...

...

6, ఆగస్టు 2010, శుక్రవారం

కవితాభిషేకం! -32


ఆముక్తమాల్యదా కోమల ప్రౌఢోక్తి
                భావనావీధుల ప్రణయమూని
మనుచరిత్ర రసార్ద్రమంజిమ భావించి
                పారిజాతములోని సౌరుగొంచు
స్తుతమతియైనట్టి ధూర్జటికవినాథు 
                మాధురీమహిమంబు మదిదలంచి
రామరాజ శ్లేష రమణీయ సంగీత 
                విన్యాసలహరిలో వేడ్కదోగి

పింగళి కళా ప్రపూర్ణత రంగరించి
కందుకూర్యష్టకముల విందుగొంచు
రామకృష్ణు పదన్యాస రక్తి దవిలి 
నాటి జన్మంబె కోరు దేనాటికైన

             -ఆశావాది ప్రకాశరావు



5, ఆగస్టు 2010, గురువారం

కవితాభిషేకం! -31



రాసులై రాజిల్లు రత్నాల నమ్ముచు
          బచ్చులు నంగళ్లఁ బరగు చుండ
మడువులేచిన నీట మరులెత్తి ద్విరదముల్
          కాటుక కొండల కరణి నుండ
ఈతబంటిగ బారు నేఱుల కాలూన
          కెగబాఱి యశ్వమ్ము లెలరు చుండ
యవన వీరులనొత్త్ యసమున నగలించు
          వీరబలంబులు వెలయుచుండ

నెలకు ముమ్మారు మేఘముల్ నిలచి కురియ
కాపు కోరిన ధాన్యముల్ గాంచె ధరణి
జనుల కారోగ్య భాగ్యముల్ నెనయు దివ్య
సీమ శ్రీ కృష్ణదేవరాయల సీమ యొప్పె
                  - భైరపురెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి

4, ఆగస్టు 2010, బుధవారం

సకల

డా. దేవరకొండ సహదేవరావు గారి డైరెక్టు కథ సకల కథాజగత్‌  లో చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి.

కవితాభిషేకం! - 30

శ్రీవాణీవీణానా
దావిర్భావాంధ్రవరసుధాపదచయమున్
ఠావుల్ దప్పక నిలుపన్
భావికినందిచ్చితివిప్రబంధములప్రభూ !

తెలుగదేలయంచు తెలియకో చర్చకో
అడిగెనెవడొగాని ఆంధ్రభోజ!
మారిడితివి మరల వేరొక్కడడుగక,
తెలిసి కొనగ జగతి తెలుగు ఖ్యాతి.

ఆంధ్రు లొక్కొ? గారు ఆరంభ శూరులే
ఆశు పద్య ధార నరసి చెపుడి
యని సవాల్ విసిరితి వన మాకిడితివయ్య!
భువనవిజయ మనెడు కవన విధిని.

రాసుల బోసివీధులను రత్నము లమ్మిన గాధవింటిలే
దూసిన కత్తులన్ రిపుల దూరము ద్రోలెడుశౌర్యమెంతులే
రోసము బెంచుపండితుల రోయక మన్నన జేసిబంపవే
దోసములెంచువార బడదోయగ రాముని పెంపుజేయవే

వాసక సజ్జికల్ వలపు వాకిట వేచుట జూచి బ్రోవవే
దాసుల భృత్యులన్ మిగుల దానము లిచ్చియనుగ్రహింపవే
బాసలు చాలనేర్చియు నృపాల!తెనుంగనముద్దుచూపవే
నీసభ నున్నసత్కవులు నిత్యముసొంపగు కైతలల్లరే

వ్రాసియె ఏడుకొండలనివాసికి నీవిడ కబ్బమొప్పెలే
భాసుర దేహకాంతులను భానుని రూపున నాకుదోపవే
భూసఖ! సాంద్రకీర్తిగని బోలవె పున్నమిచందమామతో
నీసరి లేరురారెవరు నిక్కమిదయ్య!నృపాలపాలకా!

జనజీవనసుఖమయ పా
లనమునను సుకవులకైతలను రాజకవీ!
గనుగొన సులువుగనిలను,గ
గనమును నాకముగ మార్చు ఘనుడవు నీవే!

సప్త దిగ్గజముల సాహితీ సభదీర
ఒప్ప దేమొ మనసు ఊహ సేయ
రామ కృష్ణ కవిని రాజ!జేర్చుకొనుట
పురి తెనాలి కీర్తి పుడమి నిండె.

సరసవచోభూషణులే
వరుసగ కైతలనుజెప్ప వాణియె ముదమున్
పరికింపనెంచి స్వయముగ
అరుదెంచినదేమొసభకు ఆదినములలో 


పదములమృదుపదములను వెదకి బట్టి
తెలుగు పద్యములను మాల వలెను గట్టి
 పదములనుమృదుపదముల వద్ద నుంచి
తృప్తి గొననిమ్ము శ్రీకృష్ణ దేవరాయ!
                                  -ఊకదంపుడు  

3, ఆగస్టు 2010, మంగళవారం

పచ్చబొట్టు చెరిగి పోదులే నా రాజా

సాక్షి పేపర్ సౌజన్యంతో

కవితాభిషేకం! - 29




విమల యశో విభూతి నెద వెల్గుల నింపెడు వేవెలుంగు, ధీ సమ కవిరత్న దీపికల సౌరున మించెడు మంచువేల్పు నా సమరస కృష్ణరాయలదె స్వర్ణయుగంబట లేదు లేదులే యమవస; నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే.

                                            -కోడీహళ్లి మురళీమోహన్

2, ఆగస్టు 2010, సోమవారం

కవితాభిషేకం! - 28

వీర, సార భూమి విజయ నగరమందు
తెలుగు ధీర యుక్తి, ధిషణ శక్తి
ఒక్క రూపమందె ఉద్దీపనము చెంద
’కృష్ణ రాయ’డగుచు కీర్తి నొందె !


కత్తి కలమ్ముగా సమర కావ్యమునన్ రుధిరాక్షరంబులన్
విత్తగ ’కృష్ణ రానృపుడు’, విక్రమ గీతులు పొంగె ! ఆతడే
మెత్తని పాళి గల్గు కలమే ఝళిపింపగ కత్తిగాన్, సిరా
హత్తుకొనన్, సుకావ్యమె మహా రస యుద్ధము నాయె వింతగాన్ !



రాజ సూర్యుడు, కవిరాజునున్ రెండయి -
తెలుగు రాజ్య రమకు దీప్తి గలుగ -
దిద్దె వీర రక్త తిలక మామె నుదుట !
అద్దె కవన మధువు నామె నోట !


అష్ట దిగ్గజాల్ మోయగా, ఆంధ్ర సాహి
తీ ప్రబంధ మండిత మహా దివ్య ’భువన
విజయ’ విస్తృత విఖ్యాత విశ్వ మకుట
ధారి - సర్వజ్ఞ శేషాహి తానె యయ్యె !



పలుకది యున్నంత వరకు -
తెలుగది యున్నంత వరకు - దేదీప్యముగాన్
వెలుగది యున్నంత వరకు -
నిలుచును శ్రీకృష్ణరాయ నృప ! నీ యశమున్ !

                   
                   - ’పద్య కళా ప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర