...

...

25, ఏప్రిల్ 2009, శనివారం

పుస్తక సమీక్ష! -10 పర్యావరణం - సమాజం, ప్రకృతి - పర్యావరణం

[పుస్తకం: 1.పర్యావరణం - సమాజం పేజీలు :171 వెల: రూ.100=00లు
పుస్తకం: 2.ప్రకృతి - పర్యావరణం పేజీలు : 96 వెల:రూ.50=00లు
రచన : నాగసూరి వేణుగోపాల్ ప్రతులకు : ఎన్.కె. పబ్లికేషన్స్, 24-8-1, సమీర రెసిడెన్సి, విజయనగరం 535 001]


తెలుగులో శాస్త్ర సాంకేతిక రంగాలపై రచనలు తక్కువగానే వెలువడుతున్నాయని చెప్పుకోవాలి. ఆంగ్ల సాంకేతిక పదాలకు తెలుగులో సరియైన, సులభమైన సమానమైన పదాల సృష్టి తక్కువగా ఉండటం ఒక కారణమైతే, ఈ విషయాలపై జనరంజకంగా, ఆసక్తి గొలిపే విధంగా రచనలు చేయడం అంత సులభం కాకపోవడం మరో కారణం. అయితే శాస్త్రీయ వైజ్ఞానిక అంశాలపై రచనలు చేస్తున్న తెలుగు రచయితలలో నాగసూరి వేణుగోపాల్ విషయాన్ని సామాన్య పాఠకునికి సులభంగా, తేలికగా అర్థమయ్యే విధంగా రాయడంలో బహు నేర్పరి. వీరు పర్యావరణ శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలను ఒక ప్రముఖ దిన పత్రిక ఆదివారం సంచికలో ప్రకృతి - వికృతి అనే శీర్షికతో జనసామాన్యానికి అందించారు. ఈ వ్యాసాలు ప్రకృతి - పర్యావరణం, పర్యావరణం - సమాజం అనే పేర్లతో పుస్తకరూపంలో మన ముందున్నాయి. వీటిలో పర్యావరణం - సమాజం అనే పుస్తకం ఇదివరకే ప్రకృతి - వికృతి అనే పేరుతో రెండు ముద్రణలు పొంది ప్రస్తుతం పునర్నవీకరించబడింది.


ఈ వ్యాసాలలో నాగసూరి వేణుగోపాల్ పర్యావరణ, జీవావరణ సంబంధమయిన అనేక విషయాలను, వాటి మూలంగా ప్రకృతిలో సంభవిస్తున్న అనేక మార్పులను, విపత్తులను వివరిస్తున్నారు. రకరకాలైన కాలుష్యాల కారణంగా చాలా రకాల మొక్కలు, జంతువులు, పక్షులు కనుమరుగవుతున్నాయి. విపరీతమైన పాలిథీన్ కవర్ల వాడకం పర్యావరణ తుల్యతను దెబ్బతీస్తోంది. అధిక జనాభా, వాటి అవసరాలు, నాగరికత, శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి కారణాలుగా పలు రకాల జీవ రాశులు అంతరించిపోతున్నాయి. పారిశ్రామిక కాలుష్య ప్రభావంతో తాజ్‌మహల్ వంటి అద్భుత కట్టడాలు తేజొ రహితంగా మారిపోతున్నాయి. తరుగుతున్న అడవులు పులులు, ఏనుగులు వంటి మృగాలను జనావాసాల వైపు రావడానికి దోహద పడుతున్నాయి. మనం పంట పొలాల్లో వాడుతున్న క్రిమి సంహారక రసాయనాల కారణంగా రాబందులు, గ్రద్దలు మొదలైన పక్షి జాతులు అంతరించి పోతున్నాయి. రొయ్య చెరువుల కోసం కృష్ణా తీరంలో మడ అడవులను నాశనం చేయడం వల్ల జీవ వైవిధ్యం అంతరించి పోతోంది. పలు దేశవాళీ పళ్ళ రకాలు క్రమంగా కనుమరుగు కావడానికి మనం ఒడిగట్టుతున్న పర్యావరణ వినాశనమే కారణం. కాలుష్యం, మానసిక ఒత్తిడి, పొగత్రాగడం, మలిన ఆహారం, పరిసరాల్లోని విషపు లోహాలు, ఇతర మలినాలు ఇవన్నీ మానవజాతి వంధ్యత్వానికి కారణాలవుతున్నాయి. ఆధునిక వ్యవసాయం, నగరీకరణ కారణంగా పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. పరిశ్రమల మలినాలు, క్రిమి సంహారిణిలు భుగర్భ జలాలను సైతం కలుషితం చేస్తున్నాయి. దీని వల్ల చర్మ సంబంధమైన వ్యాధులు, శ్వాస కోశ వ్యాధులు కలుగుతున్నాయి. రసాయనిక, పారిశ్రామిక పరిశోధనల మూలంగా అసహజమైన, సింథటిక్ రంగులు రావడంతో ప్రకృతి సిద్ధమైన రంగులు అంతర్థానమయ్యాయి. సౌందర్య సాధనాలుగా మనం వాడుతున్న పౌడర్లు, స్నోలు, లిప్‌స్టిక్‌లు, నెయిల్ పాలిష్‌లు, డియోడరెంట్లు అన్నింట్లోనూ ఉన్న రసాయనికాల వల్ల అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉంది. డిడిటి లాంటివి మనుష్యులలో జన్యు పరమైన మార్పులకు దోహద పడే ఈడిసి (Endocrine Disrupting Chemicals)ల పాత్ర పోషిస్తున్నాయి. శీతల పానీయాలను సేవించడం వల్ల ఎముకలలో కాల్షియం పరిమాణం తగ్గడం, రక్త పీడనాన్ని ప్రభావితం చెయ్యడం, నిద్రలేమి, తలనొప్పి, కడుపులో అల్సర్, ఆందోళన వగైరా కలుగుతాయి. నియాన్ దీపాల వలన అధిక రక్త పీడనం, నరాల క్షీణత, అల్సర్, ఋతుక్రమంలో అవాంచనీయ తేడాలు, తలనొప్పి, అసిడిటి, నిర్లిప్తత, అలసట, న్యూనత మొదలైన సమస్యలు వస్తాయి. ఆటోమొబైల్ వాహనాల నుండి వెలువడే వాయువులు ఆమ్ల వర్షాలు కురిసేందుకు కారణభూతాలవుతున్నాయి. పొగ త్రాగటం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదమే కాక పాస్సివ్ స్మోకింగ్ కారణంగా పలువురు అనారోగ్యం పాలౌతున్నారు. మనం వాడుతున్న రిఫ్రిజిరేటర్లు ఓజోన్ పొరలో రంధ్రం ఏర్పడటానికి ఒక కారణం. పోడు సేద్యం వల్ల ఎంతో విస్తీర్ణం కల అడవి అంతరించి పోతోంది. లుకేమియా, లింఫొమా లాంటి రక్త కాన్సర్లకు వాతావరణ కాలుష్యమే ప్రధాన కారణం. ఇటువంటి విషయాలను నాగసూరి తమ వ్యాసాల్లో తెలియజేస్తున్నారు. ఈ వ్యాసాల్లో పలు చోట్ల రచయిత తన ఉద్దేశ్యం బెదరగొట్టి భయపెట్టడం కాదని పేర్కొంటున్నారు. పర్యావరణ కాలుష్య ప్రభావంపై పాఠకులకు అవగాహన కలిగించడమే ఈ రచన ముఖ్య సంకల్పంగా వారు చెబుతున్నప్పటికీ ఈ వ్యాసాల్లోని గణాంకాలూ అవీ చూస్తే భయం కలుగక మానదు.


అయితే ఈ వ్యాసాల్లో నాగసూరి వేణుగోపాల్ కేవలం పర్యావరణం వల్ల కలిగే నష్టాలనే కాకుండా ఎన్నో కొత్త కొత్త విషయాలను కూడా పాఠకులకు పరిచయం చేస్తున్నారు. గోవాలో విదేశీ పర్యాటకుల రాకకు అసలు కారణం వారి దేశాలలో సముద్ర తీరాన్ని కలుషితం చేస్తే కట్టవలసిన పన్ను కన్నా గోవాలో విహరించడం చౌక కావడమేనట. కార్గిల్‌లో పాకిస్తాన్ సైనికుల చొరబాటుకు పర్యావరణం ఒక కారణమని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. పర్యావరణంలో భారీ మార్పుల కారణంగా సాధారణం కంటే ముందుగా కార్గిల్ ప్రాంతంలో వచ్చిన వసంతం వల్ల మంచు తొందరగా కరిగి చొరబాటుదారులకు మార్గం సుగమం చేసింది. సాధారణంగా శీతాకాలంలో కార్గిల్ ప్రాంతంలో ఉండటం చాలా కష్టం. అందుకే ఆ సమయంలో గస్తీ కూడా ఉండదు. ఇదే అదనుగా తీసుకుని పాక్ సైనికులు మన భూభాగం పైకి రాగలిగారు. ఇంకా పర్యావరణ పరిరక్షణలో స్ఫూర్తి ప్రదాతలుగా పేర్కొన దగిన ప్రభాత్ ఉప్రితి, కొంగర తిమ్మప్ప, శోభన్ సింగ్ భండారి, కొచ్చిన్ లోని ఆంథోని, బెంగళూరుకు చెందిన ఎస్.విశ్వనాథ్, పాట్నాకు చెందిన వికాస్ చంద్ర, స్వాధ్యాయ ఉద్యమ స్థాపకుడు పాండురంగ శాస్త్రి అథవాలే మొదలైనవారి విజయ గాథలను వివరించే వ్యాసాలూ ఇందులో ఉన్నాయి.


రచయిత నాగసూరి వేణుగోపాల్ ఈ వ్యాసాలను అకడమిక్‌గా కాకుండా కథనాత్మకంగా, సాహితీ గుభాళింపును మేళవించి, సరళమైన భాషతో అందరికీ అర్థమయ్యేలా రాశారు. గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్‌వార్మింగ్, బయోనీర్స్ వంటి సాంకేతిక అంశాలు ఈ వ్యాసాలు చదివిన వారికి ఇట్టే అర్థమౌతుంది. ప్రముఖ వ్యక్తుల కొటేషన్లను సందర్భానుసారంగా ఉపయోగించి చదువరికి ఆసక్తి కలిగించారు రచయిత. ఈ వ్యాసాలకు ఉంచిన శీర్షికలూ అకట్టుకుంటాయి. ప్లాస్టిక్ సంచి పర్యావరణానికి విషాద విపంచి, ప్రకృతి లీలా విలాసానికి ప్రతీక - మడ అడవి, వినబడలేదా ఈ మృతుఘంటికలు?, వెలగనీకుమా నియాన్ దీపం!, వినువీధిలో రాగ విపంచి, గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి, ఆకు పచ్చ సంద్రంలో... ఒలికిన విషం, మొసళ్ళకు మొసలి కన్నీరు మొదలైన శీర్షికలు రచయిత భాషాభిమానాన్ని చాటితే, కాలుష్యంతో వంధ్యత్వం, విషతుల్యమవుతున్న జీవన గంగ, ఏరు పారింది ఊరు వెలిగింది, సంపదలకు నెలవు చెరువు!, అడవులకు చేటు పోడు సేద్యం, క్యాన్సర్‌కు చిరునామా కాలుష్యం మొదలైన శీర్షికలు ఆ వ్యాసాలలోని విషయాలను సూచిస్తున్నాయి. ద్రోహబుద్ధి వీడితే స్నేహహస్తం!, పేరాశతో పిచ్చి వాళ్ళం కాకూడదు!, వెనుదిరిగి విశ్లేషుకుందాం!, జాగరూకతతో ముందుకెడదాం!, పర్యావరణంలో విలువలు ప్రధానం, సామూహిక చైతన్యమే రక్షణ మొదలైన శీర్షికలు ఆ వ్యాసాలలో వివరించబోయే సమస్యలకు పరిష్కారాన్ని సూచనప్రాయంగా తెలియజేస్తుంది.


ప్రపంచ స్థాయిలో సమస్యను అర్థం చేసుకుని వ్యక్తిగత స్థాయిలో పరిష్కారాలను ప్రారంభించా లనే సూత్రం పర్యావరణ శాస్త్రానికి చక్కగా వర్తిస్తుందంటున్నారు వేణుగోపాల్. ఈ సమస్యలకు పర్యావరణవేత్తలు రెండు రకాల పరిష్కారాలను సూచిస్తున్నారు. సమస్యను అర్థం చేసుకుని జాగ్రత్తతో మసలుకుంటూ మనుగడ సాధించడం మొదటి రకం. ఇక రెండవ రకం చిన్న చిన్న గ్రామాలలో నివసిస్తూ సమస్యలకు దూరంగా పారిపోయి కాలుష్య రహితమైన జీవనాన్ని గడపడం. దీన్ని గాంధేయ దృష్టి(?)గా పేర్కొంటున్నారు రచయిత.


మొత్తం మీద పర్యావరణానికి సంబంధించిన స్థూలమైన అవగాహనను తెలుగు పాఠకులకు అందించడానికి ఈ పుస్తకాలు దోహద పడుతున్నాయి. రచయిత నాగసూరి వేణుగోపాల్ ఈ అంశాలపై కొత్త సమాచారంతో ఇంకా విస్తృతంగా రచనలు చేయడానికి పూనుకోవాలి. ఇది ఒక కర్తవ్యంగా రచయిత భావిస్తారని మనం ఆశించవచ్చు.

ఈవారం జనవార్త రాజకీయ సామాజికార్థిక వారపత్రిక ఏప్రిల్26- మే2, 2009 సంచికలో ప్రచురితం.

కామెంట్‌లు లేవు: