...

...

19, అక్టోబర్ 2009, సోమవారం

నాకు తెలిసిన బాలగోపాల్



ఇదే శీర్షికతో అంకురం బ్లాగులో శరత్‌చంద్ర వ్రాసిన టపా చూసిన తరువాత నాకు కూడా బాలగోపాల్ గురించి వ్రాయడానికి కాస్త ధైర్యం వచ్చింది. నా జీవితంలో బాలగోపాల్ గారిని ప్రత్యక్షంగా చూసే అవకాశం రెండు సార్లు కలిగింది. నేను అనంతపురంలో డిప్లొమా చదివే రోజుల్లో మొదటి సారి బాలగోపాల్‌ను చూశాను. లలిత కళా పరిషత్ పక్క సందులో ఉండే గిల్డ్ ఆఫ్ టీచర్స్ స్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ రామనాథం సంతాప సభలో బాలగోపాల్ ప్రసంగం విన్నాను. ముందు వరసలో కూర్చుని(ఆ సభకు కార్యకర్తలు మినహా ఎక్కువ మంది హాజరు కాలేదు) అతి దగ్గరనుండి బాలగోపాల్‌ను చూసే అవకాశం కలిగింది. ఆ సభ విశేషాలు నాకు ఇప్పుడు గుర్తు లేదు కానీ చాలా వేగంగా ఉద్రేకపూర్వకంగా సాగిన బాలగోపాల్ ప్రసంగం నాకు ఇప్పటికీ మనసులో మెదులుతోంది. బహుశా అప్పటికి ఇంకా అతను ఎ.పి.సి.ఎల్.సి.లో ముఖ్యమైన బాధ్యతను చేపట్టలేదనుకుంటా. ఆ రోజు నుండి నాకు తెలియకుండానే బాలగోపాల్ ప్రభావం నాపై పడింది. తరువాత అప్పుడప్పుడూ పత్రికలలో బాలగోపాల్ గురించి, పౌర హక్కుల గురించి వార్తలు చదివే వాడిని. ఎ.పి.సి.ఎల్.సి.కి ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడని వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్నాను. అతనో అన్‌సంగ్ హీరోగా నామనసులో వుండిపోయాడు. రెండోసారి బాలగోపాల్‌ను నేను కలిసింది ఆర్.టీ.సీ బస్సులో. అదీ అతని పక్క సీటులో కూర్చుని కలిసి ప్రయాణించే అదృష్టం కలిగింది. నేను హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళడానికి బస్సు ఎక్కి కూర్చున్నాను. కాస్సేపటి తర్వాత బాలగొపాల్ బస్సు ఎక్కి నా పక్కన ఉన్న విండో సైడు సీటు వద్దకు వచ్చాడు. పొట్టి చేతుల కాటన్ చొక్కా వేసుకుని ఉన్నాడు. భుజాన ఒక గుడ్డ సంచి మరో చేతిలో పోస్టర్లు చుట్టి ఉన్న కట్ట పట్టుకుని అతి సాధారణంగా వస్తున్న బాలగోపాల్‌ను చూసి ఆశ్చర్యపోయాను. లేచి అతనికి దారి వదలి అతను తన సీటులో కూర్చోగానే నా సీటులో నేను కూర్చున్నాను. సంకోచంతో కూడిన ఉద్వేగం వల్లనో మరే కారణం చేతో నేను బాలగోపాల్‌ను పలకరించే సాహసం చేయలేకపోయాను. అతను కూడా నా వైపు ఒక చూపు చూసి తన పనిలో తాను మునిగిపోయాడు. మరుసటిరోజు తాను పాల్గొనే సభగురించి ఆలోచించుకుంటూ ఉండివుంటాడు. ఆరోజు అతన్ని పలకరించి పరిచయం చేసుకోక పోవడం నేను చేసిన తప్పుగా ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను. తరువాత బాలగోపాల్ కడపలో బస్సు దిగిపోయాడు. తరువాత అడపాదడపా టీ.వీ.చానళ్ళలో చర్చలలో అతడిని చూడటం, అతడు రాసిన వ్యాసాల్లో ఒకటో రెండో చదవడం మినహా బాలగోపాల్ గురించి నాకు తెలిసింది శూన్యమే అని చెప్పాలి. నిజం చెప్పాలంటే బాలగోపాల్ గురించి ఆయన మరణించిన తరువాతనే ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను. తాడిత పీడిత అణగారిన వర్గాల తరఫున ఆయన నిత్యం న్యాయం కోసం హైకోర్టులో అలుపెరుగని పోరాటం చేసేవాడనీ, మానవ హక్కులకు ఎక్కడ భంగం వాటిల్లినా అక్కడ ప్రత్యక్షమై తన గొంతుకను విప్పేవాడనీ, కేవలం మన రాష్ట్రంలోనే కాక కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, కాశ్మీర్, బీహార్, గుజరాత్ లాంటి ప్రాంతాలలో కూడా మానవ హక్కుల కోసం పోరాటం చేసి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడనీ, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో సాధికారమైన వ్యాసాల పరంపరను వెలువరించాడనీ, డి.డి.కోశాంబిని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ ఒక అద్భుతమైన పుస్తకం వ్రాశాడనీ ఇంకా ఎన్నో విషయాలు ఆయన మరణించిన తర్వాతే తెలిసింది. 12వ తేదీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సంతాప సభలో బాలగోపాల్ నాకు పూర్తిగా అవగాహనకు వచ్చాడు. బాలగోపాల్ సమకాలీకుడినని చెప్పుకునేందుకు ఇప్పుడు నేను గర్విస్తున్నాను.

1 కామెంట్‌:

Omprakash Narayana Vaddi చెప్పారు...

మురళి! బాల గోపాల్ సర్ గురించి బాగా రాశావ్... నాకు ఆయనతో కొంత పరోక్ష పరిచయమే వుంది... జాగృతిలో నేను పని చేస్తున్నపుడు నారాయణ గూడలోని టీ షాప్ కి ఆయన ఛాయ్ తాగటానికి వచ్చేవారు... తన చుట్టు ఎవరు ఉన్నారో గమనించే వారు కాదు... అప్పటికే ఆయనకు పొలీసుల నుండి థ్రెట్ వుంది... అయినా నిర్భయంగా, ఒంటరిగా సంచరించే వారు... తన లోకంలో తానుండే వారు... చుట్టుపక్కల వారిని పట్టించుకునే వారు కాదు... ఎప్పుడు దీర్ఘాలోచనలో వుండేవారు...

ఆయనలో నాకు బాగా నచ్చిన అంశం నిరాడంబరత..... పౌర హక్కులకు ఆయన సరికొత్త నిర్వచనం చెప్పారు ....