ఇంకొక కట్ అండ్ పేస్ట్ టపా!
" అల్లము పచ్చడి తలవగ నుల్లము
నుప్పొంగు నదిరి నూగాడు లయన్,
ఆ(హా) మజ్జిగ మిరపకాయ లావరసంబున్,
జర్రున జుర్రిన జారును హృదయము ధృతిలో..
చిక్కని పెరుగున తురిమిన చక్కని కొబ్బరి పచ్చడి,
డెందమునకు బంధమేయు శాకము కందా బచ్చలి,
పంతి భోజనములు, కొసరి వడ్డింపులూ,
పరమాన్నపు భక్ష్యాదులు, పండ్ల రసంబుల్..
గుమ్మడి కాయ పులుసు గుండె తడుపు,
గుబులు పుట్టించులే గుత్తి వంకాయ,
అరటి పువ్వు కూర, దోసావకాయ,
అరటాకులొ యారగింపు, మా రుచి చూడన్..
కమ్మనైన నేయి, గుమ్మ పాలు,
వెన్న మీగడలౌర, గడ్డ పెరుగు,
గోంగూర పప్పు, గోముగా తాళింపు,
మనసు దోచెడి పొడులు, ఒరుగులొడియాలు
" గోగు చిగురు, చింత చిగురు, మునగ చిగురు తో వెరసినా,
మెంతికూర, పాలకూర, చుక్కకూర తో కలసినా,
దోసకాయ, వోగ కాయ, టొమటో ల జతగూడినా,
కమ్మనైన యర వేచిన, పప్పు తలువ తాళలేము.. "
" పాకమందు ప్రప్రథమ స్థానము యీ శాకములది,
మది మెచ్చిన, మనసిచ్చిన కూరలెన్నో కలవండి,
కొత్తిమీర, జీలకర్ర, వేపుడుల్లి కారములను,
గుబులు పుట్టించునౌర, గుత్తి వంకాయ కూర..
డెందమునకు బంధమేయు శాకము కందా బచ్చలి,
అందరు మెచ్చెడి రుచి కల, యాకు కూర తోటకూర,
వంకాయల్లము కలిసిన వంక(పెట్ట)లేని కూరయిది,
చిట్టి వడియాలు కలిపి, చిత్తు దీర భుజియించుడి..
పనస పొట్టు కూరండి, పరవశించి దినగ రండి,
అరటి కాయ శాకమిది, యాదమరచి యారగింప,
అట నిట కొబ్బరి కలిపిన యతి చక్కని శాకమండి,
మప్పితముగ ఘుప్పించుడి, పప్పు కూర యిదెనండి... "
" సొర కాయల సోయగాలు, మునగకాళ్ళ ఢప్పళాలు,
పండు గుమ్మడితో కలిసి ముల్లంగీ, క్యారెట్టులు,
ఆరగించకుండానే అందమైన రుచిని తెలుపు,
నాధరువుల మేటి యిది యతి చ(చి)క్కని మజ్జిగ పులుసు,
ఆకలాకలంటుంటే యడగకుండ కడుపు నింపు,
మది లోపలి మగత దీర్చు, నిది తియ్య(ని) పులుసు,
వెచ్చటన్నముంటేను, మెచ్చిన జత యుంటేను,
మచ్చుకి రుచి చూసిననూ, వదల లేని పచ్చి పులుసు,
ముక్కల పులుసు, బచ్చలి పులుసు, ఆవపులుసు, పప్పు పులుసు,
యెండు మిరప పోపు పొగిచి, పసుపు, యింగువ సొబగులద్ది,
కరివేపా తళుకిస్తే, కొత్తిమీర కులుకులిస్తే,
ఘుమ ఘుమ ఘుమ లాడించును, యా చవులను అదిలించును. "
" మెంతి చారు, శొంఠి చారు, యులవ చారు, యుల్లి చారు,
పప్పు చారు, యావ చారు, మిరియాల్చారు, మజ్జిగ చారు,
ఉరికించును, యుడికించును, ఉల్లాసపు ఊపిచ్చును,
ఉడుకి ఉడుకుతుండగానే, మది నూయలలూగించును....
కడుపు నిండింది మరికొన్ని ఇంకో సారి.
5 కామెంట్లు:
ఒప్పైన నిమ్మ పండ్లును ఉప్పును కప్పురము శొంఠి యాలకు పొడియున్ కలిపిన కమ్మని నిమ్మ రసం లా ఉంది సారూ
నాకు తెలిసి ఈ పద్యాలు రాసింది రామభద్ర డొక్కా అనే వ్యక్తి
కొత్తపాళీ గారూ! మీరు సరిగ్గానే కనిపెట్టారు. ఈ పద్యాలను రామభద్ర. ఆర్. డొక్కా గారు అమ్మ చేతి వంట అనే శీర్షిక క్రింద చెప్పారు. రుచిగా ఉన్నాయని లాగించేశాను.
ఎంత బాగా రాసారు.. ఇది చదివిన వారికి నొట్లో నీరు ఊరలేదంటే... ఎదో తేడా ఉంది అనిలెక్క :)
సత్యము మా ధర్మమనుచు
అత్యుత్తమ సేవలోసగు ఆశ్రిత జనులన్
ఆ ద్యుతుడు రామలింగడు
భత్యములకె ఎసరు తెచ్చె, భాగ్యము మురళీ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి