నేను ఏదైనా ఒక టపా రాస్తే దానిపై స్పందనలు వెల్లువెత్తుతాయని వాటితో నా బ్లాగు నిండిపోతుందనీ ఊహించుకుంటాను. కానీ ఆ టపాను చాలామంది(?) చదువుతారు కానీ కౌంటర్లు మాత్రం నేను ఆశించినంత రావు. దానితో ఆ టపాను మన బ్లాగ్మిత్రులకు ఆ టపా నచ్చలేదేమో అనిపిస్తుంది. బహుశా ఇదే అభిప్రాయం (వారి వారి టపాల విషయంలో) చాలామంది బ్లాగర్లకు ఉండిఉండవచ్చు. ఐతే ఆమధ్య నేనడిగిన ఒక పొడుపుకథ ఇప్పుడు కూడా కొన్ని బ్లాగులలో దర్శనమివ్వటం నాకు సంతోషాన్ని కలుగజేస్తున్నది. ఆ వివరాలు....
నేను ఫిబ్రవరి 21,2009న ఈ క్రింది టపా రాశాను.
పొడుపు కథ!
మా అమ్మాయి ఏదో కావాలని అంటే వెతకడానికి పాత ట్రంకు పెట్టె తెరిచాను. అందులో అనుకోకుండా పొడుపుకథలు అనే పుస్తకం కనిపించింది. చల్లా రాధాకృష్ణ శర్మ గారు సంకలనం చేయగా పబ్లికేషన్ డివిజన్ వారు ప్రచురించారీ పుస్తకాన్ని. ఆరేడేళ్ళ క్రితం పిల్లల కోసం బుక్ ఎక్జిబిషన్‌లో కొన్నట్టున్నాను ఈ పుస్తకాన్ని. చాలా ఇంట్రెస్టింగ్‌గా చదివించిన ఈ పుస్తకాన్ని ఇంతవరకూ చదవకుండా ఎలా మిస్అయ్యానబ్బా! పొడుపు కథలూ వాటి జవాబులూ చదువుతూ ఉంటే చాలా సంతోషం వేసింది. కొన్ని మీతో పంచుకోవాలని అనిపించింది. కానీ ఈ పొడుపు కథలు చాలా మందికి తెలిసే వుంటుందనే అనుమానం. ఈ పొడుపు కథల్లో చివరి పొడుపు కథ ఒకటి పద్య రూపంలో ఉంది. (అంటే అదొకటే పద్యరూపంలో ఉందని కాదు.180నుండి 205 సంఖ్య గల పొడుపులు పద్యాల్లో ఉన్నాయి.) ఎవరో ఒక నెరజాణ ఈ పొడుపు కథను పొడిచినట్లుంది. దీని జవాబుమాత్రం ఈ పుస్తకంలో లేదు. మీకెవరికైనా తెలిసి ఉంటే దయచేసి చెప్పండి. జవాబు నాకూ తెలియదు.
సిరియు వృక్షంబు ధనపతి పరిమళంబు
ననలు డగురయు నుపవనం బసియు నావ;
అందు మూడేసి వర్ణంబు లమరు, శబ్ద
మధ్య మాక్షర పంక్తి నా మగని పేరు.
కానీ ఏప్రిల్ 8 వరకూ ఎవరూ దీనిపై స్పందించ లేదు. ఊకదంపుడుగారు ఇలా కరుణించారు.
3 కౌంటర్లు:
ఊకదంపుడు చెప్పారు...
ఎవరండీ ఈ అనిలగురుడు
April 8, 2009 5:06 AM
కొడీహళ్లి మురళీ మోహన్ చెప్పారు...
ఊకదంపుడు గారూ!
ఇన్నాళ్లకు ఈ టపా వైపు ఒక్కరైనా చూసారు. సంతోషం.
అనిల గురుడు కాదండీ.
అనలుడు అగురయును అని విడదీసి చదవండి.
April 8, 2009 8:56 AM
ఊకదంపుడు చెప్పారు...
మురళి మోహన్ గారు.
మీరు ఇంకో మెలికె వేశారే..
ఐతే అనలుడి గురువు కాదా...
అగురయును అంటే - లైటు తీసుకోబడ్డది అని అర్ధమా
April 8, 2009 11:00 PM
నా సమస్యకు సమాధానం అంతటితో ఆగిపోయింది.
జులై నెలలో చింతా రామకృష్ణారావుగారు తమ ఆంధ్రామృతం బ్లాగులో చెప్పుకోండి చూద్దాం అంటూ ఈ క్రింది సమస్యనిచ్చారు.
చెప్పుకోండి చూద్దాం 1.
సమాధానం కనుక్కోండి చూద్దాం.
స్త్రీలు తమ భర్త పేరు నుచ్చరించరాదని ఒక లతాంగి తన భర్త పేరు చెప్పిన తీరు చూడండి.
చ:-
సరసిజ నేత్ర నీ విభుని చక్కని పేరు వచింపుమన్న, యా
పరమ పతివ్రతా మణియు భావమునన్ ఘనమైన సిగ్గునన్
కరియును - రక్కసుండు - హరు కార్ముకమున్ - శర - మద్దమున్ - శుకం
బరయగ వీని లోని నడి యక్కరముల్ గణుతింప పేరగున్.
జైహింద్.
రాసింది చింతా రామకృష్ణారావు. AT WEDNESDAY, JULY 22, 2009
ఈ సమస్యకు సమాధానం ఇస్తూ జ్యోతి గారు మరొక సమస్యను ఇలా సంధించారు.
జ్యోతి చెప్పారు...
భర్త పేరు అడిగితే ఆ పత్రివ్రత సిగ్గుతో ఇలా చమత్కారంగా చెప్పింది..
కరి (ఏనుగు), రక్కసుడు, హరకార్ముకమున్ (శివధనుస్సు), శరం (బాణం), అద్దం, శుకం (చిలుక) వీటి నడుమ అక్షరాలు కలిపితే నా భర్త పేరు వస్తుంది అంటుంది. అది " రఘునాయకులు " కదా..
అంటే ..
(కరి) ద్వి ర దం - ర
(రాక్షసుదు) అ ఘు డు - ఘు
(హరకార్ముకం) పి నా కం - నా
(శరం) సా య కం - య
(అద్దం) ము కు రం - కు
(శుకం) చి లు క -లు
JULY 22, 2009 8:49 PM
చింతా రామకృష్ణారావు. చెప్పారు...
గీ:-
సాహితీ జ్ఞాన ముప్పొంగు సరస మతిరొ!
చక్కగా నిది పఠియించి ఠక్కుమని జ
వాబు వ్రాయగా నేర్చిన వనిత మణిరొ!
ధన్య వాదము జ్యోతి! విద్యా ప్రదీప్తి!
JULY 23, 2009 7:51 AM
జ్యోతి చెప్పారు...
అపారమైన తెలివితేటలుండి, పైకి అమాయకంగా ఉండే ఓ ఇల్లాలిని ఆమె భర్త పేరడిగితే ఏకంగా సవాలు విసిరింది..
విపులాక్షి ! "నీ విభు పేరేమి?" యన్నను
చాతుర్య మెసగ నా నాతిబలికె
నక్రంబు హేమంబు నగధాము పుప్పొడి
యబ్బురం బేనుగు యాజి పడవ
అన్నిటి మూడేసి అక్షరంబులు గల
మారు నామంబుల తీరు జూచి
నాధు పేరునకును నడిమ వర్ణంబులు
సరియని జెపితి నెరిగి కొనుము
యుచు నానాతి బల్కె, తా నతిశయముగ
ఇట్టి నామంబు గలవాడే యీతడనుచు
వంచనలులేక బుధులెరింగించిరేని
వారికే నాచరించెద వందనములు.
దీనికి సమాధానం చెప్పగలరా ఎవరైనా???
JULY 23, 2009 12:13 PM
పై రెండు సమస్యలు చూసి నా ప్రశ్నకు సమాధానం దొరుకుంతుందేమో అనే ఆశ మళ్ళీ చిగురించింది. దానితో నేను ఆ టపాలో నా కామెంట్‌ను ఉంచాను ఇలా...
కోడీహళ్ళి మురళీ మోహన్ చెప్పారు...
అచ్చంగా ఇలాంటి సమస్యనొకదానిని నా బ్లాగులో చాలా కాలం క్రితం ఉంచాను.కానీ ఇంతవరకూ సమాధానం తెలియలేదు. మీ టపాకు జ్యోతి గారి సమాధానం మరియు వారిచ్చిన మరొక సమస్య చదివాక మళ్లీ ఆ పొడుపుకథకు చెందిన లింకును ఇస్తున్నాను.
http://turupumukka.blogspot.com/2009/02/blog-post_21.html
దీనికి సమాధానం చెప్పగలరా ఎవరైనా???
JULY 23, 2009 5:57 PM
జ్యోతి గారి సమస్యకు కంది శంకరయ్య గారు ఇలా సమాధానం చెప్పారు.
Kandi.Shankaraiah చెప్పారు...
నక్రంబు - మ(క)రి
హేమంబు - క(డా)ని
నగధాముడు - హ(రు)డు
పుప్పొడి - ర(జ)స్సు / పూ(పొ)డి
అబ్బురము - వె(ర)గు / అ(రు)దు
ఏనుగు - ఇ(భ)ము / నా(గ)ము
ఆజి - క(య్య)ము
పడవ - క(ప్ప)లి
ఆవిడ భర్త పేరు "కడారు జ(శ)రభయ్యప్ప" లేదా "కడారు పొరుగయ్యప్ప" కావచ్చు. నా అల్ప బుద్ధికి తోచింది ఇంతే. ఇందులో కొంత భాగమైనా సరిపోతే ధన్యుణ్ణి.
AUGUST 6, 2009 8:59 PM
ఊకదంపుడు గారు కంది శంకరయ్య గారిని ఇలా నా సమస్యను సాధించవలసినదిగా కోరారు.
vookadampudu చెప్పారు...
కలదు గాధ యొకటి గతమందు ఇట్టిదే
వివరమడిగి నారు విజ్ఞులొకరు
కోరెదమిము సులువు గోరంతనివ్వగా
సతిమనమునెరుగ శంకరార్య !
http://turupumukka.blogspot.com/2009/02/blog-post_21.html
AUGUST 28, 2009 5:12 PM
తరువాత సెప్టెంబర్ 12వతేదీ అంటే నిన్న ఇదే సమస్యగురించి రాకెశ్వరరావుగారి అందం బ్లాగులో ఈ విధంగా చదివాను.
vookadampudu said...
కంది శంకరయ్య గారు,మీరు లయగ్రాహిని కూడా కందం చెప్పినంత తేలికగా ఆశువుగా చెప్పుతున్నారు.. సంతోషమండీ, మీ వంటి పెద్దల బ్లాగ్ప్రవేశం తో మాకు నేర్చుకోవటానికి మరింత వెసులుబాటు.
మీకోసం శ్రీ.చిం.రా.కృ.రా గారి బ్లాగులో ఓ వ్యాఖ్యనుంచాను. మీరు చూశినట్టు లేరు
http://andhraamrutham.blogspot.com/2009/07/blog-post_23.html
భవదీయుడు
ఊకదంపుడు
11:52 AM, September 11, 2009
Kandi.Shankaraiah said...
ఊకదంపుడు గారూ, తురుపుముక్కలో మీరు చెప్పిన పోస్ట్ ఎప్పుడో చూసి, రాసి పెట్టుకున్నాను. సమాధానం కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. నా పద్యాలు మీకు నచ్చుతున్నందుకు ధన్యుణ్ణి.
1:18 PM, September 11, 2009
Kandi.Shankaraiah said...
ఊకదంపుడు గారూ, మీరు చెప్పిన తురుపుముక్క బ్లాగులోని పద్యం ఇదే కదా...
సిరియు వృక్షంబు ధనపతి పరిమళంబు
ననలు (డగురయు) నుపవనం బసియు నావ
అందు మూడేసి వర్ణంబు లమరు శబ్ద
మధ్యమాక్షరపంక్తి నా మగని పేరు.
ఇందులో రెండవ పాదం లోని బ్రాకెట్లో ఉన్న అక్షరాల విషయంలో నాకు సందేహం. అవి కరెక్టేనా?
6:17 PM, September 11, 2009
రాకేశ్వర రావు said...
శంకరయ్య గారు,
ఊకదంపుడు గారు న్మ ప్రాసతో లయగ్రాహి వ్రాద్దామనుకున్నట్టున్నారు, మీరు వారి ప్రాసాక్షరం దోచుకున్నారు :D
మా కోసం అలానే ఒక లయవిభాతి కూడా అందిస్తే సంతోషం.
సిరియు వృక్షంబు ధనపతి పరిమళంబు
ననలు డగురయు నుపవనం బసియు నావ;
అందు మూడేసి వర్ణంబు లమరు, శబ్ద
మధ్య మాక్షర పంక్తి నా మగని పేరు.
7:59 PM, September 11, 2009
దీన్నిబట్టి నాకు తెలిసిందేమిటంటే నేనిచ్చిన ప్రశ్న ఊకదంపుడు, కందిశంకరయ్య, రాకేశ్వర రావు తదితర ప్రతిభాశాలుర మెదళ్ళలో ఇంకా మెదులుతోందనీ దాని సమాధానం అతిత్వరలో తెలుసుకునే అదృష్టం కలుగుతుందనీను!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి