...

...

6, జూన్ 2012, బుధవారం

పొత్తూరి వారి సమీక్ష!

విద్వాన్ విశ్వం గారి జీవితంపై 2011 ఉత్తరార్థంలో రెండు పుస్తకాలు వెలువడ్డాయి. ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన మోనోగ్రాఫ్. రెండవది ఇక్కడ సమీక్షితున్న 'సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం' అనే సంకలన గ్రంథం.


రెండు ప్రచురణలలోనూ ప్రముఖ మీడియా వ్యాఖ్యాత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి కృషి ఉంది. సాహిత్య అకాడమీ ప్రచురణ ఆయన వ్రాసిన గ్రంథమే. 'సాహితీవిరూపాక్షుడు ...' డాక్టర్త్ నాగసూరి వేణుగోపాల్, శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ సహ సంపాదకత్వంలో వెలువడినది.


అకాడమీ ప్రచురణలో డాక్టర్ వేణుగోపాల్ గారు చేసిన మూర్తిమత్వ చిత్రణ ఒక్కటే కనిపిస్తుంది. 'సాహితీవిరూపాక్షుడు ...'లో విశ్వం గారితో పరిచయం ఉన్న పలువురి అభిప్రాయాలే గాక ఆయన పత్రికలలో నిర్వహించిన కొన్ని శీర్షికలలోని రచనలూ, వ్యాసాలూ కూడా ఉన్నాయి.


సంపాదకులు తమ 'నివేదన'లో 'సాహితీవిరూపాక్షుడు ...' గ్రంథం విశ్వంగారి విరాట్ స్వరూపాన్ని పూర్తిగా ఆవిష్కరించలేకపోయినప్పటికీ 'కొంతలో కొంత వారి జీవన రచనా రీతులను' తెలియజేస్తుందన్నారు. 


నిజమే. మూడు ముఖ్యమైన రంగాలలో విశ్వం గారు చేసిన కృషి తెలియజేసి, ఆయన సంపూర్ణ మూర్తిమత్వాన్ని 263 పేజీల గ్రంథంలో ఆవిష్కరించడం సాధ్యం కాదు. ఐనప్పటికీ, గ్రంథంలోని విశ్వజీవి, విశ్వరూపి, విశ్వభావి, విశ్వమేవ అనే నాలుగు అధ్యాయాలు దేనికది సంపూర్ణంగానే కనిపిస్తాయి. వైవిధ్యం కలిగిన రచనలు అందులో ఉండటమే అలాంటి భావన కలిగిస్తుంది. ఈ నాలుగు 'విశ్వ' పదబంధాలూ విశ్వంగారు సృష్టించినవే కావడం ఒక విశేషం.


విశ్వం గారు కృషి చేసిన మూడు ముఖ్యమైన రంగాలలో మొదటిది ప్రజాసేవ. యువకుడిగా ఆయన అనంతపురం జిల్లా కాంగ్రెస్‌లో నీలం సంజీవరెడ్డిగారితో సమస్థాయిలో నాయకత్వ బాధ్యత నిర్వహించారు.


సాహిత్య రంగం రెండవది. ఆయన రచించిన 'పెన్నేటి పాట' లాంటి రచనలు ఆయన సమకాలీన సాహితీవేత్తలెందరి నుంచో ప్రశంసల నందుకున్నాయి. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయనను 'సరస కవి' అన్నారు. "విశ్వం గారు తెలుగు సాహిత్యంలో 'పెన్నేటి పాట' రచించి, నార్ల వారికి అంకితం చేసి, రాళ్లపల్లి వారి మెప్పుబడసి అస్మదాదులను అలరించాడు" అన్నారు దాశరథి గారు.


"ఆయన సనాతనాధునాతన సంప్రదాయ సేతువులు. శాస్త్ర సంవిత్సముద్ర పారీణులు" అని ప్రశంసించారు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు. విశ్వం గారు నార్ల వెంకటేశ్వరరావు గారితో కలసి పత్రికలలో పనిచేశారు. ఆయన అభిమానానికి, విశ్వాసానికి పాత్రులైనారు.


2015 విశ్వంగారి శతజయంతి సంవత్సరం. దేశ సేవ, సాహిత్యం, పత్రికలు అనే మూడు రంగాలలో విశ్వంగారి విశిష్ట సేవలను గురించి తెలుసుకోవటం కొత్త తరాలకు, ముఖ్యంగా రచయితలకు, జర్నలిస్టులకు ఉపయోగకరం.


విశ్వంగారు భౌతిక శరీరాన్ని వదలిన రెండు పుష్కరాలకు 'సాహితీవిరూపాక్షుడు ...' గ్రంథం వెలువడి నవతరాల ఈ అవసరాన్ని తీరుస్తున్నది. దేశ సేవ ఎలా కళంక రహితంగా చేయాలో, సాహిత్యాన్ని ఎలా ప్రజోపయోగం కావించాలో, పత్రికారచనలో ఎలాంటి ప్రమాణాలను పాటించాలో, విశ్వం గారి జీవితం ఎలా ఆదర్శప్రాయమో ఈ గ్రంథం అవగాహన కలిగిస్తుంది - కొంతలో కొంత కాదు తగినంతగా...!


- పొత్తూరి వెంకటేశ్వరరావు

(ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక జూన్ 2012 సంచికలో ప్రచురితం)







కామెంట్‌లు లేవు: