...

...

4, ఏప్రిల్ 2009, శనివారం

పుస్తక సమీక్ష! -8 సంకల్పం

గ్రంథావలోకనమ్ నుండి
[పుస్తకం పేరు: సంకల్పం (కథల సంపుటి) రచన: గుమ్మా ప్రసాదరావు,వెల: రూ.80/-, ప్రతులకు: శ్రీ గుమ్మా ప్రసాదరావు, ఎల్ఇజి-259, హడ్కో, అమ్దీనగర్, భిలాయ్- 490 009 మరియు సాహిత్య నికేతన్, హైదరాబాద్ & విజయవాడ]




కవిత స్వప్న సుందరి, కథ సహధర్మ చారిణి.
కవిత అతిదూరాన తళుక్కున మెరిసే అప్సరాంగన
కథ చేరువగా ఉన్న చిర పరిచితురాలి వంటిది.
ప్రతివాని జీవితానికి సన్నిహితమైనది కథ
-డా. సినారె

సీనియర్ కథా రచయిత గుమ్మా ప్రసాదరావు ( కలం పేరు గుమ్మా నిత్య కళ్యాణమ్మ) గారి కథాసంపుటి సంకల్పం చదివాక పై వాక్యాలు గుర్తుకు వచ్చాయి. దీనిలోని కథలన్నీ సగటు మధ్య తరగతి జీవితాలకు సన్నిహితంగా ఉంటాయి. ప్రేమ, త్యాగం, అభిమానం, పెళ్ళి, దాంపత్యం మొదలైన మానవ సంబంధాలను రచయిత ఈ కథల్లో హృద్యంగా చిత్రించారు. దేశంకోసం ప్రాణాలు అర్పించే సైనికులను కన్నవారి మానసిక సంఘర్షణ సంకల్పం కథలో కనిపిస్తే, పెళ్ళిచూపులు కథలో కాబోయే కోడలి వ్యవహార దక్షతను పరీక్షించే ఒక ఆదర్శ స్త్రీమూర్తి దర్శనమిస్తుంది. పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చిన ఆడపిల్లను కన్నవారే పరాయి దానిలా మర్యాదలు చేస్తే ఆమె పడే బాధ కూతురొచ్చిన వేళ కథలో ఆవిష్కరింప బడింది. భార్యాభర్తల మధ్య కోపతాపాలు తాత్కాలికమైనవి అనే సత్యాన్ని జీవన న్యాయం కథలో రచయిత చెబుతారు. ఓ యువతి దురుసుతనం కారణంగా పరివర్తన చెంది తన కుమారుడి పెళ్ళి కట్నకానుకలు తీసుకోకుండా చేయాలని నిశ్చయించిన స్త్రీ ఆశయం చురక కథలో చదువుతాము. పాల పొంగు లాంటి వయస్సులో అల్లరి పెట్టిన అమ్మాయినే పెళ్ళి చూపుల్లో చూసి నిరాకరించిన ఓ యువకుడికి ఆ అమ్మాయి అతడి పట్ల దురభిప్రాయం లేదని తన మనోభావాలను తెలిపే కథ ఔన్నత్యం. కూతురి సంపాదనతో పబ్బం గడుపుకొంటున్న ఓ తండ్రీ ఆమెకు పెళ్ళి కాకుండా చేసే కుతంత్రాన్ని భగ్నం చేసిన వైనం అనూహ్యం కథలో తెలుస్తుంది. సంస్కారమనేది పుట్టుకతో రాదు పెంచిన పెంపకంలో ఉంటుందన్న సత్యాన్ని క్షితిజ కథ చాటుతుంది. స్త్రీ విద్య, ఉద్యగాల పట్ల, స్త్రీ పునర్వివాహాల పట్ల సదభిప్రాయం లేని అధికారికి తాను నమ్మిన సిద్ధాంతాలకోసం ఉద్యోగాన్ని సైతం వదులుకొనే క్రింది ఉద్యోగి కళ్ళు తెరిపిస్తాడు కనువిప్పు కథలో. జీవన శకటానికి స్త్రిపురుషులిద్దరూ రెండు చక్రాల లాంటివారు. ఏ చక్రం లేకపోయినా బండి నడవదు అనే సందేశం బొమ్మ-బొరుసు కథ ద్వారా లభిస్తుంది. పరిస్థితులతో రాజీ పడటం కాదు వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం మనిషి కర్తవ్యం అనే సంగతి మార్పు కథలో బోధపడుతుంది. వేషభూషాలనుబట్టి ఎదుటివారి వ్యక్తిత్వాన్ని బేరీజు వేయలేమని తగిన బంధం కథ నిరూపిస్తుంది. చేసిన తప్పును సరిదిద్దుకోవడంలో మానవత్వం ఉందనే నిజాన్ని పరిష్కారం కథ ద్వారా గ్రహించగలం. వైధవ్యం ప్రాప్తించిన కోడలికి ఉద్యోగం, ఆర్థిక సహాయం అందజేయిస్తే మాట మాత్రం చెప్పకుండా పునర్వివాహం చేసుకుని తన దారి తాను చూసుకొన్నా ఆమె నిర్ణయాన్ని హర్షించే మామ దొడ్డమనసు కథలో తారసిల్లుతాడు. మనుమడి పెళ్ళికి ఆరాటపడే నాయనమ్మ పాత్రను ఆహ్వానం కథలో, చెప్పుడు మాటలు విని అదే నిజమని నమ్మే తల్లి పాత్రను బలహీనత కథలో చూస్తాము. తాంబూలం కథలో కొడుకు పెళ్ళిచూపుల నెపంతో వచ్చి మిత్రుని ద్వారా కాబోయే వియ్యంకుని వివరాలు రాబట్టి విశ్లేషించిన తీరు ఆకట్టుకొంటుంది. మిగతా కథలతో పోలిస్తే అంబేద, శుభలేఖ, లక్ష్యం కథలు సాధారణంగా ఉన్నాయి. జీవన న్యాయం, పరిష్కారం కథల్లో రచయితే ఒక పాత్రగా మలచబడ్డారు. మొత్తానికి ఒక మంచి పుస్తకం చదివామన్న అనుభూతిని మిగుల్చుతుంది ఈ కథా సంపుటం.
(ఆంధ్రభూమి దినపత్రిక 6 జనవరి 2008 లో ప్రచురితం)

కామెంట్‌లు లేవు: