...

...

26, జులై 2009, ఆదివారం

'నవ్య వీక్లీ' శ్రీశ్రీ ప్రత్యేక సంచికపై 3 విశ్లేషణలు!!!

నవ్య వీక్లీ శ్రీశ్రీ ప్రత్యేక సంచిక(17-6-2009)లోని విషయాలపై ఇంతకు ముందు శ్రీశ్రీని కించపరచడం మానలేరా?! అంటూ ఒక టపాలో నా అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ టపాకు విశేషమైన స్పందన వచ్చింది. ఈ ప్రత్యేక సంచికపై పత్రికలలో మూడు విశ్లేషణలు చదవడం సంభవించింది. అందులో ఒకటి నా అభిప్రాయలకు దగ్గరగా వుంది. మిగతా రెండు వ్యాసాలు వేరువేరు దృష్టికోణాల్లో ఈ సంచికపై విశ్లేషించాయి. ఈ మూడు వ్యాసాలను తురుపుముక్క పాఠకులకు పరిచయం చేయాలనిపించింది. వీటిలో రెండు ప్రజాసాహితి మాసపత్రిక జూలై 2009 సంచికలో ప్రచురింప బడగా మరొకటి ఈవారం జనవార్త వార పత్రికలో నాగసూరి వేణుగోపాల్ గారు 'మీడియా నాడి' కాలమ్‌లో వ్రాశారు. ఈ మూడు విశ్లేషణలూ మీ కోసం!

1.కాస్త ఖేదం - కాస్త మోదం


'నవ్య' అనేది ఆంధ్రజ్యోతి యాజమాన్యంచే నడపబడుతున్న "వీక్లీ". ఈ వార పత్రిక 17-06-2009 సంచికని మహాకవి శ్రీశ్రీ ప్రత్యేక సంచికగా వెలువరించారు. షుమారు 25 మంది ప్రసిద్ధులైన వారు శ్రీశ్రీతో వారి అనుభవాల్ని 'నవ్య'వారి అభ్యర్థనపై రాశారు. ఈ సంచిక వెలువడిన 10వ తేదీ సాయంత్రానికే దాని కాపీలు దొరకలేదు(గుంటూరులో). శ్రీశ్రీ శతజయంతి సంవత్సరంలో ఇదొక ఆనందిచదగ్గ విషయం.

అయితే ఎంతో అపురూపంగా తీసుకెళ్ళిన సంచిక తెరిస్తే ఎక్కువ మంది పెద్దలు తమ అనుభవాల్ని చెత్తచెత్తగా రాశారు.

శ్రీశ్రీని తెల్సిన వాళ్ళందరికీ ఆయన తాగుతాడని తెల్సు. దీన్ని రహస్యంగా ఉంచాలని ఆయనగాని, ఆయన అభిమానులుగాని ఏనాడూ ప్రయత్నించలేదు. విషయాన్ని చెప్పే సందర్భంలో అనివార్యమైతే దాన్ని గూర్చి ప్రస్తావించడం అప్రస్తుతం కాకపోవచ్చు. కాని అదే పనిగా ఆయన సురాపానం నుండి మూత్రీకరణ వరకు ప్రస్తావించటం - అందులోనూ లబ్ద ప్రతిష్టులైన వారు చేయడం సరికాదు.

"తాను రాసి పారేసిన గీతాలు
గుబాళిస్తుండగా
తాగి పారేసిన
సీసాల కంపెందుకు" అనే గీతాన్ని కాళోజి గారు రాశారు. అది శ్రీశ్రీయే తన్ను గురించి రాసుకున్నాడని ఈ సంచికలో రాసిన వారున్నారు. శ్రీశ్రీ ఏమి రాశాడో కూడా తెలియని వాళ్ళ చేత అనుభవాలను రాయించవలసిన దుర్గతి తెలుగుదేశం లోని సాహితీ వాతారణానికి ఇంకా కల్గలేదు.

శ్రీశ్రీతో బాగా పరిచయం వున్న నిఖిలేశ్వర్, భూమన్, చలసాని లాంటి వాళ్ళు కూడా యే కారణంగానో గాని శ్రీశ్రీతో అనుభవాల్ని సరిగ్గా పంచుకోలేకపోయారు. అసలు పరిచయమే లేని డా.యాకూబ్ గారి స్పందనే అందరికన్నా బాగుంది. శ్రీశ్రీ వ్యక్తిగత అనుభవాలకు తిరుపతి పరిసరాలకి పరిమితం చేయకుండా రచనలు ఆహ్వానిస్తే ఇంకొంచెం మంచి రచనలు, శ్రీశ్రీని మరికొంత బాగా ఆవిష్కరించే రచనలు వచ్చేవేమో.

(ప్రజాసాహితి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక జూలై 2009 సౌజన్యంతో)

** * * * * * * * * * * * * * *

2.సాహిత్య సంచికగా నవ్య ప్రయోగం - నాగసూరి వేణుగోపాల్

మహాకవి శ్రీశ్రీ ప్రత్యేక సంచికగా 'నవ్య' వీక్లీ చేసిన ప్రయత్నం ఎంతో చక్కగా ఫలించింది. బహుగొప్పగా గుర్తుండిపోతుంది. జర్నలిజం పలురకాల విశేషణాలతో తీవ్రంగా విమర్శలకు గురవుతున్న కాలంలో ఇటువంటి ప్రయోగం ఎడారిలో ఒయాసిస్సులా ఆశలు రేపుతోంది. 'భారతి' వంటి సాహిత్య పత్రికను అగ్రశ్రేణి దినపత్రిక నడిపే కాలమయితే ఇందులో విస్మయం కలిగించే కోణం ఉండేదికాదు. అసలు జర్నలిజానికి గౌరవం, ఆదరణ లేని చెడ్డకాలమిది. అందువల్లనే నవ్య వీక్లీ ప్రయోగానికి ఇంతగా అభినందనలు అవసరం.

ప్రత్యేక సంచికలు రావడం విశేషం కాదు. సుంకర సత్యనారాయణగారిపై 'ప్రజాసాహితి' మాసపత్రిక బృహత్తర సంచిక ఇటీవల వెలువరించింది. ఇదేరీతిలో చిన్న పత్రికలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఒక పూర్తి స్థాయి వాణిజ్య పత్రిక ఇలా పూర్తి స్థాయిలో ఒక సాహిత్య ప్రయత్నం చేయడం ఈ కాలంలో గొప్పదే! ఈ సంచికను చూడగానే శ్రీశ్రీ పోయినపుడు జ్యోతిచిత్ర సినిమా వార పత్రిక ఒక వారం శ్రీశ్రీ సంచికగా వెలువరించిన విషయం గుర్తుకు వచ్చింది. అలాగే దాదాపు అదే సమయంలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి నేతృత్వంలో ఆంధ్రజ్యోతి వార పత్రిక కూడా శ్రీశ్రీ మీద సంచిక వెలువరించింది. అయితే ఆంధ్రజ్యోతి వార పత్రిక కన్న 'జ్యోతిచిత్ర' సినిమా వార పత్రిక ప్రయత్నం సాపేక్షికంగా సాహసం అనిపించింది. అందులో సంగతులు కేవలం సినిమా రంగానికే పరిమితం కాకపోవడం విశేషం. తర్వాత 90వ దశకం తొలి సంవత్సరంలో ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రిక కేవలం కవితలు మాత్రమే ఒక సంచికలో ప్రచురించే ప్రయోగం చేసింది. ఆ సంచికలో దాదాపు 108 కవితలు ప్రచురింపబడ్డాయి. సీరియల్‌స్, జ్యోతిష్యం వంటి ఫీచర్లు తప్పా మిగతా పేజీలన్నీ కవితలకోసం కేటాయించారు. శ్రీశ్రీ సంచికను చూడగానే ఈ జ్ఞాపకాలన్నీ అలా మెదలుతున్నాయి. ముఖచిత్రంగా పినిశెట్టిగారి చిత్రణ నుంచి చివరి అట్ట లోపలి పేజీలో శైశవగీతి దాకా సుమారు అరవై అంశాలున్నాయి. అంటే మొత్తం 76 పేజీల్లో 56 దాకా శ్రీశ్రీ పరం అయిపోయాయి. కేవలం నాలుగు సీరియల్స్, ప్రకటనలు, ఉత్తరాలు, జ్యోతిష్యం, పంచాంగం వంటి శీర్షికలు తప్పా మిగతా శీర్షికలు కూడా శ్రీశ్రీమయం అయిపోయాయి. దాంతో వారు(శ్రీశ్రీ) రాసిన కథలూ,కవితలు, కబుర్లతో పాటు ఆయన అనురాగాలు - అనుబంధాలు, ఆత్మీయతలు-అల్లరి చేష్టలతో నవ్య వీక్లి ప్రత్యేక సంచిక (వారే చెప్పుకున్నట్టు) తయారైంది. శ్రీశ్రీ జవాబులు, కవితలు, కథ, పదబంధ ప్రహేళికలతో పాటు వర్తమాన సాహితీ వేత్తలు (దాదాపు నలభైమందికి పైగా) చెప్పిన విశేషాలు ఈ సంచికలో చోటు చేసుకున్నాయి. శ్రీశ్రీ రాసిన అంశాలు తప్పా మరేమిటీ పునర్ముద్రణ కాకపోవడం మంచి వ్యూహం. అలాగే సినిమా రంగపు విశేషాలు కూడా ప్రధానం కాకపోవడం మంచి ఎత్తుగడే! దీని వల్ల ప్రయోగం సీరియస్‌గా సాగిందని చెప్పుకోవాలి. అదే సమయంలో సిగరెట్ తాగుతున్న శ్రీశ్రీ ఫోటోను ప్రతిపేజీలో ప్రచురించడంలో నిర్ణయం వెనుక ఆలోచన ఉందో లేదో కానీ- ఈ విషయంలో మనకు శ్రీశ్రీ ఆదర్శం కానక్కరలేదు. అలాగే నలభై మంది పైగా రచయితలలో రచయిత్రులు కేవలం నలుగురు మాత్రం కావడం లోటే!

అద్దేపల్లి, రావికొండలరావు, ఇనాక్, కేతు, చలసాని ప్రసాద్, వసంతలక్ష్మి, అదృష్టదీపక్, చాయాదేవి, పాపినేని, ఎం.వి.రమణారెడ్డి, మునిసుందరం, తనికెళ్ళ భరణి, ఓల్గా, శ్రీపతి, భూమన్ ఇలా ఎంతో మంది శ్రీశ్రీతో తమ అనుబంధం పంచుకుంటూ శ్రీశ్రీ కబుర్లు చెప్పారు. అన్నీ కూడా దాదాపు వైయక్తికమైన కోణంలో వివరించబడటంతో హాయిగా చదివించేస్తాయి. అంతా లబ్దప్రతిష్టులే కాకుండా మరికొందరితో కూడా వ్యాసాలు రాయించడంతో నిండుదనం వచ్చింది. ఇంద్రధనస్సులో శ్రీకాంతశర్మ శ్రీశ్రీ గురించి చెప్పడం కష్టమైన విషయం కాదు కానీ స్పోర్ట్స్‌కాలమ్ 'క్రీడాభిరామం' కూడా శ్రీశ్రీ గురించి రాయడం అభినందనీయమే! అలాగే శేఖర్‌టూన్స్ శ్రీశ్రీ సిరిసిరిమువ్వలతో గలగలలాడటం, సరసి కార్టూన్ శ్రీశ్రీ కవితాపాదాలపై ఉండటం గొప్ప విషయమే! పజిల్ స్థానంలో శ్రీశ్రీ ప్రహేళికను సమాధానాలతో పాటు ఇవ్వడం సముచితమే! ఇనాక్ ఇంటిపేరులో అచ్చుతప్పు రావడం కన్న చలసాని ప్రసాద్ కాస్త చలసాని ప్రసాదరావు అయిపోవడం పెద్ద పొరపాటే! ఇంకా చేయాలనడానికి అంతం ఉండదు. అయితే మంచి ప్రయత్నం చేశారని నవ్య వీక్లి యాజమాన్యాన్ని, సంపాదకవర్గాన్ని తప్పక అభినందించాలి.

నిజానికి ఇటువంటి ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఏమిటి? పత్రికలకు లాభమా? కాదా?- అని కూడా చూడాలి. సాహితీ వేత్తలు అభినందించడం లేదా ఫలానా కోణం, ఫలానా రచయిత చోటు చేసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేయడం సహజమే! కానీ దీన్ని దాటి వాణిజ్యపరంగా పరిశీలించినపుడు ఏమిటి అని ఆలోచించాలి. ఒక సంచికను ఇలా సాహిత్య ప్రత్యేక సంచికగా తేవడం ఆర్థిక భారం కాకపోయినా, సగటు పాఠకుడు సంచికను ఎంతవరకు ఆదరిస్తాడనే ప్రశ్న ఎదురవుతుంది. గతంలో నార్ల వెంకటేశ్వరరావు గారు సంపాదకుడుగా గురజాడ అప్పారావుగారి ఫోటోను ముఖచిత్రంగా ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికను ఒక వారం వెలువరించారు. ఆ వారం చాలా సంచికలు తిరిగివచ్చాయని నార్లగారు పేర్కొన్నట్టు నా జ్ఞాపకం. అందువల్ల ఇటువంటి సమస్య తప్పదు. అయితే ఈ సంచిక కారణంగా లభించిన పాజిటివ్ ప్రచారం ఎనలేనిది. దీన్ని ఇతరత్రా కొలవలేం. అది కేవలం అనుభవించి పలువరించడమే! అందువల్ల పత్రికకు స్థూలంగా లాభమే! అంతకు మించి 'నవ్యా తొలుత 'సరసం'గా కించిత్ అశ్లీలంగా సాగేదనే విమర్శ కలిగివుండేది. కానీ ఇటీవల రచయితలతో ఇంటర్వ్యూలు చేయడం, ఇప్పుడు శ్రీశ్రీ సంచిక రావడంతో అటువంటి ముద్ర పూర్వపక్షం అయిపోయింది. కనీసం అపుడపుడైనా ఇలాంటి ప్రయత్నం జరగాలి. ప్రాంతీయ సాహిత్యం నేపథ్యంగా, కళలు నేపథ్యంగా ఇలాంటి సంచికలు ఆరు నెలలకోసారి అయినా వెలువరిస్తే మంచిది. మిగతా పత్రికలకు ఈ ప్రయోగం స్ఫూర్తి అవుతుంది. ఏదిఏమైనా ఇతర వారపత్రికల కన్నా గౌరవమైన స్థానాన్ని 'నవ్య'వీక్లీ ఇలా పొందడం అభినందనీయమే!

[ఈవారం జనవార్త రాజకీయ సామాజికార్థిక వారపత్రిక జూన్28-జూలై 4,2009 సంచిక సౌజన్యంతో]

** * * * * * * * * * * * * * *

3.శ్రీశ్రీపై 'నవ్య వీక్లీ' ప్రత్యేక సంచిక- వ్యాపార దృక్పథం - పినాకిని, హైదరాబాదు

'గౌరవిస్తే గౌరవింపబడతామ'ని శ్రీశ్రీపై ప్రత్యేక సంచికను 'నవ్య' వెలువరించింది. శ్రీశ్రీలోని అనుకూలాంశాలను, ఆయన ఏ ప్రాపంచిక దృక్పథం వైపుకి పయనించాడన్న నిర్దిష్ట ఆలోచనకు పాఠకుడ్ని రానీయకుండా చేసిందీ సంచిక. సంచికలో కొన్ని ముఖ్యమైన వివరాలు, చాలామందికి తెలియని కొన్ని సంఘటనలు వున్నప్పటికీ ముందుగా అనుకూల అంశాలుగా రాయాలనిపించడం లేదు- ఎందుకంటే శ్రీశ్రీలోని నెగెటివ్ షేడ్స్ ఎక్కువగా మా తరానికి 'నవ్య' పరిచయం చేసింది కనుక నేను కూడా ఈ సంచిక నెగెటివ్ షేడ్‌నే ముందుగా చెప్పాలనుకుంటున్నాను.

'తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వర'ని ప్రశ్నించిన శ్రీశ్రీకున్న దృక్పథం ఖచ్చితంగా మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం. ఈ పాదంలోని అర్థం ఈ సంచికలో అభిప్రాయాలు చెప్పిన ఎక్కువ మందికి తెలియదనీ, కొందరికి తెలిసినా తెలియనట్లు మాట్లాడారనీ, ఒకరిద్దరు ఈనాటికీ సంస్థల్లో వున్నవారు అవి తప్ప మిగిలినవి రాశారనీ అనిపిస్తోంది. కొందరు వ్యక్తులుగా మిగిలిపోయి శ్రీశ్రీని ఒక వ్యక్తిగా చిత్రించారు. ఆయనలో వ్యక్తిగతంగా వీరికున్న అనుభవాలు రాదామని బయల్దేరి తమకెలా వుపయోగపడ్డారో రాసుకున్నవారున్నారు. శ్రీశ్రీ సమాజానికుపయోగపడమని చెప్పింది వీళ్ళెంత వరకు పాటించారో ఎవరూ ఒక్కముక్క చెప్పలేదు. రాసేవాళ్ళు అలా రాస్తే శ్రీశ్రీనుంచి ఉత్తేజం పొందిన ఈ ప్రముఖుల నుంచి కూడా ఈనాటితరం ఉత్తేజం పొందేవారు. ప్రతి ఒక్కరూ మీటింగ్ పెట్టారని, అక్కడకు శ్రీశ్రీ వచ్చాడని, ఏ రైల్‌లో వచ్చాడు? వేరుశెనగ కాయలు ఎక్కడ తిన్నారు? మందు ఎక్కడ కొన్నారు? ఇలా చెప్పారు. తప్ప ఆ మీటింగ్‌లు ఏ సమస్యల మీద పెట్టారు. ఎవరెవరు లేదా ఎంతమంది కార్యకర్తలు ఎన్ని వత్తిడుల నడుమ ఆ పన్లు చేశారు? ఏ ఒక్కరూ పరిశీలించలేదని అర్థమవుతుంది. రాళ్ళెత్తిన కూలీలెవరో వీరికి తెలియకనే అలా రాయలేదు. రాసిన వారి పరిమితులు, అనుభవాలు, అడిగిన వారి పరిమితుల్ని అర్థంచేసుకుందామనుకున్నా నష్టం శ్రీశ్రీకి జరిగినట్టు పైకి కనిపించినా శ్రీశ్రీ నమ్మిన ప్రాపంచిక దృక్పథానికి నష్టం కలిగించారు.

"మహాప్రస్థానం సామూహిక ఉద్యమాలకు, తిరుగుబాట్లకు ప్రేరణ ఇస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ జీవితంలోని ప్రతి ఘట్టంలో, ప్రేమలో, బంధంలో, ఆప్తుల మరణంలో, లోకం ఇచ్చిన శాపాలలో, నేను చేసిన తిరుగుబాట్లలో నా చేయిపట్టుకుని నన్ను నడిపించే నేస్తం మహాప్రస్థానమే"నంటున్నారు ఓల్గా గారు. సామూహిక ఉద్యమాలకు ప్రేరణ ఇవ్వదనేనా దీనర్థం. లేక అవసరం లేదనా? శ్రీశ్రీ వ్యక్తి కాదు శక్తి అన్నంత వరకూ అందరూ ఒప్పుకొంటున్నారు. 1970ల శ్రీశ్రీని చెప్పి అంతకు ముందు శ్రీశ్రీని వదిలేస్తే ఈ శక్తి ఆకాశంలోంచి ఊడిపడ్డ మెరుపులా కన్పిస్తాడు. అప్పుడు శ్రీశ్రీ రెండు మహావిప్లవాల నడుమ, రెండు మహా యుద్ధ సంక్షోభాల నడుమ మార్క్సిజాన్ని స్వీకరించి, స్వయంకృషిని జోడించి సాహితీ పరిణతిని సాధించాడన్న వాస్తవం మరుగున పెట్టినట్లవుతుంది. "పూవు పుట్టగానే పరిమళించును"అని రాసుకొని, శ్రీశ్రీ బ్రతికినంతకాలం ఏ ఫ్యూడల్ భావజాలాన్ని సాహిత్య రూపాల్లో తెగనరుకుతూ వచ్చాడో దాన్నే, శ్రీశ్రీకి ఆపాదించి దిన వారపత్రికలు సాహిత్య చరిత్రగా నిక్షిప్తం చేసినట్లుగా వుంది.

శ్రీశ్రీ సమాజ మార్పులో, సాంస్కృతిక రంగంలో, సాహిత్య రంగంలో ప్రజలు కోల్పోతున్న హక్కుల విషయంలో సామాజిక శక్తులతో భుజంభుజం కలిపి ఎలా నడిచాడో ఒక్క ముక్కైనా ఈ సంచికలో లేనందుకు అలా వుండాలని కోరుకోవడం అత్యాశే అవుతుందేమోనన్న సందేహంతో ఇలా స్పందిస్తున్నాను. అల్పవిషయాల చుట్టూ,భావుకత చూట్టూ పరిభ్రమించేవారి రచనలు ఈ సంచికలో ఎక్కువ వ్యాసాలు కనబడుతున్నాయి. ఇలాంటి ప్రత్యేక సంచికలింకెన్నో తేవచ్చు. శ్రీశ్రీతోడి అనుభవాలు అనంతం. అన్నట్టు ఈ సంచికలో నిజాయితీతో చెప్పిన వారు లేరా అని ఎవరన్నా అడగొచ్చు. తమ పరిమితుల్ని చెప్పుకున్న జర్నలిస్టులూ,సినీరంగంవారూ, అభిమానులూ, శ్రీశ్రీలాగా చిన్నపిల్లల్లా భోళాగా చెప్పుకున్న వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. ఈ సంవత్సరాన్ని శ్రీశ్రీనామ సంవత్సరంగా చెప్పడం చాలా గొప్పగా వుంది. ఈ సంచికకి పేరు తెచ్చేది మిత్రుడు పినిశెట్టి కుంచెలోంచి ఒకనాటి శ్రీశ్రీ తీక్షణతని చెక్కిన ముఖచిత్రమేనని నాకనిపిస్తుంది.

ఈ సంచిక ద్వారా శ్రీశ్రీ గౌరవం నిజంగా పెరిగివుంటే, 'నవ్య' కూడా గౌరవింపబడేదే. వ్యాపారస్తుల గౌరవాల గరిమనాభి లాభం దగ్గరేవుంటుందేమో!

(ప్రజాసాహితి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక జూలై 2009 సౌజన్యంతో)

5 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

Very interesting. I bought this issue but didn't have a chance to read it yet. The water color portrait of SreeSree on the cover was very nice. Will read and corroborate with the analyses here.

Hima bindu చెప్పారు...

బాగుందండి ,చదివే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదములు .

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

PINAKINI gaaru raasindi koncham alochimapa chesediga vundi........

very nice analysis.............especially

" కొందరు వ్యక్తులుగా మిగిలిపోయి శ్రీశ్రీని ఒక వ్యక్తిగా చిత్రించారు. ఆయనలో వ్యక్తిగతంగా వీరికున్న అనుభవాలు రాదామని బయల్దేరి తమకెలా వుపయోగపడ్డారో రాసుకున్నవారున్నారు. శ్రీశ్రీ సమాజానికుపయోగపడమని చెప్పింది వీళ్ళెంత వరకు పాటించారో ఎవరూ ఒక్కముక్క చెప్పలేదు. రాసేవాళ్ళు అలా రాస్తే శ్రీశ్రీనుంచి ఉత్తేజం పొందిన ఈ ప్రముఖుల నుంచి కూడా ఈనాటితరం ఉత్తేజం పొందేవారు. ప్రతి ఒక్కరూ మీటింగ్ పెట్టారని, అక్కడకు శ్రీశ్రీ వచ్చాడని, ఏ రైల్‌లో వచ్చాడు? వేరుశెనగ కాయలు ఎక్కడ తిన్నారు? మందు ఎక్కడ కొన్నారు? ఇలా చెప్పారు. తప్ప ఆ మీటింగ్‌లు ఏ సమస్యల మీద పెట్టారు. ఎవరెవరు లేదా ఎంతమంది కార్యకర్తలు ఎన్ని వత్తిడుల నడుమ ఆ పన్లు చేశారు? ఏ ఒక్కరూ పరిశీలించలేదని అర్థమవుతుంది. రాళ్ళెత్తిన కూలీలెవరో వీరికి తెలియకనే అలా రాయలేదు. రాసిన వారి పరిమితులు, అనుభవాలు, అడిగిన వారి పరిమితుల్ని అర్థంచేసుకుందామనుకున్నా నష్టం శ్రీశ్రీకి జరిగినట్టు పైకి కనిపించినా శ్రీశ్రీ నమ్మిన ప్రాపంచిక దృక్పథానికి నష్టం కలిగించారు."

nagasuri చెప్పారు...

mee sraddha, prayatnam bavundi. NAVYA lo rayabadina vyakhya ku divikumar CHINUKU lo savarana vanti vivarana rasaru. adi kuda kalipite bavuntedemo!

mmkodihalli చెప్పారు...

కొత్తపాళీ, చిన్ని, గోగినేని వినయ్ చక్రవర్తి, నాగసూరిగార్లకు మీ కౌంటర్లకు ధన్యవాదాలు!!!

@కొత్తపాళీ గారూ!
జూన్ సంచిక ఇప్పటిదాకా చదవలేదా! ముందు చదవండి బాబూ!

@చిన్నిగారూ!
చదివినందుకు మీకు కూడా ధన్యవాదములు!

@వినయ్ చక్రవర్తిగారూ!
నిజమే! పినాకినిగారు వ్రాసింది ఆలోచింపచేసిదిగా ఉంది. అలాగే మిగతా వ్యాసాలు కూడా!

@ నాగసూరిగారూ!
దివికుమార్‌గారి సవరణ లాంటి వివరణ ఇంకా చదవలేదు. త్వరలో చదివి దాన్నికూడా కలిపే ప్రయత్నం చేస్తాను.