...

...

5, డిసెంబర్ 2010, ఆదివారం

పుస్తక సమీక్ష - 18 వరాహశతకము


[పుస్తకం పేరు: వరాహశతకము, రచన: డా. ఆచార్య ఫణీంద్ర, వెల: రూ.80/-, ప్రతులకు:శ్రీమతి జి.సావిత్రి, పూర్ణేందు ప్రచురణలు,102,శ్రీనివాస ఆర్కేడ్, ఈస్ట్ మారుతీనగర్,మౌలాలి, హైదరాబద్ 500040 మరియు ఆంధ్రసారస్వత పరిషత్, ఎ.వి.కె.ఫౌండేషన్,నవోదయ, ప్రజాశక్తి, విశాలాంధ్ర]

ఈ అధిక్షేప, హాస్య, వ్యంగ్య శతకం వరాహమా అంటూ వరాహాన్ని సంభోదిస్తూ చెప్పబడిన పద్యకవిత. వరాహమనేది ఒక కేవలం  మిషగా తీసికొని ఈ శతకంలో మనుష్యజాతి విపరీత పోకడలను కవి ఎండగడుతున్నారు. పంది మీద శతకమేమిటని పండితులు ఘాటుగా తిట్టినా తిట్టనీ తాను వెనుదిరగనని కవి ఈ శతక రచనకు పూనుకున్నారు.

కవి వరాహానికి ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తున్నారు ఈ పుస్తకంలో. కనకాక్షుడనే రాక్షసుణ్ని సంహరించటానికి విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తినట్లు, హరి ఆదివరాహముగా కీర్తింపబడుతున్నట్లు, తిరుమల కొండ పై వరాహ తీర్థం ఏర్పడటానికి కారణమైనట్లు, నేటికినీ తిరుమలలో ముందు వరాహమూర్తి దర్శనమైన తరువాతనే వెంకటేశ్వరుని దర్శిస్తారని, సింహగిరిక్షేత్రంలోని దేవుణ్ని వరాహ నరసింహుడని పిలుస్తారని, కల్పములలో ఒకదానిని శ్వేతవరాహ కల్పమని పిలుస్తారని, అర్జునుడు పాశుపతాస్త్రము కోరి తపస్సు చేయగా శివుడు పరిక్షంప దలచిన సందర్భములో వారిరువురి బాణపు దెబ్బలను నిస్స్వార్థముగా సహించినట్లు, గణితశాస్త్ర కోవిదుడు వరాహమిహిరుని పేరులో కూడా వరాహము పేరు ఉన్నట్లు, కాకతీయ ప్రభువు రాజ్య పతాకముపై చిహ్నంగా ఉన్నట్లు కవి తెలుపుతున్నారు.

ఇంతటి పూర్వ చరిత్ర ఉన్న పందిని లోకులు ఎందుకు ఈసడిస్తారో కదా? అని కవిగారు వాపోతున్నారు. ప్రాణులన్నీ ఒకటేనని, అందరి శరీరాలలో పారే రక్తం ఒకటేనని,అందరికి అన్ని సమానంగా దక్కవలనని శాక్యముని మొదలుగా గాంధీ, అంబేద్కరు, జ్యోతీబాఫూలే మొదలైన వారు చాటినా ప్రజలు రంగులు వేరనీ, ప్రాంతాలు వేరనీ, పేద ధనిక వర్గాలనీ,జాతి, లింగ కుల వివక్షతను పట్టుకుని మూర్ఖముగా వేలాడుతున్నారని కవి ఆక్రోశిస్తున్నారు. పందులలో కూడా సీమ పందులు, ఊరపందులు, అడివి పందులు, ముళ్ల పందులు, తెల్లవి, నల్లవి ఎన్నో రకాలున్నప్పటికీ మానవుల వలె భేదభావములు లేవని కవి ప్రశంసిస్తున్నారు.

"కొందరు మనుష్యులు ముప్పూటలా మెక్కి ఏ పనీ చేయకుండా ఉంటారు. అట్టివారిని 'పంది వలె బలుపు పట్టి ఉన్నా'వని తూలనాడితే నీ మనస్సుకు ఎంత బాధ కలుగుతుందో కదా? "అని కవి జాలిపడుతున్నారు. "నీపై ఎండా వానలు పడినా నీలో చలనం ఉండదు. మా నేతలకు కూడా ఈ గుణం అబ్బింది. ఎంత తిన్నా నీవు ఏది పడితే అది మెక్కుతావు. మా నేతలు కూడా పశుగ్రాసం, టెలివిజన్లు, పాలడబ్బాలు,బ్యాంకులు, చిట్‌ఫండ్లు, షేర్ మార్కెట్ స్క్రిప్పులు అవి ఇవి అని లేక  ఏదిపడితే అది అచ్చంగా నీ వలే మేస్తారు. ఎవడు మంచి వాడో? ఎవడు నీ అవతారమో? అని మేము ముందుగా కనిపెట్టలేకపోతున్నాము." అని కవి వ్యంగ్యంగా చెబుతున్నారు.

"దారిలో ఎక్కడ ఏ మురికి కనిపించినా శుభ్రంగా తినేస్తావు. నీ కృషి మా మున్సిపాలిటీ వారికి మార్గదర్శకం కావాలి" అని చమత్కారంగా అంటారు. "వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో 'ఒక స్త్రీకి పంది పిల్లలు పుడతా'రని ఎప్పుడో చెప్పారు. రూపం సంక్రమిస్తే వింతే గాని నడతను చూస్తే నీవలె ఏనాడో పుట్టారు" అని హాస్యభరితంగా అంటున్నారు. "గంపెడు పిల్లలను కను నీమాదిరి మానవులు కూడా పెక్కురు పిల్లలను కంటున్నారు. అది చూసి నిన్ను మదిలో తలచుకుని నీరసం కలుగుతున్నది. మానవజాతి కుటుంబ నియంత్రణ పాటించి నిన్ను ఆదర్శముగా తీసుకొనకూడద "ని కవి ఆశిస్తున్నారు.

"పల్లెల్లో ఇప్పటికీ పందులు వీరవిహారం చేస్తూ ఉంటాయి. పందులు లేనియెడల పల్లెలు వృద్ధి చెందినట్లే అనే భావం నీకు వేదన కలిగించవచ్చు. మెదడువాపు, స్వైన్‌ఫ్లూ మొదలైన వ్యాధులు వ్యాపింపచేయడం నీకు భావ్యమా?" అని ప్రశ్నిస్తున్నారు. "గిరిజనులు కొందరు సంప్రదాయము పేరున భుజించిన భుజించ వచ్చు కాని ఎన్నో రకాల శాకములన్నప్పటికీ నాగరికులు నిన్ను 'పోర్క్' అనే పేరుతో భుజించటం భావ్యమేనా? కొందరికైనా నీవు ఆకలి తీర్చేంచుకు ఆత్మ త్యాగం చేస్తున్నావు. పందుల పెంపకం లాభసాటి వ్యాపారంగా గుర్తించి కొందరు వర్తకులు దానిని చేపడుతున్నారు. తొలినాళ్లతో దూరదర్శన్లో ఎప్పుడూ పందుల పెంపకంపై కార్యక్రమాలను చూపేవారు. ఏమైనా కాని ఇట్లా పందులను సంతలో అమ్ముట విచారకరం" అని కవి జాలి చూపిస్తున్నారు.  

ఈ శతకంలో ఆచార్య ఫణీంద్రగారు తాము చెప్పదలచిన భావాలను సుస్పష్టంగా చెబుతున్నారు. "అభ్యుదయమ్ము నా పథము! అట్టడుగందున నున్నవారి కే నభ్యుదయమ్ము  గోరెదను"అంటున్నారు. దుబాయి షేకులకు హైదరాబాదు పాతనగరంలోని మహమ్మదీయులు తమ పసి పిల్లలను కాసుల మూటకై నిఖా జరిపించిన యథార్థ దుర్ఘటనలు కవిగారి హృదయాన్ని ద్రవింపజేస్తోంది.  "లౌకిక సౌఖ్య సంపదల లౌల్యము  పెంచునవాంగ్ల విద్యలు" అని నిరసిస్తున్నారు. "అరువది నాల్గు సత్కళలు, నంతకు మించిన మేటి క్రీడలుం"డగా "ఎరువుగ దెచ్చుకొన్న క్రికెటెంతురు మా యువకుల్!" అని వాపోతున్నారు. "రోమనులట్లు ప్రేమికుల రోజును క్రొత్తగా నేర్వనేటికో?" అని ప్రశ్నిస్తున్నారు. "తరగని ప్రేమ పెన్నిధుల తత్త్వము, సత్త్వమెరుంగకున్నచో ఒరుగునదేమి ప్రేమికుల కొక్క దినంబిడ" అని సూత్రీకరిస్తున్నారు. ఇంకా ఈ పద్యకృతిలో సినిమాలలో చూపుతున్న అసభ్యతను, డబ్బుకోసం ప్రజలు పడే కక్కుర్తిని, భార్యను చులకనగా చూసే భర్తలను, యువతులపై ప్రేమ పేరుతో జరుగుతున్న యాసిడ్ దాడులను, ఉగ్రవాదులను తయారు చేస్తున్న మదర్సాలను కవిగారు తూర్పారబట్టారు.

వరాహానికి గల పర్యాయపదాలనన్నింటినీ ఒకే పద్యంలో చక్కగా ఇమిడ్చి డా.ఆచార్య ఫణీంద్ర 'పద్యకళా ప్రవీణ' అని నిరూపించుకున్నారు. పందికి సంబంధించిన అన్ని విషయాలనూ సేకరించి ఈ కృతిలో చొప్పించి ఈ శతకాన్ని 'సూకర సర్వస్వం'గా మార్చినారు. ఇది వీరి విషయగ్రాహ్యానికి దర్పణం పడుతోంది. సిద్ధాంతమనే గ్రామంలో ఒక పంది గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వింత వార్తను కూడా ఈ శతకంలో ప్రస్తావించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

ఈ కృతికి డా.కె.వి.రమణ, ఆచార్య మసన చెన్నప్ప, ఆంధ్రపద్యకవితా సదస్సు శాశ్వతాధ్యక్షులు శ్రీ శిష్ట్లా వెంకటరావుగారి పీఠికలు శోభను గొలుపుతున్నాయి. ఈ కావ్యాన్ని ఇద్దరు మహాకవులు గుఱ్ఱం జాషువా, దాశరథి కృష్ణమాచార్యలకు అంకితమియ్యటం కవి అభిరుచిని చాటుతోంది.    

ఈ గ్రంథావిష్కరణ సందర్భంగా పరిచయకర్త శ్రీ జి.ఎం.రామశర్మ చెప్పినట్లుగా ఈ  దశాబ్దంలో పద్యకవితకు లభించనున్న ఆదరణకు సూచిక ఈ వరాహశతకం. ఈ శతకాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమీప భవిష్యత్తులో బల్లిశతకం, మశక శతకం వంటివి వెలువడవచ్చని ఎవరైనా ఆశిస్తే అది ఏమాత్రం అత్యాశ కాబోదు.   

                

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి