...

...

27, జూన్ 2009, శనివారం

సమస్యాపూరణం!

సమస్య : సతి సతి కలయంగ నొక్క సాధువు పుట్టెన్

కొన్ని పూరణలు :

సందర్భం : ఒక అభాగ్యుడు, తన తల్లి తనతో ఉండటానికి రాగానే ...
1. మతి తప్పిన వాడయ్యెన్ !
సతి చాయాదేవి, మాత సూర్యా కాంతం
గతమెప్పుడు కలవని పిత-
సతి, సతి కలయంగ నొక్క సాధువు పుట్టెన్! - కృష్ణ కొండక



2. మతిబోయెనేమి మీకున్?
అతి తెలివికి పోదురేల? అమెరిక నందై
న తమకిది సాధ్యమౌనా!-
సతి సతి కలయంగ నొక్క సాధువు పుట్టన్ - కృష్ణ కొండక

3. సతి యొకతె అండ మిచ్చిన
రతి యెరుగని పడతి యొకతె పిండము మోయన్
సుతుడెదిగి జంగమాయెను
సతి సతి కలయంగ నొక్క సాధువు పుట్టెన్ - విస్సావఝల ప్రభాకర్


4. అతిభక్తు డయిన పురుషుడు
సుతార్థి యగుచు గుడులెల్ల చుట్టుచు నొకచో
వ్రత నిస్ఠను సత్రంపు వ
సతి, సతి కలయంగనొక్క సాధువు పుట్టెన్. - శ్యామల రావ్


5. గతి లేకన్ పస లేకన్
గుతగుత మని వ్రాయనేల దినకరుచే పూ-
రితమును జదివిన తెలియును:
సతి సతి కలయంగ నొక్క సాధువు పుట్టెన్ - కె. సదానంద

6. సతి పతి శిరసున నుండెడి
అతి మోహన రూపి, వెన్నెలల నిచ్చెడి రే
డతి ప్రీతి పంచ ద్వే విం-
సతి సతి కలయంగనొక్క సాధువు పుట్టెన్ - చిలుకూరి సత్యదేవ్


పై పూరణలు నుండి తెలు(గు)సా(హిత్యం) ఫోరం నుండి గ్రహించబడ్డాయి. చతురులైన బ్లాగుమిత్రులు ఎవరైనా ఇదే సమస్యను పూరించమని కోరుతున్నాను.

2 కామెంట్‌లు:

వేమన చెప్పారు...

సుతులతొ విసిగిన మనుజుడొకడు లోక
గతి మార్చగ తలచి ప్రయత్నమొనరింప
అతిశయమగు ధ్యాన కారణమౌనానాపాన
సతి సతి కలియంగనొక్క సాధువు బుట్టెన్.

( ఆనాపానసతి అను సతి )

mmkodihalli చెప్పారు...

@వేమన గారూ! మీ పూరణ బాగున్నదండీ! ఇదే సమస్యను కొద్దిగా మార్చి ఇస్తే ఒక అవధానంలో ఆశావాది ప్రకాశరావు గారు ఇలా పూరించారు.

సమస్య:

సతి సతి కలయింగ పుత్ర సంతతి కలిగెన్

పూరణ:

పతి యూరలేని యెడ సం
గత మయ్యెన్ సతికి కాన్పు, సాయము లేమిన్
సతమతమై యేడ్వ దరుల
సతి సతి కలియంగ, పుత్రసంతతి కలిగెన్