...

...

12, ఫిబ్రవరి 2009, గురువారం

తెలుగు బ్లాగులూ.. సమస్యా పూరణమూ..

ఈ ఫిబ్రవరి నెలలో తెలుగు బ్లాగుల్లో పద్యపూరణల జోరు బాగా కనిపిస్తోంది. మొట్ట మొదటగా ఈబ్లాగులో(ఫిబ్రవరి 4) సమస్యా పూరణం అనే శీర్షిక క్రింద రెండు సమస్యలను ఇచ్చాను. అవి
1.రాముని భార్యలకు నింద రానే వచ్చెన్
2.ముదమగు నొకసుతయు వేయి యల్లుళ్లున్నన్!
పై రెండు సమస్యలకు ఇదివరకే పూరించిన పద్యాలను చెరో నాలుగింటిని పేర్కొని అవే సమస్యలను ఎవరినైనా పూరించమని కోరాను.
ఆత్రేయ గారి పూరణ:
1.కాముడు రావణ హతకుడు
కోమలి తోడగు గణముల కోతులు అనగా
రాముడె నందుని సుతుడవ
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్‌
2.పదమనె సిరిపతి పత్నితొ
పదవులు ఊడిన సురగణ పరపతి నిలుపా
కదలని సిరితో పలికెను
"ముదమగు నొక సుతయు వేయి యల్లుళ్ళున్నన్‌ "!
ఫణి ప్రసన్న కూమార్ పూరణ:
ఆ మునులు కొల్చిరెవనిని ?
హోమపు ఫలమును దశరథు డెవరికి యిచ్చెన్ ?
సోముని గాంచిన యేమయె ?
రాముని భార్యలకు నింద రానేవచ్చెన్

ఆంధ్రామృతం బ్లాగులో(ఫిబ్రవరి 5) చింతా రామకృష్ణారావు గారు
తప్పక యిచ్చెద. వ్రాయుడు.
నిప్పుకుచెదబట్టె నయ్య! నేర్పరి యింట
తప్పుగ వ్రాయగ తగదయ.
ఒప్పుగ నది భారతాన యున్నదె చెపుమా!
అంటూ మీ కవితామృతాన్నందించండి అని కోరారు.
వీరి సమస్యకు క్రింది పూరణలు వచ్చాయి.
1.ఆత్రేయ:
అప్పుగ తెచ్చిన డబ్బుతొ
గొప్పగ వడ్డిని గెలిచిన గోమటి తెలివీ
చెప్పులు కొరకగ కుంటిన
నిప్పుకు చెదబట్టెనయ్య నేర్పరి యింటన్‌
2.ఊక దంపుడు:
గొప్ప నిజాయితి పరుడని
అప్పనముగపదవినీయ హస్తపు రాణే
విప్పిరి సంచులు సభలో
నిప్పుకు...చెద పట్టెనయ్య! నేర్పరి యింటన్.
3.ఫణి ప్రసన్న కుమార్:
తుప్పిడె గాంఢీవమునకు
గప్పున సడి లేక గాలి కదలక యుండెన్
అప్పయు నెలుకలు కొరికెను
నిప్పుకు చెద పట్టెనయ్య నేర్పరి యింటన్
4.పుష్యం:
అప్పడు అంతట వెదకెను
నిప్పుకు, చెదబట్టెనయ్య 'నేర్పరి' ఇంటన్!
తప్పగ తాగిన అతడిక
నిప్పెట్టతలచె గుడిసెకు, 'నేర్పరి' కాడే!
5.చింతా రామకృష్ణారావు:
అప్పుల సొమ్మది. కాలెను
నిప్పుకు ! చెద పట్టెనయ్య! నేర్పరి! ఇంటన్
గొప్పగు గ్రంధములన్నియు
తిప్పలు పడుచుంటినయ్య! తీర్పగదయ్యా!
6.చదువరి:
చెప్పులు నాకెడు కుక్కల
తప్పుడు కూతల నెదిర్చి తద్బ్లాగరులే
మెప్పును పొందిరి గొప్పగ
నిప్పుకు చెదబట్టదెపుడు నేర్పరి యింటన్‌
పై పూరణల్లో ఫణి ప్రసన్న కుమార్ పూరణ ఒక్కటే భారతార్థంలో ఉంది.

డా. ఆచార్య ఫణీంద్ర తమ "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" బ్లాగులో(ఫిబ్రవరి 6)సమస్యను పరిష్కరించండి అంటూ
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్! అనే సమస్యనిచ్చారు.
దీనికి స్పందనగా ఈ క్రింది పూరణలు వచ్చాయి.
1.జిగురు సత్యనారాయణ:
ఆకృతి దాల్చగ కూటమి
ఆకలన సమయము వచ్చినంత తెరాసా
కైకొనెను పెక్కు సీట్లన్
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!!
2.ఆత్రేయ:
పైకము, పదవులు చాలక
శోకించెడి రైతుల వ్యధ చూడక రాజుల్
మైకున అరచిరి ఓటిడ -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్
2.డా. ఆచార్య ఫణీంద్ర:
నాకిడవలె పలు సీట్లని,
లేకున్నను పొత్తులింక లేవని చెప్పెన్
ఆ కే.సీ.ఆర్. బాబుకు -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!

ఆంధ్రామృతం బ్లాగులో(ఫిబ్రవరి 6) చింతా రామకృష్ణారావు గారు మనం కూడా సమస్యా పూరణ చేసి చూద్దామా?1. అంటూ
పరమ శివునితో లక్ష్మియు పవ్వళించె అనే సమస్యనిచ్చారు.
ఈ సమస్యకు క్రింది పూరణలు వచ్చాయి.
1.జిగురు సత్యనారాయణ:
కొండ పైన కాత్యాయిని కోరియుండె
పరమ శివునితో, లక్ష్మియు పవ్వళించె
విష్ణుతో నడి సంద్రాన విభ్రమముగ
ఇల్లు వాకిలి లేనట్టి యింతులయ్యె!!
2.ఫణి ప్రసన్న కూమార్:
హరియు లోకపాలన సేసి అలసి జాలి
మీరి యోగనిద్రను చనె మరచె నన్ను
పరగె కాపురమ్మిటని వాపోయి పల్కె
పరమ శివునితో, లక్ష్మియు పవ్వళించె.
3.రాఘవ:
ప యనఁగ పయనించును గాఁన పవనుఁడు, మఱి
రమ యనంగ యనంగమాత మణిరమణి,
శూలి శివుడు, పదములొకచోటఁ జేరఁ
పరమశివునితోఁ లక్ష్మియు పవ్వళించె!
4.సనత్ శ్రీపతి:
నాథు డిచ్చిన గోరింట నూరి, తరుణి
తనయ 'లక్ష్మి ' చేతికి బెట్టె, తనివి తీర
నూత్న రీతి విరించి తొ, నాటి నుండి
పరమ శివునితో, లక్ష్మియు పవ్వళించె.
5.ఆత్రేయ:
పరవశమునాట లాడెడి
పరమాత్మల చంకనెత్తి పడకకు జనగా
పరతన బేధము లెరగక
పరమ శివుని తోడ లక్ష్మి పవళించెనయా!

మలక్‌పేట రౌడీగారు తమ రౌడీ రాజ్యం బ్లాగులో (ఫిబ్రవరి 10) క్రింది సమస్యల నిచ్చారు.
1. రాజా పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై ...

2. హరుడు నియంతయౌ హరిని యంతము సేయుట పాడియే కదా ...

3. భర్త అల్లుడయ్యె భామకపుడు
వాటి పూరణలు:
1.భావకుడన్:
రాజా, పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై,
రోజాలున్నవి వాడి ముళ్ళుయును వీరోచిత్తము న్వీడియున్,
రేజాలన్నదికన్ శశి ప్రణయము రేపంచున్. హన్న! మా
యాజాలంబది గన్న విర్సె గనులున్ యాశ్చర్యమున్చేటలై.
2.డా. ఆచార్య ఫణీంద్ర:
భువికి మరియు సిరికి ధవుడు శ్రీనాథుండు!
రాముడాడె పెండ్లి భూమి సుతను -
ఏమి చిత్ర మిద్ది - రామావతారాన
భర్త అల్లుడయ్యె భామ కపుడు!
3.డా. సీతాలక్ష్మి(మలక్‌పేట రౌడీగారి అమ్మగారు):
జాజుల్మల్లెల సోయగాలు కళలై జాణల్ సమాయత్తలై
మైజాఱుల్ సరిచేసి నీటమునుగన్ మాధుర్యముల్ మీరగా
రాజీవానన మోర్పు చంద్రుడగుచున్ రమ్యమ్ముగా పల్కెనో
రాజా పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై
4.డా. సీతాలక్ష్మి:
సూకరమయి నాడు సుదతి బ్రోచిన హరి
చెట్టబట్టి పృధ్వి చేయిబట్టె
దాశరధిగ ధరణి తనయను పెండ్లాడ
భర్త అల్లుడయ్యె భామకపుడు

ఆంధ్రామృతం బ్లాగులో(ఫిబ్రవరి 11) చింతా రామకృష్ణారావు గారు మనం కూడా సమస్యా పూరణ చేసి చూద్దామా?2. అంటూ
మణులు మాటలాడె మనసు కరుగ అనే సమస్యనిచ్చారు.
వీరి సమస్యకు క్రింది పూరణలు వచ్చాయి.
1.నరహరి:
కాస్త లేటు యయ్యె కార్యాల యమునను
అలిగి మంచమెక్కె ఆలి నాదు
తీపి మాట లాడ తిరిగి నాదు ప్రియ
మణులు మాట లాడె మనసు కరుగ
2.ఊక దంపుడు:
"పిలువ బిగువె?" యనుచు పేర్మిబంపరమణీ
మణులు, మాటలాడె- మనసు కరుగ
పిల్లవాని కటను పెళ్లి చూపులయందు;
వధువు యగుట నేడు వరుస కలిసి
3.రవి:
ఇంచుక యొక సమస్య ఇంపుగ పూరణ
సేయుమన్న యెడనె సై యని వెంటనె
కలము గొన్న వారు ఎలమి నెజ్జన శిరో
మణులు మాటలాడె మనసు కరుగ.
4.ఆత్రేయ:
గుణ గానము తగు నెరపి క
రుణ జూడమనిన వినని తరుణమున భృంగా
రుణ బహుమతీయ తరుణా
మణి మాటలాడె ముదముగ మనసులు కరుగన్
5.జిగురు సత్యనారాయణ:
కారు వీరు నీకు పరులు బాంధవులగు
తాల్మి లేక చంప తగునె? అనుచు
ధర్మ రాజు తోడ దాయాదుల నిజ ర-
మణులు మాటలాడె మనసు కరుగ
6.జిగురు సత్యనారాయణ:
బీద సాదలకును బియ్యము, కూరలు,
వెచ్చములు కొనంగ వెతలనుచును
నాయకాళి తోడ నయముగను రమణీ
మణులు మాటలాడె మనసు కరుగ
7.రాఘవ:
మాదు తల్లినుండి మమ్మల్ని బలిమితో
వేరుసేసి సానవెట్టి మీర
లమ్ముకుందురనుచు నాశ్యర్యముగఁ గలన్
మణులు మాటలాడె మనసు కరుగ
8.ఫణి ప్రసన్న కూమార్:
వేణుగానము సోకి వీనులు పులకింప
విరిసె దుద్దులలోని వింత రవ్వ
మరునితో పోరి వగరు పైయెద సెగల
ఎరుపెక్కె కంఠాన వెలయు కెంపు
ఇంపైన సఖుని తలంపులకు నొదిగె
పాపిట ముత్యాళి పరవశమున
జతగాని మరుకేళి జతగూడు తలపుచే
చుంబించె కటియందు కులుకు పచ్చ

చెలుని చూచుకాని చెంతకు పోబోదు
తెలుపలేదు సిగ్గు తమకములచె
రమణి బాధలెల్ల రమ్యముగ మెరిసి
మణులు మాటలాడె మనసు కరుగ
9.డా. ఆచార్య ఫణీంద్ర:
సాన బెట్టు వాడు మేని నరుగదీయ
వజ్రములకు మెరుగు వచ్చు వరకు -
"ప్రాణ మిట్లు తీయ భావ్యమా నీ"కంచు
మణులు మాటలాడె మనసు కరుగ!
10.రాకేశ్వర రావు:
బెట్టుఁ జేసియున్న బ్రేకిన్సుపెక్టర్‌కి
"మణులు మాట లాడె మనసు కఱుగ"
అంచు నేనుఁ జూపె లంచము, సొమ్ము చేఁ
బట్టకతను బండిఁ బట్టు కెళ్ళె!
11.రాకేశ్వర రావు:
గోపని విడిపించఁ గోరి తానీషాకి
ధనము నిచ్చి నిద్దరి నడుగంగ
"అప్పు యుంటి మతని కంచు" ఆ రామల
క్ష్మణులు మాట లాడె మనసు కఱుగ

మలక్‌పేట రౌడీగారు తమ రౌడీ రాజ్యం బ్లాగులో (ఫిబ్రవరి 11) పూరింపబడని సమస్య
హరుడు నియంతయౌ హరిని యంతము సేయుట పాడియే కదా ...తో పాటు మరో సమస్య నిచ్చారు.
అది
వాణి వార వనితలందు వాసికెక్కె
ఈ సమస్యలకు క్రింది పూరణలు వచ్చాయి.
1.డా. ఆచార్య ఫణీంద్ర:
కరము నధర్మమార్గమున, కామముతోడ నియంతవోలె సో
దరుని కళత్రమౌ "రుమ"ను దారగ చేకొనె "వాలి" ధూర్తుడై!
ఎరిగియునద్ది స్నేహితుని కేర్పడ న్యాయము, జానకీ మనో
హరుడు నియంతయౌ హరిని యంతము సేయుట పాడియే గదా!
2.డా. సీతాలక్ష్మి:
అరయగ వాలి నీతి విడనాడి రుమన్ చెరబట్టి త్రోలెసో
దరుని దురాత్ముడై పరమ దైన్యము నందెను సూర్య పుత్రుడున్
వెరవున రాజధర్మమగు వెట నెపమ్మున జానకీ మనో
హరుడు నియంతయౌ హరిని యంతము సేయుట పాడియే కదా
3.జిగురు సత్యనారాయణ:
వరునిగ చేది భూవరుని వాసిగ నెన్నిక జేసి యుండగా
పిరికితనంబు జూపి తను పిల్లను దొంగిలి వెళ్లె గొల్లడున్
గరికకు తూగునే ఖలుడు? కాంచగ కట్టడి లేక రుక్మిణీ
హరుడు నియంతయౌ,హరిని యంతము సేయుట పాడియే కదా!!
4.ఊక దంపుడు:
ఆధునికకాల మందున, ఆంధ్ర సాహి
తీజగతిన, చింతామణి తేజెరిల్లె
పద్య మందు; గద్యముగన హృద్య "మధుర
వాణి" వార వనితలందు వాసికెక్కె
5.డా. ఆచార్య ఫణీంద్ర:
వార వనిత నొక్క ప్రధాన పాత్ర జేసి,
అల్లినాడు "కన్యా శుల్క"మనెడి గొప్ప
నాటకమ్మును "గురజాడ" నాడు! - "మధుర
వాణి" వార వనితలందు వాసికెక్కె!
6.డా. సీతాలక్ష్మి:
పారిజాత ప్రసూనమై పరిమళించి
పలుకు తేనెల నందించు ప్రజ్ఞ కలిగి
రసతరంగిణి వలపుల రాణి మధుర
వాణి వార వనితలందు వాసికెక్కె
ఆంధ్రామృతం బ్లాగులో(ఫిబ్రవరి 14) చింతా రామకృష్ణారావు గారు మనం కూడా సమస్యా పూరణ చేసి చూద్దామా?3. అంటూ
'కొడుకునకుం కూతునిచ్చె కోమలి ముదిమిన్' అనే సమస్యనిచ్చారు.
వీరి ఈ సమస్యకు క్రింది పూరణలు వచ్చాయి.
1.ఊక దంపుడు:
ఒడి నుండుబాల యదివడి
వడిగా ఎదిగిగె సొగసును వయసును బొందన్
అడిగియె, అన్నయ్యచివరి
కొడుకునకుం కూతునిచ్చె కోమలి ముదిమిన్
2.జిగురు సత్యనారాయణ:
కడు నెయ్యపు వరుడు, సదా
యెడంద శోభిల్లు పేర్మి, యీడుకు జోడౌ,
ముడి పెట్టగనాడపడచు
కొడుకునకుం కూతునిచ్చె కోమలి ముదిమిన్!!
3.రాఘవ:
గుడిగుడిగుంతల ప్రాయము
చిడిపితనము పోని వయసు చేయగ పెండ్లిన్
జెడలల్లి బొమ్మలకు తన
కొడుకునకుం గూతునిచ్చెఁ గోమలి ముదిమిన్.
4.రాఘవ:
ఉడుమండలపతిముఖునికి
వడిగలవానికి దశరథవరతనయునకున్
పుడమి తననేలు భూపతి
కొడుకునకుం గూతునిచ్చెఁ గోమలి ముదమున్.

ఈవిధంగా మన బ్లాగరులు మంచి మంచి పూరణలతో తమ ప్రతిభను చాటుతూ వుండటం మనమందరమూ గర్వించదగిన విషయం. ఈ సమస్యాపూరణ విజయోల్లాసానికి "తురుపుముక్క" నాంది పలకడం మహదానందంగా ఉంది.

5 కామెంట్‌లు:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అర్యా! సమస్యాపూరణ లన్నీ మీరొకే చోట చేర్చి పాఠకులకు సమస్య లేకుండా చేస్తున్నందుకు ధన్యవాదములు.
ఇక ఆంధ్రామృతం బ్లాగులో(ఫిబ్రవరి 5) ఇచ్చిన సంస్యను గూర్చి చిన్న వివరణ.
కందము:-
తప్పక యిచ్చెద. వ్రాయుడు.
నిప్పుకుచెదబట్టె నయ్య! నేర్పరి యింట
తప్పుగ వ్రాయగ తగదయ.
ఒప్పుగ నది భారతాన యున్నదె చెపుమా!

పై పాద్యంలో నాల్గవ పదంలోని భారతాన = బారత దేశమునందలి మఱియు భారత మందలి అని అర్థ ద్వయము గ్రాహ్యము. కావుననే సమస్యనిచ్చిన నేనే లౌకికాంశంతో పూరించాను.

Malakpet Rowdy చెప్పారు...

aryaa! naa dhanyavaadaMulu kUDA!

అజ్ఞాత చెప్పారు...

ఇది చూడండి:

ఆధునికకాల మందున, ఆంధ్ర సాహి
తీజగతిన, చింతామణి తేజెరిల్లె
పద్య మందు; గద్యముగన హృద్య "మధుర
వాణి" వార వనితలందు వాసికెక్కె

Malakpet Rowdy చెప్పారు...

baagunnadamDI UkadamPuDugaarU! naa blaagulO aachaarya phaNImdra gaaru kooDa poorimchaaru. chUDamDi.

Malakpet Rowdy చెప్పారు...

బాగున్నదండీ ఊకదంఫుడుగారూ! నా బ్లాగులో ఆచార్య ఫణీంద్ర గారు కూడ పూరించారు. చూడండి.