...

...

23, ఫిబ్రవరి 2010, మంగళవారం

శ్రీకృష్ణ సంకీర్తనములు - రెండవ భాగము

ఓమ్
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీకృష్ణ సంకీర్తనములు 
గ్రంథకర్త :-
కీ.శే.కోడీహళ్ళి చన్నరాయప్ప


21. ఉల్లాసమందితివి - ఉర్వి కృష్ణ మూర్తి!
      గొల్ల యశోద సతి - తల్లియై చను గుడుప
    అల్ల జగన్నాథ - అందమై పరగె వ్రే
   పల్లె క్రీడార్థముగ - పద్మనాభ! నీకు                   llకృష్ణll

22. ఎవ్వని చే బుట్టు - ఎవని లోపల నుండు
    ఎవ్వని చే జచ్చు - ఎల్ల లోకంబులును
    ఎవ్వడు మూలంబు - ఎల్ల లోకములకు
    అవ్విభుడీశ్వరుడు - అరయ నీవే కృష్ణ                llకృష్ణll

23.మందుడనని నాను - మఱవకుము దేవా!
   నిందల బొందితి - నీచుడనైతిన్
 సందేహింపకను - సరగున కావుము
 నందుని వరపుత్ర - నమ్మితిని కృష్ణ               llకృష్ణll
  
24.నందు ముద్దుల పత్ని - నాతిముందఱ నీవు
    అందె గజ్జెలు ఘల్లు - మనుచు మ్రోయగ వేడ్క
    చిందులను ద్రొక్కుచును - చేతులను ద్రిప్పుచును
    అందముగ ముఱియుచు - ఆటలాడెడు కృష్ణ              llకృష్ణll


25.భుజగేంద్ర శయన - పుండరీకాక్షా!
   త్రిజగత్ కళ్యాణుడ - దేవ! మురారీ!
   గజరాజ వరద! - కంజదళాక్షుడ!
   విజయ రక్షక నన్ను - విడువక కావుము              llకృష్ణll


26.ఒకపరి జగములు - ఒనర వెలిగింతువు
   ఒకపరి లోపల - ఉండగ జేయుదువు
   సకలార్థములకు - సాక్షి వీవె కాద!
   అకళంక హృదయ ని - న్నర్థింతు కృష్ణా              llకృష్ణll


27.ఉరమున రత్నాల - హారము మెఱయగ
   కరమొప్పు చేతులను - కంకణ రవములు
   హరిచందనము మేన - అరుదుగ పూయుచు
   పరగితివౌ బాల - ప్రాయము కృష్ణా                    llకృష్ణll


28.గోపాల మూర్తిని - కోరి భజియింతును
   పాపాల దోలెడు - ప్రభుడంచు దలతును
   గోపాల బాలక - గోవిన్ద! ముకున్ద!
   నాపాల నుండుము - నమ్మితిని కృష్ణా                llకృష్ణll


29.నర్తకుని విధముగ - నటియించుచు పెక్కు
   మూర్తుడవగు నిన్ను - మునులు దేవతలును
   కీర్తింప నేరరు - కేశవ! కృష్ణ! నీ
   వర్తనమెవరును - వర్ణింప జాలరు                      llకృష్ణll


30.వేణీ మూలము నందు - వెలయ పించము దాల్చి
   పాణి వెన్నముద్ద - పదిలముగ గైకొనుచు
   ఆణి ముత్యములను - అందముగ నాసికను
   నాణెముగ ధరియించి - నాట్యమాడెడు  కృష్ణ           llకృష్ణll


31.సుందరరూపా! - నందుని పాపా!
   మందరగిరిధర! - మాధవ కృష్ణ!
   కొందల మందక - కూరిమి నాడుదువు
   వందనములు నీకు - వసుదేవ పుత్రా!                 llకృష్ణll
  

32.దుర్మతినై చేఅల - ద్రోహపు దుష్టపు
   కర్మములు చేసిన - కష్టుని నన్నున్
   నిర్మలుని జేయుము - నిర్మలాత్మకుడ!
   మర్మంబు వలదుర - మాధవ కృష్ణా!                    llకృష్ణll


33.భవము దోషంబు రూ - పంబు కర్మంబులును
   ఎవనికి లేవో - ఈశ్వరుడె నీవగుచు
   భువనములు కలిగించి - భుజశక్తి నణచుదువు
   ఎవడెఱుగు నీ మాయ - ఈశ్వర! శ్రీ కృష్ణ!               llకృష్ణll


34.మడువు జొచ్చినపుడు - మాయకాళీయుని
   పడగలపై నీవు - భరత శాస్త్రముగ
   విడువకును ఆడెడు - విశ్వమోహన నీ
   అడుగులను మదిదలతు - అచ్యుత! శ్రీ కృష్ణ!            llకృష్ణll
  

35.నిర్వాణ నాథ ! - నిఖిల లోకేశ!
   సర్వాత్మకుడ నన్ను - సరగున కావుము
   దుర్వార చక్రంబు - తోడమెఱయుదువు
   శర్వాణి వినుతుడౌ - జగదాధారా!                      llకృష్ణll


36.శ్రీనాథ కృష్ణ నీ - శ్రేష్ఠమౌ నామములు
   మానకెల్లపుడును - మది భక్తి స్మరియింప
   నానా రుజినమ్ములు - నాశనమై పోవు
   కానరు దుష్టులది - కంజలోచన కృష్ణ                    llకృష్ణll

    
37.అందముగ వేణువు - అరుదుగ పూరింప
   సుందరులెల్ల గో - వింద! యని పాడగ
   బృందావనమ్ములో - బ్రహ్మానందముగ
   మందారము క్రింద - మమతనుందువు కృష్ణ             llకృష్ణll


38.చిత్రమౌ అవతార - చిన్మయాకారా!
   సత్రాజిత్కుమారి - సౌందర్య ధామా!
   సుత్రామనుత దేవ! - సుగుణ గణాఢ్యా!
   పుత్రు రీతిగ నన్ను - బ్రోవుము కృష్ణా                  llకృష్ణll


39.కలడు దీనులయందు - కలడు భక్తులయందు
   కలడు యోగులయందు - గణుతికెక్కిన స్వామి
   కలడన్ని దిశలందు - కలడుకలడని జగతి
   పలికిన ప్రహ్లాదు - పాలనము చేసితివి                   llకృష్ణll


40.దీనులు కుయ్యిడగ - దేవ! విందు వీవు
   దీనులను రక్షింప - తీవ్రముగ వచ్చెదవు
   దీనావన బిరుదు - దేవ నీ కొప్పును
   దీనపరాధీన - దేవ శ్రీకృష్ణా                              llకృష్ణll


                    (సశేషము)
    
 

కామెంట్‌లు లేవు: