...

...

11, మే 2009, సోమవారం

వేసవి సెలవుల్లో...

ఈ వేసవి సెలవుల్లో మా పిల్లలను కర్నాటక లోని పలు ప్రాంతాలను చూపించటానికి తీసుకెళ్లాను.మా ఇద్దరు తమ్ముళ్లు, వారి కుటుంబాలు, మా అమ్మా నాన్న, మా కుటుంబం అంతా కలిసి బెంగళూరు నుండి ఒక టెంపో ట్రాలెలర్ లో యాత్రకు బయలుదేరి వెళ్లాము. మొదటగా హొరనాడు చేరాము. హొరనాడు లో అన్నఫూర్ణేశ్వరి అమ్మవారు నెలకొని ఉన్నారు. ఈ ప్రాంతం కొండల మధ్యలో దట్టమైన అడవి బొడ్డున వుంది. ఇక్కడి దేవస్థానం లో భక్తులకు చక్కటి ఆతిథ్యం లభిస్తుంది. వసతి, స్నాన పానాదులకు దేవస్థానం వారే అన్ని సౌకర్యాలు సమకూర్చారు. అమ్మవారి దర్శనం చేసుకొని గుడిలోనే ఫలహారం ముగించుకొని శృంగేరికి పయనమయ్యాము. ఈ ప్రయాణం మా మనసుల్లో మధురానుభూతులను నింపింది. పశ్చిమ కనుమల అందాలను ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తూ ఆస్వాదించాము. ఎత్తైన పోక చెట్లు, వాటిని అల్లుకొన్న మిరియపు తీగలు, కాఫీ టీ ప్లాంటేషన్లు కొబ్బరి చెట్ల సమూహాలు పనస చెట్లు కనువిందు చేశాయి. యెక్కడ చూసినా కనుచూపు మేరకు పచ్చదనమే. కాంక్రీటు జంగిల్లో నివసించే మా పిల్లలకు ఈ ప్రకృతి పట్టరాని ఆనందాన్ని కలిగించింది. శృంగేరి,శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాలలో ఒకటైన దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠానికి ప్రసిద్ధి. మేము శృంగేరి చేరి, అక్కడ మలహారక చంద్రమౌళీశ్వరుడు, శారదాంబల దర్శనం గావించుకొని తుంగా నది ఆవలి ఒడ్డున ఉన్న గురుమందిరంలో ప్రస్తుత శంకరాచార్యులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి వారి దర్శనం చేసుకొని, దేవస్థానం వారిచే ఎర్పాటు చేయబడిన భోజన ప్రసాదాన్ని స్వీకరించి కొల్లూరుకు ప్రయాణమయ్యాము.కొల్లూరు మూకాంబికా అమ్మవారి దర్శనము చేసుకొని సాయంకాలానికి మురుడేశ్వరం చేరుకొన్నాము. మురుడేశ్వరాన్ని తీర్థయాత్ర కన్నా విహారయాత్రగానే చెప్పుకోవాలి. అరెబియా సముద్ర తీరం లో ఉన్న మురుడేశ్వర్ బీచ్ మా పిల్లలను(ఆ మాటొస్తే పెద్దలను కూడా) కేరింతలు కొట్టించింది. సముద్రం లో కాసేపు సరదాగా గడిపి సముద్రపు ఒడ్డునే ఉన్న ఓ విశ్రాంతి భవనం లో బస చేశాము.ఉదయాన్నే లేచి మురుడేశ్వరుని దర్శనం చేసుకొన్నాము. అక్కడ కొండ పైన ఉన్న ఎత్తైన ఈశ్వరుని విగ్రహం, భూకైలాశ్ గుహలో దృశ్య, శ్రవణ రూపకాన్ని దర్శించుకొని కామత్ హోటల్లో కాఫీ టిఫిన్లు ముగించుకొని గోకర్ణకు బయలుదేరాము.గోకర్ణ కూడా అరేబియా సముద్ర తీరం లో ఉంది. ఎన్‌టీఆర్ సినిమా భూకైలాస్ చూసిన వారికి గోకర్ణం గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుని ఆత్మలింగం ప్రతిష్టింప బడింది. భక్తులు ఈ లింగాన్ని చేత్తో తాకి నమస్కరించ వచ్చు. రావణుని చేతిలో మొట్టికాయ తిన్న గణపతి తలపైని గుంతను కూడా చేతితో తాకి చూడవచ్చు. గోకర్ణలో తియ్యని కొబ్బరి బోండాలను తాగి ఎడుగుంజి, ఆనేగుడ్డె లలోని గణపతులను దర్శించుకొని ఉడిపి చేరుకొన్నాము. ఎడుగుంజి దేవస్థానంలో భోజనం చేశాము. కర్ణాటకలో ప్రతేకత ఏమంటే ఏ దేవస్థానానికి వెళ్ళినా చక్కటి ఉచిత భోజనం లభిస్తుంది. కాకపోతే దేవస్థానంలోకి ప్రవేశించేటప్పుడు భోంచేసేటప్పుడు మగవారు చొక్కా బనియన్లను విప్పాలి. ఉడిపి కనకదాసు కథకు రంగస్థలం. కనకదాసు బ్రాహ్మణుడు కానందున అతడికి కృష్ణుడి దర్శనం లభించలేదు. కనకదాసు గర్భగుడి వెనుక ఉన్న కిటికీ నుండి దేవుణ్ని దర్శించటానికి పూనుకొంటే అతని భక్తికి దాసుడై కృష్ణుడే వెనుకకు తిరిగి అతడికి దర్శనము ఇచ్చాడు. ఇప్పటికీ ఉడిపి శ్రీ కృష్ణుణ్ని ఆ కిటికీ లోంచే మనం దర్శించుకోవాలి.ఉడిపి కృష్ణమందిరం చుట్టూ భారతదేశంలోని పలు మఠాల శాఖలు ఉన్నై. ఉడిపి నుండీ కటీలు ప్రయాణం కూడా వంకర టింకర ఘాట్ రోడ్డు మలుపులతో సాగింది. మార్గమధ్యంలో హిందూస్థాన్ పెట్రోలియం వారి ఫ్యాక్టరీ సాయంకాలపు దీపపు వెలుగుల్లో జిగజిగేల్‌మంటూ కనువిందు చేసింది. కటీలులో దుర్గాపరమేశ్వరి దేవస్థానం వారి వసతిగృహంలో విడిదిచేసి యథాప్రకారం అమ్మవారి దేవస్థానంలో భోజనానికి బయలుదేరాము. ఐతే ఆరోజు ఏకాదశి కావడం మూలాన ఫలహారంతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఉదయాన్నే అమ్మవారి దర్శనం చేసుకొని ధర్మస్థళకు బయలుదేరాము. ధర్మస్థళలో శ్రీమంజునాథ స్వామి దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో వస్తారు. అంతమంది భక్తులకూ ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం లభిస్తుంది. దేవాలయ సిబ్బంది ఓపికను అభినందించి తీరాలి.శ్రీమంజునాథ స్వామి దర్శనం తరువాత బెంగళూరుకు తిరుగు ముఖం పట్టాము.అప్పటికే మా బృందంలోని సభ్యులందరికీ విపరీతమైన బడలిక కావడంతో ముందుగా ప్లాను చేసిన కుక్కె, బేలూరు, హళేబీడు లను చూసే ఓపిక నశించడం వల్ల వాటిని చూడకుండానే మా టూర్ ముగించాము.

1 కామెంట్‌:

panipuri123 చెప్పారు...

photos bagunnayi...