...

...

31, మే 2009, ఆదివారం

వినదగు నెవ్వరు జెప్పిన... 'గ్రంథావలోకనమ్' పై స్పందన!!!

నా సమీక్షావ్యాసాల సంపుటి గ్రంథావలోకనమ్ ప్రచురింపబడి 6 నెలలు దాటింది. ఈ పుస్తకాన్ని కొన్ని పత్రికలు సమీక్షించాయి. మరికొన్ని 'స్వీకారం'తో సరిపెట్టుకున్నాయి. మిగిలిన పత్రికలు స్పందించలేదు. గత అనుభవాల దృష్ట్యా కొన్ని ఎంపికచేసుకున్న పత్రికలకే సమీక్షకు పంపడం జరిగింది.ఒక పత్రికా సంపాదకుడైతే "మా పత్రికకు కొన్ని విలువలున్నాయి. అన్ని పుస్తకాలనూ సమీక్షించం" అని మొహం మీదే అన్నాడు."సమీక్షించడం సమీక్షించకపోవడం మీ ఇష్టం. కనీసం గ్రంథ స్వీకారం లో దీని వివరాలు వేయండి" అని కోరాను. ఫలితం శూన్యం. ఒక సమీక్షకుడైతే 'సమీక్షలపై సమీక్ష వ్రాయడమేమిటి?' అని తిరస్కరించాడట.సరే! ఎవరిష్టం వాళ్లది.ఈ సంపుటంపై పలువురు తమ అభిప్రాయాన్ని లేఖల ద్వారా తెలియజేశారు. ఈ గ్రంథావలోకనమ్ పై వచ్చిన స్పందనను తురుపుముక్క పాఠకులతో పంచుకోవాలని అనిపించింది. దాని పర్యవసానమే ఈ టపా.


సమీక్షల "గ్రంథా"వలోకనమ్
స్వరలాసిక, కోడీహళ్లి మురళీమోహన్ పేర్లతో ఆంధ్రభూమి దిన పత్రిక, నేటి నిజం దినపత్రిక, ఈవారం, జాగృతి లాంటి పత్రికలలో వివిధ గ్రంథాలపై చేసిన సమీక్షల్ని "గ్రంథావలోకనమ్" పేరుతో వెలువరించారు రచయిత.ఈ పుస్తకానికి డా. అద్దేపల్లి రామమోహన రావు,డా.చేకూరి రామారావు ముందు మాటలు రాశారు. ఐ.ఎస్.బి.ఎన్.నెంబరుతో వెలువడిన ఈ పుస్తకంలో చివర గతంలో రచయిత సంకలనం చేసిన కథాజగత్,గడ్డి పూవు పుస్తకాలపై పత్రికలు, ప్రముఖుల అభిప్రాయాలు ప్రచురించారు. స్వీయ సాహితీ కృషిని తెల్పుకోవడంలో ఆక్షేపణ లేదు కానీ, అవసరమా? అనే అంశం ఆలోచించాలి.

ప్రముఖ రచయితలు, కవుల నుండి కొత్త వారి పుస్తకాల దాకా వివిధ పత్రికలలో మురళీ మోహన్ చేసిన సమీక్షల సంకలనమే ఈ గ్రంథావలోకనమ్.గుంటూరు శేహేంద్ర శర్మ, దేవరాజు మహారాజు, నాగసూరి వేణుగోపాల్, కల్లూరి భాస్కరం, గోపులింగారెడ్డి, షేక్ కరీముల్లా, పెన్నా శివరామ కృష్ణ, జూలూరి గౌరీశంకర్, ఎస్.ఆర్.పృథ్వీ,ఎస్.రవీంద్ర, ప్రయాగ, మునిసుందరం లాంటి వారి గ్రంథాలపై నిశితంగా సమీక్ష చేసిన తీరు గమనించగలం. ఒంగోలు రైతు జీవన చిత్రం "మిత్తవ" రచన:మంచికంటి(పేజీ 35), మానవత్వంపై మమకారం ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుతకం ఇది అంటూ షేక్ కరీముల్లా "కవాతు"ను(పేజీ 87)పరిచయం చేస్తారు మురళీ మోహన్. లకుమ "హైకూలు"(పేజీ 89) చక్కటి వ్యాస పరమైన ప్రయోజనకరమైన సమీక్ష.

సామాన్యుడి జీవిత చి(ఉ)త్తర్వులపై "రాజముద్ర" అంటూ దేవరాజు మహారాజు గారి గ్రంథంపై(పేజి 99) సమీక్షిస్తారు. శైలీ శిల్పాల పరంగా మొదటి పుస్తకం"అన్వేషణ"కన్నా సంగెవేని రవీంద్ర కవిగా ఈ "వలస పత్రం" లో పురోగమించాడు(పేజీ 102).విమర్శనాత్మకంగా... నిశితంగా పరిశీలిస్తూ సత్యవాడ(ఓగేటి)ఇందిరా దేవి రాసిన "నిరుడు కురిసిన హిమ సమూహములు"(నవల) (పేజీ 69) యువ నవలాకారులకు ఎంతో ప్రయోజనకర సమీక్ష. "రచనతోనే మనకు సంబంధం తప్ప - రచయిత కాదు" అనేది విమర్శకుడి లక్ష్యం-లక్షణం.

రాచమల్లు రామ చంద్రారెడ్డి, త్రిపురనేని మధుసూధన రావు, చిలుకూరి నారాయణ రావు, రాళ్లపల్లి అనంత శర్మ, కాశీ కృష్ణమాచార్యులు, వేలూరి నారాయణ రావు, జే.సీ.జగన్మోహనాచార్యులు, జి.లక్ష్మీనర్సయ్య, కేతవరపు రామకోటి శాస్త్రి, ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం, చేరా, అద్దేపల్లి, ఆర్.ఎస్.సుదర్శనం,కె.వి.రమణా రెడ్డి,కె.కె.రంగనాథాచార్యులు, ఆచార్య తుమ్మపూడి లాంటి అనేక మంది పెద్దలు సమీక్ష, విమర్శ మొదలగు అంశాలపై ఎంతో నిబద్ధతతో, బాధ్యతాయుతంగా విశ్లేషణలు చేశారు. కవిని,రచయితను..చూడకుండా అతని రచనపైనా.. విమర్శను.. (బాగోగులను) రాయాలి. సమీక్షకుడు వేరు - విమర్శకుడు వేరు. ఎటువంటి భేషజాలు, పక్షపాత ధోరణులు,ఈర్ష్య ద్వేషాలు లేకుండా సాహిత్య విమర్శలు రావాలి. సమీక్షకుడికి తగినంత ప్రాచీన, నవీన సాహిత్య అధ్యయనం ఉండాలి. కేవలం తన అభిప్రాయాలనే పెట్టుబడిగా పెట్టుకున్నవారి సమీక్షలలో ప్రామాణికత ఉండదు. సమీక్షకుడు ఏ ఒక్క భావజాలానికీ నిబద్ధుడు కాడు. భావాలకు మత్రమే నిబద్ధుడు. ఈ దిశగా "కోడీహళ్లి" కలం సమీక్ష ప్రమదావనానికి కాపు కాయాలి.
- తంగిరాల చక్రవర్తి.
(ప్రజాశక్తి,14 డిసెంబర్2008.)

* * *

గ్రంథావలోకనమ్

పలు ప్రక్రియలకు సంబంధించిన గ్రంథాలపై ఒక రచయిత సమీక్షలు గుదిగుచ్చి ప్రచురించిన పుస్తకం ఇది. శీర్షిక గ్రంథావలోకనమ్. ఈ పుస్తకానికి ఇద్దరు ప్రముఖులు ముందుమాట వ్రాసారు. ఒకరు అభ్యుదయకవి అద్దేపల్లి రామమోహన రావు. మరొకరు ఉస్మానియా మొదలైన విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులైన సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య చే.రా. సుంకోజు దేవేంద్రాచారితో ప్రారంభించి 'గడ్డి పూవు' కవితా సంపుటి సమీక్షా వ్యాసంతో గ్రంథం పరిసమాప్తమౌతుంది.సమీక్షలలో రచయిత తీసుకున్న వైఖరి బాగుంది. కేవలం పరిచయాలు కాక విశ్లేషణ కూడా ఉంది. కానీ ఈ మధ్య కొందరు విమర్శకులం మేం, సమీక్షకులం అంటూ కొన్ని పత్రికల ద్వారా వాటికి లక్షణాలు వివరిస్తూ చవకబారు సూచనలు, లక్ష్యాలక్షణాల్ని నిర్దేశించడం కించిత్ బాధాకరం అనే చెప్పాలి. ఆయా వ్యక్తుల పేర్లు వారి లోపాల్ని నేను విప్పి చెప్పాలంటే అదో ఎం.ఫిల్ వ్యాసం అవుతుంది.

కోడీహళ్లి సమీక్షలలో సమకాలీన సాహిత్యం ఎదురుకుంటున్న సమస్యలు కనిపిస్తాయి. వేంపల్లి గంగాధర్, వి.ప్రతిమ, గుమ్మా ప్రసాదరావు, జి.రాములు, మంచికంటి, మల్లాప్రగడ రామారావు, సుగుణారావు, గోపు లింగారెడ్డి, కరీముల్లా, లకుమ, పెన్నా శివరామకృష్ణ, జూలూరి గౌరీశంకర్, ఎమ్బీయస్ ప్రసాద్, ప్రయాగ, సత్తి లలితారెడ్డి మొదలైన వారి గ్రంథాల మీద స్వరలాసిక, కోడీహళ్లి మురళీ మోహన్ పేర్లతో ఈ సమీక్షలు పలు పత్రికలలో వెలువడినవే.తను రాసిందే గొప్ప సమీక్ష అని స్వోత్కర్ష చాటుకునే వ్యక్తుల్ని, మిగిలిన వాళ్లు వ్రాసింది తూతూమంత్రంగా వ్రాసాడన్న వ్యక్తుల్ని మనం పరిగణనలో తీసుకోవలసిన అవసరం ఏముంది గనుక. పాఠకులకు ఎవరు ఏమిటో తెలీదనుకోవడం అవివేకం.అద్దేపల్లి గారు చెప్పినట్లు సమీక్షకుడికి ఒక ప్రాపంచిక దర్శన దృక్పథం అవసరమే.ఈ పుస్తక రచయిత కూడా దానిని కొంత సమూపార్జించుకోవాలి. ప్రతి పుస్తకాన్నీ చదివి రాసే కోడీహళ్లికి మంచి విమర్శకునిగా ఎదిగే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.తెలుగు సమీక్ష కేవలం పుస్తక పరిచయంగా దిగజారి పోయిన కాలమిది. కానీ కోడీహళ్లి ఆ స్థాయిని అధిగమించి మంచి సమీక్షకునిగా ఎదిగాడు.కొన్ని సమీక్షలు ఒకే మూసలో ఉంటాయి. దానిని అధిగమించాలి. భాషను మరింత మెరుగు పరుచుకోవాలి. అన్ని పుస్తకాలకూ ఒకే తరహా భాషను ఉపయోగించడం సరైంది కాదు. పుస్తకాన్ని పాఠకులకు చేరవేసే విధంగా ఉండాలి.

నేటి కాలంలో కథలు, కవితలు, వ్యాసాలు, సంపుటాలు, సంకలనాలు పుంఖానుపుంఖాలుగా వెలువడు తున్నాయి. ఎవరి సత్తా వారిది.నిజం చెప్పాలంటే ఏ రచయితైనా తన రచన మీద మరొకరి విశ్లేషణ తెలుసుకోవాలనుకుంటాడు. అటువంటి విశ్లేషణలు వెలువడినప్పుడే రచన సార్థకమవుతుంది. పుస్తకాల ప్రచురణ బాగా పెరిగింది. పాఠకులు పెరిగారు. కానీ రచనలు రాశిలో పెరిగినా వాసిలో పెరగలేదు. ఇప్పుడు సమీక్షల అవసరం వల్ల సమీక్షకులు రూపొందుతున్నారు.మంచి రచనల్ని మంచివని చెప్పడం ఎంత న్యాయమో, స్థాయి తక్కువ గలవాటిని అదేవిధంగా చెప్పడం అవసరం. కానీ ఈ రచనలలో ఎక్కువ సానుకూల సమీక్షలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూలం తక్కువే. అవి సవరించు కుంటే ఈ రచయిత మంచి విశ్లేషకుడవుతాడని చెప్పడం భావ్యం.

-డా. మంతెన
(ఈవారం జనవార్త మార్చి 15-21,2009)

* * *

విషయ పరిజ్ఞానం కలిగిన "గ్రంథావలోకనమ్"

నేడు సాహితీ ప్రక్రియలలో కవిత్వం, కథ, నవల, వ్యాసం, నాటిక, గేయం ఒక ఎత్తైతే, ఇటీవల వస్తున్న సాహితీ సమీక్షా వ్యాసాలు ఒక ఎత్తు.. ఇవి ఒక విధంగా అధ్యయన గ్రంథాలు.. కానీ.. నేడు చాలావరకు సమీక్షలంటే కేవలం పొగడ్తలుగా కనిపిస్తున్నాయి..ఎందుకంటే వేలకు వేలు పెట్టి తనకు తోచిన వాక్యాల్ని కవితలుగా రచిస్తే ఇది బాగోలేదని చెప్పడమెందుకు అనే భావం అందరిలో ఉండటం ఒక కారణమైతే గ్రంథ సమీక్షకులు కూడా సమకాలీకులు కావడం మరో కారణం. కానీ.. ఈ గ్రంథ సమీక్షకులు కోడీహళ్లి మురళీ మోహన్ అలా కాకుండా సమీక్షను ఒక పనీలా కాకుండా.. ఒక బాధ్యతగా స్వీకరించారు. కాకుంటే ఇందులో ఒక ప్రత్యేకత వుంది. ఒక కవిత్వం, కథే కాకుండా నవల కూడా సమీక్షించడం సాహిత్యానికి సంపూర్ణత్వం చేకూరినట్లయింది.

సమీక్ష అనేది చాలా కాలాతీతమైన పని. సంక్షిప్తంగా తెలియ జేస్తూ విషయం విపులీకరించడం కత్తి మీద సాము లాంటిది.నేడు పత్రికల సంఖ్యతో పాటు కవులు కూడా పెరగటం మూలంగా ఎలా రాసినా, ఏదో ఒకటి రాసినా వారు కవులనే భావాన్ని కల్పించే ఇప్పటి వాతావరణంలో దేనికీ అటు రచయితలకూ, పత్రికలకూ ఏ లోటూ వుండటం లేదు. కానీ ఒకే వాక్యం ఎంతమంది ప్రయోగించినా అది తెలిపే విధానంలోనే కవిత్వం వుంటుంది అనేది అతిశయోక్తి కాదు.

ముందుమాటలో అద్దేపల్లిగారు అన్నట్లు విమర్శిస్తేనో, పొగిడితేనో అది సమీక్ష కాదు. విమర్శిస్తే గొప్పవారని, పొగిడితే ఏమీ తెలియని వారని అనుకోవడం పొరపాటే అవుతుంది.స్త్రీల సమస్యలపై స్త్రీల దృష్టి కోణంలో కథలు రచించిన వి.ప్రతిమ గారి పక్షి కథా సంపుటిని సమీక్షిస్తూ ఆమె రచనలను సమర్థిస్తూనే మరోవైపు ప్రతిమ లాంటి సమర్థులైన రచయితలు తమ రచనల్ని పాజిటివ్ అప్రోచ్ లో ఎందుకు రాయకూడదు అంటూ ప్రశ్నించారు. అలాగే డా. ఎం.సుగుణా రావు గారి జాబిలి మీద సంతకం కథలు సమాజాన్ని అధ్యయనం చేయడంలోనూ, కథకు అనుగుణంగా స్పందించడంలోనూ సిద్ధహస్తులు, ఇలాంటి కథలకు నామమాత్రంగానైనా తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆర్థిక స్థోమత కల్పించడం వారు చేస్తున్న మంచి పని అంటారు.

ఒక పుస్తకం ప్రముఖులు అనే ముద్ర పడిన రచయిత నుండి వస్తే అలాంటి పుస్తకాలు ఒక విధంగా ప్రశ్నలుగానే మన ముందు నిలబడతాయి.ఆ ప్రశ్నలకు సమాధానం రాయాలంటే సమీక్షకునిలో ఎంతో అవగాహన వుండాలి. అంతటి అవగాహనతోనే దాదాపు అన్ని ప్రక్రియలు కలిపి ఎన్నో పుస్తకాలు సమీక్షలు చేసిన మురళీ మోహన్ గారు ప్రముఖులనుండి, వర్ధమాన కవుల వరకు ఏ సంకోచం లేకుండా, ఏ సంపుటికి ఎంత అవసరమో అంతే వివరణ ఇస్తూ సమీక్షలు చేశారు. షేక్ కరీముల్లా గారి ఇస్లాంవాద కవితా సంకలనం కవాతును సమీక్షిస్తూ ఆ పుస్తకం మానవత్వంపై మమకారం వున్న ప్రతి ఒక్కరూ చదవాల్సిందే అంటారు.కానీ సాహిత్యం పట్ల ఎన్నో అవగాహనా గ్రంథాలు రచించి విమర్శకునిగా, సమీక్షకునిగా తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని చేరుకున్న ప్రముఖులు ద్వానా శాస్త్రి గారిని ఒక వైపు వీరు లింకా రికార్డు బుక్కులో ఎక్కదగిన వ్యక్తి కాదనను... కానీ సమీక్షకుడికీ, విమర్శకుడికీ వుండవలసిన లక్షణాలు ఒకటే అనుకుంటున్నారని, వీరు సమీక్షక సవ్యసాచి కాగలరు కానీ సద్విమర్శకులు కాలేరని తెలపడం ఒక విధంగా ఆలోచించాల్సిన విషయం.

-శైలజా మిత్ర
(నేటి నిజం దిన పత్రిక, 20-3-2009)

* * *

మాన్యశ్రీ కోడీహళ్లి మురళీ మోహన్‌గారికి డా.వి.వి.ఎల్.నరసింహారావు హృదయపూర్వక నమస్కారాలు.

మహాశయా!
మీరు స్వయంగా మా యింటికి వచ్చి సాదరంగా నాకు బహూకరించిన మీ "గ్రంథావలోకనమ్" గ్రంథం సావధానంగా ఆద్యంతం అధ్యయనం చేశాను. చదవటం చాలదనిపించింది; అందుకే అధ్యయనం చేశాను.
మీరు ఆదర్శప్రాయులైన ఉత్తమ సమీక్షకులు.'సమీక్షా'పరిభాషను సార్థకం చేశారు.
ఆధునికమైన తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల స్వరూప స్వభావాలను చక్కగా చూడగల దక్షులు. సమీక్షలకు మీరుంచిన శీర్షికలు గ్రంథంలోని ప్రధానాంశాలను ప్రత్యక్షం చేసేటట్లుగా ఉన్నాయి.
వేంపల్లి గంగాధర్ కథలు - 'సమకాలీన సమాజ ప్రతిబింబా'లన్నారు.
గుమ్మా ప్రసాదరావు 'సంకల్పం'కథల సంపుటిని - "మనసు పొర్లిన హంసతూలికా తల్పం" అన్నారు.
'జాబిలి మీద సంతకా'న్ని యథాతథంగా శీర్షికగానే ఉంచారు.
సత్యవాడ(ఓగేటి)ఇందిరాదేవి నవల "కోటలో నా రాజు"ను ఏకబిగిని చదివించే చారిత్రక నవలగా పరిచయం చేశారు. ఇందిరాదేవి#రచనల గురించి నా అభిప్రాయం కూడా ఇదే.ఈ రచయిత్రి విద్యార్థినీ దశలో నా శిష్యురాలు; నేటికీ ఆమె నాకు అటువంటి శ్రద్ధతోనే తన రచనలు బహూకరిస్తూ ఉంటుంది.
డా. ద్వా.నా.శాస్త్రిగారి "సమీక్షాచక్షువు"ను మీరు సమీక్ష చేసిన తీరు కుండబ్రద్దలు కొట్టినట్లుగా ఉన్నది. తమ అభిప్రాయాలను ఇంత స్పష్టంగా చెప్పగలిగే సమీక్షకులు నేడు వ్రేళ్ల మీద లెక్కపెట్టవలసిన సంఖ్యలోనే ఉన్నారు. వారిలో మీరు ముఖ్యులు కావటం ముదావహం.
డా.గోపు లింగారెడ్డిగారి "పాటలబాటసారిగా..."వ్యాస సంకలనం జానపద సాహిత్యానికి తగిన ప్రాధాన్యం ఇచ్చిందనే సంతృప్తిని మీరు వ్యక్తం చేశారు. సంతోషం.
కల్లురి భాస్కరం, నాగసూరి వేణుగోపాల్‌గార్ల సాహిత్య వ్యాసాలను మీరు సమీక్షించిన తీరు ఆదర్శప్రాయం.
డా.దేవరాజు మహారాజు"లైఫ్ టానిక్"నాటికలు, మునిసుందరం రూపకాలు మీ సూచనలను అందుకుని సుపరిష్కృతమై ప్రేక్షకులను ఆనందింపజేస్తాయి.
గుంటూరు శేషేంద్ర శర్మ "నా దేశం - నా ప్రజలు" కావ్యంపై మీ అభినందనలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
'అమ్మ ఒడిలోంచి... మృత్యు కుహరంలోకి' శీర్షిక తప్పక ప్రభుత్వం చెవిలో పడితీరుతుంది.
హింసోన్మాదంపై ముస్లిం రచయితల 'కవాతు' మీరన్నట్లు ప్రతిఒక్కరు చదవాల్సిన పుస్తకమే.
హైకూలు,నానీలు,వచన కవితలు ఆధునిక సాహిత్య ప్రక్రియలుగా మీరు వింగడించిన తీరు రచయితలకు మార్గదర్శకమే.
అష్టపదులు భావలయను స్ఫురింపజేసే ఇష్టపదులు - మినీ కవితలుగా మెనీ భావాలను పండించినా అష్టపదుల లయాన్విత ధోరణి ఇష్టపదులకు కూడా ఉండటం అభిలషణీయం. సబ్బుబిళ్ల- అగ్గిపుల్ల వేటికి ప్రతీకలో సూచించటం ముఖ్యమే.ఏమైనా ఇవి పాఠకుల మనస్సులను ఆకట్టు కొంటాయి. శ్రీశ్రీ వేసిన బాటలు ఒకవిధంగా మార్గదర్శకాలే.
'అనలానిలము'ను 'బడబానలమూ... మలయానిలమూ...'శీర్షికతో మీరు సమీక్షించటం అర్థవంతంగా ఉన్నది.
'పడక్కుర్చీ కబుర్లు', 'గుణానందలహరి'అంతరంగ లక్షణాన్ని, ఆత్మ తత్త్వాన్ని చక్కగా వింగడించి చూపారు మీరు.
ఉచ్చారణ సరిగా ఉంటేనే అక్షర దోషాలు రాకుండా ఉంటాయి.
రాచమల్లు రామచంద్రా రెడ్డి ప్రముఖ భాషా శాస్త్రవేత్త కాకపోయినా భాషావేత్త అని అంగీకరించక తప్పదు.
సరే, ఇవన్నీ విమర్శ ధోరణుల్లో అనివార్యం.
సమ్యగీక్ష చేయటమే సమీక్షా లక్షణం.
'గడ్డి పూవు' కవితా సంకలనం అందించిన అబ్జ క్రియేషన్స్‌కి మీరు సంపాదకత్వం వహించటం అభినందనీయం.
'కథాజగత్'సంపాదకత్వంతో మీరు ఉత్తమోత్తమ సంపాదకులైనారు.
మొత్తం మీద మీ 'గ్రంథావలోకనమ్' ఆధునికాంధ్ర సాహిత్యంలోని వివిధ ప్రక్రియలకు నిలువుటద్దంగా భాసిస్తున్నది.
'జనవార్త'మొదలు 'సంహిత'వఱకు గల వివిధ పత్రికల్లోని మీ సమీక్షలు పఠితృలోకానికి వెలుగు వెల్లువలు ప్రసరింపజేస్తున్నాయి.
మీకు నా హార్ధికాభినందనలు.
ఉంటాను.
మీ
వి.వి.ఎల్.నరసింహారావు
11-2-2009
[ఈ లేఖలోని విషయమే కొద్ది మార్పులతో గ్రంథ సమీక్షగా సాహితీ తేజమ్ ఏప్రియల్ 2009 సంచికలో ప్రచురింప బడింది.
# శ్రీమతి సత్యవాడ(ఓగేటి)ఇందిరాదేవి 23-05-2009తేదీన స్వర్గస్థులైనారు.వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి]

* * *

ప్రియ మిత్రులు శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ గారికి నమస్కారములు!
మీ గ్రంథావలోకనమ్ చదివాను అనడం కన్నా నన్నే ఆ పుస్తకం ఆసాంతం చదివించింది అనడం బాగుంటుంది.
క్లుప్తత, స్పష్టత మీ సమీక్షల ప్రత్యేకత. మీరు సమీక్షించిన పర్తి పుస్తకమూ చదవాలన్న కోరిక కలుగుతుంది. లోటుపాట్లను సున్నితంగా చూపించే మీ పద్ధతి రచయితలకు ఆనందాన్ని కలుగజేస్తుంది.
మీరు పరిచయం చేసిన పుస్తకాలను కొని చదవాలనుకొన్నవారికి- నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే రచయితల చిరునామాలు లేవు. అవికూడా జతచేసి ఉంటే - ఈపాటికి ప్రతి రచయితా కొన్ని అభినందన ఉత్తరాలనైనా పొంది వుండేవాడు.
మీరు సమీక్షించిన పుస్తకాల ముఖచిత్రాలనే మీ పుస్తక ముఖచిత్రంగా మలచిన తీరు బాగుంది. నా పుస్తకం మటుకు రెండువైపులా అచ్చయింది. మీ ప్రేమకు బహుధా ధన్యవాదాలు.పత్రికలలో వచ్చిన సమీక్షలతో బాటు - మీరు విడిగా రాసిన సమీక్షలను కూడా ప్రచురించారు. అందులో నా పుస్తకం చేరడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
కథాజగత్తు పైని స్పందనలనూ, గడ్డిపూవుపై సమీక్షనూ కూడా చివర చేర్చి- పుస్తకాన్ని కదంబంగా మార్చినారు. బాగుంది.
నూతనాంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.ధనుర్మాసారంభ శుభాకాంక్షలు.
మీ
వరిగొండ కాంతారావు
వరంగల్లు
14.12.2008

* * *

మిత్రుడు మురళీ మోహన్ గారికి,
నమస్కారాలు.
మీరు అందజేసిన పుస్తకం గ్రంథావలోకనమ్ చాలా ఆనందం కలిగించింది.ఎందుకంటే ఈ పుస్తకం మీ ఆసక్తిని, ఉత్సాహాన్ని, చిత్తశుద్ధిని తెలుపుతుంది. అలాగే అబ్జ క్రియేషన్స్ ద్వారా మీరు కథాజగత్, గడ్డిపూవు పుస్తకాలను ప్రచురించారని కూడా బోధ పడింది. పుస్తకానికి ISBN No.వేయడం కూడా మీ సామర్థ్యాన్ని తెలుపుతుంది. మీరు మరింత సాహిత్య కృషి ఇంకొంత లోతుగా చేయాలి. మీ సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి.

మీ
నాగసూరి వేణుగోపాల్
హైదరాబాదు
28-11-08

* * *

సహృదయులు, సాహితీ మిత్రులు శ్రీ కోడీహళ్లి మురళీ మోహన్ గారికి-
నమస్కారములు.ఉభయకుశలోపరి.
"గ్రంథావలోకనమ్" అందింది. ఆనందం పంచింది.
సాహిత్య సభల్లో అప్పుడప్పుడు వచ్చే కొన్ని కామెంట్స్‌కి నేను రాసిన హైకూల గురించి మీ దృష్టికి తీసుకు రావాలనిపించింది.
1. కొంత మంది స్వప్రయోజనం, స్వపక్షం చూసుకుని సమీక్షలు, విమర్శలు చేస్తున్నారనే కామెంట్స్‌కి నాకు కలిగిన అనుభూతిని -
ఏ రచనని
తూకమేస్తుందట
గోడ మీద పిల్లి

అనే హైకూలో చూపాను.(హైకూ సమయం)

2. కొంతమంది వారికి అక్కర్లేని వారి రచనలను మౌనంతోనూ, ఇతర పద్ధతులలోనూ చంపేసి, వారికి కావాల్సిన వారినే మెచ్చి మేకతోళ్లు కప్పుతున్నారనే కామెంట్స్‌కి నాకు కలిగిన అనుభూతిని-
మేకతోళ్లు
కప్పబడును
--- తోడేలు

అనే హైకూలో చూపాను.(హైకూ భావనలు)

3.ఏదైనా ఒక పుస్తకానికి ముందుమాట రాసిన పెద్దమనిషి కావాల్సిన వాడైతేనే కొందరు ఆ పుస్తకం గురించి ప్రస్తావిస్తారనీ ఆకాశానికి ఎత్తేస్తారని, ఆ పెద్దమనిషి నచ్చని వాడైతే ఆ పుస్తకాన్ని కించ పరచడమో, మౌనంతో చంపేయడంతో చేస్తారనే కామెంట్స్‌కి నాకు కలిగిన అనుభూతిని
ముందుమాట
ఎక్కడ పడేస్తుందో
ఎవరికెరుక

అనే హైకూలో చూపాను.(హైకూ సమయం)

నేను ఉదహరించిన వారివలె కాకుండా, మీరు ఏదైనా పుస్తకం చదివితే కలిగిన అభిప్రాయాన్నే, యథాతథంగానే సమీక్షగా "గ్రంథావలోకనమ్"నందు ప్రతిబింబించారని అర్థమౌతుంది. పత్రికల్లో రెగ్యులర్‌గా వచ్చే సమీక్షలకు మీ సమీక్షలకు తేడా పాఠకులకు స్పష్టంగా కనబడుతుంది.
'అన్నంగుడ్డ','పెరటి చెట్టు','గోరంత దీపం', 'తరం మారుతుంది''పక్షి','బొగ్గుపొరల్లో','కవాతు','ఆ తర్వాత' మొదలైన రచనలపై మీ సమీక్షలు నాకు బాగా నచ్చాయి. కొన్ని సమీక్షలు ఏవరేజ్‌గా ఉన్నాయి.
"లకుమ హైకూలు" సమీక్షలో
"పాప కంట పడకుండా
రాత్రి అమ్మ రెండో వెన్న ముద్దను
ఆకాశంలో దాచింది"
ఇక్కడ వెన్నెలను వెన్నముద్దతో పోల్చడం ఎంత మంచి ఊహ!అని మీరు పేర్కొన్నారు. ఇక్కడ మీరు పొరబడ్డారనిపిస్తుంది. 'వెన్నెల'ను కాకుండా 'చంద్రు'ని వెన్న ముద్ద తో పోల్చాలి కదా! ఆలోచించండి.
మీ సమీక్షలను ఒక పుస్తక రూపంగా వెలువరించడమంటే, మీరు సమీక్షించిన రచనలను బ్రతికించినట్లే లెక్క. మీ కృషి ఆదర్శనీయంగా ఉంది.
ఇన్ని పుస్తకాలను గురించి తెలుసుకునే అవకాశం మీరు దయతో నాకు కలిగించినందుకు కృతజ్ఞతలు.
అభినందనలతో,
మీ
శంకర
ఆచంట

* * *

Dear Sri Murali Mohangaaru,
నమస్తే. మీరు అభిమానంతో పంపిన 'గ్రంథావలోకనమ్' సమీక్షల సంపుటి అందింది. చాలా కృతజ్ఞతలు.
నా'ఊటీలో ఓ సాయంత్రం' కథా సంపుటి పై సమిక్షతో పాటు మిగిలిన సమీక్షలు కూడా చదివాను. చాలా బాగున్నాయి. Both +ve & -ve pointsని చెప్పారు. మెచ్యూరిటీతో రాసిన సమీక్షలు అనిపిస్తుంది.రచయితలోని సృజనా శక్తి పెంపొందడానికి యిలాంటి సమీక్షలు అవసరం. ప్రఒత్సాహం ఉండాలి. దాంతో పాటు సద్విమర్శ కూడా ఉండాలి(constructive criticism). You have done it.
సంపుటిని యింత అందంగా, ఓ విధంగా చెప్పాలంటే సాహసంతో వెలువరించిన మీకు అభినందనలు.
with best regards,
సి.ఎన్.చంద్రశేఖర్
chittoor
03-12-08

* * *

సాహితీ బంధువు శ్రి కె.మురళీ మోహన్ గార్కి,
నమస్సులు.
మీరు ఆత్మీయంగా పంపిన "గ్రంథావలోకనమ్"అందినది. చాలా సంతోషం కలిగినది. వివిధ రచయితల కథా సంపుటులు, కవుల కవితాసంపుటులు సమీక్షిస్తూ మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు, అభినందనలు ఆయా సృజనకారులకు ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాయి. ఒక్కరుగా అందరి సాహితీకారుల్ని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి సాహితీలోకానికి పరిచయం చేసిన తీరు శ్లాఘనీయమైనది. చేరా,అద్దేపల్లి వంటి ప్రముఖుల ముందు మాటలు రచయితలకీ, కవులకీ శిరోధార్యాలు. ద్వా.నా.శాస్త్రి అనుకున్నది అనుకున్నట్టు రాస్తే పొగిడేవారెందరో. మనం మాత్రం ద్వా.నా. గురించి మనం అనుకున్నది అనుకున్నట్టు రాస్తే రాద్ధాంతం ఎందుకో అర్థం కాదు.విడిచిపెట్టేద్దాం.
మీ
బనారా
(బద్ది నాగేశ్వర రావు)
అనకాపల్లి
5-12-08

* * *

కవి మిత్రులు శ్రీ మురళీమోహన్ గారికి,
నమస్సులు.
ఉభయకుశలోపరి.
ఆత్మీయంగా పంపిన 'గ్రంథావలోకనమ్' అందింది. నా'గుండె ఊటల'కు స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు.
మీ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తున్నాను.
శెలవు.
భవదీయ
యస్సార్.పృథ్వి
రాజమండ్రి
23-11-2008

* * *

గౌరవనీయులకు -
మీరు ప్రేమతో పంపిన మీ 'గ్రంథావలోకనమ్' అందింది. ధన్యవాదాలు. వ్యయప్రయాసలకోర్చి ప్రచురించిన గ్రంథాన్ని మీ సమీక్షలతో ప్రయోజనం పొందిన వారికి పంపటం నిజంగా అభినందనీయం.
ఇట్లు
సయ్యద్ నశీర్ అహ్మద్
వినుకొండ
21-11-2008

* * *

ప్రియ సాహితీ మిత్రులు
మురళీ మోహన్ గారికి,
నమస్తే-
ప్రేమతో మీరు పంపిన పుస్తకం అందింది. పాటల బాటసారిగా పుస్తక సమీక్ష రాసినందులకు కృతజ్ఞతలు.ఈ సమీక్ష ఏ పత్రికలో వచ్చిందో చివర్లో వేయలేదు. పాట ఒక బాట ఆర్వీయస్ సుందరం, రచయిత ముందుమాట రెండుసార్లు అచ్చయ్యిందన్నారు. నిజమే - బైండింగ్ చేసేటప్పుడు కొన్ని పుస్తకాల్లో ఆ పేజీలు రేండేసి పెట్టడం వల్ల అలా జరిగింది. మరిన్ని సమీక్షలు రాసి మంచి విమర్శకులుగా ఎదగాలని ఆశిస్తూ
మీ
గోపు లింగారెడ్డి
కరీంనగర్
23-11-08

* * *

సాహితీ మిత్రులు కె.మురళీమోహన్‌గార్కి
నమస్కారములతో,
మీ 'గ్రంథావలోకనమ్' అందింది.ధన్యవాదాలు. పుస్తకం సమీక్షించడం సామాన్యమైన విషయం కాదు. అందుకు పూనుకున్న మీరు తెలుగు సాహిత్యం గర్వించదగ్గ స్థాయిలో మీ సమీక్షలు తీసుకు వచ్చారు. మీ సమీక్షలల్లో నూతనత్వం, విశ్లేషణ,భావుకత పరవళ్ళు తొక్కాయి. వేటికవే ప్రత్యేకత సంతరించుకుంటూ పాఠకుడ్ని కట్టి పడేస్తాయి. మంచి సమీక్షలు రాసి మంచి పుస్తకం తీసుకు వచ్చిన మీకు అభినందనలతో
-షేక్ కరీముల్లా
వినుకొండ.

* * *

చి. మురళీమోహన్ గారికి
మీరు నాకు అందచేసిన "గ్రంథావలోకనమ్"పుస్తకం చదివాను. అన్ని వ్యాసాలు ఆసక్తి కలిగించాయి. చేకూరి రామారావు,అద్దేపల్లి వారి ముందు మాటలు చదివాను. 'సమీక్షకుడు తాను సమీక్షించే పుస్తకం గురించి, పాఠకునికి స్థూలమైన అవగాహన ఇస్తే చాలు.''సమీక్షకునిలో సాత్వికత కావాలి. అన్న్ని అంశాలూ అనుకూలంగా పరిశీలించాలి.'ఇతను సమీక్షించిన గ్రంథాలు, వివిధ ప్రాంతాలవి కావటం వలన ఆంద్ర దేశంలో పలు ప్రాంతాల విశేషాలు ఈ సమీక్షల ద్వారా తెలుస్తాయి.' ఇవి వాస్తవాలే. చివరగా - ద్వా.నా.శాస్త్రి మంచి విమర్శకుడా? అంత వ్యతిరేకంగా వ్రాయాల్సిన అవసరం లేదు. ఈ మాటే నేను కోట్ చేశాను. ఆ వ్యాసం చదివాక- చేకూరి అభిప్రాయం నాది ఒక్కటె - ఆశ్చర్యమనిపించింది.
సి.కృష్ణవేణి
భాగ్‌లింగంపల్లి
17-01-09

* * *

మీ గ్రంథావలోకనం చదివాను.
దానిలో ముఖ్యంగా నాకు కనిపించిన విషయం ఏమంటే, మీరు గ్రంథంతో పాటు గ్రంథ కర్తను కూడా సమీక్షించారు.
అందువలన ఆ సమీక్ష సమగ్రంగా ఉండి, ఒక పఠనీయ గ్రంథంగాను, పిహెచ్‌డి గ్రంథంగాను పరిణితి చెందింది మీ రచన.
మీ సమీక్షలు చదివాక ఆ రచయితల రచనలను చదవాలనే కుతూహలం కలుగుతోంది.
అభినందనలు.

శ్రీనివాసరావు.గొర్లి


February 9, 2010

1 వ్యాఖ్య:

విహారి చెప్పారు...

మాష్టారూ! మీరు అద్దేపల్లి వారితో టచ్ లో ఉన్నారా? ఉన్నట్లయితే నా గురించి ప్రస్తావించండి. వారు 1997 లో ప్రచురితమైన నా 'సశేష స్వప్నాలు' కవితా సంకలనానికి ముందు మాట రాసారు. - రాజేష్