...

...

8, జులై 2013, సోమవారం

విశ్వం వెర్సస్ సర్దేశాయి




ఒకరు సాహితీ విరూపాక్షుడు. మరొకరు జ్ఞానసింధువు.
ఇద్దరూ పండితులే. మేధావులే. ఒకరితో ఇంకొకరిని పోల్చలేము.
ఎవరికి వారు గొప్పవారే. ఇద్దరూ దాదాపు సమకాలికులే. 
విద్వాన్ విశ్వం 1915 - 1987 ల మధ్యకాలంలో జీవిస్తే
సర్దేశాయి తిరుమలరావు 1928 -1994 ల మధ్య జీవించారు.
ఇద్దరూ రాయలసీమకు ప్రత్యేకించి అనంతపురానికి సంబంధించిన వారే.
అయితే ఒకరి గురించి మరొకరు ప్రస్తావించుకున్న సందర్భాలు దాదాపు లేవు.(కనీసం నాకు తెలిసినంత వరకూ) 
విద్వాన్ విశ్వం సంస్కృత కావ్యాలను తెలుగులోనికి అనువదిస్తే
సర్దేశాయి తిరుమలరావు పాశ్చాత్య కవులను వారి కవితారీతులను మనకు పరిచయం చేస్తారు.
ఒకరు విశిష్ట సంపాదకులయితే మరొకరు విలక్షణ విమర్శకులు.
విద్వాన్ విశ్వం జర్నలిస్టుగా రూపాంతరం చెందిన రాజకీయవేత్త కాగా
సర్దేశాయి తిరుమలరావు తైల సాంకేతిక రంగంలో ప్రపంచస్థాయిలో ఎన్నదగిన శాస్త్రవేత్త.
అయితే వీరిద్దరికీ ఒక విషయంలో సామ్యం వున్నది. 
మహామహోపాధ్యాయ డాక్టర్ చిలుకూరు నారాయణరావు గారి శిష్యగణంలోనివారే ఇద్దరూను.
విద్వాన్ విశ్వం 1932 నుండి చిలుకూరు నారాయణరావు గారి వద్ద సంస్కృత, వ్యాకరణ, భాషా శాస్త్రాలను అభ్యసిస్తే 
సర్దేశాయి తిరుమలరావు దత్తమండల కళాశాలలో చిలుకూరి నారాయణరావుగారివద్ద శిష్యరికం చేశారు.
విద్వాన్ విశ్వం గురువుగారికి గురుదక్షిణగా తన తొలికావ్యం విరికన్నె అంకితం ఇచ్చారు.  
కాగా సర్దేశాయి తిరుమలరావు తన గురుదక్షిణ సమర్పించుకోవడంలో సఫలీకృతులు కాలేక పోయారు. 
డా.చిలుకూరు నారాయణరావుగారు తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ మొదలైన పలు భాషలలో లక్షన్నరకు పైగా సేకరించిన సామెతలను ఒక క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా వర్గీకరించే బాధ్యతను సర్దేశాయి తిరుమలరావు తన భుజస్కందాలపై వేసుకున్నారు కానీ దానిని ఏ కారణం చేతనో నెరవేర్చలేక పోయారు. అదే కనుక సాధ్యమయి ఉంటే సారస్వత రంగానికి గొప్ప నిధి లభ్యమైవుండేది.

కామెంట్‌లు లేవు: