...

...

22, జూన్ 2009, సోమవారం

పుస్తక సమీక్ష! -11 తీవ్రవాదం

[పుస్తకం పేరు: తీవ్రవాదం, రచయిత: కస్తూరి మురళీ కృష్ణ, పేజీలు: 264, వెల: రూ.100/- , ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, విజయ సాయి రెసిడెన్సీ, సలీం నగర్, మలక్‌పేట్, హైదరాబాద్ 500 036]

పాపులర్ రచయిత కస్తూరి మురళీ కృష్ణ వారం వారం వ్రాస్తున్న రాజకీయ కాలమ్ పవర్ పాలిటిక్స్‌లో తీవ్రవాదానికి సంబంధిచిన 35 వ్యాసాలను ఎంపిక చేసి ఈ సంపుటంలో ప్రకటించారు.ఈ వ్యాసాలన్నీ 2000-2008 సం.ల మధ్య కాలంలో వెలువడినవే. తీవ్రవాదం అంటే ఏమిటో, దాని పుట్టు పూర్వోత్తరాలు, ప్రపంచ వ్యాప్తంగా దాని విశ్వరూపం, తీవ్రవాదానికి కారణాలు, ప్రేరణలు, ఈ సమస్యపై లోతైన విశ్లేషణ వగైరా ఈ వ్యాసాల్లో చర్చింప బడింది.

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇజ్రాయిల్, ఇండొనేషియా,బంగ్లా దేశ్,లైబీరియా, సూడాన్, కంబోడియా, థాయ్‌లాండ్, సింగపూర్, ఫిలిప్పీన్స్, చైనా, మలేషియా, టర్కీ,చెచెన్యా,సౌదీ అరేబియా, స్పెయిన్, శ్రీలంక మొదలైన దేశాలలోని తీవ్రవాద కార్యకలాపాలనే కాక మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ వంటి రాష్ట్రాలు, ముంబయ్,హైదరాబాద్ వంటి నగరాలలో జరిగిన తీవ్రవాద దుశ్చర్యలపై ఈ వ్యాసాలలో సమగ్రంగా చర్చింపబడింది. ఈ దుశ్చర్యలకు కారణమైన రాజకీయ, సాంఘిక, మత పరమైన కారణాలు వివరించబడింది. తాలిబాన్, ఆల్‌ఖైదా, లష్కర్-ఎ-తొయిబా, ఎల్.టి.టి.ఈ., వంటి ఉగ్రవాద సంస్థల గురించి ఈ పుస్తకంలో సమగ్రమైన సమాచారం లభిస్తుంది.

ఈ తీవ్రవాద సమస్య పరిష్కారానికి కావలసిన మార్గాల అన్వేషణ గూర్చి ఈ పుస్తకంలో కూలంకషంగా వివరించబడింది. దీన్ని ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచ సమస్యగా పరిగణించాలి. ప్రభుత్వాలు ప్రజలలోని అసంతృప్తి, అభద్రతాభావాలను పోగొట్టి ప్రజల విశ్వాసాలను చూరగొనాలి. అలాగే ధృఢమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు తమ అధికార దాహం, స్వార్థం వదిలి దేశభవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విచక్షణ ప్రదర్శించాలి. దేశ సరిహద్దులను కట్టుదిట్టం చేసి, అక్రమ రవాణాను, చొరబాటుదార్లను అరికట్టాలి. వలస వచ్చేవారిని, దొంగతంగా దేశంలో ప్రవేశించే వారిని ఏరివేయాలి. దేశద్రోహ చర్యలకు పాల్పడేవారిని ఎవరినైనా సరే నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి. తాము పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం చివరకు తమకే ముప్పుగా పరిణమిస్తుందని అన్ని దేశాలు గ్రహించాలి.

అయితే అన్ని ప్రాంతాల తీవ్రవాద సమస్యలకూ ఒకే రకమైన పరిష్కారం సాధ్యం కాదు. అక్కడి చారిత్రక, రాజకీయ పరిస్థితులు సమస్యను ప్రభావితం చేస్తాయి. మనం తీవ్రవాదం అని భావిస్తున్న దానిని అది ఆచరించేవారు హక్కుల పోరాటంగానో, స్వాతంత్ర్య సమరంగానో భావిస్తున్నారు. శాంతి సాధనకు సైనిక చర్య ఒక్కటే మార్గం కాదు.

తీవ్రవాదుల మానసిక ప్రవర్తనను విశ్లేషిస్తూ రచయిత కస్తూరి ఒక చోట వారు పబ్లిసిటీని కోరుకుంటారని అంటున్నారు. నిజమే. మన మీడియా ఇస్తున్న పబ్లిసిటీ కారణంగానే తీవ్రవాదులు ఇంకా పేట్రేగి పోతున్నారు. మన మీడియా, రచయితలు ఈ సమస్యపై ఎంత తక్కువగా స్పందిస్తే అంత తీవ్రవాదాన్ని తగ్గించిన వారమౌతాము.

మొత్తం మీద ఈ పుస్తకం తీవ్రవాదంపై పాఠకునికి ఒక స్పష్టమైన, సంపూర్ణమైన అవగాహనను కలిగిస్తుంది. ఆ మేరకు రచయితా, ప్రచురణ కర్తా విజయం సాధించినట్లే.

కామెంట్‌లు లేవు: