...

...

4, జనవరి 2009, ఆదివారం

సాహిత్యోపనిషత్

ఊకదంపుడు, వాగ్విలాసము టపాలు చూసిన తర్వాత ఇటీవలే అంతర్జాలంలో శోధించగా కనబడిన(చదివిన) శ్రీ శ్రీ - ఆరుద్రల సంవాదమును ఇక్కడ మీతో పంచుకోవాలని అనిపించింది. ఇది ఆరుద్ర గారి "సినీవాలి" లోనిది అనుకుంటున్నాను.



"స్వవిషయసూచిక"
(సాహిత్యోపనిషత్).


ఆరుద్ర
-------

ఏమయ్యా కవీ
నాదో మనవి
నువ్వెందుకు రాస్తున్నావ్
నూక లివ్వకపోయినా భావాల
మేక లెందుకు కాస్తున్నావ్?

శ్రీ శ్రీ
--------

చెప్పిందే చెప్పిందే మళ్ళీ చెప్పడం
అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కొందరి కిష్టం
చెప్పింది చెప్పి మెప్పించాలని
చేస్తున్నాను నేను నా రచనల్లో ప్రయత్నం
అదే అనుకుంటాను కవిత్వం
అనుకరణం అనవసరం
అంతేకాదు అనర్ధకం
అందుకనే దేవుణ్ణి సహా ఇమిటేట్ చెయ్యడం
మానెయ్యడం
అదీ నా ప్రయత్నం
అదే నా కవిత్వం
ఈ మేకలే నాలోని పెద్దపులికి ఆహారం
నా కవిత్వం ఆ వ్యాఘ్రం ఆకలి ఆహారం

ఆరుద్ర
-------

అచ్ఛా స్వేచ్ఛాజీవీ
చర్చకి చోటిచ్చావు
ఎవరూ చెప్పింది చెప్పడం
ఇలా చెప్పి మెప్పించడం
అదే నన్నమాట కవిత్వం అంటే
ఐతే కొందరు మెచ్చనంటే?

శ్రీ శ్రీ
---------

మెచ్చకుంటే మించిపోయెను

ఆరుద్ర
-------

ఇది గురజాడకి
ఇమిటేషన్ కదూ?

శ్రీ శ్రీ
---------

ఇమిటేషన్ కాదు కొటేషన్
ఇదివరకు కవులను మింగెయ్యాలనే
ఆకలి కాదిది
నిన్నటినుంచి ఇవాళ లాగ
నిరుటి కవులనుంచి నేటి కవులు పుడతారు
కందం రాసినవాడు కవేగాని
అంతింతో కందపద్య మల్లగలాడెల్లా
ఎంతమాత్రమూ కవికాడు

ఆరుద్ర
-------

ఒప్పుకొన్నాను తప్పకుండా ఈ సంగతి
చెప్పావుకావు ఈ మెప్పుగురించి

శ్రీ శ్రీ
---------

రుచీ, ఔచిత్యం ఇవీ ముఖ్యం మెప్పుకి
కవికోరే మెప్పు గండపెండేరం కాదు
సమానధర్ముల హృదయస్పందనం శిరఃకంపనం
అదీ గీటురాయి అసలైన కవిత్వానికి
వానలాగ ప్రజల హృదయాలల్లో వర్షించి
కొత్త భావాల బీజాలు జల్లేది కవిత్వం
ప్రజలు చప్పట్లు కొట్టే భావాలకి
పద్యాల రూపం ఇస్తే చాలదు
ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తూనే కవి
మెజారిటీకి అందని ఊహలు వెదకాలి
ఆ తర్వాత అతని మైనారిటీ ఓటు
ఆక్రమిస్తుంది ప్రజాహృదయంలో చోటు
ఏమైనాసరే కవిత్వం
మేలుకొల్పాలి కాని జోగొట్టగూడదు
అంతేనంటావా లేక----

ఆరుద్ర
-------

అప్పుడప్పుడది జోల ముప్పు ముంచుకొస్తే కేక...
అప్పుడప్పుడు అవుతుంది జీవితం దుఃఖభాజనం
అప్పుడు వెలుగు చూపించడం కవిత్వ ప్రయోజనం
అప్పుడప్పుడు జనం కళ్ళకి కప్పుతాయి ఏవో పొరలు
అప్పుడు కవిత్వం తొలగించాలి ఆయా తెరలు
బాధపడుతుంది ఒకప్పుడు గాయపడిన మనస్సు
గాధలను చెప్పి ఊరడించడమే కవియొక్క తపస్సు
అప్పుడప్పుడు అధికారులకీ పోతుంది కామన్‌సెన్స్
ఇప్పుడిప్పుడు పురోగమిస్తోంది మనయొక్క దేశం
ఇది కవిత్వానికి అనువైన నిజమైన సన్నివేశం
ఎప్పుడో మానిషాదతో పుట్టిందట మొదటి కవిత్వం
ఎప్పుడైనా అలాంటి ఘటనతో పుట్టడమే దాని తత్వం
అక్రమం జరగడం కవితకి నాందనేది ముఖ్యం
అంతటా అంతర్లీనంగానే ఉండాలి భరతవాక్యం
కవిత్వం సైన్స్, కారాదు కవి రచన కఠినమైన థిసిస్
కావాలి అది ఎడారిలో ఒయాసిస్సు అనుభవాల తేట సరస్సు
అందరికీ ఉపయోగపడాల్సినదే కవిత్వం
కొందరికి ఊహకందక పోవచ్చు లోని రహస్యం
అప్పుడు సామాన్య మానవుడికి చేయూత
ఇవ్వాలా సహృదయుడైన వ్యాఖ్యాత?


శ్రీ శ్రీ
---------

కవిత్వమ్మీద కవిత్వంకూడా కవిత్వమే
అది ఎప్పటికైనా తెలిసిపోయే రహస్యమే
ఈలోగా ఎవరైనా తికమక పడుతున్నప్పుడు
వ్యాఖ్యాత జోక్యం చేసుకోక తప్పదు
భావాల సరిహద్దులవద్ద కాపలా కాయాలి కవి
ప్రపంచాన్ని ప్రజానీకానికి విశదం చేయాలి కవి
చక్రాల్లో చక్రాల్లాగా అర్ధాల్లో అంతర్ధాలుంటాయి
కొంతమట్టుకే బోధపడవచ్చు కొందరికి
ఇంకా అందులో ఏముందో చెబుతాడు వ్యాఖ్యాత
అర్ధంకాని రహస్యం లేనట్టే అసలే బోధపడనిదంటూ ఏదీ
ఉండదు
అన్ని కళల్లాగే కవిత్వం కూడా
ఏక కాలంలో రెండు లెవెల్స్ లో పనిచేస్తుంది
అందుకే అసలైన కవిత్వం
ఏకకాలంలోనే పండిత పామరజన రంజకం
ఎవరో అనగా విన్నాను
"మనుష్యులంతా సమానులే గాని
కొందరు మరికొంచెం ఎక్కువ సమాను"లని
విదూషకుడి నోటంట వచ్చే నిజం లాంటిదిది
మనుష్యుల్లో హెచ్చు తక్కువలు సర్దుదాం మొదట
మనసుల్లో ఎగుడు దిగుడులు సర్దుకొంటా యాపిదప
సరేగాని నేనొకటడుగుతాను చెప్పు
ఛందస్సుల నియమ బంధంలో లేదా ముప్పు?



ఆరుద్ర, శ్రీశ్రీ లను స్మరించుకొనే అదృష్టం కలిగించినందులకు ఊకదంపుడు, రాఘవ గార్లకు కృతజ్ఞతలు.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

సంతోషమండీ.

vedantam sripatisarma చెప్పారు...

మురళీమోహన్ గారూ,

చక్కని సంవాదాన్ని అందించారు. ధన్యవాదాలు!
వేదాంతం శ్రీపతి శర్మ