...

...

8, జూన్ 2012, శుక్రవారం

యోజనలో సమీక్ష!

యోజన అభివృద్ధి మాసపత్రిక జూన్ 2012 సంచికలో సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంపై ఎం. సుబ్బరాజుగారు సమీక్ష వ్రాశారు. తురుపుముక్క పాఠకులకోసం ఆ సమీక్ష పాఠం ఇక్కడ. 



సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం (వ్యాస సంకలనం) 


       తొందరలో 2015లో రాబోతున్న విద్వాన్ విశ్వంగారి శతజయంతిని దృష్టిలో పెట్టుకుని ఆ సాహితీ పూర్ణచంద్రుడికి డా.నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్‌గారలు ఉడుతాభక్తితో ఈ గ్రంథాన్ని అడ్వాన్స్ నైవేద్యంగా తీసుకురావడమన్నది హర్షదాయకమైన విషయం. లోగడ ఆయన కలం నుండి ఆంధ్రప్రభలో వెలువడే 'మాణిక్య వీణ' నుంచి ఎన్ని అక్షర సుగంధాలు వెలువడ్డాయో తెలియని సాహితీ ప్రేమికులు తెలుగు నేల మీద లేరనే చెప్పాలి. కొండంత దేవుడికి కొండంత పత్రి తేలేక పోయినా విశ్వంగారి మేరు శిఖర సమాన వ్యక్తిత్వాన్ని చక్కగా సోపపత్తికంగా ఇందలి వ్యాసాలలో మనం గమనించగలుగుతాం!
         
      సాహితీవిరూపాక్షుడైన విశ్వంగారు నిర్వహించిన పత్రికలలోని శీర్షికలు, సమీక్షలు, సందేశాలు, ఇంటర్వ్యూలు ఇంకా ఎన్నో గుదిగుచ్చి ఈ గ్రంథానికో నిండుదనం తీసుకొచ్చారు సంపాదకులు. విషయాన్ని నాలుగు అధ్యాయాల్లో పొందుపరిచారు. వారు నాగిరెడ్డి అనే వారితో కలిసి 'నవ్యసాహితి'అనే పత్రికను నిర్వహించిన భోగట్టా కూడా ఈ గ్రంథంలో ఉటంకించారు. విశ్వంగారు తొలిదశలో రాజకీయాలకు సన్నిహితులుగా తలమునకలైవున్నా పత్రికా సంపాదకత్వం బాటలో పయనిస్తున్నాని చెప్పడం వారికి మాతృభాష పట్ల, స్వజాతి జనుల పట్ల గల ప్రేమ వ్యక్తం అవుతున్నది.
          
విరికన్నె, పాపం, రాతలు గీతలూ, నా హృదయం వీరి కలమ్నుండి వెలువడ్డ లఘుకృతులైతే పెన్నేటిపాట, ఒకనాడు అనేవి కావ్యకన్నికలు. అయితే విద్వాన్ విశ్వంగారు అసంఖ్యాకములైన అనువాదాలు చేసియున్నారు. అవి సంకృత భాషనుండి, పాశ్చాత్య భాషలనుండీ జరిగినా అది ప్రక్రియాపరంగా చెప్పాలనంటే నవలలు, నాటకాలు, కథలు, కావ్యాలు, సిద్ధాంత గ్రంథాలు ఇలా ఎన్నో లెక్కకు మించి దర్శనమిస్తాయి. పైగా అనువాదమన్నది అనుకున్నంత తేలికైన విషయం కాదు. అది కత్తి మీద సాము వంటిదని అనుభవమున్న ప్రతి ఒక్కరికీ తెలిసిన అంశం. ఈ గ్రంథం చదవటం ద్వారా పాఠకులకు ముఖ్యంగా వారి రచనలో కనిపించే లోతైన ఆలోచనలు, సమన్వయవాదం, అవగాహన, అర్హులైనవారికి తగిన గౌరవం లభించాలన్న ఆతృతలు వీటికి తోడు అద్భుతమైన గతకాల జ్ఞాపకాల దొంతరలకు సాక్ష్యంగా ఈ పుస్తకం దర్శనమిస్తుంది.

సంపాదకుల శ్రమకూడా తక్కువని చెప్పలేం. ఒక వ్యక్తి తాలూకు ఔన్నత్యాన్ని పలువురికీ విశదపర్చగలందులకు చేసిన గట్టి కృషిగా నిలుస్తుంది. ఇదొక విలక్షణమైన గ్రంథం అని చెప్పుకోవచ్చు. వ్యక్తిగా, మేధావిగా, రచయితగా విశ్వంగారిలోని పలుకోణాల్ని ఆవిష్కరిస్తూ పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది. సంపాదకుల కృషిని అభినందించకుండా ఉండలేము.

- ఎం.సుబ్బరాజు



కామెంట్‌లు లేవు: