...

...

28, జూన్ 2009, ఆదివారం

జగత్ కథ - డా. అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ)

(నా సంపాదకత్వంలో వెలువడిన కథాజగత్ పుస్తకంలోని పీఠికలో కొన్ని భాగాలు.)

"In the nineteenth century the invented story was used to do things that other literary forms- the poem, the essay - could not easily do; to give news about a changing society, to describe mental states ...." from prologue of - Beyond Belief - by V.S.Naipal.

వి.ఎస్.నయపాల్ గొప్ప రచయిత. విదేశాలలో పుట్టి పెరిగిన భారతీయ సంతతికి చెందినవాడు. భారత దేశమంటే భారతీయ మత సస్కృతులు, తరతరాల భారతీయ సామాజిక జీవితమంటే అభిమానమున్న రచయిత. అవగాహన ఉన్న రచయిత. ఆయనకు నాలుగేళ్ల కిందట నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన సృజనాత్మక సాహిత్య రచనలు ఇంగ్లీషులోనే చేశాడు. ఆయనకు సాహిత్యానికే నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇంగ్లాండ్‌లో చదువుకున్నాడు. కథాకథనంలో గొప్ప ప్రతిభావంతుడాయన. దేశ విదేశ యాత్రా వృత్తాంత రచనతో సుప్రసిద్ధుడు. కొత్తగా అంటే గత కొద్ది శతాబ్దాల కాలంలో ఇస్లామీకరణం చెందిన దేశాలలో ఆయన పర్యటించి అక్కడి జన జీవన వృత్తాంతాలను గాఢంగా విశ్లేషించి సామాజిక పరిణామాలకు స్పందించి రాసిన గ్రంథమే ఈ 'బియాండ్ బిలీఫ్' అనేది. ఈ గ్రంథానికి ఉపోద్ఘాతంగా కథన ప్రక్రియను గూర్చి రాసినవి పై ఇంగ్లీషు వాక్యాలు. కథనమంటే ఒక విషయాన్ని కథగా చెప్పడం. ఈ చెప్పడం నేర్పులో నయపాల్ అద్భుత ప్రజ్ఞాశాలి.

ఆయన పై చెప్పిన వాక్యాలలో భావం ఏమిటి? కథనం లేదా కథ చెప్పడం అనే ప్రక్రియ సారస్వత రీతులలో కొత్తది. అది పుట్టి సుమారు రెండు శతాబ్దాలే అయ్యింది. కవిత్వ ప్రక్రియ కాని, వ్యాసం కాని వెలువరించలేని జీవనానుభవాలను ఈ ప్రక్రియ సమర్థంగా, సంతృప్తికరంగా చిత్రీకరిస్తుంది. అసలు ఈ ప్రక్రియ అందుకే పుట్టింది. మారుతున్న సమాజాన్ని గూర్చి భోగట్టా, దాని వార్తాకథనం, మానసిక ప్రవృత్తుల విశ్లేషణ, చిత్తవృత్తుల చిత్రణ కోసం ఈ సాహిత్య ప్రక్రియ ఉద్దిష్టం.

కాబట్టి లోకమంతా కథా ప్రక్రియకు అనుగుణమైనదే. అవసరమైనదే. ప్రపంచమంతా కథలో ఇముడుతుంది. ఇమిడ్చవచ్చు. ప్రపంచంలోని వస్తువే కథా వస్తువు. ప్రపంచం వినా కథకు వస్తువు లేదు. అయితే కథా రచయిత దృష్టిలో ఎవరి ప్రపంచం వారిది. రాసేప్పుడు ఇదే ప్రపంచమనుకుంటాడు రచయిత. అట్లా అయితే తప్ప కలం సాగదు. కథ నడవదు. తనకు అవగాహన అయినంత మేరకు జగత్తును గూర్చే రాస్తాడు రచయిత. తన ముందు జగత్తు లేకపోతే కథ రాయలేడతడు. రాయడం కుదరదు. ప్రతి కథా అందువల్ల జగత్కథే అవుతుందనుకోవాలి. అట్లా అని కనీసం రచయిత భ్రమిస్తాడు. తన రచనని తాను ప్రేమిస్తాడు.

తెలుగు భాగవతంలో పోతన్నగారు 'ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక' అన్నట్లు కథా రచయితలకు కూడా ఈ జగత్తు అనే ప్రపంచం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది. సమాజంలో ఎందరు వ్యక్తులో, ఎన్ని ప్రవృత్తులో, ఎన్ని చిత్తవృత్తులో అన్ని కథలుంటాయి. రాయగలగాలే కాని ఎన్నో కథలు. 'ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం' అని శ్రీశ్రీ కూడా అందుకే అన్నాడేమో! అయితే ఆయన కవి కాబట్టి అట్లా అన్నాడు. కథా రచయితకు నిజంగా వర్తించ వలసిన భావమది.

తెలుగులో ఆధునికార్థంలో, ఆధునిక స్వరూప స్వభావాలతో కథా ప్రక్రియ పుట్టిన తర్వాత అంటే సుమారు నూరేళ్లలో ఒక లక్ష కథలు వచ్చి ఉండవచ్చేమో. సగటు సాలుసరి వెయ్యి కథలు వచ్చి ఉండవా అన్ని పత్రికలను, అందరు రచయితలను కలుపుకొంటే? పోనీ నాలెక్క అతిశయోక్తి అనో, ఉత్ప్రేక్ష అనో అనుకొంటే కొన్ని వేలు అనుకుందాం. అయినా ప్రపంచం అంతా కథలో ఇమడలేదు. వర్ణితం కాలేదు. పుష్పక విమానం లాగా ఎందరెక్కినా దానిలో చోటు ఉండనే ఉంటుంది. ఉండనే ఉంది. ఈ నూరేళ్ళలో తెలుగు కథా రచయితలలో కనీసం నూరుగురినైనా గొప్ప కథకులను పేర్కొనవచ్చు. గురజాడ నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకు ఒక వెయ్యి మంచి కథలనైనా ఎంచవచ్చు. దీనికి కావలసిన అధ్యయనమూ, ఆసుపాసులు, సమయం, సావకాశం కావాలి. రావాలి.

అసలు మంచి కథ అంటే ఏమిటి? మంచి కథ లేదా గొప్ప కథ అని ఎట్లా రాస్తే అంటారు? ఎందుకంటారు? ఎలా అంటారు? దాని ప్రమాణాలు ఏమిటి? ఎట్లా కొలుస్తాం దానిని? ఎట్లా విలువిస్తాం? అంటే నిత్య జీవితంలో తరచు ప్రాపంచికులకు (సామాజికులకు) ఎదురయ్యే ఒక సంఘటన లేదా ఒక సన్నివేశం ఉద్రేకభరిత, ఉద్వేగభరిత, సంఘర్షణ ఇద్దరు వ్యక్తుల మధ్య కాని, లేదా పదిమందికి సంబంధించినది కాని సంభవించినప్పుడు దానికి ప్రత్యక్ష సాక్షి అయిన స్పందనశీలుడైన వ్యక్తి అందులో జోక్యం కలించు కోవడం కాని, అదుపు చేయగలగడం కాని, ఆవేశకావేషాలను, అవ్వంచనీయ పర్యవసానాలను కొంతవరకైనా ఉపశమింప చేయగలగడం కాని నిర్వహించ గలిగినప్పుడు ఆయన నిర్వహించిన పాత్రతో ఒక గొప్ప లేదా మంచి కథా రచయిత రచనతో సాదృశ్యం చూపుతూ విశ్లేషణ పూర్వకంగా వివరించవచ్చు. ఉదాహరణకు వీధిలో (అది చిన్న ఊరైనా కావచ్చు, ఒక మోస్తరు పట్టణమైనా కావచ్చు, పెద్ద నగరమైనా కావచ్చు) బహు ఉద్రేకంగా రెచ్చిపోయి ఇద్దరు బలశాలురు చేయీ చేయీ, బుజమూ బుజమూ కలిపి జుట్టూ జుట్టూ దొరకబుచ్చుకునే సంఘర్షణ దృశ్యంలో దారినబోయే పెద్దమనిషి వాళ్ళిద్దరినీ సమీపించి తన రెండు చేతులతో వాళ్ళిద్దరినీ నిలువరించగలిగాడనుకొందాం. లేదా ఆ పెద్దమనిషి అపూర్వ వ్యక్తిత్వంతో వాళ్ళు తాత్కాలికంగానైనా రోజుతూ రొప్పుతూనైనా కాస్త ఎడమైనారనుకుందాం. ఆ పెద్దమనిషి అసలా ఉద్రిక్త సమస్య ఏమిటి? బహిరంగంగా అందుకు తలపడడంలో పర్యవసానాలు ఏమిటి?( ఎవరికైనా కాలో చెయ్యో విరగడమో, రక్తం పోవడమో, పోలీసులు పట్టుకెళ్ళడమో) అని గట్టిగా బోధించి ఒకరిని తన వెంటబెట్టుకొని వెళ్ళడమో, లేదా రక్షక భటుల పాలు చేయడమో చేస్తాడనుకుందాం. సమాజంలో దురన్యాయాలు, దౌర్జన్యాలు, అసబబులు, అపకారాలు, స్వార్థం, క్రౌర్యం, ద్వేషం, దుఃఖం, కపటం, మోసం, వంచన, మానసిక దురుద్రేకాలు, బలహీనతలు, హింస ఉంటూనే ఉంటాయి కదా! ఇవి లేకపోతే ప్రపంచం లేదు. ఇవి స్పర్థిస్తున్నపుడు బలవంతుడు, గుణవంతుడు, ధర్మాగ్రహ పక్షపాతి తన చేతులు చాచి అదుపు లేదా నిరోధకానికి పూనుకోవడం ధర్మం కదా! న్యాయం కదా! తాత్కాలికంగానైనా ఉపశమింప చేయాలి కదా! తక్షణ నష్టాన్ని అరికట్టాలి కదా! సాహిత్యం కర్తవ్యమది. బాధ్యత అది. జవాబుదారీ తనమది. అయితే వయసు చాలని ఏ కౌమార వయస్కుడో, వయసు మళ్ళిన ఏ వృద్ధుడో ఘర్షిస్తున్న వ్యకులను వారించలేడు. అన్యాయాలను, అక్రమాలను బోధించలేడు. వాళ్ళు ఆ 'పెద్దమనిషి'ని లెక్కచెయ్యరు సరికదా ఈసడిస్తారు. తోసివేస్తారు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు స్వీయహాని కూడా జరగవచ్చు ఈ తీర్పరికి. నేర్పరితనం అంటే బలం, వయస్సు, లోకానుభవం, అనుశాసకత్వం, వ్యక్తి ఓడ్డు పొడుగులతో ఒక ధాటి ఉన్నప్పుడు కాని ఘర్షణ వ్యక్తులపైన ఆయన మాట పనిచేయదు. అందువల్ల అటువంటి సందర్భాలలో సామాన్యులెవరూ సాధారణంగా ఆ జోలికి పోరు. ఆ దెబ్బలాటలు, ఆ వైషమ్యాలు, నష్టాలు, కష్టాలు అట్లా సాగిపోతూనే ఉంటాయి.

ఇదంతా ఏమిటి? ఏ అంతరార్థాన్ని చెప్పటానికి ఈ సాదృశ్యం, ఈ సమాజ జీవిత దృశ్యాల, నేరమనస్కుల ప్రస్తావన? అంటే కథా రచయిత సమాజ సంఘర్షణలలో, లోపాలలో, అనర్థకాలలో జోక్యం కలిగించుకోగల, మంచి చెడ్డల విచక్షణ సమాజం పాటించేట్లు చెప్పగల, చేయగల సత్తా కలవాడై ఉండాలని చెప్పడానికే. సమర్థుడు కాకపోతే అతడు చేయగలిగిందేమీ ఉండదు. పైగా ఈసడింపుకూ, అప్రయోజకత్వానికీ గురి అవుతాడు. కథా రచయిత సామర్థ్యానికీ ఇందులో సాదృశ్యముంది. ఆయన రచనలో శిల్పం, ఎత్తుగడ, ముగింపు, పాత్రల మనోభావ ఉన్మీలన, కళ, అసలు వస్తువును ఎంచుకోవడంలో అతని సామర్థ్యం ఉంటుంది. అప్పుడే రచయిత సామర్థ్యం, ప్రతిభ వెలికి వస్తాయి. రచయితలో సాహిత్య స్పందనశీలం ఉన్నప్పుడే అతడు లేదా ఆమెనుంచి మంచి రచన ఒక్కక్కసారి గొప్ప రచన ఆశించగలం.

కథారచన ఫోటోగ్రఫీ వంటిది కాదు. సృజనాత్మకమైన చిత్రకళ వంటిది. వర్ణ చిత్రకళ వంటిది. ఫోటోగ్రఫీలో కూడా సృజనాత్మకత లేకపోలేదు. కాని సాంకేతిక విజ్ఞాన పరికర సాహాయ్యం ఉంటుంది. ఒకొక్కసారి ప్రతిభావంతుడు కాని చిత్రకళాకారుడికంటె ఫోటోగ్రాఫర్ తీసిన బొమ్మే అందంగా ఉండి ఉండవచ్చు. కాని సృజనాత్మకత లోకాన్ని చూసినంత మాత్రం చేత అలవడదు. అవగాహన చేసుకోగలగాలి. ఆర్తి కావాలి. ఆత్మీయత కావాలి లోకంతో. అప్పుడే కళాకారుడికి తన కళలో యోగసిద్ధి కలుగుతుంది. ఫుటోగ్రఫీ వృత్తినిపుణులలో కూడా అందరూ గొప్ప ప్రతిభావంతులనిపించు కోవటం లేదు కదా! అట్లానే కవులైనా, నాటకకర్తలైనా, సాహిత్య తత్త్వవేత్తలైనా, కథారచయితలైనానూ.

మంచి రచయిత అనిపించుకోవాలంటే, మంచి రచన చేయాలంటే లోకాన్ని అర్థం చేసుకోవడం ఎంత అగత్యమో, ఎంత అవసరమో, గొప్ప సాహిత్యాన్ని అధ్యయనం చేయడం కూడా అంతకన్న అధిక ప్రయోజనం. గొప్ప రచయితలు లోకాన్ని మనం అర్థం చేసుకొనేట్లు చేస్తారు. మనకెంతో ఆసరా అవుతారు.

ఏ రచన అయినా అది చదివే పాఠకుని స్థాయిని బట్టి బాగోగుల సాపేక్షతను ప్రస్తావించాల్సి ఉంటుంది. పాఠకుల స్థాయితో బాటే రచయిత స్థాయి కూడా ఎప్పటికప్పుడు ఎదగాల్సి ఉంటుంది. 'క్షణ క్షణే యన్నవతా ముపైతి'లాగా రచయిత శిల్పం, లోకం పట్ల ఆర్తి, అవగాహన, సాహిత్య స్పందన విస్తరించుకోవలసి ఉంటుంది.

కామెంట్‌లు లేవు: