్కరూ చదివి ఆనందిచవలసిన నవల ఇది.

కామెంట్‌లు లేవు: