...

...

4, జూన్ 2012, సోమవారం

మాణిక్యవీణ సృష్టికర్తకు నీరాజనం!

వార్త దినపత్రిక ఆదివారం 13,మే 2012 సంచికలో కృతి శీర్షికలో ప్రచురితమైన సమీక్ష పూర్తిపాఠం.

కోటి గొంతుల కిన్నెరమీటుకొనుంచు
కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు
'పెన్నేటి పాట'తో రాయలసీమ కరువు కాటకాలను సాహితీమాధ్యమం ద్వారా ఆంధ్రపాఠక లోకం ముందు ఆవిష్కరించిన విద్వాన్ విశ్వం అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. విశ్వం కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో చదివి, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పట్టా పుచ్చుకొన్నారు. విశ్వం మనువునీ మార్క్సునీ సమంగా అర్థం చేసుకొన్నారని ఒకరంటే నాటి రాయలసీమలో అంగళ్లలో రత్నాలు కొలిచే రోజులున్నా నేటి రాయలసీమ ప్రజల కన్నీటి కష్టాలను ఆయన గుది గుచ్చి విశ్లేషినంతగా వేరెవరూ చెప్పలేరని మరో వ్యాఖ్య.  సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం పేరిట రచయితలు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్‌లు సంయుక్తంగా సేకరించి సంకలనం చేసిన పుస్తకమిది. విశ్వవిద్యాలయాల్లో పి.హెచ్.డి స్థాయిలో విద్వాన్ విశ్వం రచనలపై కనీసం ఒక్క పరిశోధన కూడా వెలుగు చూడలేదంటూనే అలాంటి పరిశోధనాత్మక పరిశీలనా వ్యాసాన్ని వీరు సాహితీ లోకానికి అందించారు. 

ఆయన మాణిక్యవీణ, తెలుపు నలుపు శీర్షికలద్వారా తెలుగు పత్రికా పాఠకులకు సాహితీ ప్రియులకు చిరపరిచితుడు. 'తెలుపు-నలుపు' సాహిత్య పాఠకుల కోసం రాస్తే మాణిక్యవీణ సామాన్య పాఠకులకోసం రాశారని ఆయన రచనా వ్యాసంగాలను పరిశ్రమించిన వారు స్పష్టంగా విభజన చేసేసారు. ఈ పుస్తకాన్ని అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రచురించి వచ్చే 2015వ సంవత్సరంలో విశ్వంగారి శతజయంతి జరుగబోతున్న రీత్యా రచయితలు విద్వాన్ విశ్వం గారి రచనా వైదుష్యాన్ని సాహితీ లోకానికి, పాఠకలోకానికి అందించాలన్న తపనతో రచయితల సంకల్పం సానుకూలపడింది. తత్ఫలితంగా మనచేతుల్లోకి 263పేజీల పుస్తకం అలరించింది.  

విశ్వంగారి జీవన రచనారీతులను తెలియచేసే విధంగా రూపుదిద్దుకున్న నాలుగు అధ్యాయాల పుస్తకమిది. 'విశ్వజీవి' అధ్యాయంలో విశ్వంగారి జీవితాన్ని సాహిత్యాన్ని వారిపై అభిప్రాయాన్ని, పరిచయాలను క్రోడీకరించే వ్యాసాలున్నాయి. 'విశ్వరూపి'లో విశ్వం నడిపిన శీర్షికలు తెలుపు - నలుపు, మాణిక్యవీణల్తో పాటు మరికొన్ని వ్యాసాలున్నాయి. 'విశ్వభావి' అనే అధ్యాయంలో రచయితమాటలు, పీఠికలు, పుస్తకసమీక్షలు, 'విశ్వమేవ' లో ఆయన సందేశాలు, ఇంటర్వ్యూలు ఉన్నాయి. విశ్వంగారి రచనల మీద అధికారికంగా విశ్వవిద్యాలయాల స్థాయి పరిశోధనలు చేయదలచిన వారు ఈ పుస్తకం ఆసాంతం తిరగేస్తే చాలు. ఇందులో గతంలో పలు సంధర్భాలలో 21మంది సాహితీవేత్తలు, సీనియర్ జర్నలిస్టులు, ప్రసిద్ధ కవులు రాసిన వ్యాసాలున్నాయి. అందులో కొన్ని విషయాలను వార్త పాఠకుల కోసం ముచ్చటించుకుందాం.

విశ్వం 'పెన్నేటి పాట'లో రాయలసీమ పలుకుబళ్లు, నానుడులు, మాటల తీరుతెన్నులు, వ్యవసాయ విధానాలు, ఆహార విహారాదులు, సీమ వాసుల మనోగతాలు - ఇలాంటి విశేషాలెన్నింటినో సమకూర్చారు. నిజమైన కవికి హృదయ స్పందనం, నిశిత దృష్టి, మానవత, భావి జగత్కళ్యాణం మీద అపార విశ్వాసం ఉండాలని విశ్వం పేర్కొనేవారు.

ఆయన 'పెన్నేటి పాట'ను మెచ్చుకోని వారు లేరు. స్వస్థానంపై అభిమానంతో దాశరథి 'నా తెలంగాణ కోటి రత్నాల వీణ' అంటే విశ్వం 'రాయలసీమ మించుల సితారు పచ్చల బజారు' అంటాడు. దాశరథి సూక్తి నినాదమై గర్జించింది. విశ్వం ఆర్తి నిదానమై వ్యాపించింది. ఇది ఆనాటి సంగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో ఆరుద్ర మాట. ఇక 'నాకు తెలంగాణ అంటే ఆవేశం వచ్చినట్లు విశ్వంగారికి రాయలసీమ అనగానే ఆవేశం పొంగి వస్తుంది. స్వయంగా డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య విశ్వం షష్టి పూర్తి అభినందన సంచికలో రాసిన మాటలివి. అంతమాత్రాన అన్య ప్రాంతాల మీద అభిమానం లేకపోలేదు. ఇవి దాశరథి నోటివెంట జాలువారినవే.

పలుకుతీరులో, పలుకుబడుల పోహళింపులో, ఛందో గమనంలో విశ్వానిది ఒక విలక్షణ రీతి. ఈ విషయాన్ని స్వయంగా విశ్వంగారే అంగీకరించారని పున్నమరాజు నాగేశ్వరరావు విశ్వం గురించి రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. చాలామంది తమ వ్యాసాల్లో విశ్వంపై వ్యాసాల్లో ఏనాడో చెప్పినా ఈనాటికీ అవి కరతలామలకములే. భావంలోనూ, భాషలోనూ, కథనంలోనూ పత్రికారంగంలోనూ విభిన్న ధోరణులు చోటు చేసుకుంటున్న ఈ రోజుల్లో పాత్రికేయులు విశ్వం వ్యాసాలను పాఠ్యాంశాలుగా అధ్యయనం చేయాలి.
 
తెలుగు సంస్కృతి విశృంఖలంగా విహరించి విశ్వవ్యాప్తం కావాలన్నదే విశ్వం ఆకాంక్ష.
 
బాణుడు సంస్కృతంలో రచించిన 'కాదంబరి'ని తెలుగులోకి అనువదించిన సాహసికుడాయన. పాళీ భాషలో గుణాఢ్యుడు రచించిన 'కథా సరిత్సాగరం'ను సంస్కృతంలోకి సోమదేవసూరి అనువదిస్తే విశ్వం 12 సంపుటాలుగా తెనుగీకరించారు.

- వరిగొండ కాశీవిశ్వేశ్వరరావు
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి