...

...

7, జనవరి 2009, బుధవారం

హైకూ కైకూ?

మరొక కట్ అండ్ పేస్ట్ టపా!


హైకూ


ద్విపద ఉండగా
జపానీసు హైకూ
మనకు కైకూ?



ద్విపద


మన దేశి వృత్తము ద్విపద యుండగను
జాపాను వారి హైకు మనకు కైకు?

ముత్యాల సరాలు

మనకు కల ముత్తియపు సరముల
మరచి పోయి జపాను వారిది
పదియు నేడక్షరాల్ కలిగిన
హైకు కైకనెదన్!

కూనలమ్మ పదాలు

తెలుగు చందాలలో
పోవు పంథాలలో
కలవు అందాలులే
హై-కూనలమ్మా!

ద్విపద

మరతురో మనకున్న మంచి ద్విపదను
పొరుగింటి హైకన్న పుల్ల కూర గని



మత్తేభం
.


ఒక సందేహము `హైకూ మీద తల యెత్తెన్ దాని సిగ్గోసిరా
యొక హైకేమిటి జేసె గాని, మనకే పొద్దైననా భాషలో
నొక చందంబును మెచ్చి దాని వెనకో యీభాషలో నున్న వే
రొక చందంబును జూచి దాని వెనకో పోకున్నచో తోచదా?


తేట గీతి.


సంస్కృతంబున వృత్తాలు చాల వనిన,
జాతి యుప జాతి పద్యాలు చాల గలవు
ఇంట తిన రోసి హోటళ్ళ వెంట తిరిగి
నట్లు యీరీతి వెంపర లాడ నేల?


సీసం.

వ్రాయ గల్గిన వాడు వ్రాయ బూనెడునెడ
తగినన్ని చందముల్ తనకు లేవె?
కల్పనా చాతురి కనులకు గట్టింప
మన చందముల కేమి మహిమ లేదె?
రస పోషకంబులై రాణించ జాలిన
కమనీయ చందమే కాన రాదె?
వేయేండ్ల నుండి కవీంద్రులు వాడిన
చందంబు లన్నియు చచ్చు బడెనె?

ఆటవెలది.

యెందు చేత మనకు యీనాడు తెలుగులో
నున్న చంద మెల్ల సున్న యయ్యె?
యెందు చేత నేడు యితర భాషల నుండి
యీ యెరువు దెచ్చుకొను బుద్ధి పొడమరించె?


చంపక మాల.


అటులని క్రొత్త క్రొత్త చిగురాకులు వేయక నెల్ల కాలమొ
క్కటి యగు రీతిబట్టి జన గా దొక భాషకు నట్టులయ్యు నా
ర్భటమున వారసత్వముగ వచ్చిన సంపద నొల్లరోసి వే
రిట గల మంచి చందముల వేటలు మంచివి గావు చూడగన్.

సీసం.
ఏభాష నుండైన యేమైన దేవచ్చు
కన్న భాషకు ఉట్టి గట్ట రాదు
క్రొత్త భావంబుల గుప్పించ వచ్చును
పాతయే రోతని పలుక రాదు
కొంగ్రొత్త పలుకుల కూర్మి జేర్పగ వచ్చు
ఉన్నవాటిని విసర్జింప రాదు
నూత్న ధోరణులతో నింగి ముట్టగ వచ్చు
తెలుగుతనము తుంగ ద్రొక్క రాదు

ఆటవెలది.

భాష నభివృద్ధి జేయుట పాడి గాని
వృద్ధి పేరిట నాత్మ సంశుద్ధి లేక
నవసరము లేని యెరువుల నచ్చటచట
దేబిరించెడు కర్మ మిదేల మనకు?

9 కామెంట్‌లు:

Mallik చెప్పారు...

చాలా బాగుంది.

kasturimuralikrishna చెప్పారు...

హైకూ, ఐ, డోంట్ లైకూ!

అజ్ఞాత చెప్పారు...

yappa saMY....VERY GOOD

అజ్ఞాత చెప్పారు...

బాగుంది. మీ కవితలు బహు పసందు
కాని చిన్న సందేహము నాకు గలదు ఇందు
అచ్చ తెలుగున అప్పుతచ్చులా ఈ "కైకు" అన్న పదమెందుకు?
మీ జాతీయ భాష పట్ల మీకు గల అభిమానము ప్రకటించుకొనుటకా లేక హిందీ తెలుగు భాయి భాయి అని చెప్పకనే చెప్పుటకా?

mmkodihalli చెప్పారు...

మల్లిక్, కస్తూరి మురళీకృష్ణ, అజ్ఞాత, వేదాంతం వెంకట సత్యవతి గార్లకు,
మీ కౌంటర్లకు సంతోషం! ఇది నా స్వకపోల కల్పితం కాదు. ముందే చెప్పినట్లు ఇది కట్ అండ్ పేస్ట్ టపా! ఇది అంతర్జాలం నుండి సంగ్రహింపబడింది. నాకు తెలిసి "కైకూ" అన్న పదం హిందీ పదం కాదు ఉర్దూ పదం.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

bro, chala baagundi. kottha cartoonu geesanu. choodu.

చంద్ర మోహన్ చెప్పారు...

చాలా బాగుంది! ఎక్కడ కట్ చేశారు?

mmkodihalli చెప్పారు...

చంద్రమోహన్ గారూ! మీరు నాకు mmkodihalli@gmail.comకు ఈ-మెయిల్ చెయ్యండి. మీకు ఆ లింక్ పంపిస్తాను.

suryaprakash చెప్పారు...

నేర్పిన నెవరైన నేర్చుకుందు మాతృభాషను గూర్చి
కూర్చిన నేమి ఐదేడైదక్షరాల హైకు శ్రేష్ట భావంబు నేర్చి
నేర్పితిరా నేవనికైన సీస ప్రాస పద్య గద్యంబుల గూర్చి
కూర్చిన వాని గేలి సేయనేల హైకని కైపని భావంబు గూర్చి

మాతృభాష యన్న మమకార మెవరికి లేదన్న
పిత్రుపారంపర్య మన్న సంస్కర మిదన్న
సత్యమెన్నడు మరుగు సేయబడదు గదన్న
నిత్యము జనులు ఆశింపకున్న ఎందులో ఉన్నా!

భాష కున్నదేమో హద్దు భావానికిది అంటగట్ట వద్దు
భాష తోనైనా గ్రహింపకున్న పొదిక పొద్దు
భాష లందు తెలుగు తీపి యన్నది మరువ వద్దు
భాష నాతెలుగు భాష అది హైకన్న కైపన్న ముద్దు!

హద్దు లెందుకు
కూర్చబడిన భావం
సరి చూడగా

గ్రహింపకున్న
భాషకు లేదికర్ధం
చేయకనర్ధం

ప్రేమను పెంచు
భాషపై ప్రేమనుంచు
సరిగ చూసి

గ్రహింప రేల
భావంలోనైనా హైకు
పండితవర్యా!