ఓమ్
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీకృష్ణ సంకీర్తనములు
గ్రంథకర్త :-
కీ.శే.కోడీహళ్ళి చన్నరాయప్ప
దశావతార స్తోత్రములు
41.నిగమములు హరియించి - నీరు సొచ్చిన సోమ
పగతు రక్కసు జంపి - పరమేష్ఠి దేవునకు
నిగమముల నిచ్చితివి - నిండు కరుణను దేవ!
మగమీనమై నీవు - మాధవ శ్రీకృష్ణా! llకృష్ణll
42.సురులు దనుజులు చేరి - సూటిగ క్షీరాబ్ధి
దరువ నా మందరము - తక్షణమె మునిగెన్
అరుదుగ కూర్మమై - అద్రిని గొనితెచ్చి
సురవరుల కొసగితివి - సుందర శ్రీకృష్ణ llకృష్ణll
43.పంది రూపము దాల్చి - పంద కనకాక్షుని
మ్రందించి భూదేవి - మమత బ్రోచితివి
కందర్ప సౌందర్య - కరుణ సాగర దేవ!
వందనమ్ములు నీకు - వాసుదేవ! కృష్ణ llకృష్ణll
44.సురవైరి స్తంభము - సూటిగ కొట్టిన
అరుదుగ వెడలితివి - అఖిల లోకేశా!
సురవైరి యురమును - సొంపుగ జీల్చిన
నరహరి అవతారు - నగధర కృష్ణా! llకృష్ణll
45.వటురూపమును దాల్చి - బలిదైత్యునర్థించి
దిటముగను బొందితివి - దేవ! పాద త్రయము
తటుకునను నిండితివి - త్రైలోక్య మంతయును
ఘటికుడై బరగితివి - ఘనుడ! శ్రీకృష్ణయ్య llకృష్ణll
46.ధరగల్గు రాజుల - తడయక నెమకుచు
ఇరువదొక్కమారు - ఈడ్చి చంపితివి
ధరను కశ్యపునకు - ధార పోసితివి
పరగితివి ధరలోన - పరశురాముడగుచు llకృష్ణll
47.దశకంఠు బరిమార్చి - దైత్యుల మర్ధించి
కుశలముగ జానకిని - కూర్మిగొని తెచ్చితివి
విశదమయోధ్యాపురి - వేడుక నేలితివి
దశరథ పుత్ర! రామ - ధన్య శ్రీకృష్ణా llకృష్ణll
48.దనుజులైనట్టి యా - ధేనుక ముష్టికులు
అనుపమౌ భుజశక్తి - అణచినావయ్య
అనఘాత్మ రేవతిని - హర్షమున బెండ్లాడి
ప్రణుతినందితివయ్య - బలరామ మూర్తీ llకృష్ణll
49.కపట వేషము పూని - త్రిపుర దైత్యసతుల
నిపుణమౌ వ్రతమునను - నిలిపినావు నీవు
విపులముగ బుద్ధుడని - వినుతిగనినయట్టి
కృపను గల్గిన మూర్తి - కృష్ణ వాసుదేవ! llకృష్ణll
50.బలమైన హయమెక్కి - బాహాటముగ వెళ్ళి
ఇలను ధర్మము నిలుప - హీనులను మడియింప
కలియుగము తుదినీవు - కనుల పండువుసేయ
కలికి మూర్తివి లోక - కర్తవైతివి కృష్ణ llకృష్ణll
51.శ్రీరామ రఘురామ - సీతా మనో ధామ!
కారుణ్యమూర్తి ఓ - కాకుత్స కుల తిలక!
దారిద్ర్యమును బాపు - తాపత్రయమును దీర్పు
రారా నిను నమ్మితి - రక్షించు శ్రీకృష్ణ! llకృష్ణll
52.పిలిచిన పల్కవు - ప్రేమను జూడవు
తలచిన తప్పులె - తప్పక జూతువు
పలుమారు పట్టెద - పాదయుగ్మములు
పలుచగ జూడకు - బాముల బెట్టకు llకృష్ణll
53.క్రూరుడజామికుడు - కూర్మి కుమారుని
నారాయణ! యనుచు - నయముగ పిలిచిన
ఏరీతినాతని - ఏలితివి కరుణ
ఆరీతి బ్రోవుము - అఖిలలోకేశా! llకృష్ణll
54.కలికియొకతె తొల్లి - కడుప్రేమమున బెంచి
చిలుకనతి ముచ్చటగ - శ్రీరామయని పిలువ
అలరగామెకు నీవు - అమృతపదమొసగితివి
కలరె ఈ భువిలో నీ - కంటె ఘనుడెవడయ్య llకృష్ణll
55.పరికింప యినుమును - పరుసము సోకిన
వరుసగ పసిడియై - వనరునట్లుగను
హరి నీ నామము - అందిన జిహ్వకు
సురవందితయేను - సులభుడగుదు నీకు llకృష్ణll
56.పైక్షణము ఎటులో - విపత్తులెపుడుండునో
ఏక్షణముననేమొ - ఏమౌనొ? యిప్పుడె
అక్షయముగ భజన - అమృతమొసగిన నన్ను
రక్షించి బ్రోవుము - రఘురామ! కృష్ణ! llకృష్ణll
57.ఓ పుండరీకాక్ష! - ఓ భక్త వరద!
ఓ పురుష సింహమౌ - ఓ గోవిన్ద!
ఓ పుణ్యదేవుండ! - ఓ చక్రపాణి!
శ్రీపతి! ననుబ్రోవు - శీఘ్రమె కృష్ణ! llకృష్ణll
58.జలజ నేత్రలు యమున - జలమునందు చేరి
జలకమ్ములాడగను - సరసమునను నీవు
వలువలన్నియు దీసి - వారలనతి ప్రేమ
వలపునను ముంచితివి - వనజాక్ష శ్రీకృష్ణ! llకృష్ణll
59.హా వాసుదేవా! - హా కృష్ణ గోవింద!
కావు మానమనుచు - కంజాక్షి వేడగను
ఆ వారిజాక్షికి - అక్షయమగునట్లు
శ్రీ వినుత! చీరలు - సిద్ధముగ చేసితివి llకృష్ణll
60.నందుని వరపుత్ర - నగధర! కృష్ణా!
అందెలు పాదమ్ము - లందున మెఱయగ
సుందరముగ దాల్చి - సొంపుమీరగను
మందరమెత్తితివి - మాధవ! శ్రీకృష్ణ! llకృష్ణll
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి