...

...

14, జూన్ 2009, ఆదివారం

శతజయంతి ఉత్సవాలు

రెండ్రోజులుగా ఇంట్లో 'నెట్' మొరాయించటంతో పొద్దున సైబర్‌కేఫ్‌కు వెళ్ళి నా టపా పై వచ్చిన కౌంటర్లు చదివి సమాధానం వ్రాస్తుండగా సాహితీ మిత్రుడు తంగిరాల చక్రవర్తి నుండి ఫోన్ వచ్చింది తెలుగు విశ్వవిద్యాలయంలో శ్రీశ్రీ పై సభ జరుగుతోంది పోలేదా అంటూ. ఎప్పుడు అని అడిగాను. ఇప్పుడే, ఓల్గా కండక్ట్ చేస్తోంది అన్నారు. శ్రీశ్రీ మత్తు ఇంకా దిగక పోవడంతో ఆ సభకు హాజరు కావాలని డిసైడ్ అయ్యాను.నేను నిక్కుకుంటూ నీలుగుకుంటూ సభ జరుగుతున్న తెలుగు విశ్వవిద్యాలయం చేరెసరికి మధ్యాహ్నం ఒంటిగంట దాటింది.(మధ్యలో క్యాట్రిడ్జ్ రీఫిల్ చేయించుకునే పని తగిలింది మరి.)అక్కడికి వెళ్లే సరికి ఉదయం సెషన్ పూర్తయ్యి అందరూ భోజనాలకు వెళ్తున్నారు. హాలు బయట వరండాలో నిల్చుని అక్కడ ప్రదర్శిస్తున్న పుస్తకాల వైపు చూస్తున్నాను. టీవీ గొట్టం ముందు నిలబడి ఎ.బి.కె.ప్రసాద్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మరో చానల్ కెమెరా ముందు ఓల్గా శ్రీశ్రీ మహాప్రస్థానం కవితను గట్టిగా వినిపిస్తున్నారు. ఇంటర్వ్యూ పూర్తయ్యిందేమో ఓల్గా గారు వెళ్తూ నన్ను భోజనం చెయ్యమని రిక్వెస్ట్ చేశారు.బాహుశా నన్ను మీడియా పర్సన్ అని అనుకున్నారేమో! మొదట మొహమాట పడినా ఆత్మారాముడి ఆదేశంతో భోజనం చేసే వైపుకు వెళ్ళక తప్పలేదు. తెలిసిన మొఖాలేవీ కన్పించక పోవడంతో అనవసరంగా బుక్ అయ్యానేమో అని అనిపించింది. క్యూలో పళ్లెం పట్టుకుని నిలబడి వాళ్లు వడ్డించినవేవో తీసుకుంటూ ఇవతలకు వచ్చాను.ఇదేదో ప్రైవేట్ ఫంక్షన్‌లా ఉంది. ఎక్కువ మంది ఆడవాళ్లే కనిపిస్తున్నారు. తింటూ సింగమనేని గారిని విష్ చేసి పరిచయం చేసుకున్నాను. మా జిల్లా వాడే కావడంతో కొంత బాగానే మాట్లాడారు. ఇంతలో ఎవరో వచ్చి ఆయనతో మాట్లాడ సాగారు. ఈ లోగా వొరప్రసాద్ కనిపించడంతో అటు వెళ్ళాను. అతనితో మాట్లాడుతూ భోజనం అయ్యిందనిపించాను. హమ్మయ్య అనుకుంటూ హాల్‌లో ఒక ఫ్యాను చూసుకుని దాని కింద కూర్చొన్నాను. అప్పుడు తెలిసింది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది ఆస్మిత అనే మహిళా రచయితల సంస్థ అని. కొడవటిగంటి కుటుంబరావు, సుద్దాల హనుమంతు, శ్రీశ్రీ, మహీధర రామమోహన రావు గారల శతజయంతులతో పాటు మధురవాణి పాత్రకు కూడ శతజయంతిని ఉమ్మడిగా ఈరోజు నిర్వహిస్తున్నారని అర్థమయ్యింది.ఉదయం కార్యక్రమంలో సుద్దాల హనుమంతు, శ్రీశ్రీ, కొకులపై సింగమనేని, అశోక్‌తేజ తదితరులు మాట్లాడారని తెలిసింది. మధ్యాహ్నం సరిగ్గా 2.30గంటలకు సభ ప్రారంభమయ్యింది.మొదట పదినిమిషాలు కొండపల్లి కోటేశ్వరమ్మ మహీధర రామ మోహన రావు గారి గురించి తన జ్ఞాపకాలను పంచుకున్నారు. మధ్యలో ఓల్గా గారు మధురవాణి, మహీధరల గురించి ఒక ఇరవై నిమిషాలు ప్రసంగించారు. మిగతా సమయమంతా శ్రీశ్రీ కవితాగానంతో గడిచింది. శ్రీశ్రీ రాసిన కవితలను చదువుతూ వచ్చిన వారంతా సభికులను మరో ప్రపంచంలోకి తీసుకు వెళ్ళారు.కవితాపఠనం చేసిన వారిలో ఎన్.వేణుగోపాల్, మృణాళిని, చిల్లర భవానీ దేవి, దర్భశయనం, కొండవీటి సత్యవతి,వొర ప్రసాద్, సత్యభాస్కర్, కందుకూరి శ్రీరాములు,అక్కినేని కుటుంబరావు మొదలైనవారున్నారు. చివర్లో యాకూబ్ గానం చేసిన జగన్నాథ రథ చక్రాలతో సభ ముగిసింది. శ్రీశ్రీ శత జయంతి కార్యక్రమాన్ని ఎలా జరుపుకోవాలో ఆస్మిత సంస్థ చేసి చూపించింది. ఈ సభలో శ్రీశ్రీ కవితా గానం విన్న తర్వాత అంతకు ముందు శ్రీశ్రీ పై వ్రాసిన టపాలో నేను పడిన ఆవేదన అంతా మటుమాయం అయ్యింది. మూడు గంటలు వృథా కాకుండా ఒక మంచి కార్యక్రమం చూసిన ఆనందం కలిగింది. అన్నట్లు శ్రీశ్రీ కవితాపఠనం చేసిన వారిలో మన బ్లాగరు కూడా ఉన్నారండోయ్! అతడు/ఆమె ఎవరో నేను చెప్పను. సస్పెన్స్. మీరే గెస్ చెయ్యండి!!!

2 కామెంట్‌లు:

భావన చెప్పారు...

బాగుంది దగ్గర వుండి చూసినట్లు అనిపించింది మీ వర్ణన వింటే.... మన బ్లాగర్ గారు ఎవరండోయ్...

mmkodihalli చెప్పారు...

@భావన మీ కామెంట్‌కు థ్యాంక్స్.
శ్రీశ్రీ కవితా పఠనం చేసిన బ్లాగర్ ఎవరో ఇంతవరకూ ఎవరూ కనిపెట్టలేక పొయారు.
అతనే అక్కిరాజు భట్టిప్రోలు.