...
16, డిసెంబర్ 2010, గురువారం
భరత సుతుడా మేలుకో!
సాహితీ మిత్రులు శ్రీ వరిగొండ కాంతారావు గారి రచన భరత సుతుడా మేలుకో! బ్లాగు వీక్షకుల కోసం సమీక్షిద్దామని మొదట భావించాను. అయితే ఈ పుస్తకంపై సమీక్ష వ్రాయటం కంటే మొత్తం పుస్తకాన్ని అందిస్తే బాగుంటుందని అనిపించి శ్రీ కాంతారావుగారి అనుమతి కోరాను. వారు సంతోషంగా అంగీకరించారు. మాత్రా ఛందస్సుతో సాగే ఈ గేయ ద్విశతకాన్ని ధారావాహికగా మీకోసం ప్రత్యేకంగా తురుపుముక్క అందించనున్నది.. చదివి మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయండి.
Labels:
వరిగొండ కాంతారావు
15, డిసెంబర్ 2010, బుధవారం
వస్తున్నాయొస్తున్నాయి...
వర్తమాన కథాకదంబం కథాజగత్‌లో త్వరలో ప్రకటించబోయే కథల వివరాలు!
1.సగ్గురాజయ్య - కలిసుందాం రా!
2.పిడుగు పాపిరెడ్డి - శాలువా 3.పారుపూడి వెంకట సత్యనారాయణ -కృతే కార్యే కిం ముహూర్త ప్రశ్నేన 4.పి.వి.శేషారత్నం - సంకల్పం
5.రేగులపాటి కిషన్‌రావు - సౌజన్యం 6.రేగులపాటి విజయలక్ష్మి - కీడు జరుగుతుందా? 7.కొలకలూరి స్వరూపరాణి - ఫ్రిజుడిటీ 8.కొవ్వలి రామకృష్ణ పరమహంస - కనువిప్పు
9.శ్రీవిరించి - పుడమి-పోడిమి
1.సగ్గురాజయ్య - కలిసుందాం రా!
2.పిడుగు పాపిరెడ్డి - శాలువా 3.పారుపూడి వెంకట సత్యనారాయణ -కృతే కార్యే కిం ముహూర్త ప్రశ్నేన 4.పి.వి.శేషారత్నం - సంకల్పం
5.రేగులపాటి కిషన్‌రావు - సౌజన్యం 6.రేగులపాటి విజయలక్ష్మి - కీడు జరుగుతుందా? 7.కొలకలూరి స్వరూపరాణి - ఫ్రిజుడిటీ 8.కొవ్వలి రామకృష్ణ పరమహంస - కనువిప్పు
9.శ్రీవిరించి - పుడమి-పోడిమి
పుస్తక సమీక్ష - 19 గమనం
[పుస్తకం పేరు: గమనం, రచన: సత్యభాస్కర్, వెల: రూ.75/-, ప్రతులకు:జనమిత్ర ప్రచురణలు, 3-8-7, ఫ్లాట్ నెం.101, రాధాదేవి అపార్ట్మెంట్స్, ఫేజ్-1, రామాంతపూర్, హైదరాబాద్ 500 013 మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు]
మిత్రుడు సత్యభాస్కర్ కలంనుండి జాలువారిన కథల సమాహారమే ఈ గమనం. శ్రామిక పక్షపాతమైన కథలు, ఉద్యమస్ఫూర్తిని ఇచ్చే కథలు ఇందులో చోటు చేసుకున్నాయి. మహిళలు ఇంటా బయటా పడుతున్న శ్రమను గుర్తించే కథలూ ఉన్నాయి. వ్యక్తిగౌరవాన్ని, స్వాభిమానాన్ని ఎత్తిచూపే కథలున్నాయి. సంఘటిత వ్యవస్థ చూపించే పరిష్కారాలు ఈ కథలలో కనిపిస్తాయి.
ఈ కథలలోని పాత్రలు నిష్కల్మషంగా ఉంటాయి. ఎదుటివారి సమస్యలకు పరిష్కారాన్ని చూపేవిగా ఉంటాయి. ప్రగతిశీల భావాలను కలిగి ఉంటాయి. సమస్యలను కలిసికట్టుగా ఎదుర్కోవాలనుకుంటాయి. తాము అనుభవించిన కష్టాలు ఇంకొకరు అనుభవించరాదని మనస్ఫూర్తిగా కోరుకుంటాయి. తమ సహచరులు పడే శ్రమను గుర్తించగలుగుతాయి. పోరాటంలో అంతిమ విజయం ఎప్పటికైనా తమదే అనే విశ్వాసంతో ఉంటాయి. ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా ఆత్మాభిమానాన్ని మటుకు చంపుకోవు. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తాయి. కానీ తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటాయి. తమకోసమే కాకుండా ఎదుటివారి కోసంకూడా పోరాటానికి సిద్ధపడతాయి. కొత్తతరం ఆలోచనలను స్వాగతిస్తాయి. ఈ పాత్రలలో ఎక్కడా తమకు జరిగిన అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకునే ధోరణి కనబడదు. తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే సాధు స్వభావం కల పాత్రలివి.
ప్రతి కథా చదివించేదిగా ఉంది. కథ ద్వారా తాను చెప్పదలచినది ఏమిటో రచయిత సమర్థవంతగా, స్పష్టంగా చెప్పగలిగారు. ఏదో సందేశాన్ని ఇచ్చినట్లు కాకుండా కథలో అంతర్లీనంగా తన అభిప్రాయాన్ని చొప్పించగలగటం ఈ రచయిత సామర్థ్యానికి అద్దం పడుతోంది.
ఈ సంపుటికి ముందుమాట రాసిన వారు 'ఆకాశంలో సగం'కథలో రొమాంటిసైజేషన్' తారాస్థాయికి చేరుకుందని, ఉద్యమాలను రొమాంటిసైజ్ చేయడం సమర్థనీయం కాదని అభిప్రాయపడుతున్నారు. హెచ్చుతగ్గుల మాట పక్కన పెడితే వ్యక్తి జీవితంలో రొమాన్స్, ప్రేమవంటివి ఒక భాగమని అంగీకరించాలి. ఉద్యమంలో ఉన్న వ్యక్తులు కూడా వీటికి మినహాయింపు కాదు.
సత్యభాస్కర్ ఈకథల నేపథ్యాన్ని వివరిస్తూ తాను సంపాదకత్వ బాధ్యతలునిర్వహిస్తున్న ఒక కార్మిక పత్రికలో ప్రచురణకోసం వ్రాసినట్లు తెలుపుతున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ప్రొజెక్ట్ చేయటంలో సత్యభాస్కర్ కృతకృత్యులైనారు. అయితే 'బ్రాండెడ్' రచయితగా ముద్రపడకుండా వైవిధ్యభరితమైన ఇతివృత్తాలను ఎన్నుకుని విస్తృతంగా కథలను వ్రాయాల్సిన అవసరాన్ని ఈ రచయిత గుర్తించాలి. మునుముందు సత్యభాస్కర్నుండి మరిన్ని మంచి కథలను ఆశించవచ్చు.
Labels:
katha jagat,
review
9, డిసెంబర్ 2010, గురువారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము - 33 సమాధానాలు!
అడ్డం:
1. లీడర్లో నటించిన ముద్దుగుమ్మ రిచా ఈ వ్యాపార ప్రకటనలో కూడా కనిపిస్తుంది. - డాబర్వాటికా
3. నల్లగొండ, వరంగల్లు జిల్లాల సరిహద్దులోనున్న ప్రసిద్ధ జైనతీర్థం తోక తెగింది. - కొలనుపా (క)
5. మోపర్తి సీతారామారావుకు, తులసీదాస్కూ ఉన్న సామ్యము. - హనుమాన్‌చాలీసా (తులసీదాసు రచించిన హనుమాన్‌చాలీసాను ఆంధ్రీకరించిన ఎం.ఎస్.రామారావుగారు సుప్రసిద్ధులు)
7. కర్నూలులో కొండారెడ్డి పేరుమీద ఉన్న ఈ కట్టడం దర్శనీయం. - బురుజు (కొండారెడ్డి బురుజు)
9. పేరున్న పేరులేని రచయిత. కాదు...కాదు...పేరులేని పేరున్న రచయిత. ఏమిటో అంతా తికమకగా ఉంది :) - అనామకుడు (రామాశాస్త్రిగారి కలం పేరు.)
10. 1975నాటి విఠలాచార్య సినిమా మొదట్లో తడబడింది. - టకోలోపాగా (కోటలోపాగా)
11. గుహ ముంగిట గుఱ్ఱం కట్టేశారేమో చూడండి. - గుహము (గుహము = గుఱ్ఱము)
14. ఎరిడనస్ దీనికి ఒక ఉదాహరణ. - నక్షత్రమండలము
15. గుడిపాటి నడుపుతున్న సాహిత్య పత్రిక. - పాలపిట్ట
16. మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడోయి... ఈ పాట ఉన్న సినిమా కుడి నుంచి ఎడమకి! - డుకుయనాథాక (కథానాయకుడు)
నిలువు:
1. కర్పూర వసంతరాయలు కావ్యకర్త పొడి అక్షరాల్లో. - డా.సి.నా.రె.
2. ఆంగ్లంలో ఉమ్మడి వాటా? - కామన్షేరు (common share)
4. ఒక దశాబ్దం పైగా బాలసుబ్రహ్మణ్యం టీవీల్లో నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమం పేరు. - పాడుతా తీయగా
5. "యిది లేని కావ్యం, ఎన్ని అందమైన పదాలతో,అలంకార ప్రయోగాలతో ఉన్నా బురదకాలువలాగే అనిపిస్తుంది..." అని వ్యాసునితో నారదమహర్షి అన్నాడట! - హరి నామ కీర్తన
6. కడగంటి చూపు! - సాచివిలోకితము
7. హాస్యమందున అఋణ/అందె వేసిన కరుణ/___ వెంకటరమణ/ఓ కూనలమ్మా. - బుడుగు
8. ౙడముడి మొదట్లో కుఱచ అయింది. - జుటము (జూటము = ౙడముడి)
9. అప్పుడప్పుడు! - అడపాదడపా
12. అంజనాదేవి, కేసరిల పుత్రుడు. - హనుమంతుడు
13. అడ్డం9.కి లింగమార్పిడి చేస్తే ఉంగరపు వేలు స్ఫురించిందా? - అనామిక (అనామిక = ఉంగరపు వేలు)
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
8, డిసెంబర్ 2010, బుధవారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము - 33
ఆధారాలు:
అడ్డం:
1. లీడర్లో నటించిన ముద్దుగుమ్మ రిచా ఈ వ్యాపార ప్రకటనలో కూడా కనిపిస్తుంది.
3. నల్లగొండ, వరంగల్లు జిల్లాల సరిహద్దులోనున్న ప్రసిద్ధ జైనతీర్థం తోక తెగింది.
5. మోపర్తి సీతారామారావుకు, తులసీదాస్కూ ఉన్న సామ్యము.
7. కర్నూలులో కొండారెడ్డి పేరుమీద ఉన్న ఈ కట్టడం దర్శనీయం.
9. పేరున్న పేరులేని రచయిత. కాదు...కాదు...పేరులేని పేరున్న రచయిత. ఏమిటో అంతా తికమకగా ఉంది :)
10. 1975నాటి విఠలాచార్య సినిమా మొదట్లో తడబడింది.
11. గుహ ముంగిట గుఱ్ఱం కట్టేశారేమో చూడండి.
14. ఎరిడనస్ దీనికి ఒక ఉదాహరణ.
15. గుడిపాటి నడుపుతున్న సాహిత్య పత్రిక.
16. మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడోయి... ఈ పాట ఉన్న సినిమా కుడి నుంచి ఎడమకి!
నిలువు:
1. కర్పూర వసంతరాయలు కావ్యకర్త పొడి అక్షరాల్లో.
2. ఆంగ్లంలో ఉమ్మడి వాటా?
4. ఒక దశాబ్దం పైగా బాలసుబ్రహ్మణ్యం టీవీల్లో నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమం పేరు.
5. "యిది లేని కావ్యం, ఎన్ని అందమైన పదాలతో,అలంకార ప్రయోగాలతో ఉన్నా బురదకాలువలాగే అనిపిస్తుంది..." అని వ్యాసునితో నారదమహర్షి అన్నాడట!
6. కడగంటి చూపు!
7. హాస్యమందున అఋణ/అందె వేసిన కరుణ/___ వెంకటరమణ/ఓ కూనలమ్మా.
8. ౙడముడి మొదట్లో కుఱచ అయింది.
9. అప్పుడప్పుడు!
12. అంజనాదేవి, కేసరిల పుత్రుడు.
13. అడ్డం9.కి లింగమార్పిడి చేస్తే ఉంగరపు వేలు స్ఫురించిందా?
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
5, డిసెంబర్ 2010, ఆదివారం
పుస్తక సమీక్ష - 18 వరాహశతకము
[పుస్తకం పేరు: వరాహశతకము, రచన: డా. ఆచార్య ఫణీంద్ర, వెల: రూ.80/-, ప్రతులకు:శ్రీమతి జి.సావిత్రి, పూర్ణేందు ప్రచురణలు,102,శ్రీనివాస ఆర్కేడ్, ఈస్ట్ మారుతీనగర్,మౌలాలి, హైదరాబద్ 500040 మరియు ఆంధ్రసారస్వత పరిషత్, ఎ.వి.కె.ఫౌండేషన్,నవోదయ, ప్రజాశక్తి, విశాలాంధ్ర]
కవి వరాహానికి ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తున్నారు ఈ పుస్తకంలో. కనకాక్షుడనే రాక్షసుణ్ని సంహరించటానికి విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తినట్లు, హరి ఆదివరాహముగా కీర్తింపబడుతున్నట్లు, తిరుమల కొండ పై వరాహ తీర్థం ఏర్పడటానికి కారణమైనట్లు, నేటికినీ తిరుమలలో ముందు వరాహమూర్తి దర్శనమైన తరువాతనే వెంకటేశ్వరుని దర్శిస్తారని, సింహగిరిక్షేత్రంలోని దేవుణ్ని వరాహ నరసింహుడని పిలుస్తారని, కల్పములలో ఒకదానిని శ్వేతవరాహ కల్పమని పిలుస్తారని, అర్జునుడు పాశుపతాస్త్రము కోరి తపస్సు చేయగా శివుడు పరిక్షంప దలచిన సందర్భములో వారిరువురి బాణపు దెబ్బలను నిస్స్వార్థముగా సహించినట్లు, గణితశాస్త్ర కోవిదుడు వరాహమిహిరుని పేరులో కూడా వరాహము పేరు ఉన్నట్లు, కాకతీయ ప్రభువు రాజ్య పతాకముపై చిహ్నంగా ఉన్నట్లు కవి తెలుపుతున్నారు.
ఇంతటి పూర్వ చరిత్ర ఉన్న పందిని లోకులు ఎందుకు ఈసడిస్తారో కదా? అని కవిగారు వాపోతున్నారు. ప్రాణులన్నీ ఒకటేనని, అందరి శరీరాలలో పారే రక్తం ఒకటేనని,అందరికి అన్ని సమానంగా దక్కవలనని శాక్యముని మొదలుగా గాంధీ, అంబేద్కరు, జ్యోతీబాఫూలే మొదలైన వారు చాటినా ప్రజలు రంగులు వేరనీ, ప్రాంతాలు వేరనీ, పేద ధనిక వర్గాలనీ,జాతి, లింగ కుల వివక్షతను పట్టుకుని మూర్ఖముగా వేలాడుతున్నారని కవి ఆక్రోశిస్తున్నారు. పందులలో కూడా సీమ పందులు, ఊరపందులు, అడివి పందులు, ముళ్ల పందులు, తెల్లవి, నల్లవి ఎన్నో రకాలున్నప్పటికీ మానవుల వలె భేదభావములు లేవని కవి ప్రశంసిస్తున్నారు.
"కొందరు మనుష్యులు ముప్పూటలా మెక్కి ఏ పనీ చేయకుండా ఉంటారు. అట్టివారిని 'పంది వలె బలుపు పట్టి ఉన్నా'వని తూలనాడితే నీ మనస్సుకు ఎంత బాధ కలుగుతుందో కదా? "అని కవి జాలిపడుతున్నారు. "నీపై ఎండా వానలు పడినా నీలో చలనం ఉండదు. మా నేతలకు కూడా ఈ గుణం అబ్బింది. ఎంత తిన్నా నీవు ఏది పడితే అది మెక్కుతావు. మా నేతలు కూడా పశుగ్రాసం, టెలివిజన్లు, పాలడబ్బాలు,బ్యాంకులు, చిట్ఫండ్లు, షేర్ మార్కెట్ స్క్రిప్పులు అవి ఇవి అని లేక ఏదిపడితే అది అచ్చంగా నీ వలే మేస్తారు. ఎవడు మంచి వాడో? ఎవడు నీ అవతారమో? అని మేము ముందుగా కనిపెట్టలేకపోతున్నాము." అని కవి వ్యంగ్యంగా చెబుతున్నారు.
"దారిలో ఎక్కడ ఏ మురికి కనిపించినా శుభ్రంగా తినేస్తావు. నీ కృషి మా మున్సిపాలిటీ వారికి మార్గదర్శకం కావాలి" అని చమత్కారంగా అంటారు. "వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో 'ఒక స్త్రీకి పంది పిల్లలు పుడతా'రని ఎప్పుడో చెప్పారు. రూపం సంక్రమిస్తే వింతే గాని నడతను చూస్తే నీవలె ఏనాడో పుట్టారు" అని హాస్యభరితంగా అంటున్నారు. "గంపెడు పిల్లలను కను నీమాదిరి మానవులు కూడా పెక్కురు పిల్లలను కంటున్నారు. అది చూసి నిన్ను మదిలో తలచుకుని నీరసం కలుగుతున్నది. మానవజాతి కుటుంబ నియంత్రణ పాటించి నిన్ను ఆదర్శముగా తీసుకొనకూడద "ని కవి ఆశిస్తున్నారు.
"పల్లెల్లో ఇప్పటికీ పందులు వీరవిహారం చేస్తూ ఉంటాయి. పందులు లేనియెడల పల్లెలు వృద్ధి చెందినట్లే అనే భావం నీకు వేదన కలిగించవచ్చు. మెదడువాపు, స్వైన్‌ఫ్లూ మొదలైన వ్యాధులు వ్యాపింపచేయడం నీకు భావ్యమా?" అని ప్రశ్నిస్తున్నారు. "గిరిజనులు కొందరు సంప్రదాయము పేరున భుజించిన భుజించ వచ్చు కాని ఎన్నో రకాల శాకములన్నప్పటికీ నాగరికులు నిన్ను 'పోర్క్' అనే పేరుతో భుజించటం భావ్యమేనా? కొందరికైనా నీవు ఆకలి తీర్చేంచుకు ఆత్మ త్యాగం చేస్తున్నావు. పందుల పెంపకం లాభసాటి వ్యాపారంగా గుర్తించి కొందరు వర్తకులు దానిని చేపడుతున్నారు. తొలినాళ్లతో దూరదర్శన్‌లో ఎప్పుడూ పందుల పెంపకంపై కార్యక్రమాలను చూపేవారు. ఏమైనా కాని ఇట్లా పందులను సంతలో అమ్ముట విచారకరం" అని కవి జాలి చూపిస్తున్నారు.
ఈ శతకంలో ఆచార్య ఫణీంద్రగారు తాము చెప్పదలచిన భావాలను సుస్పష్టంగా చెబుతున్నారు. "అభ్యుదయమ్ము నా పథము! అట్టడుగందున నున్నవారి కే నభ్యుదయమ్ము గోరెదను"అంటున్నారు. దుబాయి షేకులకు హైదరాబాదు పాతనగరంలోని మహమ్మదీయులు తమ పసి పిల్లలను కాసుల మూటకై నిఖా జరిపించిన యథార్థ దుర్ఘటనలు కవిగారి హృదయాన్ని ద్రవింపజేస్తోంది. "లౌకిక సౌఖ్య సంపదల లౌల్యము పెంచునవాంగ్ల విద్యలు" అని నిరసిస్తున్నారు. "అరువది నాల్గు సత్కళలు, నంతకు మించిన మేటి క్రీడలుం"డగా "ఎరువుగ దెచ్చుకొన్న క్రికెటెంతురు మా యువకుల్!" అని వాపోతున్నారు. "రోమనులట్లు ప్రేమికుల రోజును క్రొత్తగా నేర్వనేటికో?" అని ప్రశ్నిస్తున్నారు. "తరగని ప్రేమ పెన్నిధుల తత్త్వము, సత్త్వమెరుంగకున్నచో ఒరుగునదేమి ప్రేమికుల కొక్క దినంబిడ" అని సూత్రీకరిస్తున్నారు. ఇంకా ఈ పద్యకృతిలో సినిమాలలో చూపుతున్న అసభ్యతను, డబ్బుకోసం ప్రజలు పడే కక్కుర్తిని, భార్యను చులకనగా చూసే భర్తలను, యువతులపై ప్రేమ పేరుతో జరుగుతున్న యాసిడ్ దాడులను, ఉగ్రవాదులను తయారు చేస్తున్న మదర్సాలను కవిగారు తూర్పారబట్టారు.
వరాహానికి గల పర్యాయపదాలనన్నింటినీ ఒకే పద్యంలో చక్కగా ఇమిడ్చి డా.ఆచార్య ఫణీంద్ర 'పద్యకళా ప్రవీణ' అని నిరూపించుకున్నారు. పందికి సంబంధించిన అన్ని విషయాలనూ సేకరించి ఈ కృతిలో చొప్పించి ఈ శతకాన్ని 'సూకర సర్వస్వం'గా మార్చినారు. ఇది వీరి విషయగ్రాహ్యానికి దర్పణం పడుతోంది. సిద్ధాంతమనే గ్రామంలో ఒక పంది గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వింత వార్తను కూడా ఈ శతకంలో ప్రస్తావించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
ఈ కృతికి డా.కె.వి.రమణ, ఆచార్య మసన చెన్నప్ప, ఆంధ్రపద్యకవితా సదస్సు శాశ్వతాధ్యక్షులు శ్రీ శిష్ట్లా వెంకటరావుగారి పీఠికలు శోభను గొలుపుతున్నాయి. ఈ కావ్యాన్ని ఇద్దరు మహాకవులు గుఱ్ఱం జాషువా, దాశరథి కృష్ణమాచార్యలకు అంకితమియ్యటం కవి అభిరుచిని చాటుతోంది.
ఈ గ్రంథావిష్కరణ సందర్భంగా పరిచయకర్త శ్రీ జి.ఎం.రామశర్మ చెప్పినట్లుగా ఈ దశాబ్దంలో పద్యకవితకు లభించనున్న ఆదరణకు సూచిక ఈ వరాహశతకం. ఈ శతకాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమీప భవిష్యత్తులో బల్లిశతకం, మశక శతకం వంటివి వెలువడవచ్చని ఎవరైనా ఆశిస్తే అది ఏమాత్రం అత్యాశ కాబోదు.
Labels:
review
3, డిసెంబర్ 2010, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)




