...

...

15, డిసెంబర్ 2010, బుధవారం

పుస్తక సమీక్ష - 19 గమనం


[పుస్తకం పేరు: గమనం, రచన: సత్యభాస్కర్, వెల: రూ.75/-, ప్రతులకు:జనమిత్ర ప్రచురణలు, 3-8-7, ఫ్లాట్ నెం.101, రాధాదేవి అపార్ట్‌మెంట్స్, ఫేజ్-1, రామాంతపూర్, హైదరాబాద్ 500 013 మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు]

      మిత్రుడు సత్యభాస్కర్ కలంనుండి జాలువారిన కథల సమాహారమే ఈ గమనం. శ్రామిక పక్షపాతమైన కథలు, ఉద్యమస్ఫూర్తిని ఇచ్చే కథలు ఇందులో చోటు చేసుకున్నాయి. మహిళలు ఇంటా బయటా పడుతున్న శ్రమను గుర్తించే కథలూ ఉన్నాయి. వ్యక్తిగౌరవాన్ని, స్వాభిమానాన్ని ఎత్తిచూపే కథలున్నాయి. సంఘటిత వ్యవస్థ చూపించే పరిష్కారాలు ఈ కథలలో కనిపిస్తాయి.


   ఈ కథలలోని పాత్రలు నిష్కల్మషంగా ఉంటాయి. ఎదుటివారి సమస్యలకు పరిష్కారాన్ని చూపేవిగా ఉంటాయి. ప్రగతిశీల భావాలను కలిగి ఉంటాయి. సమస్యలను కలిసికట్టుగా ఎదుర్కోవాలనుకుంటాయి. తాము అనుభవించిన కష్టాలు ఇంకొకరు అనుభవించరాదని మనస్ఫూర్తిగా కోరుకుంటాయి. తమ సహచరులు పడే శ్రమను గుర్తించగలుగుతాయి. పోరాటంలో అంతిమ విజయం ఎప్పటికైనా తమదే అనే విశ్వాసంతో ఉంటాయి. ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా ఆత్మాభిమానాన్ని మటుకు చంపుకోవు. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తాయి. కానీ తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటాయి. తమకోసమే కాకుండా ఎదుటివారి కోసంకూడా పోరాటానికి సిద్ధపడతాయి. కొత్తతరం ఆలోచనలను స్వాగతిస్తాయి. ఈ పాత్రలలో ఎక్కడా తమకు జరిగిన అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకునే ధోరణి కనబడదు. తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే సాధు స్వభావం కల పాత్రలివి.

   ప్రతి కథా చదివించేదిగా ఉంది. కథ ద్వారా తాను చెప్పదలచినది ఏమిటో రచయిత సమర్థవంతగా, స్పష్టంగా చెప్పగలిగారు. ఏదో సందేశాన్ని ఇచ్చినట్లు కాకుండా కథలో అంతర్లీనంగా తన అభిప్రాయాన్ని చొప్పించగలగటం ఈ రచయిత సామర్థ్యానికి అద్దం పడుతోంది.

   ఈ సంపుటికి ముందుమాట రాసిన వారు 'ఆకాశంలో సగం'కథలో రొమాంటిసైజేషన్' తారాస్థాయికి చేరుకుందని, ఉద్యమాలను రొమాంటిసైజ్ చేయడం సమర్థనీయం కాదని అభిప్రాయపడుతున్నారు. హెచ్చుతగ్గుల మాట పక్కన పెడితే వ్యక్తి జీవితంలో రొమాన్స్, ప్రేమవంటివి ఒక భాగమని అంగీకరించాలి. ఉద్యమంలో ఉన్న వ్యక్తులు కూడా వీటికి మినహాయింపు కాదు.

  సత్యభాస్కర్ ఈకథల నేపథ్యాన్ని వివరిస్తూ తాను సంపాదకత్వ  బాధ్యతలునిర్వహిస్తున్న ఒక కార్మిక పత్రికలో ప్రచురణకోసం వ్రాసినట్లు తెలుపుతున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ప్రొజెక్ట్ చేయటంలో సత్యభాస్కర్ కృతకృత్యులైనారు. అయితే 'బ్రాండెడ్' రచయితగా ముద్రపడకుండా వైవిధ్యభరితమైన ఇతివృత్తాలను ఎన్నుకుని విస్తృతంగా కథలను వ్రాయాల్సిన అవసరాన్ని ఈ రచయిత గుర్తించాలి.   మునుముందు సత్యభాస్కర్‌నుండి మరిన్ని మంచి కథలను ఆశించవచ్చు.  
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి